ప్రతీకాత్మక చిత్రం
నాకిప్పుడు 35 ఏళ్లు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఎన్. సుకన్య, ఆమ్రబాద్
లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి.
ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి.
ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక భర్తతో కాపురం చేయొచ్చు.
మేడమ్.. మా మేనత్తకు ఈ మధ్యే పాప్ టెస్ట్ చేశారు. పాప్ టెస్ట్ అంటే ఏంటో చెప్పగలరు?
– కె. సబిత, కంచిలి
గర్భాశయ ముఖ ద్వారాన్ని సెర్విక్స్ అంటారు. ఇక్కడ అంటే ఈ సెర్విక్స్ లేదా సర్వైకల్ సెల్‌లో ఏవైనా మార్పులు ఉంటే పాప్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా సర్వైకల్ సెల్‌లో కనిపించే మార్పులు క్యాన్సర్‌గా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు అవి నార్మల్ అవచ్చు కూడా. కాబట్టి ఈ టెస్ట్‌లో అబ్‌నార్మల్ రిజల్ట్ వస్తే అడ్వాన్స్‌డ్ టెస్ట్‌ని సూచిస్తారు డాక్టర్లు.
ఆ పరీక్షల్లో కూడా మార్పులు కనిపిస్తే అప్పుడు ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. పాప్ టెస్ట్‌ను నెలసరి అయిన వారంలోపు చేయాలి. అదీ గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్‌లోనే చేస్తారు. పది నిమిషాలు పడుతుంది. వారంలో టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఈ వైద్య పరీక్ష వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టెస్ట్ వల్ల సెర్విక్స్ క్యాన్సర్‌ను తొందరగా పసిగట్టవచ్చు. దాంతో వెంటనే చికిత్స అంది, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
పాప్ టెస్ట్‌ను పాతికేళ్లు వచ్చినప్పటి నుంచి ప్రతి మూడేళ్లకొకసారి చేయించుకోవాలి. యాభై నుంచి అరవై అయిదేళ్ల మధ్య వయస్కులు ప్రతి అయిదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఈ టెస్ట్‌లో హెచ్‌పీవీ టెస్ట్‌ను కూడా కలిపి చేయించుకోవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందవచ్చు.
∙మేడమ్.. నాకు డెలివరీ అయ్యి నెలవుతోంది. బేబీకి నా పాలే ఇస్తున్నాను. కానీ రెండు రోజుల (ఈ ఉత్తరం రాస్తున్నప్పటికి) నుంచి బ్రెస్ట్‌లో ఒకటే నొప్పి, చలి జ్వరం. ఈ టైమ్‌లో బేబీకి నా పాలు పట్టొచ్చా?
– పి. సుధారాణి, తిరుపతి
తల్లి పాలు ఇచ్చేప్పుడు బ్రెస్ట్‌లో నొప్పి, మంట ఉంటాయి కొంచెం. వేడినీళ్లతో కాపడం పెడితే తగ్గుతుంది. కానీ జ్వరం కూడా ఉంది అంటున్నారు కాబట్టి.. బ్రెస్ట్‌లో ఇన్‌ఫెక్షన్ ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించాలి. దీనిని Mastitis అంటారు. బేబీ నోటిలో, ముక్కులో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా తల్లి బ్రెస్ట్ ఇన్‌ఫెక్షన్‌కు కారణం కావచ్చు. త్వరగా గమనించి చికిత్స చేస్తే జ్వరం రాదు.
దీనివల్ల బ్రెస్ట్‌లో విపరీతమైన నొప్పి, జ్వరం, తలనొప్పి కూడా వస్తాయి. బ్యాక్టీరియా బ్రెస్ట్ నిపిల్ మీది పగుళ్ల ద్వారా లోపలికి వెళ్లి మిల్క్ డక్ట్‌ను ఇన్‌ఫెక్షన్‌తో బ్లాక్ చేస్తుంది. మీకు డయాబెటిస్ లేదా నిపిల్ మీద పగుళ్లు ఉంటే బ్రెస్ట్‌లో గడ్డ అయ్యే చాన్స్ పెరుగుతుంది. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చూసి, కొన్ని రక్త పరీక్షలు చేసి యాంటిబయాటిక్ మందులు ఇస్తారు. అవీ పాలు తాగే బిడ్డకు సురక్షితంగా ఉండేవే.
ఈ టైమ్‌లో కూడా మీరు మీ బిడ్డకు డైరెక్ట్‌గానైనా లేదా పాలను పిండైనా పట్టవచ్చు. నిపిల్ పగుళ్లకు క్రీమ్ ఇస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండానికి చనుమొనలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే రెండు రొమ్ముల నుంచి సమంగా పాలు పట్టాలి. పోషకాహారం, మంచి నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. త్వరగా Mastitisకు చికిత్సను అందిస్తే అది గడ్డలా మారదు.
ఇన్‌ఫెక్షన్ ఎక్కువై, రొమ్ములో వాపు వస్తే చిన్న ఆపరేషన్ చేసి పాలగడ్డలను, చీమును తీయవలసి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పాలిస్తూ ఉండాలి. జ్వరం ఉన్నా బిడ్డకు తల్లిపాలు పట్టొచ్చు. పాలిచ్చే సమయంలో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇలాంటి ఇన్‌ఫెక్షన్ తగ్గిన తరువాత కూడా బ్రెస్ట్ పంప్‌తో ఎక్కువైన పాలను తీసేస్తూ జాగ్రత్తగా ఉండాలి.
-డా. భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment