• దేశంలోనే తొలిసారిగా ఉస్మానియాలో చికిత్స
• 60 ఏళ్ల నిరుపేదకు పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో అరుదైన రికార్డు సృష్టించారు. శరీరంలోని అత్యంత క్లిష్టమైన ప్రాంకియాస్‌కు ఆనుకుని ఉన్న నాలుగు కేజీల బరువైన కేన్సర్ గడ్డను విజయవంతంగా తొలగించారు. దేశంలోనే ఈ తరహా చికిత్స తొలిసారని వైద్యులు వెల్లడించారు. శనివారం డాక్టర్ మధుసూదన్ చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. జహీరాబాద్ నిరుపేద కుటుంబానికి చెందిన విఠల్ (60) ఎనిమిది నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అనేక మంది వైద్యులకు చూపించినా నొప్పి మాత్రం తగ్గలేదు.
దీంతో ఆయన నెల కిందట ఉస్మానియాలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ప్రముఖ కాలేయ మార్పిడి నిపుణుడు డాక్టర్ చింతకింది గణేష్‌ను సంప్రదించారు. బాధితుడిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్రాంకీయాస్ నుంచి ఇతర భాగాలకు ఇన్స్‌లిన్‌ను సరఫరా చేసే కీలకమైన రక్తనాళాలకు ఆనుకుని పెద్ద కేన్సర్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. 20 రోజుల క్రితం 8 మందితో కూడిన వైద్యుల బృందం తొమ్మిది గంటల పాటు శ్రమించి గడ్డను విజయవంతంగా బయటికి తీశారు. కడుపు, గర్భసంచిలో పది కేజీల గడ్డలు ఉండటం సహజం. కానీ చాలా చిన్న పరిమాణంలో ఉండే ప్రాంకీయాస్‌లో నాలుగు కేజీల బరువుతో కూడిన కేన్సర్ గడ్డ ఉండటం చాలా అరుదు.
దీని చుట్టూ అనేక రక్తనాళాలు ముడిపడి ఉంటాయి. ఇలాంటిచోట చికిత్స చేయడం క్లిష్టమైన ప్రక్రియ. కానీ, తాము దీన్ని సవాలుగా తీసుకుని చికిత్స చేశామని మధుసూదన్ తెలిపారు. ఇలాంటి చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.10–రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ ఉస్మానియాలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నాడన్నారు.