నాలుగేళ్ల జయంతి మెడపై ఉన్న గడ్డ (ఫైల్)
పొదలకూరు: పుట్టుకతో తల్లి బాలింత గుణంతో మరణించగా, తండ్రి ఉన్నా కనిపించకుండా ఎటో వెళ్లిపోయాడు. పొదలకూరు శ్రామికనగర్ (గిరిజన కాలనీ)కు చెందిన నాలుగేళ్ల చిన్నారికి పెద్ద కష్టం వచ్చిపడింది. తల్లిదండ్రులు లేని పసిపాపను మేనత్త అక్కున చేర్చుకుని పోషిస్తోంది. అయితే విధి ఆ పాపను వేధిస్తూనే ఉంది. చిన్న వయస్సులో మెడపై పెద్ద గడ్డ పుట్టి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. గిరిజనులైన వారు చిన్నారిని ఎలా కాపాడుకోవాలో తెలియక విలవిల్లాడిపోయారు. తెలిసిన వారి ద్వారా ఆస్పత్రులకు తిరిగితే శస్త్రచికిత్సకు రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని వైద్యనిపుణులు వెల్లడించారు.
బొల్లినేనిలో శస్త్రచికిత్స
ఎట్టకేలకు బాలిక గెడి జయంతికి దాతల సహకారంతో బొల్లినేని ఆస్పత్రిలో శనివారం శస్త్రచికిత్స చేశారు. పొదలకూరుకు చెందిన దాసరి సురేంద్రబాబు సహకారంతో బొల్లినేనిలో బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు కొద్ది రోజుల సమయం తీసుకుని శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. బాలిక మెడపై ఉన్న గడ్డకు శస్త్రచికిత్స నిర్వహిస్తే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినా పరీక్షల అనంతరం శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. గతేడాది శస్రత్తచికిత్సకు రూ.వేలాది ఖర్చు అవుతుందని తెలుసుకున్న సురేంద్రబాబు విజయవాడకు వెళ్లి సీఎం పేషీ నుంచి లేఖను తీసుకుని వచ్చారు.
శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాటు చేస్తుండగా జయంతికి నెమ్ము అధికంగా ఉండడంతో వైద్యనిపుణులు నెమ్ముతగ్గిన తర్వాత శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు. ఈలోగా సీఎం పేషీ ఇచ్చిన లేఖ గడువు ముగిసిపోయింది. జయంతి పేరు రేషన్‌కార్డులో లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వర్తించ లేదు. ఎన్నో పర్యాయాలు ఆమె పేరును రేషన్‌కార్డు యాడింగ్‌లో చేర్చినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత ఆరోగ్య రక్ష కింద రూ.1,500 నగదు చెల్లించారు.
దాతల సహకారం
సురేంద్రబాబు ద్వారా ఆరోగ్యరక్ష పథకంలో పాపకు శస్త్రచికిత్స చేసినప్పటికీ నగదు అవసరం కావడంతో దాతలు ముందుకు వచ్చారు. నెల్లూరు నేస్తం ఫౌండేషన్‌కు చెందిన ప్రవీణ్ రూ.30 వేలు, పొదలకూరు కొత్తలూరు ఫౌండేషన్‌కు చెందిన కోటేశ్వర్రావు రూ.5 వేలు వైద్యఖర్చుల నిమిత్తం బాలికకు అందజేశారు. దీంతో బాలిక శస్త్రచికిత్స ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment