cancer tumor
-
కేన్సర్ కణుతులను మాత్రమే చంపేసే థెరపీ
హూస్టన్: శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలు, కణజాలాల జోలికి పోకుండా కేన్సర్ కణుతులను మాత్రమే చంపేసే కొత్త విధానాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. నేచురల్ కిల్లర్ (ఎన్కే) కణాల వంటి రోగ నిరోధక కణాలతో తయారైన యాంటీట్యూమర్ రోగ నిరోధక ప్రతిస్పందనను ఈ చికిత్స ద్వారా క్రియాశీలకంగా మార్చవచ్చు. అంకోలైటిక్ వైరోథెరపీ (ఓవీ) అనే ఈ విధానం ఇటీవల వచ్చిన కేన్సర్ చికిత్సల్లో అత్యంత నమ్మకమైనదిగా భావిస్తున్నారు. హూస్టన్‌లోని సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెప్టార్స్ అండ్ సెల్ సిగ్నలింగ్ డైరెక్టర్ షౌన్ ఝాంగ్ దీన్ని అభివృద్ధి చేశారు. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం ఆయనకు భారీ గ్రాంటు మంజూరు చేసింది. -
క్యాన్సర్‌ను చంపే ‘ముసుగు మందు’..!
క్యాన్సర్‌కు చేసే చికిత్సలు చాలా కష్టంగా అనిపిస్తుంటాయి. దానికి కారణమూ ఉంది. క్యాన్సర్‌కు వాడే కీమో మందులైనా, రేడియేషన్ ఇచ్చినా... క్యాన్సర్ కణాలతో పాటు ఎన్నో కొన్ని / ఎంతో కొంత ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటాయి. చికిత్స తర్వాత సైడ్ఎఫెక్ట్స్ ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆఖరికి శస్త్రచికిత్స చేసినా సరే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు కొంత మార్జిన్ తీసుకుని, క్యాన్సర్ గడ్డకు ఆనుకుని ఉన్న మంచి కణాలనూ కొంతమేరకు తొలగిస్తుంటారు. చివరకు వ్యాధి నిరోధకతను పెంచడం ద్వారా క్యాన్సర్ కణాలనే నశింపజేసి, బాధితుల ఆయుష్షును పెంచే ఇమ్యూనోథెరపీల విషయంలోనూ ఇలాంటి నష్టం ఎంతో కొంతమేర జరుగుతుంది. ఒకవేళ మంచి కణాలకు ఏమాత్రం హాని చేయకుండా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే వెదికి వెదికి పట్టి తుదముట్టించే చికిత్స ప్రక్రియను కనుగొంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చాలామంది శాస్త్రవేత్తల్లో ఉన్నప్పటికీ... యూనివర్సిటీ ఆఫ్ షికాగోకు చెందిన ప్రిట్జ్కర్ స్కూల్ ఆఫ్ మాలెక్యులార్ ఇంజనీరింగ్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు ఓ ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఈ ముసుగు మందు!! దాని వివరాలివి... ముసుగు మందు పని తీరు ఇది క్యాన్సర్ కణాలకూ, ఆరోగ్యకరమైన కణాలకూ ఓ తేడా ఉంది. ఆరోగ్యకరమైన కణాలు క్రమపద్ధతిలో, నియమిత వేగంతో మాత్రమే పెరుగుతాయి. కానీ క్యాన్సర్ కణాల పెరుగుదల ఓ పద్ధతి లేకుండా చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలా పెరగడానికి కొన్ని ఎంజైములు ఉత్పత్తి అవుతుంటాయి. కానీ అదే ఆరోగ్యకరమైన కణాలతో ఈ ఎంజైముల ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ఈ తేడాలనే మరింత సురక్షితమైన ‘ఐఎల్–12’ వర్షన్‌ను రూపొందించడానికి శాస్త్రవేత్త లు ఉపయోగించుకున్నారు. దీని ఆధారంగా విపరీతంగా ప్రవర్తించే ఈ ‘ఐఎల్–12’ కణాలకు ఓ ‘మాలెక్యులార్ ముసుగు’ తొడిగారు. అవి క్యాన్సర్ గడ్డను చేరేవరకు వాటిపై ఆ ముసుగు అలాగే ఉంటుంది. చాలా వేగంగా ఉత్పత్తయ్యే కణజాలం ఎంజైములు తగిలినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అంటే ఆ ఎంజైమే ఈ ముసుగును ఛిద్రం చేస్తుంది. అంటే... ‘ఐఎల్–12’ కణాలు క్యాన్సర్ గడ్డను చేరగానే ముసుగు తొలగిపోతుందన్నమాట. అక్కడ అవి తమ తీవ్రతా, వైపరీత్యం వంటి గుణాన్ని కోల్పోకుండా... అక్కడే తమ ప్రభావాలను చూపుతాయి. ఫలితంగా అక్కడ కిల్లర్ టీ–సెల్స్‌ను విపరీతంగా పెరిగేలా చేస్తాయవి. దాంతో క్యాన్సర్ గడ్డపై మాత్రమే ఆ తీవ్రత ప్రభావం తీక్షణంగా ఉంటుంది. మిగతా ఆరోగ్యకరమైన కణాలు సురక్షితంగా ఉంటాయి. ఒక క్లినికల్ పరీక్షలో ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’ అనే కొత్త చికిత్సగా... ముసుగు వేసుకుని... లక్ష్యాన్ని చేరాక అక్కడ తీవ్రస్థాయిలో ప్రభావవంతంగా జరిగే ఈ చికిత్సనే ‘ట్రోజెన్ డ్రగ్ డెలివరీ’గా కూడా అభివర్ణిస్తారు. తమ యుద్ధతంత్రంలో భాగంగా... ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి, అందులో రహస్యంగా సైనికులను నింపి ఉంచి... శత్రువులకు బహూకరించాక... అందులోంచి ఒక్కపెట్టున సైనికులు వచ్చి దాడి చేసిన‘ట్రోజన్ వార్’ కథ తెలిసిందే. అందుకే ఈ చికిత్స ప్రక్రియకు ఆ పేరు పెట్టారు. అయితే... ఎంత ముసుగు వేసుకుని పోయినా కొన్నిసార్లు ఇది కొన్నిచోట్ల (మైక్రో ఎన్విరాన్మెంట్లో) అక్కడి కణాల కన్నుకప్పలేకపోవచ్చు. ఆ ఇబ్బందిని గనక అధిగమిస్తే... ఇమ్యూనోథెరపీనీ, కార్–టీ సెల్ థెరపీ (కైమరిక్ యాంటీజెన్ రీకాంబినెంట్ టీ సెల్ థెరపీ)ని... రెండింటినీ కలగలుపుకున్న ఈ థెరపీ మరింత సమర్థంగా రూపొందే అవకాశం ఉందనేది నిపుణుల భావన. అదే జరిగితే (జరిగే అవకాశాలే ఎక్కువ) ఇది తిరుగులేని చికిత్సగా ఆవిర్భవిస్తుందన్నది వైద్యశాస్త్రవేత్తలూ, నిపుణుల మాట. క్యాన్సర్ కణంపై రోగనిరోధక వ్యవస్థ పని చేసేదిలా! మన రోగనిరోధక వ్యవస్థలో సైటోకైన్స్ అనే ప్రోటీన్లు ఒక్కసారిగా దాడి చేసి హానికారక కణాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా సైటోకైన్లు... తెల్లరక్తకణాల్లో ఒక రకానికి చెందిన ‘కిల్లర్ టీ–సెల్స్’ను పెద్ద ఎత్తున ప్రేరేపిస్తాయి. అప్పుడా ‘కిల్లర్ టీ–సెల్స్’ క్యాన్సర్ కణాలపై దాడి ప్రారంభిస్తాయి. ఈ దాడి ప్రభావపూర్వకంగా ఎలా జరగాలన్న అంశంపై ఈ సైటోకైన్ ప్రోటీన్లే... ‘కిల్లర్ టీ–సెల్స్’కు శిక్షణ అందిస్తాయి. ఇలా అవి క్యాన్సర్ కణాలనూ, గడ్డలనూ ఎదుర్కొని వాటిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి సైటోకైన్లలో ఒక రకమే ‘ఇంటర్‌ల్యూకిన్–12’. దీన్ని సంక్షిప్తంగా ‘ఐఎల్–12’ అని కూడా అంటారు. వాటి ప్రభావం ఇలా ఉంటుంది... ఐఎల్– 12ను కనుగొని దాదాపు 30 ఏళ్లయ్యింది. కానీ వీటిని చికిత్సలో ఉపయోగించినప్పుడు అవి వాపు, మంట కలిగించే అంశాలనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇన్ఫ్లమేటరీ మాలెక్యుల్స్ను పుట్టిస్తాయి. ఇవి దేహంలోని ఇతర కణాలను, ముఖ్యంగా కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే... వీటిని ఉపయోగించాక కలిగే అనర్థాలూ, దుష్ప్రభావాల కారణంగా, ముఖ్యంగా కాలేయం వంటి కీలక అవయవాలకు జరిగే నష్టాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని... ఎఫ్‌డీఏ వీటిని చికిత్స ప్రక్రియలకు అనుమతించలేదు. ఆనాటి నుంచి శాస్త్రవేత్తలు ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. క్యాన్సర్ కణాల పట్ల ఈ ‘ఐఎల్–12’ కణాల ప్రభావం తగ్గకూడదు. కానీ దేహం తట్టుకోగలిగేలా వాటిని రూపొందించాలి. ప్రయోగాత్మకంగా రెండు కేస్–స్టడీలివి... రొమ్ముక్యాన్సర్ వచ్చిన కొందరు బాధితులను పరిశీలించగా... సాధారణంగా ఇమ్యూనోధెరపీలో ఉపయోగించే ‘చెక్‌పాయింట్ ఇన్హిబిటార్’తో కేవలం 10 శాతం ఫలితాలు కనిపించగా... ఈ ‘మాస్క్డ్ ఐఎల్–12’తో 90 శాతం ఫలితాలు కనిపించాయి. ఇక ఒక పెద్దపేగు (కోలన్) క్యాన్సర్ కేస్–స్టడీలో ఈ ‘మాస్క్డ్ ఐఎస్–12’తో 100 శాతం ఫలితాలు కనిపించడం మరో విశేషం. డాక్టర్ సురేష్. ఏవీఎస్. మెడికల్ ఆంకాలజిస్ట్ -
కర్నూలు: మహిళ అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి
కర్నూలు(హాస్పిటల్): ఓ మహిళ అండాశయంలో ఏర్పడిన 10 కిలోల క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించారు. వివరాలను శుక్రవారం గైనకాలజి విభాగంలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సాయిప్రణీత్ తెలిపారు. ఎమ్మిగనూరుకు చెందిన మదనమ్మ(65) అనే మహిళ ఐదు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 7వ తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజి విభాగంలో చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆమె అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 23వ తేదిన ఆమెకు వైద్యులు సర్జరీ చేసి కణితి తొలగించారు. శుక్రవారం ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వారిలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సి. సాయిప్రణీత్, గైనకాలజి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్యరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుముద, పీజీ వైద్యురాలు డాక్టర్ సోనాలి, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ వి. శ్రీలత, డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్‌గౌడ్, డాక్టర్ ఎం. స్నేహవల్లి ఉన్నారు. -
చిన్నారికి ‘దాతృత్వ’ చూపు!
పొదలకూరు: పుట్టుకతో తల్లి బాలింత గుణంతో మరణించగా, తండ్రి ఉన్నా కనిపించకుండా ఎటో వెళ్లిపోయాడు. పొదలకూరు శ్రామికనగర్ (గిరిజన కాలనీ)కు చెందిన నాలుగేళ్ల చిన్నారికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లిదండ్రులు లేని పసిపాపను మేనత్త అక్కున చేర్చుకుని పోషిస్తోంది. అయితే విధి ఆ పాపను వేధిస్తూనే ఉంది. చిన్న వయస్సులో మెడపై పెద్ద గడ్డ పుట్టి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. గిరిజనులైన వారు చిన్నారిని ఎలా కాపాడుకోవాలో తెలియక విలవిల్లాడిపోయారు. తెలిసిన వారి ద్వారా ఆస్పత్రులకు తిరిగితే శస్త్రచికిత్సకు రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని వైద్యనిపుణులు వెల్లడించారు. బొల్లినేనిలో శస్త్రచికిత్స ఎట్టకేలకు బాలిక గెడి జయంతికి దాతల సహకారంతో బొల్లినేని ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. పొదలకూరుకు చెందిన దాసరి సురేంద్రబాబు సహకారంతో బొల్లినేనిలో బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొద్ది రోజుల సమయం తీసుకుని శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. బాలిక మెడపై ఉన్న గడ్డకు శస్త్రచికిత్స నిర్వహిస్తే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా పరీక్షల అనంతరం శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. గతేడాది శస్రత్తచికిత్సకు రూ.వేలాది ఖర్చు అవుతుందని తెలుసుకున్న సురేంద్రబాబు విజయవాడకు వెళ్లి సీఎం పేషీ నుంచి లేఖను తీసుకుని వచ్చారు. శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాటు చేస్తుండగా జయంతికి నెమ్ము అధికంగా ఉండడంతో వైద్యనిపుణులు నెమ్ముతగ్గిన తర్వాత శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. ఈలోగా సీఎం పేషీ ఇచ్చిన లేఖ గడువు ముగిసిపోయింది. జయంతి పేరు రేషన్‌కార్డులో లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించ లేదు. ఎన్నో పర్యాయాలు ఆమె పేరును రేషన్‌కార్డు యాడింగ్లో చేర్చినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత ఆరోగ్య రక్ష కింద రూ.1,500 నగదు చెల్లించారు. దాతల సహకారం సురేంద్రబాబు ద్వారా ఆరోగ్యరక్ష పథకంలో పాపకు శస్త్రచికిత్స చేసినప్పటికీ నగదు అవసరం కావడంతో దాతలు ముందుకు వచ్చారు. నెల్లూరు నేస్తం ఫౌండేషన్‌కు చెందిన ప్రవీణ్ రూ.30 వేలు, పొదలకూరు కొత్తలూరు ఫౌండేషన్‌కు చెందిన కోటేశ్వర్రావు రూ.5 వేలు వైద్యఖర్చుల నిమిత్తం బాలికకు అందజేశారు. దీంతో బాలిక శస్త్రచికిత్స ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా జరిగింది. -
ఎంఆర్ఐతోనే క్యాన్సర్ కణుతుల గుర్తింపు...
శరీరంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే చేయించుకునే ఎంఆర్ఐ పరీక్షలు ఇకపై క్యాన్సర్ కణుతుల గుర్తింపుకి కూడా ఉపయోగపడనున్నాయి. ఇదంతా యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్ సౌత్ వెస్టర్న్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. శరీరంలో కణుతులు ఏర్పడటం కొన్ని సందర్భాల్లో సహజం. అన్నీ క్యాన్సర్‌కు దారితీయవు. ఏది వ్యాధిగా మారుతుందో గుర్తించాలంటే.. ఆ కణజాలాన్ని బయటకు తీసి పరీక్షించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కత్తికి అందనిచోట్ల కూడా కణుతులు ఏర్పడటం కద్దు. ఈ నేపథ్యంలో టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కిడ్నీల్లో ఏర్పడే కణుతులపై పరిశోధనలు జరిపారు. సాధారణ ఎంఆర్ఐ పరీక్షలకే కొన్ని మార్పులు చేయడం ద్వారా కణితి ప్రమాదకరమైనదా? కాదా? అందులో ఉన్న పదార్థం ఎలాంటిది? వంటి అన్ని అంశాలను విశ్లేషించగలిగారు. బోలెడన్ని ఎంఆర్ఐ చిత్రాల ఆధారంగా నిర్దిష్ట ప్రాంతలో ఉండే కణితి లోపల అతి సూక్ష్మస్థాయిలో ఉండే కొవ్వు కణాలను కూడా ఇది గుర్తించగలదు. ఈ పద్ధతి దాదాపు 80 శాతం కచ్చితత్వంతో ప్రమాదకరమైన కణుతులను గుర్తించగలదని జెఫ్రీ కాడెడూ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి ఇది శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కాదని.. అనవసరంగా పదే పదే శస్త్రచికిత్సలు చేసే అవసరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
సూక్ష్మజీవులు మారితే.. ఆరోగ్యం!
పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు మారితే.. ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పరిశోధనశాలల్లో పనిచేసే మందులు కొన్ని వాస్తవ పరిస్థితుల్లో పనిచేయక పోవడానికీ ఇదే కారణం కావొచ్చని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్‌లోని డాక్టర్ బార్బరా రెహర్మాన్ చెబుతున్నారు. ప్రకృతిలో, పరిశోధనశాలల్లో పెరిగే ఎలుకలు రెండూ వేర్వేరు. పరిశోధనశాలల్లో వాటికి ఏ రకమైన ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తగా నియంత్రిత వాతావరణంలో పెంచుతారు. దీని ప్రభావం వాటి శరీరం, పేగుల్లోని సూక్ష్మజీవులపై ఉంటుందని బార్బరా పేర్కొంటున్నారు. ఈ సూక్ష్మజీవులు సాధారణ వాతావరణంలో వ్యాధులను ఎదుర్కొనేందుకు తగిన నిరోధకతను ఇస్తుందని, పరిశోధనశాలల్లో పెరిగిన ఎలుకలకు ఈ సామర్థ్యం ఉండదని వివరించారు. ఈ నేపథ్యంలో తాము సహజ సిద్ధంగా పెరుగుతున్న దాదాపు 800 ఎలుకల్లోని సూక్ష్మజీవులను సేకరించి పరిశోధనశాలల్లో పెరిగిన ఎలుకల్లోకి జొప్పించామని, నాలుగు తరాల తర్వాత అవి ఫ్లూ వైరస్‌ను తట్టుకున్నాయని వివరించారు. అలాగే పెద్దపేగు కేన్సర్ కణుతులు కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు చేసి సహజసిద్ధమైన సూక్ష్మజీవుల ప్రభావాన్ని స్పష్టంగా గుర్తించాల్సి ఉందని చెప్పారు. -
ప్రాంకియాస్‌లోని 4 కేజీల కేన్సర్ గడ్డ తొలగింపు
• దేశంలోనే తొలిసారిగా ఉస్మానియాలో చికిత్స • 60 ఏళ్ల నిరుపేదకు పునర్జన్మ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో అరుదైన రికార్డు సృష్టించారు. శరీరంలోని అత్యంత క్లిష్టమైన ప్రాంకియాస్కు ఆనుకుని ఉన్న నాలుగు కేజీల బరువైన కేన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించారు. దేశంలోనే ఈ తరహా చికిత్స తొలిసారని వైద్యులు వెల్లడించారు. శనివారం డాక్టర్ మధుసూదన్ చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. జహీరాబాద్ నిరుపేద కుటుంబానికి చెందిన విఠల్ (60) ఎనిమిది నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అనేక మంది వైద్యులకు చూపించినా నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఆయన నెల కిందట ఉస్మానియాలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ప్రముఖ కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ చింతకింది గణేష్‌ను సంప్రదించారు. బాధితుడిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్రాంకీయాస్ నుంచి ఇతర భాగాలకు ఇన్స్‌లిన్‌ను సరఫరా చేసే కీలకమైన రక్తనాళాలకు ఆనుకుని పెద్ద కేన్సర్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. 20 రోజుల క్రితం 8 మందితో కూడిన వైద్యుల బృందం తొమ్మిది గంటల పాటు శ్రమించి గడ్డను విజయవంతంగా బయటికి తీశారు. కడుపు, గర్భసంచిలో పది కేజీల గడ్డలు ఉండటం సహజం. కానీ చాలా చిన్న పరిమాణంలో ఉండే ప్రాంకీయాస్లో నాలుగు కేజీల బరువుతో కూడిన కేన్సర్ గడ్డ ఉండటం చాలా అరుదు. దీని చుట్టూ అనేక రక్తనాళాలు ముడిపడి ఉంటాయి. ఇలాంటిచోట చికిత్స చేయడం క్లిష్టమైన ప్రక్రియ. కానీ, తాము దీన్ని సవాలుగా తీసుకుని చికిత్స చేశామని మధుసూదన్ తెలిపారు. ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.10–రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ ఉస్మానియాలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడన్నారు. -
క్యాన్సర్ కణితి తొలగింపులో...గాటుతో పోయేదానికి కోత ఎందుకు?
క్యాన్సర్ కణితి రావడానికి ఫలానా అవయవం అంటూ మినహాయింపు ఉండదు. క్యాన్సర్ సోకిన అవయవాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో కణితి ఉన్న భాగాన్ని తీయడం కోసం పెద్దగా కోయడం కంటే చిన్నవి రెండు మూడు రంధ్రాలు పెట్టి చేయగలిగితే...? దాన్నే ఎండోస్కోపిక్ సర్జరీ అంటారు. చిన్న రంధ్రం పెడతారు కాబట్టి కీహోల్ సర్జరీ అని కూడా అంటారు. దీని వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికే ఈ కథనం. క్యాన్సర్ కణితిని తొలగించాలంటే ఇప్పుడు చిన్న గాటు చాలు. మన దేహంలోని వివిధ అవయవాలకు వచ్చే క్యాన్సర్ గడ్డలను అతి చిన్న రంధ్రం ద్వారానే తొలగించుకోవడం ఎలా సాధ్యమో, సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఆ ప్రక్రియ వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం. జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్ గడ్డలకు: నోరు మొదలుకొని, పురీషనాళం వరకు ఆహారం ప్రయాణం చేస్తూ, జీర్ణక్రియకు ఉపయోగపడే వ్యవస్థను జీర్ణవ్యవస్థ (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్ట్) అంటారు. ఈ మార్గంలో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఉంటే... దాన్ని తొలగించడం కోసం సంప్రదాయ శస్త్రచికిత్సలో భాగంగా ఛాతీ భాగాన్ని కోయాల్సి వస్తుంది. అన్నవాహికలో, పొట్టలో వచ్చే క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి పక్కటెముకలను దాటుకుని వెళ్లడానికి వాటిని కూడా ఛేదించాల్సి ఉంటుంది. ఈ భాగాలకు వచ్చే క్యాన్సర్లు ప్రధానంగా పెద్ద వయసు వారిలో, పొగతాగే అలవాటు ఉన్నవారిలో వస్తాయి. అంత పెద్దగా కోయడం వల్ల వచ్చే దుష్ర్పభావాలను తట్టుకోవడం ఆ వయసు వారికి కష్టం కావచ్చు. ఛాతీ భాగంలో అతి చిన్నవైన మూడు రంధ్రాలు చేయడం ద్వారానే క్యాన్సర్ గడ్డలను తొలగించగలిగే సౌకర్యం ఉన్నప్పుడు ఇక అంత పెద్దగా కోయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. జీర్ణవ్యవస్థలోని కింది భాగంలో అంటే పెద్దపేగు భాగంలో, పురీషనాళం వద్ద (కోలోరెక్టల్) ఏర్పడే క్యాన్సర్లలో ఆ భాగాన్ని తొలగించాక, వెంటనే కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రెక్టల్ (మలద్వార) భాగంలో ఉన్న క్యాన్సర్‌ను తొలగించిన వెంటనే రేడియోథెరపీ ఇవ్వాలి. సంప్రదాయ శస్త్రచికిత్స ద్వారా కోసి, క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగిస్తే, అటు కీమోగాని, ఇటు రేడియేషన్ గాని ఇవ్వాలంటే గాయం తగ్గే వరకూ ఆగాలి. పెద్దగా కోత ఉన్నప్పుడు అది తగ్గడానికి చాలా సమయం తీసుకోవచ్చు. కానీ ఇలా కేవలం రెండుమూడు రంధ్రాలతో జరిగే శస్త్రచికిత్సలో గాయం చిన్నది కాబట్టి త్వరగా మానిపోయి కీమో, రేడియేషన్ తొందరగా మొదలుపెట్టడానికి అవకాశం ఎక్కువ. ఇక సంప్రదాయ శస్త్రచికిత్సలో పెద్దపేగు చివరి భాగం రెక్టమ్ క్యాన్సర్ స్పష్టంగా బయటకు కనపడదు కాబట్టి చాలాసార్లు ‘పర్మనెంట్ కొలాస్టమీ’ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కీహోల్ ప్రక్రియలో కంటికి కనపడని రెక్టమ్ భాగాన్ని కూడా 3-డి డిజిటల్ ఇమేజ్ ద్వారా చూసేందుకు వీలుండటంతో పెద్దపేగును బయటకు తీసుకురాకుండానే అక్కడే చికిత్స చేయవచ్చు. పైగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అధునాతన స్టేప్లర్ డివైజ్లతో శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయాల్సిన భాగాలను మరింత సమర్థంగా అతికించవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో మలద్వార (రెక్టల్) భాగంలో ఆపరేషన్ చేస్తే, ఆ తర్వాత చాలామందిలో సెక్స్‌పరమైన సామర్థ్యలోపం కలిగేందుకు అవకాశాలు ఎక్కువ. దాంతోపాటు మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయేందుకూ అవకాశం ఉంటాయి. ఎందుకంటే మూత్రవిసర్జన, సెక్స్ ప్రక్రియకు సంబంధించిన నరాలు రెక్టల్ భాగానికి దగ్గర్నుంచి వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి సదరు నరాలు గాయపడితే పై సమస్యలు రావచ్చు. కానీ కీ-హోల్ చికిత్స ప్రక్రియలో ఇప్పుడున్న హై-డెఫినేషన్ 3-డి కెమెరాల్లో ఈ నరాలు మామూలు కంటితో చూసిన దానికంటే స్పష్టంగా కనపడతాయి. దాంతో ఇలాంటి సెక్స్‌పరమైన లోపాలు రావడానికి అవకాశం లేదు. ఈ కీహోల్ ప్రక్రియ ద్వారా కాలేయం, ప్యాక్రియాస్ వంటి చోట్ల ఉండే కణుతులనూ సులభంగా తొలగించవచ్చు. మూత్ర-ప్రత్యుత్పత్తి భాగాల్లో: మూత్రవిసర్జన, ప్రత్యుత్పత్తికి సంబంధించిన శరీర భాగాలలోని క్యాన్సర్ కణుతులను తొలగించడానికి కేవలం గాటుతోనే పని జరిగిపోయే ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. మూత్రవిసర్జక-ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే ఈ భాగాలను జనైటల్ ట్రాక్ట్ భాగాలుగా పేర్కొంటారు. ఇందులో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించడం అన్నది కేవలం 0.5 సెం.మీ. పరిమాణంలో ఉండే నాలుగు రంధ్రాల ద్వారా తేలిగ్గా సాధ్యమవుతుంది. ఇక ఒవేరియన్ క్యాన్సర్ చాలా ఆలస్యంగా బయటపడుతుంది. బాగా ముదిరాక కనపడే ఈ ఒవేరియన్ క్యాన్సర్‌ను సంప్రదాయ శస్త్రచికిత్స ద్వారా తొలగించాలంటే శరీరంపై దాదాపు 25 సెం.మీ. పొడవున కోయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద గాయం మానాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఇదే శస్త్రచికిత్సను కేవలం 0.5 సెం.మీ. కంటే తక్కువ ఉండే నాలుగైదు రంధ్రాలతో చేయవచ్చు. కాబట్టి గాయం చాలా త్వరగా మానుతుంది. క్యాన్సర్ విషయంలో కోతకు తక్కువగా ఆస్కారం ఉండేలా అందానికి ప్రాధాన్యం ఏముంది అని కొందరంటుంటారు కానీ నిజానికి ఇక్కడ అందం (కాస్మటిక్)కి ఎలాంటి ప్రాధాన్యమూ ఉండదు. 25 సెం.మీ. పొడవున ఉండే గాయం కంటే 0.5 సెం.మీ పరిమాణంలో ఉండే నాలుగు రంధ్రాలు చాలా త్వరగా మానిపోవడం వల్ల, ఆ తర్వాత శస్త్రచికిత్స అనంతరం చేయాల్సిన కీమో, రేడియోథెరపీ వంటి ఇతర ప్రక్రియలను అతిత్వరితంగా మొదలుపెట్టడం అనే దానికే డాక్టర్లు ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే పురుషాంగ క్యాన్సర్ విషయాల్లోనూ, మూత్రవిసర్జక వ్యవస్థలో కనిపించే యూరినరీ ట్రాక్ట్ క్యాన్సర్లకు, కిడ్నీల్లో వచ్చే ట్యూమర్ల విషయంలోనూ సాంప్రదాయిక మార్గాల ద్వారా చేసే రాడికల్ సిస్టెక్టమీ, రాడికల్ నెఫ్రెక్టమీకి బదులు... తక్కువ గాటుతో ఆయా శరీర భాగాలను బయటకు తీసి శస్త్రచికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆయా గడ్డలను ‘ఎండో బ్యాగ్’ అనే సంచిలో పెట్టి పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణజాలానికి తగలకుండా బయటకు తీయడానికి వీలవుతుంది. దీనివల్ల ట్యూమర్ కారణంగా పక్క కణజాలానికి వ్యాధి సంక్రమించకుండా (ట్యూమర్ కంటామినేషన్ జరగకుండా) చేయడానికి వీలువుతుంది. ఇక యూరినరీ బ్లాడర్, గర్భసంచి వంటి వాటికి చేసే పెల్విక్ ఎక్సెంట్రేషన్ శస్త్రచికిత్సలకు బదులు తక్కువ గాటుతో చేసే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీల వల్ల రోగులు చాలా త్వరగా కోలుకోడానికి అవకాశముంటుంది. పైన పేర్కొన్న శస్త్రచికిత్సలు మాత్రమే గాక... థైరాయిడ్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ముఖ్యంగా చంకలో ఉండే చిన్న చిన్న గడ్డలకు పాకిన సందర్భాల్లో వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్: ఈ తరహా క్యాన్సర్ పొగతాగేవారిలో లేదా వయసు పైబడ్డవారిలో ఎక్కువ. దాంతో వారు పూర్తిగా ఛాతీ కోసే చేసే థొరకాటమీ ప్రక్రియకు తట్టుకునే అవకాశాలు తక్కువ. అదే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ (వ్యాట్స్) అనే ప్రక్రియ ద్వారా తక్కువ గాటుతో చేసే శస్త్రచికిత్సతో అత్యంత సంక్లిష్టమైన ఊపిరితిత్తులు, వాటి లోబ్స్ (తమ్మెల)కు చేసే శస్త్రచికిత్స చాలా సులువవుతుంది. ప్రయోజనాలు: ఎండోస్కోపీ లేదా కీహోల్ సర్జరీగా అభివర్ణించే ఈ తక్కువ గాటుతో చేసే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీతో అనేక ప్రయోజనాలున్నాయి. కేవలం మూడు, నాలుగు చిన్న గాట్లు పెట్టడం వల్ల అవి తేలిగ్గా తగ్గిపోతాయి. దాంతో సర్జరీ తర్వాత చేయాల్సిన కీమో, రేడియోథెరపీ లాంటి ఇతర ప్రక్రియలు త్వరగా మొదలుపెట్టవచ్చు. కొన్నిసార్లు కోత గాయం మానకుండా ఉన్నప్పుడు వచ్చే వూండ్ కాంప్లికేషన్స్, ఈ ప్రక్రియలో రావు. పైగా కోత ఉండదు కాబట్టి నొప్పీ తక్కువే. ఇక నిమోనియా, డీప్‌వీన్ థ్రాంబోసిస్ లాంటి కాంప్లికేషన్లూ తక్కువే. సాధారణ శస్త్రచికిత్స తర్వాత మెట్లు ఎక్కడం, బరువులు మోయడం, కిందకూర్చోవడం వంటి ప్రక్రియలకు మూడు నెలలు ఆగాలి. కానీ కీహోల్ ప్రక్రియతో శస్త్రచికిత్స పూర్తయ్యాక ఆ పనులన్నీ ఆ మర్నాడే చేసుకోవచ్చు. డాక్టర్ సిహెచ్.మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్: 98480 11421