
శరీరంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే చేయించుకునే ఎంఆర్‌ఐ పరీక్షలు ఇకపై క్యాన్సర్ కణుతుల గుర్తింపుకి కూడా ఉపయోగపడనున్నాయి. ఇదంతా యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్ సౌత్ వెస్టర్న్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. శరీరంలో కణుతులు ఏర్పడటం కొన్ని సందర్భాల్లో సహజం. అన్నీ క్యాన్సర్‌కు దారితీయవు. ఏది వ్యాధిగా మారుతుందో గుర్తించాలంటే.. ఆ కణజాలాన్ని బయటకు తీసి పరీక్షించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కత్తికి అందనిచోట్ల కూడా కణుతులు ఏర్పడటం కద్దు. ఈ నేపథ్యంలో టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కిడ్నీల్లో ఏర్పడే కణుతులపై పరిశోధనలు జరిపారు.
సాధారణ ఎంఆర్‌ఐ పరీక్షలకే కొన్ని మార్పులు చేయడం ద్వారా కణితి ప్రమాదకరమైనదా? కాదా? అందులో ఉన్న పదార్థం ఎలాంటిది? వంటి అన్ని అంశాలను విశ్లేషించగలిగారు. బోలెడన్ని ఎంఆర్‌ఐ చిత్రాల ఆధారంగా నిర్దిష్ట ప్రాంతలో ఉండే కణితి లోపల అతి సూక్ష్మస్థాయిలో ఉండే కొవ్వు కణాలను కూడా ఇది గుర్తించగలదు. ఈ పద్ధతి దాదాపు 80 శాతం కచ్చితత్వంతో ప్రమాదకరమైన కణుతులను గుర్తించగలదని జెఫ్రీ కాడెడూ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి ఇది శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కాదని.. అనవసరంగా పదే పదే శస్త్రచికిత్సలు చేసే అవసరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.