MRI test
-
రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతి చౌక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్ఐ కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు. అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డిఎస్జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్ఐ స్కాన్‌కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్‌ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్ఐ యంత్రాలు చొప్పున ఉన్నట్టు ప్రకటించారు. After a low-cost dispensary, Gurudwara Bangla Sahib is now slated to open a cheap diagnostic facility. An ultrasound will cost Rs. 150 & an MRI Scan Rs. 50! 🙏 pic.twitter.com/oZLKQblUTa — Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 5, 2020 -
ఎంఆర్ఐతోనే క్యాన్సర్ కణుతుల గుర్తింపు...
శరీరంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే చేయించుకునే ఎంఆర్ఐ పరీక్షలు ఇకపై క్యాన్సర్ కణుతుల గుర్తింపుకి కూడా ఉపయోగపడనున్నాయి. ఇదంతా యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్ సౌత్ వెస్టర్న్ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. శరీరంలో కణుతులు ఏర్పడటం కొన్ని సందర్భాల్లో సహజం. అన్నీ క్యాన్సర్‌కు దారితీయవు. ఏది వ్యాధిగా మారుతుందో గుర్తించాలంటే.. ఆ కణజాలాన్ని బయటకు తీసి పరీక్షించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కత్తికి అందనిచోట్ల కూడా కణుతులు ఏర్పడటం కద్దు. ఈ నేపథ్యంలో టెక్సస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కిడ్నీల్లో ఏర్పడే కణుతులపై పరిశోధనలు జరిపారు. సాధారణ ఎంఆర్ఐ పరీక్షలకే కొన్ని మార్పులు చేయడం ద్వారా కణితి ప్రమాదకరమైనదా? కాదా? అందులో ఉన్న పదార్థం ఎలాంటిది? వంటి అన్ని అంశాలను విశ్లేషించగలిగారు. బోలెడన్ని ఎంఆర్ఐ చిత్రాల ఆధారంగా నిర్దిష్ట ప్రాంతలో ఉండే కణితి లోపల అతి సూక్ష్మస్థాయిలో ఉండే కొవ్వు కణాలను కూడా ఇది గుర్తించగలదు. ఈ పద్ధతి దాదాపు 80 శాతం కచ్చితత్వంతో ప్రమాదకరమైన కణుతులను గుర్తించగలదని జెఫ్రీ కాడెడూ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి ఇది శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కాదని.. అనవసరంగా పదే పదే శస్త్రచికిత్సలు చేసే అవసరాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ఎంఆర్ఐకి 40 ఏళ్లు
సాక్షి, అమరావతి: మానవ శకాన్ని క్రీ.పూ, క్రీ.శ అని ఎలా విభజించారో.. వైద్య రంగాన్ని కూడా మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ)కి ముందు, ఎంఆర్ఐకి తర్వాత అని చెప్పుకోవచ్చు. శరీరం లోపలి భాగాలను ప్రతి అంగుళం స్పృశించి, రోగ నిర్ధారణను కళ్ల ముందు ఆవిçష్కృతమయ్యేలా చేసిన మహా ఆవిష్కరణ ఇది. వ్యాధిని కనుక్కునేలోపే కోట్లాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న తరుణంలో 1977లో మానవ మేధస్సు నుంచి జాలువారింది. ఈ వైద్య పరికరం మన ముంగిటకొచ్చి 40 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఎంఆర్ఐ ప్రత్యేకతలు తెలుసుకుందాం.. ఎంఆర్ఐ ఎలా పనిచేస్తుందంటే.. శరీరంలో చిన్న చిన్న క్యాన్సర్ కణాలను కనుక్కోవడం ఎవరితరమూ కాదు. వ్యాధి సోకిందని తెలుసుకునేలోపే మూడు లేదా నాలుగో దశకు చేరుకుంటుంది. ప్రాణాలు కోల్పోవడం మినహా మరో మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఎంఆర్ఐ.. క్యాన్సర్‌ను గుర్తించడంలో ఇతోధికంగా సహాయపడింది. ప్రాథమిక దశలోనే శరీరంలోని క్యాన్సర్ కణాలను శోధించి జబ్బు నిర్ధారణ చేసింది. తద్వారా లక్షలాదిమందిని ప్రాణాపాయం నుంచి గట్టెక్కించింది. ఇదెలా పనిచేస్తుందంటే.. మొదట రోగిని మాగ్నెట్ (అయస్కాంతం) లోపల ఉంచాలి. ఈ అయస్కాంతం కాయిల్.. రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్‌ని శరీరంలోకి పంపిస్తుంది. తర్వాత రోగి నుంచి సంకేతాలు తీసుకుంటుంది. ఇలా వచ్చిన సంకేతాలను ఒక ఇమేజ్ (చిత్రం)లాగా కంప్యూటర్‌కు చేరుస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆ అవయవంలోని లోపాలను చూసుకునే వీలుంటుంది. కొత్త పద్ధతులు అభివృద్ధి చేసిన వారికి నోబెల్ ప్రైజ్ 1977లో ఎంఆర్ఐని కనిపెట్టింది అమెరికాకు చెందిన రేమండ్ డయాడియన్. ఈయన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసే ఎంఆర్ఐని కనుగొన్నారు. ఆ తర్వాత లాటర్బర్, సర్ పీటర్ మాన్స్ఫీల్డ్ అనే ప్రొఫెసర్లు ఇద్దరూ కలిసి ఎంఆర్ఐలో కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో 2003లో వీరిద్దరికీ నోబెల్ బహుమతిని ప్రకటించారు. అయితే రేమండ్ డయాడియన్కు నోబెల్ దక్కాలని, ఆయనే దీనికి మూలపురుషుడని కానీ ఆయనకు దక్కకుండా ఎంఆర్ఐ అభివృద్ధి చేసినవారికి ఇచ్చారని ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం. ఎంఆర్ఐలో అనేక రకాల సీక్వెన్స్‌లు ఎంఆర్ఐలో అనేక రకాల సీక్వెన్స్ (చిత్రీకరణ)లు ఉన్నాయి. ఒక్కో సీక్వెన్స్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. టి1: దీనిలో అనాటమీ (శరీరంలోని భాగాలు) విపు లంగా కనిపిస్తాయి. ఏ భాగాన్ని స్కాన్ చేసినా ఇందులో అనాటమీని చూడొచ్చు. ఇందులో గాడోలి నియం అనే కాంట్రాస్ట్‌ను రోగి నరాల్లోకి ఇచ్చి కొన్ని సందర్భాల్లో మళ్లీ స్కాన్ చేస్తారు. దీంతో ఆ భాగంలో వ్యాధి కణజాలం ఎక్కడ, ఎలా ఉందో నిర్ధారిస్తుంది. టి2: దీనిలో అనాటమీతోపాటు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడు, దీనిలో కణితులు చూడొచ్చు. వెన్నెముకలో తేడాలు, మోకాలు, భుజం, మోచేయి, ఛాతీ, రొమ్ము ఇలా అన్నింటిలోనూ స్కానింగ్ ద్వారా వ్యత్యాసాలను పరిశీలించొచ్చు. టి2 ఫ్లెయర్: దీని ద్వారా ఇన్ఫెక్షన్లను గుర్తించొచ్చు. కణితుల్లోని తేడాలను తెలుసుకోవచ్చు. స్టిర్: ఇది ఎముకలోని తేడాలను, కండరాలతోపాటు అస్థిపంజరంలోని తేడాలని కనిపెట్టడానికి ఉపయోగిస్తారు. జీఆర్ఈ (ససెప్టిబిలిటీ సెస్సిటివ్ సీక్వెన్స్): హేమరేజ్ (రక్తం గడ్డకట్టడం), మెదడులో కలిగే ఇన్ఫెక్షన్లు గుర్తించొచ్చు. ఫ్లో సెస్సిటివ్ సీక్వెన్స్: ఎంఆర్ యాంజియోగ్రఫీ, ఎంఆర్ వినోగ్రఫీ, సీఎస్ఎఫ్ ఫ్లో వంటివి చేస్తారు. వెన్నుపాములో ఉండే రక్త స్రావం,, శరీరంలోని ధమనులు, నరాలు వాటిలో ఉండే తేడాలను తెలుసుకోవచ్చు. కణితులను సులభంగా గుర్తించొచ్చు గతంలో మెదడులో కణితులను గుర్తించాలంటే సిటీ స్కాన్ చేసేవాళ్లం. ఇందులో స్పష్టత ఉండేది కాదు. దీంతో జబ్బును గుర్తించలేకపోయేవాళ్లం. కానీ ఎంఆర్ఐ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతి చిన్న కణాలను కూడా స్పష్టంగా గుర్తిస్తున్నాం. దీంతో మెదడు వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం సులువుగా మారింది. –డా.ప్రవీణ్ అంకతి, న్యూరో సర్జన్, గ్లోబల్ హాస్పిటల్, హైదరాబాద్ -
అల్ట్రాసౌండ్ స్కానర్‌తోనే సీటీ, ఎంఆర్ఐ
ఇప్పటివరకు ఉన్న అల్ట్రాసౌండ్ స్కానర్ల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఉన్నవన్నీ 2డీ స్కానర్లే. గర్భంలోని శిశువు, గుండె, ఇతర అవయవాల త్రీడీ చిత్రాలతో వైద్య రంగంలో ఎన్నో ఉపయోగాలున్న విషయం తెలిసిందే. కాకపోతే వీటి ఖరీదెక్కువ. తాజాగా దాదాపు కోటిన్నర రూపాయలు విలువ చేసే త్రీడీ అల్ట్రాసౌండ్ యం త్రం లక్షల్లో వచ్చేలా చేశారు డ్యూక్, స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు. ఇందుకు మన స్మార్ట్ఫోన్లలో ఉండే యాక్సెలరోమీటర్ సాయం తీసుకున్నారు. ఫోన్ ఏ పొజిషన్లో ఉందో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వెయ్యి రూపాయలు ఖరీదు చేసే మైక్రోప్రాసెసర్‌తో దీన్ని 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు అనుసంధానించడం ద్వారా త్రీడీ ఇమేజింగ్ చేయగలిగామని, ఇది సీటీ స్కాన్, ఎంఆర్‌ఐలకు ఏమాత్రం తీసిపోదని జోషువా బ్రూడర్ అనే శాస్త్రవేత్త వివరించారు. ‘మా అబ్బాయి వీడియే గేమ్స్ ఆడుతుంటే దాని కం ట్రోలర్ నన్ను ఆకట్టుకుంది. కన్సోల్ స్థానాన్ని కచ్చితంగా గుర్తుపట్టే సామర్థ్యాన్ని 2డీ అల్ట్రాసౌండ్కు అందించాలన్న ఆలోచనతో మా ప్రాజెక్టు మొదలైంది’అని ఆయన పేర్కొన్నారు. 2డీ అల్ట్రాసౌండ్ ప్రోబ్‌కు ఓ ప్లాస్టిక్ ఉపకరణాన్ని అనుసంధానిస్తే, అందులోని మైక్రో ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుందని చెప్పారు. -
2 నెలలు ఆగి రండి!
అత్యవసర పరీక్షలపై సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ ⇒ సిటీస్కాన్, ఎంఆర్ఐలకూ నెలల తరబడి ఆగాల్సిందే ⇒ రిపోర్టుల కోసం మరో పక్షం రోజుల నిరీక్షణ ⇒ ఆ లోపు వ్యాధి ముదిరితే అంతే సంగతి! వరంగల్‌లోని భారత్ గ్యాస్ కార్యాలయంలో పని చేస్తున్న భాస్కర్.. ఇటీవల అకస్మాత్తుగా ఎడమ కాలి స్పర్శ కోల్పోయాడు. స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు అత్యవసరంగా ఎంఆర్ఐ పరీక్ష చేయించాలని చెప్పారు. దీంతో జనవరి 30న హుటాహుటిన హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రికి వచ్చాడు. అత్యవసరమైనప్పటికీ ఫిబ్రవరి 21 వరకు ఎంఆర్ఐ తీసేందుకు వీలు లేదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. వారు చెప్పినట్లే గతనెల 21న ఎంఆర్ఐ పరీక్ష చేయించాడు. కాని రిపోర్టులు మాత్రం భాస్కర్ చేతికందలేదు. దీంతో చికిత్స చేయించుకోవాల్సిన సమయంలో ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నాడు. రిపోర్టు రానిదే చికిత్స చేయలేమని వైద్యులు తేల్చి చెప్పడంతో భయాందోళన చెందుతున్నాడు. ఉప్పల్‌కు చెందిన ఎన్.మల్లారెడ్డి వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు. పక్షం రోజుల క్రితం నిలబడలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించగా అత్యవసరంగా ఎంఆర్ఐ తీయించమని చెప్పాడు. దీంతో ఎంఆర్ఐ పరీక్ష కోసం కౌంటర్ వద్దకు వెళితే.. మే 24వ తేదీన వచ్చి పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.వెన్నునొప్పి తీవ్రం కావడం, నడవలేని పరిస్థితి ఏర్పడడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. సాక్షి, హైదరాబాద్: జబ్బు చేసి దవాఖానకు వెళ్తే.. ఖాళీ లేదు మళ్లీ రండి అంటే..? వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలంటే.. ‘రెండు నెలల తర్వాత..’ అని తిప్పి పంపిస్తే.. ఆ రోగి పరిస్థితి ఏమిటి? హైదరాబాద్‌లోని కార్మిక ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న దుస్థితి ఇది. చికిత్స కోసం వందల కిలోమీటర్ల నుంచి వస్తున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి నరకం చూపిస్తోంది. అత్యవసర పరీక్షలు తక్షణమే చేయాల్సిందిగా వైద్యులు సూచనలు చేస్తుండగా.. ఆస్పత్రిలో మాత్రం పరీక్షలు చేసేందుకు నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. రెండు నెలల తర్వాత.. వ్యాధి నిర్ధారణలో ఎంఆర్ఐ, సిటీస్కాన్ పరీక్షలు కీలకం. ఈ పరీక్షల ఆధారంగా వచ్చే ఫలితాలను బట్టి రోగులకు చికిత్స మొదలుపెడతారు. ఈ పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవి. దీంతో ఈ పరీక్షలు అవసరమున్న కార్మికులు అత్యాధునిక పరికరాలు ఉన్న సనత్‌నగర్ ఆస్పత్రిలో సంప్రదిస్తారు. కాని ఇక్కడ పరీక్షలు నిర్వహించడానకే నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. అత్యవసర కేటగిరీలో వచ్చే పేషంట్లను కూడా రెండు నెలల తర్వాత వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్పత్రి కావడంతో పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ.. పరీక్షలు చేయడానికి రెండు నెలల తర్వాత రమ్మనడంపై కార్మిక కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల ఫలితాల సంగతీ అంతే! సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ఒక ఎత్తయితే.. వాటి తాలూకు రిపోర్టులు తీసుకోవడం మరో ఎత్తు. పేషంట్లు నిర్దేశిత తేదీల్లో వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నా.. రిపోర్టులు పొందాలంటే వారం నుంచి పక్షం రోజులు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిందే. రిపోర్టులు రాకపోవడంతో చికిత్స ప్రారంభించలేక వైద్యులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఆస్పత్రిని నమ్ముకుని వచ్చిన రోగి ప్రాణాలమీదకు వస్తోంది. ఎంఆర్ఐ, సిటీస్కాన్ కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉందని, గతంలో ఆరుగురు పని చేస్తుండగా ప్రస్తుతం నలుగురే ఉన్నారని, రెండు రాష్ట్రాల నుంచి పేషంట్లు అధికంగా రావడంతో జాప్యం జరుగుతోందని ఆ విభాగ అధికారి స్వర్ణలత ‘సాక్షి’కి తెలిపారు.