పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు మారితే.. ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. పరిశోధనశాలల్లో పనిచేసే మందులు కొన్ని వాస్తవ పరిస్థితుల్లో పనిచేయక పోవడానికీ ఇదే కారణం కావొచ్చని అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్‌లోని డాక్టర్ బార్బరా రెహర్‌మాన్ చెబుతున్నారు.
ప్రకృతిలో, పరిశోధనశాలల్లో పెరిగే ఎలుకలు రెండూ వేర్వేరు. పరిశోధనశాలల్లో వాటికి ఏ రకమైన ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తగా నియంత్రిత వాతావరణంలో పెంచుతారు. దీని ప్రభావం వాటి శరీరం, పేగుల్లోని సూక్ష్మజీవులపై ఉంటుందని బార్బరా పేర్కొంటున్నారు. ఈ సూక్ష్మజీవులు సాధారణ వాతావరణంలో వ్యాధులను ఎదుర్కొనేందుకు తగిన నిరోధకతను ఇస్తుందని, పరిశోధనశాలల్లో పెరిగిన ఎలుకలకు ఈ సామర్థ్యం ఉండదని వివరించారు.
ఈ నేపథ్యంలో తాము సహజ సిద్ధంగా పెరుగుతున్న దాదాపు 800 ఎలుకల్లోని సూక్ష్మజీవులను సేకరించి పరిశోధనశాలల్లో పెరిగిన ఎలుకల్లోకి జొప్పించామని, నాలుగు తరాల తర్వాత అవి ఫ్లూ వైరస్‌ను తట్టుకున్నాయని వివరించారు. అలాగే పెద్దపేగు కేన్సర్ కణుతులు కూడా గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు చేసి సహజసిద్ధమైన సూక్ష్మజీవుల ప్రభావాన్ని స్పష్టంగా గుర్తించాల్సి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment