క్యాన్సర్‌ను చంపే ‘ముసుగు మందు’..!  | Masked Cancer Drug That Kills Tumors | Sakshi
Sakshi News home page

మాస్క్‌డ్‌ ఐఎల్‌ 12.. క్యాన్సర్‌ను చంపే ‘ముసుగు మందు’..! 

Published Sat, Jun 4 2022 11:41 PM | Last Updated on Sat, Jun 4 2022 11:41 PM

Masked Cancer Drug That Kills Tumors - Sakshi

క్యాన్సర్‌కు చేసే చికిత్సలు చాలా కష్టంగా అనిపిస్తుంటాయి. దానికి కారణమూ ఉంది. క్యాన్సర్‌కు వాడే కీమో మందులైనా, రేడియేషన్‌ ఇచ్చినా... క్యాన్సర్‌ కణాలతో పాటు ఎన్నో కొన్ని / ఎంతో కొంత ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతింటాయి. చికిత్స తర్వాత సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎలాగూ ఉండనే ఉంటాయి. ఆఖరికి శస్త్రచికిత్స చేసినా సరే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు కొంత మార్జిన్‌ తీసుకుని, క్యాన్సర్‌ గడ్డకు ఆనుకుని ఉన్న మంచి కణాలనూ కొంతమేరకు తొలగిస్తుంటారు.

చివరకు వ్యాధి నిరోధకతను పెంచడం ద్వారా క్యాన్సర్‌ కణాలనే నశింపజేసి, బాధితుల ఆయుష్షును పెంచే ఇమ్యూనోథెరపీల విషయంలోనూ ఇలాంటి నష్టం ఎంతో కొంతమేర జరుగుతుంది. ఒకవేళ మంచి కణాలకు ఏమాత్రం హాని చేయకుండా, కేవలం క్యాన్సర్‌ కణాలను మాత్రమే వెదికి వెదికి పట్టి తుదముట్టించే చికిత్స ప్రక్రియను కనుగొంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చాలామంది శాస్త్రవేత్తల్లో ఉన్నప్పటికీ... యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోకు చెందిన ప్రిట్జ్‌కర్‌ స్కూల్‌ ఆఫ్‌ మాలెక్యులార్‌ ఇంజనీరింగ్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు ఓ ప్రయత్నం చేశారు. దాని ఫలితమే ఈ ముసుగు మందు!! దాని వివరాలివి... 

ముసుగు మందు పని తీరు ఇది
క్యాన్సర్‌ కణాలకూ, ఆరోగ్యకరమైన కణాలకూ ఓ తేడా ఉంది. ఆరోగ్యకరమైన కణాలు క్రమపద్ధతిలో, నియమిత వేగంతో మాత్రమే పెరుగుతాయి. కానీ క్యాన్సర్‌ కణాల పెరుగుదల ఓ పద్ధతి లేకుండా చాలా వేగంగా కొనసాగుతుంది. ఇలా పెరగడానికి కొన్ని ఎంజైములు  ఉత్పత్తి అవుతుంటాయి. కానీ అదే ఆరోగ్యకరమైన కణాలతో ఈ ఎంజైముల ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. ఈ తేడాలనే మరింత సురక్షితమైన ‘ఐఎల్‌–12’ వర్షన్‌ను రూపొందించడానికి శాస్త్రవేత్త లు ఉపయోగించుకున్నారు. దీని ఆధారంగా విపరీతంగా ప్రవర్తించే ఈ ‘ఐఎల్‌–12’ కణాలకు ఓ ‘మాలెక్యులార్‌ ముసుగు’ తొడిగారు. అవి క్యాన్సర్‌ గడ్డను చేరేవరకు వాటిపై ఆ ముసుగు అలాగే ఉంటుంది.

చాలా వేగంగా ఉత్పత్తయ్యే  కణజాలం ఎంజైములు తగిలినప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది. అంటే ఆ ఎంజైమే ఈ ముసుగును ఛిద్రం చేస్తుంది. అంటే... ‘ఐఎల్‌–12’ కణాలు క్యాన్సర్‌ గడ్డను చేరగానే ముసుగు తొలగిపోతుందన్నమాట. అక్కడ అవి తమ తీవ్రతా, వైపరీత్యం వంటి గుణాన్ని కోల్పోకుండా... అక్కడే తమ ప్రభావాలను చూపుతాయి. ఫలితంగా అక్కడ కిల్లర్‌ టీ–సెల్స్‌ను విపరీతంగా పెరిగేలా చేస్తాయవి. దాంతో క్యాన్సర్‌ గడ్డపై మాత్రమే ఆ తీవ్రత ప్రభావం తీక్షణంగా ఉంటుంది. మిగతా ఆరోగ్యకరమైన కణాలు సురక్షితంగా ఉంటాయి. ఒక క్లినికల్‌ పరీక్షలో ఈ అంశాన్ని ప్రయోగాత్మకంగా చూశారు. 

‘ట్రోజెన్‌ డ్రగ్‌ డెలివరీ’ అనే కొత్త చికిత్సగా...
ముసుగు వేసుకుని... లక్ష్యాన్ని చేరాక అక్కడ తీవ్రస్థాయిలో ప్రభావవంతంగా జరిగే ఈ చికిత్సనే ‘ట్రోజెన్‌ డ్రగ్‌ డెలివరీ’గా కూడా అభివర్ణిస్తారు. తమ యుద్ధతంత్రంలో భాగంగా... ఓ పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి, అందులో రహస్యంగా సైనికులను నింపి ఉంచి... శత్రువులకు బహూకరించాక... అందులోంచి ఒక్కపెట్టున సైనికులు వచ్చి దాడి చేసిన‘ట్రోజన్‌ వార్‌’ కథ తెలిసిందే. అందుకే ఈ చికిత్స ప్రక్రియకు ఆ పేరు పెట్టారు.

అయితే... ఎంత ముసుగు వేసుకుని పోయినా కొన్నిసార్లు ఇది కొన్నిచోట్ల (మైక్రో ఎన్విరాన్‌మెంట్‌లో) అక్కడి కణాల కన్నుకప్పలేకపోవచ్చు. ఆ ఇబ్బందిని గనక అధిగమిస్తే... ఇమ్యూనోథెరపీనీ, కార్‌–టీ సెల్‌ థెరపీ (కైమరిక్‌ యాంటీజెన్‌ రీకాంబినెంట్‌ టీ సెల్‌ థెరపీ)ని... రెండింటినీ కలగలుపుకున్న ఈ థెరపీ మరింత సమర్థంగా రూపొందే అవకాశం ఉందనేది నిపుణుల భావన. అదే జరిగితే (జరిగే అవకాశాలే ఎక్కువ) ఇది తిరుగులేని చికిత్సగా ఆవిర్భవిస్తుందన్నది వైద్యశాస్త్రవేత్తలూ, నిపుణుల మాట. 

క్యాన్సర్‌ కణంపై రోగనిరోధక వ్యవస్థ పని చేసేదిలా! 
మన రోగనిరోధక వ్యవస్థలో సైటోకైన్స్‌ అనే ప్రోటీన్‌లు ఒక్కసారిగా దాడి చేసి హానికారక కణాలను తుదముట్టించడానికి ప్రయత్నిస్తాయి. ఈ ప్రయత్నంలో భాగంగా సైటోకైన్లు... తెల్లరక్తకణాల్లో ఒక రకానికి చెందిన ‘కిల్లర్‌ టీ–సెల్స్‌’ను పెద్ద ఎత్తున ప్రేరేపిస్తాయి. అప్పుడా ‘కిల్లర్‌ టీ–సెల్స్‌’ క్యాన్సర్‌ కణాలపై దాడి ప్రారంభిస్తాయి. 
ఈ దాడి ప్రభావపూర్వకంగా ఎలా జరగాలన్న అంశంపై ఈ సైటోకైన్‌ ప్రోటీన్లే... ‘కిల్లర్‌ టీ–సెల్స్‌’కు శిక్షణ అందిస్తాయి. ఇలా అవి క్యాన్సర్‌ కణాలనూ, గడ్డలనూ ఎదుర్కొని వాటిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఇలాంటి సైటోకైన్లలో ఒక రకమే ‘ఇంటర్‌ల్యూకిన్‌–12’. దీన్ని సంక్షిప్తంగా ‘ఐఎల్‌–12’  అని కూడా అంటారు. 

వాటి ప్రభావం ఇలా ఉంటుంది...
ఐఎల్‌– 12ను కనుగొని దాదాపు 30 ఏళ్లయ్యింది. కానీ వీటిని చికిత్సలో ఉపయోగించినప్పుడు అవి వాపు, మంట కలిగించే అంశాలనూ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇన్‌ఫ్లమేటరీ మాలెక్యుల్స్‌ను పుట్టిస్తాయి. ఇవి దేహంలోని ఇతర కణాలను, ముఖ్యంగా కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే... వీటిని ఉపయోగించాక కలిగే అనర్థాలూ, దుష్ప్రభావాల కారణంగా, ముఖ్యంగా కాలేయం వంటి కీలక అవయవాలకు జరిగే నష్టాల వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని... ఎఫ్‌డీఏ వీటిని చికిత్స ప్రక్రియలకు అనుమతించలేదు. ఆనాటి నుంచి శాస్త్రవేత్తలు ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. క్యాన్సర్‌ కణాల పట్ల ఈ ‘ఐఎల్‌–12’ కణాల  ప్రభావం తగ్గకూడదు. కానీ దేహం తట్టుకోగలిగేలా వాటిని రూపొందించాలి. 

ప్రయోగాత్మకంగా రెండు కేస్‌–స్టడీలివి... 
రొమ్ముక్యాన్సర్‌ వచ్చిన కొందరు బాధితులను పరిశీలించగా... సాధారణంగా ఇమ్యూనోధెరపీలో  ఉపయోగించే ‘చెక్‌పాయింట్‌ ఇన్హిబిటార్‌’తో కేవలం 10 శాతం ఫలితాలు కనిపించగా... ఈ ‘మాస్క్‌డ్‌ ఐఎల్‌–12’తో 90 శాతం ఫలితాలు కనిపించాయి. ఇక ఒక పెద్దపేగు (కోలన్‌) క్యాన్సర్‌ కేస్‌–స్టడీలో ఈ ‘మాస్క్‌డ్‌ ఐఎస్‌–12’తో 100 శాతం ఫలితాలు కనిపించడం మరో విశేషం.  


డాక్టర్‌ సురేష్‌. ఏవీఎస్‌. 
మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement