కన్జ్యూమర్‌ వాచ్‌డాగ్‌ చీఫ్‌  రోహిత్‌ చోప్రాను తొలగించిన ట్రంప్‌  | Donald Trump removes Rohit Chopra as director of CFPB | Sakshi
Sakshi News home page

కన్జ్యూమర్‌ వాచ్‌డాగ్‌ చీఫ్‌  రోహిత్‌ చోప్రాను తొలగించిన ట్రంప్‌ 

Published Sun, Feb 2 2025 4:37 AM | Last Updated on Sun, Feb 2 2025 4:37 AM

Donald Trump removes Rohit Chopra as director of CFPB

పామ్‌ బీచ్‌ (యూఎస్‌): వినియోగదారుల ఆర్థిక రక్షణ సంస్థ డైరెక్టర్‌ రోహిత్‌ చోప్రాను అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తొలగించారు. జనవరి 20న ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. ఇప్పటికీ పదవిలో ఉన్న డెమొక్రటిక్‌ అధికారుల్లో చోప్రా ఒకరు. చోప్రా తొలగింపును ఈమెయిల్‌ ద్వారా ఆయనకు తెలియజేశారు. దీంతో తన నిష్క్రమణ గురించి చోప్రా శనివారం ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.

 ఏజెన్సీతో తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించినందుకు శక్తివంతమైన కంపెనీలు, వాటి ఎగ్జిక్యూటివ్‌లపై చర్యలు తీసుకోవడంలో మీరు మాకు సహాయపడ్డారు. మా పనిని మెరుగుపరిచారు’’అని చోప్రా పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం చోప్రా ఐదేళ్ల పాటు సీఎఫ్‌పీబీ డైరెక్టర్‌గా కొనసాగాల్సి ఉంది. అయితే కొత్త అధ్యక్షుడు కోరితే తన పదవి నుంచి తప్పుకుంటానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.

 చోప్రా తన పదవీకాలంలో క్రెడిట్‌ రిపోర్టుల నుంచి వైద్య రుణాన్ని తొలగించడం, ఓవర్‌డ్రాఫ్ట్‌ల జరిమానాలపై పరిమితులను తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఆయన చర్యలను రెగ్యులేటరీ అతిక్రమణగా కొందరు వ్యతిరేకించారు. చోప్రా తొలగింపు.. వినియోగదారుల రక్షణ శకానికి ముగింపును సూచిస్తుందని డెమొక్రాట్, కాలిఫోర్నియా ప్రతినిధి మాక్సిన్‌ వాటర్స్‌ అన్నారు. వాల్‌స్ట్రీట్‌ బిలియనీర్లకు లొంగిపోయి సంస్థను నాశనం చేయడానికి రిపబ్లికన్లు ప్రయత్నిస్తే.. పోరాటం చేస్తామని వారెన్‌ హెచ్చరించారు.   

2008లో ఏర్పాటైన బ్యూరో 
2008 ఆర్థిక సంక్షోభం తరువాత తనఖాలు, కారు రుణాలు, ఇతర వినియోగదారుల ఫైనాన్స్‌ను నియంత్రించడానికి బ్యూరోను ఏర్పాటు చేశారు. దీన్ని రిపబ్లికన్లు, వారి ఆర్థిక మద్దతుదారులు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యూరోను బలహీనపరిచే ఒక సవాలును గతేడాది సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి నిధులు సమకూర్చే విధానం రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తీర్పు ఇచ్చింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement