నాకిప్పుడు ఏడవ నెల. బేబీకి కిడ్నీలో వాపు ఉందన్నారు. దీని వలన బేబీ పుట్టిన తర్వాత ఏమైనా సమస్య వస్తుందా? ఇది అందరికీ ఉంటుందా?
– నీరజ, కర్నూలు
మీరు చెప్పిన సమస్యను ఫీటల్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఇది సర్వసాధారణ సమస్య. సాధారణంగా ఐదవ నెల స్కాన్‌లో బయటపడుతుంది. కొద్దిమందికి మాత్రమే ఏడవ నెల, ఎనిమిదో నెల స్కానింగ్‌లలో కనబడుతుంది. ప్రెగ్నెన్సీలో తల్లి శరీరంలోని తాత్కాలికంగా కండరాలు సాగడం వలన బేబీకి కిడ్నీ వాపు కనిపించవచ్చు. ఇది డెలివరీ తరువాత తగ్గిపోతుంది. కానీ కొన్నిసార్లు కిడ్నీకి, యురేటర్‌కి మధ్య బ్లాకేజ్ రావచ్చు లేదా యూరేటర్‌కి , బ్లాడర్‌కి మధ్య వాల్వ్ పనిచేయకపోవచ్చు.
కిడ్నీలో సిస్ట్ ఉన్నప్పుడు బేబీ కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది. డెలివరీ తర్వాత స్కానింగ్‌లో బేబీ సైజును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలావరకు మందులతోనే తగ్గిపోతుంది. అరుదుగా కొంతమందికి చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది. గర్భిణీలకు 8వ నెల, 9వ నెలలో చేసే స్కాన్‌లో బేబీ కిడ్నీ వాపును బట్టి పీడియాట్రిక్ నెఫ్రాలాజిస్ట్‌ను సంప్రదించి తగిన చికిత్స చేయాల్సి ఉంటుంది.
డెలివరీ తర్వాత పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ చేసి, అవసరమైతే సర్జరీకి ప్లాన్ చేస్తారు. బేబీ స్కాన్‌లో రీనల్ పెల్విస్ వాపు 7 మి.మీ. కంటే ఎక్కువగా ఉన్నట్లయితే సర్జరీ అవసరమవుతుంది. సాధారణంగా 4 వారాల తరువాత మళ్లీ స్కానింగ్ చేసి, కణితి ఏమైనా ఉందో లేదో చూస్తారు. కణితి ఉన్నట్లయితే, హిస్ట్టరోస్కోపీ చేసి, దాన్ని చిన్న ప్రక్రియ ద్వారా తీసివేసి, బయాప్సీకి పంపుతారు. డెలివరీ తర్వాత బేబీకి ఇంకా కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, కొందరికి అవసరాన్ని బట్టి ఎక్స్‌రే తీస్తారు. డెలివరీ తర్వాత స్కాన్‌లో నార్మల్‌గా ఉంటే ఆ తర్వాత ఏ పరీక్షలూ అవసరం ఉండవు.
నాకు 25 ఏళ్లు. ఈ మధ్యే పెళ్లయింది. మొదటి నుంచీ వైట్ డిశ్చార్జ్ ఉంది. పెళ్లయ్యాక మరీ ఎక్కువైంది. కొన్నిసార్లు బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉంటున్నాయి. డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందా? లేదంటే మెడికల్ షాప్‌లో మందులు అడిగి వేసుకోవచ్చా?
– సంధ్యారాణి, కామారెడ్డి
యంగ్ ఏజ్‌లో వైట్ డిశ్చార్జ్‌ని నిర్లక్ష్యం చేయకూడదు. చాలామందికి వైట్ డిశ్చార్జ్‌తో పాటు దుర్వాసన, దురద, మంట కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటే వెజైనల్ ఇన్‌ఫెక్షన్ అని అర్థం. ఇది యాంటీబయాటిక్స్‌తో తగ్గవచ్చు. కానీ డాక్టర్‌ని సంప్రదించకుండా మెడికల్ షాప్‌లో మందులు కొని వేసుకోవద్దు. గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే వెజైనల్ స్పెక్యులమ్ ఎగ్జామ్ చేసి సమస్యను తెలుసుకుంటారు. గర్భసంచి ముఖద్వారానికి ఇన్‌ఫెక్షన్ రావడం మంచిది కాదు.
భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కూడా అది హాని చేస్తుంది. అందుకే డాక్టర్‌కి చూపించుకుంటే అసలు సమస్య ఏంటనేది తెలుస్తుంది. కొంతమందికి గర్భసంచి ముఖద్వారం పైన కొన్ని గ్రోత్స్ ఉంటాయి. అదనంగా టిష్యూ పెరగడం వల్ల వస్తాయివి. వీటిని పాలిప్స్ అంటారు. సాధారణంగా ఇవి రెడ్ లేదా గ్రే కలర్‌లో ఉంటాయి. వీటికి సంబంధించి చాలావరకు ఏ సింప్టమ్ ఉండకపోవచ్చు. చెక్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ కొంతమందికి ఎప్పుడూ నీళ్లలా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. లైంగికచర్యలో పాల్గొన్నప్పుడు స్పాటింగ్, బ్లీడింగ్ అవుతుంది.
ఇలాంటివి కనిపిస్తే కచ్చితంగా తగిన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సెలైన్ సోనోగ్రఫీ ద్వారా ఈ పాలిప్ గర్భసంచిలో ఉందా లేదా గర్భసంచి ముఖద్వారం మీద ఉందా అని చెక్ చేస్తారు. పాలిప్ సైజ్, నేచర్ కూడా తెలుస్తాయి. హిస్టరోస్కోపీ ప్రక్రియ ద్వారా ఈ పాలిప్‌ని డే కేర్‌లోనే రిమూవ్ చేస్తారు. దాన్ని బయాప్సీకి పంపితే, అది ఎలాంటి పాలిప్, మళ్లీ వచ్చే చాన్స్ ఉందా, ఫాలో అప్ ఎలా చెయ్యాలి అనేవి డీటెయిల్డ్‌గా తెలుస్తాయి. ఏడాదికోసారి రెగ్యులర్ పెల్విక్ పరీక్ష చేయించుకోవాలి.
డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment