కర్నూలు(హాస్పిటల్): ఓ మహిళ అండాశయంలో ఏర్పడిన 10 కిలోల క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించారు. వివరాలను శుక్రవారం గైనకాలజి విభాగంలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సాయిప్రణీత్ తెలిపారు. ఎమ్మిగనూరుకు చెందిన మదనమ్మ(65) అనే మహిళ ఐదు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 7వ తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజి విభాగంలో చేరింది.
వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆమె అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 23వ తేదిన ఆమెకు వైద్యులు సర్జరీ చేసి కణితి తొలగించారు. శుక్రవారం ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వారిలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సి. సాయిప్రణీత్, గైనకాలజి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్యరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుముద, పీజీ వైద్యురాలు డాక్టర్ సోనాలి, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ వి. శ్రీలత, డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్‌గౌడ్, డాక్టర్ ఎం. స్నేహవల్లి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment