ప్రతీకాత్మక చిత్రం
నాకు పందొమ్మిదేళ్లు. ఇప్పుడు నేను తొలి చూలు ప్రెగ్నెంట్‌ని. టీటీ ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి? ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ చెకప్‌కి వెళ్లాలి? ఆపరేషన్ లేకుండా ప్రసవం కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – టీ. ప్రణీత, ధర్మవరం
ప్రెగ్నెన్సీలో వేసుకునే టెటనస్ ఇంజెక్షన్ వాక్సినేషన్‌లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. మన గవర్నమెంట్ సెటప్‌లో T.T plain ఇంజెక్షన్‌ను 13–39 వారాల మధ్యలో నాలుగు వారాల తేడాతో రెండు డోస్‌లు ఇస్తారు. సెకండ్ డోస్ టీటీ వాక్సీన్‌ను ప్రసవానికి కనీసం మూడు నెలల ముందు తీసుకునేట్టు చూడాలి.
దీనివల్ల తల్లి నుంచి బిడ్డకి యాంటీబాడీస్ పాస్ అవడానికి.. హైకాన్సంట్రేషన్ ఉండటానికి సహాయపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు.. ప్రెగ్నెన్సీ సమయంలో 27– 36 వారాల మధ్య.. Tdap అనే కాంబినేషన్ వాక్సిన్ సింగిల్ డోస్‌ను ఇస్తున్నారు. దీన్ని మన దేశంలో కూడా ఐఏపీ (ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్), ఎఫ్‌ఓజీఎస్‌ఐ (ది ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా) అనుమతించాయి.
చెకప్స్ విషయానికి వస్తే
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో చెకప్స్ విషయానికి వస్తే.. మొదటి ఏడు నెలల వరకు నెలకు ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెలదాకా రెండు వారాలకు ఒకసారి చెకప్స్‌కి వెళ్లాలి. తొమ్మిదవ నెలలో వారానికి ఒకసారి చెకప్‌కి వెళ్లాలి. ఇలా కరెక్ట్‌గా చెకప్స్‌కి వెళ్తే తల్లీ, పొట్టలోని శిశువు ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు. బీపీ, సుగర్, థైరాయిడ్‌లాంటివి డిటెక్ట్ చేసి.. వెంటనే చికిత్సను అందించే వీలు ఉంటుంది.
ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన మందులను ఇస్తూ ప్రసవం సాఫీగా అయ్యేలా చూసే చాన్స్ ఉంటుంది. గర్భస్థ శిశువు పెరుగుదలను చూడ్డానికి స్కాన్, TIFFA స్కాన్, NT స్కాన్‌ను సజెస్ట్ చేస్తారు. ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ కావడానికి ప్రెగ్నెన్సీ మొదలు పోషకాహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ
కొన్ని మెడికల్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటే మాత్రం ముందుగానే డాక్టర్‌ను కలిస్తే.. మెడికల్ హిస్టరీ తెలుసుకుని.. ప్రెజెంట్ కండిషన్‌ను అంచనా వేస్తారు. రిస్క్ ఉంది అనుకుంటే.. తొమ్మిదవ నెల నిండాక ఆపరేషన్ తప్పనిసరి అని చెబుతారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే మాత్రం వంద శాతం నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తారు.
తొమ్మిదవ నెలలో పెరినియల్ మసాజెస్.. నార్మల్ డెలివరీకి కొంతవరకు సాయపడవచ్చు. కనీసం ఒక గంట వాకింగ్, 15– 20 స్క్వాట్స్ చేయడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలకు వ్యాయామం అందుతుంది. అధిక బరువు లేకుండా, బీపీ, సుగర్, థైరాయిడ్‌లు రాకుండా స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావాలి. రెగ్యులర్ చెకప్స్‌లో ఇంటర్నల్ పెల్విస్ చెక్ చేసి నార్మల్ డెలివరీ చాన్స్ ఎంత ఉందో మీ డాక్టర్ చెబుతారు.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment