ప్రతీకాత్మక చిత్రం
నాకు 30 ఏళ్లు. ఏడాదిన్నర కిందట డెలివరీ అయింది. నార్మల్ డెలివరీనే. ఇప్పుడు దగ్గినా.. తుమ్మినా కొంచెం యూరిన్ లీక్ అవుతోంది. ఇదేమైనా పెద్ద సమస్యా? దీనికి ట్రీట్‌మెంట్ ఉందా? – బి. ప్రసూన, నందిగామ
చాలా మంది ఆడవాళ్లకు పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్‌నెస్ ఉంటుంది. ఈ కండరాలు కింది భాగంలో ఉంటాయి. ఇవి ఒక స్లిప్‌లాగా ఉండి, పైన ఉన్న బ్లాడర్, గర్భసంచి, రెక్టమ్ (మలవిసర్జన పైప్)ను సపోర్ట్ చేస్తాయి. వయసు పెరిగేకొద్దీ సహజంగానే ఇవి కొంత వీక్ అవుతాయి.
ఇవి నడుము కింద టైల్‌బోన్ నుంచి ముందు వైపున్న ప్యూబిక్ బోన్‌కు అటాచ్ అవుతాయి. ఈ కండరాలనూ శరీరంలోని అన్ని కండరాల్లాగే శక్తిమంతం చేసుకోవాలి. దానికోసం కొన్ని వ్యాయామాలు చేయాలి. దాంతో కండరాలు పటుత్వం కోల్పోవు. దగ్గినప్పుడు.. తుమ్మినప్పుడు యూరిన్ లీక్ కాదు.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ కండరాలు ఆటోమేటిగ్గా టైట్ అయి ఆ ఓపెనింగ్స్‌ను క్లోజ్ చేసి లీక్ అవకుండా చేస్తాయి. కానీ ఈ కండరాలు ఆల్రెడీ వదులైపోతే లీకేజ్ తప్పదు. ప్రసవం తర్వాత ఎక్కువగా దగ్గు, ఎక్కవ కాలం శ్వాస సంబంధమైన ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా, అధిక బరువుతో బాధపడుతున్నా, ఎక్కువ కాలం బరువు పనులు చేస్తున్నా.. రుతుక్రమం ఆగిన తరువాత వీక్ అవుతాయి.
క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రసవం తరువాత వెజైనా స్ట్రెచ్ అయి ఈ కండరాలు వదులవుతాయి. వ్యాయామాల ద్వారా ఈ కండరాలను టైట్ చేయవచ్చు. బరువు తగ్గడం, పోషకాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ యూరిన్ లీక్ ప్రాబ్లమ్ 80 శాతం కేసెస్‌లో తగ్గుతుంది.
ఏ రిజల్ట్ లేనప్పుడు యూరో గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ప్రతిరోజు కనీసం మూడుసార్లయినా ఈ వ్యాయామాలు చేయాలి. ప్రతిసారి 8 కాంట్రాక్షన్స్ చేయాలి. ఇలా మూడు నెలలు చేస్తే చాలా ఫలితం కనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే వాళ్లు ఈ వ్యాయామాలు ఎలా చేయాలో వివరిస్తారు.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్.
చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా?
Gynecology: 60 ఏళ్ల వయసులో ఎందుకిలా? ఏదైనా ప్రమాదమా?
Comments
Please login to add a commentAdd a comment