ప్రతీకాత్మక చిత్రం
Gynecology Problems Solutions And Tips In Telugu: ప్రెగ్నెన్సీలో వ్యాయామాలు చేసినందువల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? – యామిని, వైజాగ్
ఆరోగ్యవంతమైన తల్లి–బిడ్డకి వ్యాయామాలు ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో చాలా అవసరం. వారంలో కనీసం 150 నిమిషాలు ఒక మోస్తరు వ్యాయామాలు చేసినందువల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.
మీరు ఇంతకు ముందు ఎప్పుడూ వ్యాయామాలు చేయకపోతే, ప్రెగ్నెన్సీలో కొంచెం నెమ్మదిగా, చిన్నచిన్న వ్యాయామాలతో మొదలుపెట్టాలి. మీకు యోగా, ఆసనాలు, నడవడం వంటివి ముందే అలవాటు ఉంటే అవి కంటిన్యూ చేయొచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేసినందువల్ల..
1) ప్రెగ్నెన్సీలో కరెక్ట్ వెయిట్ గెయిన్ ఉంటుంది.
2) సుగర్, రక్తపోటు(బీపీ) వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
3) నిద్ర బాగా పడుతుంది.
4) ఉల్లాసంగా యాక్టివ్‌గా ఉండొచ్చు.
∙మీరు వ్యాయామాలు/యోగా వంటివి ఆన్‌లైన్‌లో మంచి ట్రైనర్ దగ్గర క్లాసులు అటెండ్ అవ్వచ్చు. దానిలో కనీసం వారానికి రెండు సార్లు మజిల్ స్ట్రెంగ్తెనింగ్ యాక్టివిటీస్ (కండరాలు బలపరుచుకునేందుకు) చేసేటట్టు ప్లాన్ చేసుకోండి.
∙ప్రతి చిన్న వ్యాయామం, బాడీ మూమెంట్ మీకు లాభం చేస్తుంది. ప్రతి నిమిషం కౌంట్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేసినందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
∙మీ శరీరానికి సరిపడే వ్యాయామాలను అడాప్ట్ చేసుకోవాలి. ఇంట్లో మెట్లు ఎక్కి దిగడంతో పాటు యోగా చేసుకోవచ్చు.
∙బయటకు వెళ్లే అవకాశం ఉంటే.. లాంగ్ వాకింగ్ చేయడం, సైక్లింగ్‌కి వెళ్లడం మంచిదే. మీకు ఇష్టమయితే స్విమ్మింగ్, డాన్సింగ్ వంటివి కూడా చేయొచ్చు.
∙కొన్ని ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉన్నవారికి మీ డాక్టర్ 3వ నెలలోనే ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చో చెప్తారు. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ట్రైనర్‌ను సంప్రదిస్తే, ఎలాంటి వ్యాయామాలు సురక్షితమో వివరిస్తారు.
మెనోపాజ్ అంటే ఏంటి? నాకు ఇప్పుడు యాభై ఏళ్లు. గత 6 నెలలుగా నెలసరి రావడం లేదు. చాలా చిరాకుగా ఉంటోంది. పరిష్కారం చెప్పగలరు? – లలిత, ఖమ్మం
మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోవటం. చాలా మందికి 45–55 సంవత్సరాల మధ్యలో నెలసరి ఆగిపోతుంది. దీనికి కారణం అండాలు విడుదల కాకపోవడమే. ఈ పరిస్థితిని కొంతమందిలో నలభై ఏళ్లలోపే చూస్తాం. నెలసరి ఆగినప్పుడు, శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. చాలామందికి ఒంట్లో వేడిగా ఉండటం, చెమటలు ఎక్కువగా పట్టడం, యోని దగ్గర పొడిబారి ఉండటం, మూడ్ డిస్టర్బ్ కావడం, మజిల్స్, జాయింట్స్ పెయిన్ వస్తాయి.
నెలసరి ఆగినప్పుడు ఎఫ్‌ఎస్‌హెచ్ అనే హార్మోన్ టెస్ట్‌తో మెనోపాజ్ వచ్చిందా? లేదా? అని తెలుసుకోవచ్చు. ఈ టైమ్‌లో ఆహారంలో ఎక్కువ శాతం పళ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, సోయాబీన్స్, పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. రొటీన్ పాప్‌స్మియర్ టెస్ట్, థైరాయిడ్, సీబీపీ టెస్ట్ చేయించుకుంటే మంచిది.
ఒకవేళ మీకు పైన చెప్పిన లక్షణాలు ఎక్కువగా ఉంటే.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ)ని డాక్టర్ సూచిస్తారు. తక్కువ మోతాదులో ఈస్ట్రోజెన్ జెల్స్‌తో యోని డ్రైనెస్ తగ్గుతుంది. ఇబ్బందిగా ఉంటే మీ డాక్టర్‌ని సంప్రదించాలి.
నాకు ఏడవ నెల ప్రెగ్నెన్సీ. నాకు విపరీతమైన నడుము, కాళ్ల నొప్పులు ఉన్నాయి. డాక్టర్ ఏ మందులు ఇచ్చినా, నొప్పి మాత్రం తగ్గడంలేదు. ఏం చేయాలి? – స్వరూప, మెహిదీపట్నం
నడుము భాగం మూడు జాయింట్స్‌తో ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ ఆ బరువు ఈ జాయింట్స్ మీద పడి, బాగా స్ట్రెస్ అవుతుంది. ఇది ఐదుగురిలో ఒకరికి వస్తుంది. నడుము నొప్పి నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు, పక్కకు తిరిగి పడుకున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది.
ఇది ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా రావచ్చు. దీనికి నిలబడే, కూర్చునే భంగిమ ప్రధానమైన కారణం. నిజానికి ఈ నొప్పి వల్ల బేబీకి ఏ ఇబ్బంది ఉండదు. కొన్ని చిన్న చిన్న మార్పులతో మీరు ఈ నొప్పి తగ్గించుకోవచ్చు. రోజూ వ్యాయామం చేయడం వల్ల, ప్రెగ్నెన్సీలో బాడీ అడాప్ట్ అవుతుంది.
∙నిటారుగా నిలబడాలి, వంగి నడవకూడదు.
∙ 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకూడదు. మధ్యలో లేచి నడవాలి.
∙రెండు కాళ్ల మీద సరిగ్గా బరువు పెట్టి నడవాలి.
∙తలగడని కాళ్ల మధ్యలో, నడుము వెనక పెట్టుకొని పడుకోవాలి.
∙ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్ వాడవచ్చు.
∙వంగి బరువులు ఎత్తకూడదు.
∙ఎక్కువసార్లు మెట్లు ఎక్కి దిగకూడదు.
∙పేరాసిటమల్ లాంటి తక్కువ డోస్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు. లైఫ్‌స్టయిల్ చేంజెస్ చాలా ఉపయోగపడతాయి.
ఇలాంటి నడుము నొప్పి ఉన్నా నార్మల్ డెలివరీ చేయొచ్చు. అందుకు లేబర్ వార్డ్‌లో కొన్ని మార్పులు చేస్తాము. ఎక్కువసేపు బెడ్ మీద పడుకోకుండా, కొంచెం సపోర్ట్‌తో నడిపిస్తాము. ఈ నొప్పి డెలివరీ తర్వాత చాలామందికి తగ్గిపోతుంది. పదిమందిలో ఒకరికి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. రెగ్యులర్ ఫిజియోథెరపీతో నొప్పిని తగ్గించుకోవచ్చు.
ఈ నొప్పి మళ్లీ తరువాత ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు. అందుకే సరైన బరువుతో నెక్ట్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. కాన్పు తర్వాత ట్రైనర్ ద్వారా పొట్ట, నడుము భాగంలోని మజిల్ టైటెనింగ్ ఎక్స్‌సర్‌సైజ్ చేస్తే మళ్లీ ఈ నొప్పి వచ్చే అవకాశాలు చాలా అరుదు. పోషకాహారం తీసుకోవాలి.
డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment