మేడం! నాకిప్పుడు రెండో నెల. తొలి చూలు. వారం రోజులుగా స్పాటింగ్ అవుతోంది. గర్భధారణ సమయంలో ఇది సహజమా? లేక ప్రమాదకరమా?
– నిహారిక, గుంటూరు
గర్భధారణ మొదటి మూడు నెలల్లో కొంచెం స్పాటింగ్, నడుం నొప్పి ఉండవచ్చు. ప్రతిసారీ అది ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం గర్భస్రావానికి సూచన కావచ్చు. అందుకే స్పాటింగ్ కానీ, నొప్పి, బ్లీడింగ్ కానీ అవుతుంటే వెంటెనే డాక్టర్‌ని సంప్రదించి, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. మీ ఆఖరి నెలసరి తేదీని బట్టి అది ఎన్నివారాల గర్భమో చూస్తారు. దానికి తగ్గట్టుగానే స్కానింగ్‌లో గర్భస్థ పిండం ఎదుగుదల కనిపిస్తే ఇబ్బందేమీ ఉండదు. కొన్ని సార్లు వెజైనా నుంచి కానీ, గర్భసంచి నుంచి కానీ రక్తస్రావం అవుతుంటే డాక్టర్ చేసే పరీక్షలో తెలుస్తుంది. కొన్ని మందులతో దానిని తగ్గించవచ్చు.
వెజైనల్ ఇన్‌ఫెక్షన్ కూడా కొన్నిసార్లు స్పాటింగ్‌కి కారణం కావచ్చు. దీన్నీ మందులతో తగ్గించవచ్చు. మీ బ్లడ్ గ్రూప్, థైరాయిడ్ పరీక్ష చేస్తారు. అయిదుగురిలో ఒకరికి ఈ స్పాటింగ్ అనేది గర్భస్రావానికి దారితీస్తుంది. అందుకే వెంటనే డాక్టర్‌ను కలవడం మంచింది. స్పాటింగ్‌తో పాటు కళ్లు తిరగటం, కడుపులో విపరీతమైన నొప్పి, భుజాల్లో నొప్పి వంటి లక్షణాలూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి.
నాకు మూడవనెలలో గర్భస్రావం అయింది. రెండు వారాల కిందట డీ అండ్ సీ చేశారు. ఇప్పుడు నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ప్రత్యూష, అరసవిల్లి
గర్భస్రావం అనేది చాలా బాధాకరమైంది. దానికి కారణాలు తెలుసుకోవడం ఆవశ్యకమే కానీ ముందు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. డీ అండ్ సీ ప్రొసీజర్ తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు. డాక్టర్ సూచించిన విధంగానే వాటిని వేసుకోవాలి. పాలు, బ్రెడ్, పళ్లు, ఆకు కూరలు, కాయగూరలు, పప్పు దినుసులు, డ్రైఫ్రూట్స్‌తో మంచి ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. మీకు సపోర్ట్‌గా ఉన్న కుటుంబసభ్యులతో అన్ని విషయాలూ పంచుకోవాలి. అధిక రక్తస్రావం అవుతున్నా, అది దుర్వాసన వేస్తున్నా, భరించలేని కడుపు నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ని కలవాలి. మీరు తగినన్ని నీళ్లు తాగుతున్నప్పటికీ మూత్రంలో మంటగా ఉన్నా, ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నా అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ని సంప్రదించాలి.
గర్భస్రావం అయిన రెండు వారాలకు మీరు మామూలుగా ఇంటి పనులు, వ్యాయామం, యోగా మొదలుపెట్టవచ్చు. వ్యాయామం వల్ల కాళ్లల్లో రక్తం గడ్డకట్టడం (డీవీటీ) వంటి సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఆఫీస్‌కు వెళ్లవచ్చు. కారు, బైక్ వంటివీ నడపొచ్చు. గర్భస్రావం తరువాత మళ్లీ నెలసరి కొంచెం ఆలస్యం కావచ్చు. బలానికి మూడు నెలలపాటు మల్టీవిటమిన్ మాత్రలు తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా మీరు పూర్తిగా కోలుకున్న తరువాతే నెక్స్‌ట్ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాలి. అప్పటివరకు గర్భనిరోధక మాత్రలు లేదా కండోమ్స్‌ను ఉపయోగించాలి. కొన్ని రక్త పరీక్షలు చేసిన తరువాత గర్భస్రావానికి గల కారణాన్ని డాక్టర్ చెప్పగలుగుతారు.
నాకిప్పుడు అయిదవ నెల. అమెరికా వెళ్లాల్సిన అవసరం పడింది. నేనిప్పుడు విమాన ప్రయాణం చేయొచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రెగ్నెన్సీ టైమ్‌లో అసలు ఎప్పటి వరకు ఫ్లయిట్ జర్నీ చేయొచ్చు?
– వర్షిణి, హైదరాబాద్
ప్రెగ్నెన్సీ సమయంలో విమానయానం చేయొచ్చు భద్రంగా. ఎయిర్ ప్రెజర్ మూలంగా కడుపులో బిడ్డ మీద ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గర్భధారణప్పుడు ముప్పై వారాల లోపు వరకు విమాన ప్రయాణం చేయొచ్చు. చాలా విమానయాన సంస్థలు 37 వారాలు దాటిన తర్వాత అనుమతి కూడా ఇవ్వరు. గర్భంలో కవలలు ఉన్నట్లయితే 32 వారాల (ఎనిమిదవ నెల) లోపు ప్రయాణం చెయ్యాలి. మీరు ప్రయాణం చేయాలనుకున్న విమానయాన సంస్థల నియమ నింబంధనలను ఒకసారి చెక్ చేసుకోండి. కొంతమంది గర్భవతులకు కాళ్ల వాపు, తల తిరగడం, వాంతులు, తలనొప్పి ఉండవచ్చు.
దానికి తగిన మందులకు ముందుగానే డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. కొంతమందికి కాళ్లల్లో రక్తం గడ్డకడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కొన్ని వైద్యపరమైన సమస్యలున్న గర్భవతులకు ఈ రిస్క్ ఎక్కువ. కాబట్టి మీ డాక్టర్‌ను సంప్రదించి ముందుగా కొన్ని మందులు వాడటం మంచిది. నాలుగు గంటల కన్నా ఎక్కువ విమానయానం చేస్తే కూడా ఈ రిస్క్ ఉంటుంది. అందుకే ‘టీఈడీ స్టాకింగ్స్’ అనే సాక్స్ వేసుకోమని చెప్తాం. ఫ్లయిట్‌లో ముప్పై నిమిషాలకు ఒకసారి సీట్ ఎక్సర్‌సైజెస్ చేయమనీ చెప్తాం. నీళ్లు ఎక్కువగా తాగాలి. కుదిరితే కొంచెం సేపు నడవాలి.
హైరిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్లు ‘హెపారిన్’ ఇంజెక్షన్ చేయించుకోవలసి వస్తుంది. రక్త హీనత ఉన్నా, ఇంతకు ముందు నెలలు నిండకుండా డెలివరీ అయినా, బ్లీడింగ్ అవుతున్నా, ఊపిరితిత్తులు, గుండెకి సంబంధించి జబ్బు ఉన్నా ఫ్లయిట్‌లో సుదూర ప్రయాణం చేయకూడదు. విమానయానానికి ముందే పైన చెప్పిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఏ ప్రమాదమూ ఉండదు.
-డా. భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment