ఎంఆర్‌ఐకి 40 ఏళ్లు | MRI is 40 years old | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌ఐకి 40 ఏళ్లు

Published Sun, Nov 12 2017 1:20 AM | Last Updated on Sun, Nov 12 2017 1:21 AM

MRI is 40 years old - Sakshi

సాక్షి, అమరావతి: మానవ శకాన్ని క్రీ.పూ, క్రీ.శ అని ఎలా విభజించారో.. వైద్య రంగాన్ని కూడా మాగ్నెటిక్‌ రిసొనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ)కి ముందు, ఎంఆర్‌ఐకి తర్వాత అని చెప్పుకోవచ్చు. శరీరం లోపలి భాగాలను ప్రతి అంగుళం స్పృశించి, రోగ నిర్ధారణను కళ్ల ముందు ఆవిçష్కృతమయ్యేలా చేసిన మహా ఆవిష్కరణ ఇది. వ్యాధిని కనుక్కునేలోపే కోట్లాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న తరుణంలో 1977లో మానవ మేధస్సు నుంచి జాలువారింది. ఈ వైద్య పరికరం మన ముంగిటకొచ్చి 40 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఎంఆర్‌ఐ ప్రత్యేకతలు తెలుసుకుందాం..

ఎంఆర్‌ఐ ఎలా పనిచేస్తుందంటే..
శరీరంలో చిన్న చిన్న క్యాన్సర్‌ కణాలను కనుక్కోవడం ఎవరితరమూ కాదు. వ్యాధి సోకిందని తెలుసుకునేలోపే మూడు లేదా నాలుగో దశకు చేరుకుంటుంది. ప్రాణాలు కోల్పోవడం మినహా మరో మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఎంఆర్‌ఐ.. క్యాన్సర్‌ను గుర్తించడంలో ఇతోధికంగా సహాయపడింది. ప్రాథమిక దశలోనే శరీరంలోని క్యాన్సర్‌ కణాలను శోధించి జబ్బు నిర్ధారణ చేసింది. తద్వారా లక్షలాదిమందిని ప్రాణాపాయం నుంచి గట్టెక్కించింది. ఇదెలా పనిచేస్తుందంటే.. మొదట రోగిని మాగ్నెట్‌ (అయస్కాంతం) లోపల ఉంచాలి. ఈ అయస్కాంతం కాయిల్‌.. రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్‌ని శరీరంలోకి పంపిస్తుంది. తర్వాత రోగి నుంచి సంకేతాలు తీసుకుంటుంది. ఇలా వచ్చిన సంకేతాలను ఒక ఇమేజ్‌ (చిత్రం)లాగా కంప్యూటర్‌కు చేరుస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆ అవయవంలోని లోపాలను చూసుకునే వీలుంటుంది.

కొత్త పద్ధతులు అభివృద్ధి చేసిన వారికి నోబెల్‌ ప్రైజ్‌
1977లో ఎంఆర్‌ఐని కనిపెట్టింది అమెరికాకు చెందిన రేమండ్‌ డయాడియన్‌. ఈయన శరీరం మొత్తాన్ని స్కాన్‌ చేసే ఎంఆర్‌ఐని కనుగొన్నారు. ఆ తర్వాత లాటర్‌బర్, సర్‌ పీటర్‌ మాన్స్‌ఫీల్డ్‌ అనే ప్రొఫెసర్‌లు ఇద్దరూ కలిసి ఎంఆర్‌ఐలో కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో 2003లో వీరిద్దరికీ నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. అయితే రేమండ్‌ డయాడియన్‌కు నోబెల్‌ దక్కాలని, ఆయనే దీనికి మూలపురుషుడని కానీ ఆయనకు దక్కకుండా ఎంఆర్‌ఐ అభివృద్ధి చేసినవారికి ఇచ్చారని ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం.

ఎంఆర్‌ఐలో అనేక రకాల సీక్వెన్స్‌లు
ఎంఆర్‌ఐలో అనేక రకాల సీక్వెన్స్‌ (చిత్రీకరణ)లు ఉన్నాయి. ఒక్కో సీక్వెన్స్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే..
టి1: దీనిలో అనాటమీ (శరీరంలోని భాగాలు) విపు లంగా కనిపిస్తాయి. ఏ భాగాన్ని స్కాన్‌ చేసినా ఇందులో అనాటమీని చూడొచ్చు. ఇందులో గాడోలి నియం అనే కాంట్రాస్ట్‌ను రోగి నరాల్లోకి ఇచ్చి కొన్ని సందర్భాల్లో మళ్లీ స్కాన్‌ చేస్తారు. దీంతో ఆ భాగంలో వ్యాధి కణజాలం ఎక్కడ, ఎలా ఉందో నిర్ధారిస్తుంది.
టి2: దీనిలో అనాటమీతోపాటు బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చినప్పుడు మెదడు, దీనిలో కణితులు చూడొచ్చు. వెన్నెముకలో తేడాలు, మోకాలు, భుజం, మోచేయి, ఛాతీ, రొమ్ము ఇలా అన్నింటిలోనూ స్కానింగ్‌ ద్వారా వ్యత్యాసాలను పరిశీలించొచ్చు.
టి2 ఫ్లెయర్‌: దీని ద్వారా ఇన్‌ఫెక్షన్లను  గుర్తించొచ్చు. కణితుల్లోని తేడాలను తెలుసుకోవచ్చు.
స్టిర్‌: ఇది ఎముకలోని తేడాలను, కండరాలతోపాటు అస్థిపంజరంలోని తేడాలని కనిపెట్టడానికి ఉపయోగిస్తారు. జీఆర్‌ఈ (ససెప్టిబిలిటీ సెస్సిటివ్‌ సీక్వెన్స్‌): హేమరేజ్‌ (రక్తం గడ్డకట్టడం), మెదడులో కలిగే ఇన్‌ఫెక్షన్లు గుర్తించొచ్చు. 
ఫ్లో సెస్సిటివ్‌ సీక్వెన్స్‌: ఎంఆర్‌ యాంజియోగ్రఫీ, ఎంఆర్‌ వినోగ్రఫీ, సీఎస్‌ఎఫ్‌ ఫ్లో వంటివి చేస్తారు. వెన్నుపాములో ఉండే రక్త స్రావం,, శరీరంలోని ధమనులు, నరాలు వాటిలో ఉండే తేడాలను తెలుసుకోవచ్చు.

కణితులను సులభంగా గుర్తించొచ్చు
గతంలో మెదడులో కణితులను గుర్తించాలంటే సిటీ స్కాన్‌ చేసేవాళ్లం. ఇందులో స్పష్టత ఉండేది కాదు. దీంతో జబ్బును గుర్తించలేకపోయేవాళ్లం. కానీ ఎంఆర్‌ఐ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతి చిన్న కణాలను కూడా స్పష్టంగా గుర్తిస్తున్నాం. దీంతో మెదడు వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం సులువుగా మారింది.
–డా.ప్రవీణ్‌ అంకతి, న్యూరో సర్జన్, గ్లోబల్‌ హాస్పిటల్, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement