
నాకు 25 ఏళ్లు. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఇంకా పిల్లల్లేరు. ఈ మధ్య వెజైనా చాలా నొప్పిగా.. లాగినట్టుగా ఉంటోంది. సెక్స్ తర్వాత ఈ బాధ మరీ ఎక్కువగా ఉంటోంది. ఎందుకో అర్థం కావట్లేదు. పిల్లల కోసం ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవట్లేదు. నొప్పిగా ఉన్నప్పుడు కూర్చోలేను.. నడవలేను. అప్పుడెప్పుడో నెట్‌లో చదివాను.. వెజైనా క్యాన్సర్ కూడా ఉంటుందని. నాది క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లం అయితే కాదు కదా? భయంగా ఉంది. నాకు వచ్చిన సమస్య ఏంటో వివరించండి. – ఎన్. పరిమళ, మందమర్రి, తెలంగాణ
యోనిలో ఇన్‌ఫెక్షన్ వల్ల కాని, ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ సమస్య ఉన్నప్పుడు గర్భాశయం కింద భాగంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నా, యోనిలో కంతులు, అరుదుగా క్యాన్సర్ ఇంకా ఎన్నో కారణాల వల్ల వెజైనాలో నొప్పి రావచ్చు. నెట్‌లో ఒక లక్షణం కోసం వెతికితే సవాలక్ష సమాధానాలు దొరుకుతాయి. అంతమాత్రాన అవన్నీ మనకే ఉన్నట్లు కాదు. నీకు నువ్వు అంత భయపడుతూ, ఇబ్బంది పడుతూ ఉండే దానికంటే ఒకసారి గైనకాలిజిస్ట్‌ను సంప్రదించి నీ సమస్యను వారికి వివరిస్తే, వారు నీకు స్పెక్యులమ్ పరీక్ష, బైమాన్యువల్ పెల్విక్ పరీక్ష చేసి, ఇంకా అవసరమనుకుంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్, ప్యాప్ స్మియర్ వంటి పరీక్షలు చేసి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని దానిని బట్టి చికిత్సను సూచిస్తారు. అలాగే పిల్లలు కలగకపోవడానికి గల కారణాలను కూడా తెలుసుకొని, దానికి కూడా సలహాలను అందజేస్తారు. సాధారణంగా యోనిలో క్యాన్సర్ ఉన్నప్పుడు తెల్లబట్ట ఎక్కువ అవ్వడం, అలానే కొద్దికొద్దిగా బ్లీడింగ్ కనిపించడంతో పాటు నువ్వు చెప్పిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాని ఇది సాధారణంగా 50–60 సంవత్సరాలు పైబడ్డ వారిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంత చిన్న వయసులో చాలా చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. కాబట్టి కంగారు పడకుండా గైనకాలజిస్ట్‌ను సంప్రదించు.
డాక్టర్ గారూ.. మా అబ్బాయికి పదకొండేళ్లు. ఇంటి పని పట్లే ధ్యాస ఎక్కువ. ఆడపిల్లలతోనే స్నేహం చేస్తున్నట్లూ గమనించాం. అయితే అమ్మాయిల్లా ముస్తాబు కావడం వంటివి లేవు కాని.. వాడి చెల్లెలికి జెడ వేయడం, బొట్టు కాటుక పెట్టడం వంటివి చాలా ఇష్టంగా, శ్రద్ధగా చేస్తూంటాడు. వాడి తీరుతో మా కంటి మీద కునుకుండట్లేదు. ఇప్పుడే డాక్టర్‌కు చూపించమంటారా? దీన్నెలా అర్థం చేసుకోవాలో సలహా ఇవ్వగలరు.
– కొంగర భూపతి, ఆదోని
మీ అబ్బాయికి ఆడపిల్లలలో ఉండే ఆలోచనా ధోరణి, ఆసక్తి వంటివి ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇంట్లో, బయట చుట్టుపక్కల ఉండే మనుషులు, వాతావరణం, పెరిగిన తీరు వంటి వాటి వల్ల కూడా ప్రభావం అయ్యి అలా ప్రవర్తిస్తుండవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్లలో మార్పుల వల్ల కూడా ప్రవర్తనలో తేడా ఉండవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ముందుగానే ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదిస్తే, ఈ మార్పులు కేవలం మానసిక ఆలోచనలో తేడా వల్లనా లేదా ఏమైనా హార్మోన్లలో లోపాలు, జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి అవసరమైన పరీక్షలు చేసి, అతడికి కౌన్సెలింగ్ చేసి, సమస్య ఎక్కడ ఉందో నిర్ధారణ చేసుకొని అవసరమైన చికిత్సను అందజేస్తారు.
మేడమ్.. మా అమ్మాయికి పదమూడేళ్లు. నాలుగు నెలల కిందటనే మెచ్యూర్ అయింది. అయితే మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆ అమ్మాయి గొంతు కూడా మారిపోయింది. బొంగురుగా, కాస్త అబ్బాయిల గొంతులా వినిపిస్తోంది. ఎందుకో తెలియట్లేదు. ఇదేమైనా సమస్యా? టెస్ట్‌లేమైనా చేయించాలా? మాకు ఆందోళనగా ఉంది. దయచేసి చెప్పగలరు.
– అనంతరామకృష్ణ, వేములవాడ
కొందరు అమ్మాయిలలో హార్మోన్లలో తేడా వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్‌లు, థైరాయిడ్ సమస్య, అసిడిటీ సమస్య వంటి అనేక కారణాల వల్ల గొంతు బొంగురుగా మారడం జరుగుతుంది. కొందరిలో అనేక కారణాల వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరగడం వల్ల కూడా గొంతు బొంగురుపోయి మగ గొంతులాగా ఉండవచ్చు. మీ అమ్మాయి బరువు ఎంత ఉన్నది అనేది రాయలేదు. కొందరిలో అధిక బరువు వల్ల, అండాశయాల్లో నీటి బుడగలు ఉండటం, దాని వల్ల మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే ఆండ్రోజన్ హార్మోన్స్ ఆడవారిలో ఎక్కువగా విడుదలవ్వడం, వాటి ప్రభావం వల్ల అబ్బాయి గొంతులా వినిపించవచ్చు. ఒకసారి ఈఎన్‌టీ డాక్టర్‌ను కలసి గొంతులో సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం మంచిది. తర్వాత ఎండొక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి ఏ హార్మోన్ తేడా ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేసి, సమస్యను బట్టి చికిత్స తీసుకోవడం మంచిది.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment