magnetic resonance imaging scan
-
లాంగ్ కోవిడ్‌తో అవయవాలకు ముప్పు
లండన్: కోవిడ్–19 మహమ్మా రి బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగైన వారిలో కూడా అవయవాలు దెబ్బతింటున్నట్లు యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో వివిధ యూనివర్సిటీల సైంటిస్టులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. లాంగ్ కోవిడ్‌తో శరీరంలోని కొన్ని ప్రధాన అవయవాలు క్రమంగా పనిచేయడం ఆగిపోతున్నట్లు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. కరోనా బాధితుల మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) స్కానింగ్లతో ఈ విషయం కనిపెట్టినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాలకు లాంగ్ కోవిడ్ ముప్పు మూడు రెట్లు అధికంగా పొంచి ఉందని అన్నారు. మనిషిపై దాడి చేసిన కరోనా వైరస్ తీవ్రతను బట్టి ముప్పు తీవ్ర కూడా పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ అధ్యయనం వివరాలను ‘లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్’ పత్రికలో ప్రచురించారు. 259 మంది కరోనా బాధితులపై అధ్యయనం నిర్వహించారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక 5 నెలల తర్వాత వారి ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించారు. కరోనా సోకని వారితో పోలిస్తే వారి శరీరంలోని ప్రధాన అవయవాల్లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించారు. అన్నింటికంటే ఊపరితిత్తులే అధికంగా ప్రభావితం అవుతున్నట్లు తేల్చారు. గుండె, కాలేయం ఏమాత్రం దెబ్బతినడం లేదని గమనించారు. లాంగ్ కోవిడ్‌కు మరింత ప్రభావవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ
లండన్: సంప్రదాయ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఎంఆర్ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ రేడియాలజీ ఎక్స్పరిమెంటల్ పత్రికలో ప్రచురించారు. హార్ట్ ఫెయిల్యూర్‌ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు. -
ఎంఆర్ఐకి 40 ఏళ్లు
సాక్షి, అమరావతి: మానవ శకాన్ని క్రీ.పూ, క్రీ.శ అని ఎలా విభజించారో.. వైద్య రంగాన్ని కూడా మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ)కి ముందు, ఎంఆర్ఐకి తర్వాత అని చెప్పుకోవచ్చు. శరీరం లోపలి భాగాలను ప్రతి అంగుళం స్పృశించి, రోగ నిర్ధారణను కళ్ల ముందు ఆవిçష్కృతమయ్యేలా చేసిన మహా ఆవిష్కరణ ఇది. వ్యాధిని కనుక్కునేలోపే కోట్లాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న తరుణంలో 1977లో మానవ మేధస్సు నుంచి జాలువారింది. ఈ వైద్య పరికరం మన ముంగిటకొచ్చి 40 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఎంఆర్ఐ ప్రత్యేకతలు తెలుసుకుందాం.. ఎంఆర్ఐ ఎలా పనిచేస్తుందంటే.. శరీరంలో చిన్న చిన్న క్యాన్సర్ కణాలను కనుక్కోవడం ఎవరితరమూ కాదు. వ్యాధి సోకిందని తెలుసుకునేలోపే మూడు లేదా నాలుగో దశకు చేరుకుంటుంది. ప్రాణాలు కోల్పోవడం మినహా మరో మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఎంఆర్ఐ.. క్యాన్సర్‌ను గుర్తించడంలో ఇతోధికంగా సహాయపడింది. ప్రాథమిక దశలోనే శరీరంలోని క్యాన్సర్ కణాలను శోధించి జబ్బు నిర్ధారణ చేసింది. తద్వారా లక్షలాదిమందిని ప్రాణాపాయం నుంచి గట్టెక్కించింది. ఇదెలా పనిచేస్తుందంటే.. మొదట రోగిని మాగ్నెట్ (అయస్కాంతం) లోపల ఉంచాలి. ఈ అయస్కాంతం కాయిల్.. రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్‌ని శరీరంలోకి పంపిస్తుంది. తర్వాత రోగి నుంచి సంకేతాలు తీసుకుంటుంది. ఇలా వచ్చిన సంకేతాలను ఒక ఇమేజ్ (చిత్రం)లాగా కంప్యూటర్‌కు చేరుస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆ అవయవంలోని లోపాలను చూసుకునే వీలుంటుంది. కొత్త పద్ధతులు అభివృద్ధి చేసిన వారికి నోబెల్ ప్రైజ్ 1977లో ఎంఆర్ఐని కనిపెట్టింది అమెరికాకు చెందిన రేమండ్ డయాడియన్. ఈయన శరీరం మొత్తాన్ని స్కాన్ చేసే ఎంఆర్ఐని కనుగొన్నారు. ఆ తర్వాత లాటర్బర్, సర్ పీటర్ మాన్స్ఫీల్డ్ అనే ప్రొఫెసర్లు ఇద్దరూ కలిసి ఎంఆర్ఐలో కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో 2003లో వీరిద్దరికీ నోబెల్ బహుమతిని ప్రకటించారు. అయితే రేమండ్ డయాడియన్కు నోబెల్ దక్కాలని, ఆయనే దీనికి మూలపురుషుడని కానీ ఆయనకు దక్కకుండా ఎంఆర్ఐ అభివృద్ధి చేసినవారికి ఇచ్చారని ఇప్పటికీ విమర్శలు వ్యక్తమవుతుండటం గమనార్హం. ఎంఆర్ఐలో అనేక రకాల సీక్వెన్స్‌లు ఎంఆర్ఐలో అనేక రకాల సీక్వెన్స్ (చిత్రీకరణ)లు ఉన్నాయి. ఒక్కో సీక్వెన్స్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. టి1: దీనిలో అనాటమీ (శరీరంలోని భాగాలు) విపు లంగా కనిపిస్తాయి. ఏ భాగాన్ని స్కాన్ చేసినా ఇందులో అనాటమీని చూడొచ్చు. ఇందులో గాడోలి నియం అనే కాంట్రాస్ట్‌ను రోగి నరాల్లోకి ఇచ్చి కొన్ని సందర్భాల్లో మళ్లీ స్కాన్ చేస్తారు. దీంతో ఆ భాగంలో వ్యాధి కణజాలం ఎక్కడ, ఎలా ఉందో నిర్ధారిస్తుంది. టి2: దీనిలో అనాటమీతోపాటు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడు, దీనిలో కణితులు చూడొచ్చు. వెన్నెముకలో తేడాలు, మోకాలు, భుజం, మోచేయి, ఛాతీ, రొమ్ము ఇలా అన్నింటిలోనూ స్కానింగ్ ద్వారా వ్యత్యాసాలను పరిశీలించొచ్చు. టి2 ఫ్లెయర్: దీని ద్వారా ఇన్ఫెక్షన్లను గుర్తించొచ్చు. కణితుల్లోని తేడాలను తెలుసుకోవచ్చు. స్టిర్: ఇది ఎముకలోని తేడాలను, కండరాలతోపాటు అస్థిపంజరంలోని తేడాలని కనిపెట్టడానికి ఉపయోగిస్తారు. జీఆర్ఈ (ససెప్టిబిలిటీ సెస్సిటివ్ సీక్వెన్స్): హేమరేజ్ (రక్తం గడ్డకట్టడం), మెదడులో కలిగే ఇన్ఫెక్షన్లు గుర్తించొచ్చు. ఫ్లో సెస్సిటివ్ సీక్వెన్స్: ఎంఆర్ యాంజియోగ్రఫీ, ఎంఆర్ వినోగ్రఫీ, సీఎస్ఎఫ్ ఫ్లో వంటివి చేస్తారు. వెన్నుపాములో ఉండే రక్త స్రావం,, శరీరంలోని ధమనులు, నరాలు వాటిలో ఉండే తేడాలను తెలుసుకోవచ్చు. కణితులను సులభంగా గుర్తించొచ్చు గతంలో మెదడులో కణితులను గుర్తించాలంటే సిటీ స్కాన్ చేసేవాళ్లం. ఇందులో స్పష్టత ఉండేది కాదు. దీంతో జబ్బును గుర్తించలేకపోయేవాళ్లం. కానీ ఎంఆర్ఐ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతి చిన్న కణాలను కూడా స్పష్టంగా గుర్తిస్తున్నాం. దీంతో మెదడు వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం సులువుగా మారింది. –డా.ప్రవీణ్ అంకతి, న్యూరో సర్జన్, గ్లోబల్ హాస్పిటల్, హైదరాబాద్ -
కీళ్లు కదలకపోతే...
నిర్ధారణ! కీళ్ల నొప్పులు, కదిలించినప్పుడు టకటకమని విరిగినట్లు శబ్దం రావడం లేదా కిర్రుమని ఒకదానికొకటి రాసుకుంటున్నట్లు శబ్దం రావడం, ఎముకలో వాపు, కీళ్ల దగ్గర నీరు చేరడం, కీళ్ల కదలికలు కష్టంగా అనిపించడం, కీళ్ల దగ్గర కండరం సన్నబడిపోవడం, కీళ్లు బలంగా లేక బరువు మోపడానికి ధైర్యం చాలకపోవడం వంటి లక్షణాలు అన్నీ కానీ, కొన్ని కానీ ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్‌గా గుర్తిస్తారు. ఈ లక్షణాలు కనిపించినప్పటికీ దానిని నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌రే: ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌ను నిర్ధారించడానికి చేసే తొలి పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఎముక ములుకులా ఏర్పడడం, రెండు ఎముకల మధ్య ఖాళీ తగినంత లేక ఎముకలు దగ్గరగా జరగడం, కీళ్లలో క్యాల్షియం నిక్షిప్తమై ఉండడం వంటి ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఎంఆర్ఐ స్కాన్: దీని పూర్తి పేరు మ్యాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్. ఈ పరీక్ష ద్వారా ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్, కండరాలు, ఎముకను కండరాన్ని కలిపే టెండాన్స్ పరిస్థితితోపాటు ఎముకలో వచ్చిన చిన్న పాటి తేడాను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏ రకమైన అనారోగ్యమైనా సరే మొదట రక్తపరీక్షను సూచిస్తుంటారు. కానీ ఇందులో రక్తపరీక్ష చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఆస్టియో ఆర్థరైటిస్తోపాటు రక్తహీనత వంటి ఇతర అనారోగ్య లక్షణాలు కూడా ఉన్నప్పుడు రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది.