విపరీతమైన కడుపునొప్పి.. | Venati Shobha Health Suggestions In Sakshi Funday | Sakshi
Sakshi News home page

విపరీతమైన కడుపునొప్పి..

Published Sun, Aug 9 2020 8:16 AM | Last Updated on Sun, Aug 9 2020 8:16 AM

Venati Shobha Health Suggestions In Sakshi Funday

మా పాపకు పదమూడేళ్లు. ఏడాది కిందటే పెద్దమనిషి అయింది. నెలనెలా విపరీతమైన బ్లీడింగ్‌తోపాటు కడుపునొప్పితోనూ బాధపడుతోంది. మాకు దగ్గర్లో ఉన్న గైనకాలజిస్ట్‌కు చూపిస్తే నీటి తిత్తులున్నాయి, పాప బరువు కూడా తగ్గాలి అని చెప్పారు. మా అమ్మాయి అయిదు అడుగుల రెండు అంగుళాలుంటుంది. 55 కేజీల బరువుంది. ఓవర్‌ వెయిట్‌ కిందకే వస్తుందా? ఈ నీటితిత్తుల వల్ల ప్రమాదమా? దయచేసి వివరించగలరు.
– పి. రేణుక, జన్నారం

సాధారణంగా పెద్దమనిషి అయిన తర్వాత వారి మెదడు, అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్స్‌ సక్రమంగా పనిచేయడానికి కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఆ సమయం వరకు పీరియడ్స్‌ నెలనెలా సక్రమంగా రాకపోవడం, బ్లీడింగ్‌ ఎక్కువ అవ్వడం లాంటి ఇబ్బందులను ఎదుర్కొవలసి ఉంటుంది. కొందరిలో పీరియడ్స్‌ సమయంలో పొత్తి కడుపులో నొప్పి కూడా ఉంటుంది. అండాశయంలో నీటి తిత్తులు ఉండటాన్ని పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ అంటారు. సాధారణంగా ఈ వయసులో కూడా కొందరిలో హార్మోన్ల ప్రభావం వల్ల అండాశయంలో నీటి బుడగలలాగా ఉండే ఫాలికల్స్‌ ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి స్కానింగ్‌లో అవి పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ లాగా కనిపిస్తాయి. క్రమేణా కొందరిలో అవి మామూలు స్థాయికి వచ్చే అవకాశాలు ఉంటాయి.

నీటి తిత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదలవ్వడం తద్వారా బ్లీడింగ్‌లో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అలాగే వదలి వేస్తే, అవి ఇంకా పెరిగితే, అవాంచిత రోమాలు, మొటిమల లాంటి సమస్యలు వస్తాయి. వీటికి ఈ వయసులో హార్మోన్‌ మందులు ఇవ్వడం మంచిది కాదు. మరీ బ్లీడింగ్‌ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే తప్పితే... సాధారణంగా సమస్యను అధిగమించి పరిస్థితిని గాడిలో పెట్టడానికి మితమైన ఆహారం తీసుకుంటూ వాకింగ్, వ్యాయమాలు, స్కిప్పింగ్, డాన్స్‌ లాంటివి చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల 70 శాతానికి పైగా హార్మోన్ల అసమతుల్యత తగ్గి, బ్లీడింగ్‌ సమస్యలు తగ్గుతాయి. మీ అమ్మాయి ఎత్తుకు తగ్గ బరువే ఉంది. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 22 వస్తుంది. కాకపోతే పైన∙చెప్పినట్లు వ్యాయామాలు చేయడం వల్ల ఇంకా బరువు పెరగకుండా ఉండటం, అలాగే దానివల్ల నీటి తిత్తులు ఉన్న వారిలో ఉండే హార్మోన్‌ అసమతుల్యత తగ్గుతుంది.  పీరియడ్స్‌ సక్రమంగా వస్తాయి.     

నేను రెండో కాన్పులో ఉన్నాను. ఆగస్ట్‌లో డ్యూ డేట్‌ ఉంది. తొలి కాన్పు నార్మలే. ఈ కాన్పులోనే ట్యూబెక్టమీ కూడా చేయించుకుందామను కుంటున్నాను. చేయించుకోవచ్చా? ఒకవేళ  సీ సెక్షన్‌ చేయాల్సి వచ్చినా ట్యూబెక్టమీకి వెళ్లొచ్చా? సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందా? చెప్పగలరు. 
– సత్యవేణి, కనిగిరి

తొలి కాన్పు నార్మలే కాబట్టి, ఈసారి కూడా 95 శాతం మందిలో సాధారణ కాన్పు అయ్యే అవకాశాలు ఉంటాయి. 5 శాతం మందిలో అనేక కారణాల వల్ల సిజేరియన్‌ ఆపరేషన్‌ అవసరం పడవచ్చు. ఒకవేళ ఈసారి కూడా సాధారణ కాన్పే అయితే, కాన్పు తర్వాత రోజు నుంచి ఎప్పుడైనా పొట్ట మీద చిన్నగా కోసి, పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయించుకోవచ్చు. లేదా ఒక నెల తర్వాత అయితే ల్యాపరోస్కోపి ఆపరేషన్‌ ద్వారా పెద్ద కొత లేకుండా రెండు చిన్న రంధ్రాలు చేసి ల్యాపరోస్కోపిక్‌ ట్యూబెక్టమీ చేయించుకోవచ్చు. ఒక వేళ ‘సీ’ సెక్షన్‌ చేయావలసి వస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉంటే, ఆ ఆపరేషన్‌లోనే ట్యూబెక్టమీ కూడా చేయించుకోవచ్చు. ఒకేసారి పని అయిపోతుంది. కొన్నిసార్లు కాన్పు తర్వాత బిడ్డ అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా పిల్లల డాక్టర్‌ ఆ సమయంలో పరీక్ష చేసి చెప్పినా, 5 శాతం పిల్లల్లో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు, ఇంకా కొన్ని సమస్యలు కొన్ని రోజుల తర్వాత బయటపడే అవకాశాలు ఉంటయి.

కాబట్టి రిస్క్‌ తీసుకోకుండా ఉండాలంటే, ఆరు నెలలు ఆగి ట్యూబెక్టమీ చేయించుకోవడం మంచిది. మళ్లీ విడిగా ట్యూబెక్టమీ చేయించుకోవాలంటే, మళ్లీ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అవ్వడం, మళ్లీ ఖర్చు లాంటి ఇతర ఇబ్బందులు ఉంటాయి, కాని పొరపాటున 5 శాతం రిస్క్‌లో బిడ్డకు ప్రమాదం అయితే ఇది శాశ్వతంగా పిల్లలు పుట్టకుండా చేసే ఆపరేషన్‌ కాబట్టి మళ్లీ పిల్లల కోసం ఇబ్బంది పడవలసి ఉంటుంది. బాగా ఆలోచించుకోని సరైన నిర్ణయం తీసుకోవండం మంచిది. చాలా మంది ట్యూబెక్టమీ మళ్లీ చేయించుకుందామని అనుకొని, తర్వాత అనేక కారణాల వల్ల సమయం కుదరక వాయిదా వేసుకుంటూ ఉంటారు, ఆ సమయంలో అనుకోకుండా మళ్లీ గర్భం దాల్చడం, మళ్లీ దాన్ని అబార్షన్‌ చేయించుకోవడం హాస్పిటల్‌కు రావడం జరుగుతుంది. కొంత మంది అబార్షన్‌ ఇష్టం లేక, కొంత మంది అబార్షన్‌కు భయపడి గర్భం ఉంచేసుకొని మూడో బిడ్డకు సంసిద్ధమయ్యి ఇబ్బంది పడుతుంటారు.   
- డా. వేనాటి శోభ
హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement