క్యాన్సర్ కణితి రావడానికి ఫలానా అవయవం అంటూ మినహాయింపు ఉండదు. క్యాన్సర్ సోకిన అవయవాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించాల్సి రావచ్చు. అలాంటి సమయాల్లో కణితి ఉన్న భాగాన్ని తీయడం కోసం పెద్దగా కోయడం కంటే చిన్నవి రెండు మూడు రంధ్రాలు పెట్టి చేయగలిగితే...? దాన్నే ఎండోస్కోపిక్ సర్జరీ అంటారు. చిన్న రంధ్రం పెడతారు కాబట్టి కీహోల్ సర్జరీ అని కూడా అంటారు. దీని వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికే ఈ కథనం.
క్యాన్సర్ కణితిని తొలగించాలంటే ఇప్పుడు చిన్న గాటు చాలు. మన దేహంలోని వివిధ అవయవాలకు వచ్చే క్యాన్సర్ గడ్డలను అతి చిన్న రంధ్రం ద్వారానే తొలగించుకోవడం ఎలా సాధ్యమో, సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే ఆ ప్రక్రియ వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం.
జీర్ణవ్యవస్థలోని క్యాన్సర్ గడ్డలకు: నోరు మొదలుకొని, పురీషనాళం వరకు ఆహారం ప్రయాణం చేస్తూ, జీర్ణక్రియకు ఉపయోగపడే వ్యవస్థను జీర్ణవ్యవస్థ (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ట్రాక్ట్) అంటారు. ఈ మార్గంలో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఉంటే... దాన్ని తొలగించడం కోసం సంప్రదాయ శస్త్రచికిత్సలో భాగంగా ఛాతీ భాగాన్ని కోయాల్సి వస్తుంది. అన్నవాహికలో, పొట్టలో వచ్చే క్యాన్సర్ గడ్డలను తొలగించడానికి పక్కటెముకలను దాటుకుని వెళ్లడానికి వాటిని కూడా ఛేదించాల్సి ఉంటుంది.
ఈ భాగాలకు వచ్చే క్యాన్సర్లు ప్రధానంగా పెద్ద వయసు వారిలో, పొగతాగే అలవాటు ఉన్నవారిలో వస్తాయి. అంత పెద్దగా కోయడం వల్ల వచ్చే దుష్ర్పభావాలను తట్టుకోవడం ఆ వయసు వారికి కష్టం కావచ్చు. ఛాతీ భాగంలో అతి చిన్నవైన మూడు రంధ్రాలు చేయడం ద్వారానే క్యాన్సర్ గడ్డలను తొలగించగలిగే సౌకర్యం ఉన్నప్పుడు ఇక అంత పెద్దగా కోయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. జీర్ణవ్యవస్థలోని కింది భాగంలో అంటే పెద్దపేగు భాగంలో, పురీషనాళం వద్ద (కోలోరెక్టల్) ఏర్పడే క్యాన్సర్లలో ఆ భాగాన్ని తొలగించాక, వెంటనే కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక రెక్టల్ (మలద్వార) భాగంలో ఉన్న క్యాన్సర్‌ను తొలగించిన వెంటనే రేడియోథెరపీ ఇవ్వాలి. సంప్రదాయ శస్త్రచికిత్స ద్వారా కోసి, క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగిస్తే, అటు కీమోగాని, ఇటు రేడియేషన్ గాని ఇవ్వాలంటే గాయం తగ్గే వరకూ ఆగాలి. పెద్దగా కోత ఉన్నప్పుడు అది తగ్గడానికి చాలా సమయం తీసుకోవచ్చు. కానీ ఇలా కేవలం రెండుమూడు రంధ్రాలతో జరిగే శస్త్రచికిత్సలో గాయం చిన్నది కాబట్టి త్వరగా మానిపోయి కీమో, రేడియేషన్ తొందరగా మొదలుపెట్టడానికి అవకాశం ఎక్కువ.
ఇక సంప్రదాయ శస్త్రచికిత్సలో పెద్దపేగు చివరి భాగం రెక్టమ్ క్యాన్సర్ స్పష్టంగా బయటకు కనపడదు కాబట్టి చాలాసార్లు ‘పర్మనెంట్ కొలాస్టమీ’ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కీహోల్ ప్రక్రియలో కంటికి కనపడని రెక్టమ్ భాగాన్ని కూడా 3-డి డిజిటల్ ఇమేజ్ ద్వారా చూసేందుకు వీలుండటంతో పెద్దపేగును బయటకు తీసుకురాకుండానే అక్కడే చికిత్స చేయవచ్చు. పైగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అధునాతన స్టేప్లర్ డివైజ్‌లతో శస్త్రచికిత్స తర్వాత కుట్లు వేయాల్సిన భాగాలను మరింత సమర్థంగా అతికించవచ్చు.
ఇక అన్నిటికంటే ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే... సంప్రదాయ శస్త్రచికిత్సలో మలద్వార (రెక్టల్) భాగంలో ఆపరేషన్ చేస్తే, ఆ తర్వాత చాలామందిలో సెక్స్‌పరమైన సామర్థ్యలోపం కలిగేందుకు అవకాశాలు ఎక్కువ. దాంతోపాటు మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయేందుకూ అవకాశం ఉంటాయి. ఎందుకంటే మూత్రవిసర్జన, సెక్స్ ప్రక్రియకు సంబంధించిన నరాలు రెక్టల్ భాగానికి దగ్గర్నుంచి వెళ్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి సదరు నరాలు గాయపడితే పై సమస్యలు రావచ్చు. కానీ కీ-హోల్ చికిత్స ప్రక్రియలో ఇప్పుడున్న హై-డెఫినేషన్ 3-డి కెమెరాల్లో ఈ నరాలు మామూలు కంటితో చూసిన దానికంటే స్పష్టంగా కనపడతాయి. దాంతో ఇలాంటి సెక్స్‌పరమైన లోపాలు రావడానికి అవకాశం లేదు. ఈ కీహోల్ ప్రక్రియ ద్వారా కాలేయం, ప్యాక్రియాస్ వంటి చోట్ల ఉండే కణుతులనూ సులభంగా తొలగించవచ్చు.
మూత్ర-ప్రత్యుత్పత్తి భాగాల్లో: మూత్రవిసర్జన, ప్రత్యుత్పత్తికి సంబంధించిన శరీర భాగాలలోని క్యాన్సర్ కణుతులను తొలగించడానికి కేవలం గాటుతోనే పని జరిగిపోయే ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. మూత్రవిసర్జక-ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే ఈ భాగాలను జనైటల్ ట్రాక్ట్ భాగాలుగా పేర్కొంటారు. ఇందులో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించడం అన్నది కేవలం 0.5 సెం.మీ. పరిమాణంలో ఉండే నాలుగు రంధ్రాల ద్వారా తేలిగ్గా సాధ్యమవుతుంది.
ఇక ఒవేరియన్ క్యాన్సర్ చాలా ఆలస్యంగా బయటపడుతుంది. బాగా ముదిరాక కనపడే ఈ ఒవేరియన్ క్యాన్సర్‌ను సంప్రదాయ శస్త్రచికిత్స ద్వారా తొలగించాలంటే శరీరంపై దాదాపు 25 సెం.మీ. పొడవున కోయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద గాయం మానాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఇదే శస్త్రచికిత్సను కేవలం 0.5 సెం.మీ. కంటే తక్కువ ఉండే నాలుగైదు రంధ్రాలతో చేయవచ్చు. కాబట్టి గాయం చాలా త్వరగా మానుతుంది. క్యాన్సర్ విషయంలో కోతకు తక్కువగా ఆస్కారం ఉండేలా అందానికి ప్రాధాన్యం ఏముంది అని కొందరంటుంటారు కానీ నిజానికి ఇక్కడ అందం (కాస్మటిక్)కి ఎలాంటి ప్రాధాన్యమూ ఉండదు. 25 సెం.మీ. పొడవున ఉండే గాయం కంటే 0.5 సెం.మీ పరిమాణంలో ఉండే నాలుగు రంధ్రాలు చాలా త్వరగా మానిపోవడం వల్ల, ఆ తర్వాత శస్త్రచికిత్స అనంతరం చేయాల్సిన కీమో, రేడియోథెరపీ వంటి ఇతర ప్రక్రియలను అతిత్వరితంగా మొదలుపెట్టడం అనే దానికే డాక్టర్లు ప్రాముఖ్యత ఇస్తారు.
అలాగే పురుషాంగ క్యాన్సర్ విషయాల్లోనూ, మూత్రవిసర్జక వ్యవస్థలో కనిపించే యూరినరీ ట్రాక్ట్ క్యాన్సర్‌లకు, కిడ్నీల్లో వచ్చే ట్యూమర్ల విషయంలోనూ సాంప్రదాయిక మార్గాల ద్వారా చేసే రాడికల్ సిస్టెక్టమీ, రాడికల్ నెఫ్రెక్టమీకి బదులు... తక్కువ గాటుతో ఆయా శరీర భాగాలను బయటకు తీసి శస్త్రచికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆయా గడ్డలను ‘ఎండో బ్యాగ్’ అనే సంచిలో పెట్టి పక్కనే ఉండే ఆరోగ్యకరమైన కణజాలానికి తగలకుండా బయటకు తీయడానికి వీలవుతుంది. దీనివల్ల ట్యూమర్ కారణంగా పక్క కణజాలానికి వ్యాధి సంక్రమించకుండా (ట్యూమర్ కంటామినేషన్ జరగకుండా) చేయడానికి వీలువుతుంది. ఇక యూరినరీ బ్లాడర్, గర్భసంచి వంటి వాటికి చేసే పెల్విక్ ఎక్సెంట్రేషన్ శస్త్రచికిత్సలకు బదులు తక్కువ గాటుతో చేసే ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీల వల్ల రోగులు చాలా త్వరగా కోలుకోడానికి అవకాశముంటుంది.
పైన పేర్కొన్న శస్త్రచికిత్సలు మాత్రమే గాక... థైరాయిడ్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ముఖ్యంగా చంకలో ఉండే చిన్న చిన్న గడ్డలకు పాకిన సందర్భాల్లో వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది.
ఊపిరితిత్తుల క్యాన్సర్: ఈ తరహా క్యాన్సర్ పొగతాగేవారిలో లేదా వయసు పైబడ్డవారిలో ఎక్కువ. దాంతో వారు పూర్తిగా ఛాతీ కోసే చేసే థొరకాటమీ ప్రక్రియకు తట్టుకునే అవకాశాలు తక్కువ. అదే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ (వ్యాట్స్) అనే ప్రక్రియ ద్వారా తక్కువ గాటుతో చేసే శస్త్రచికిత్సతో అత్యంత సంక్లిష్టమైన ఊపిరితిత్తులు, వాటి లోబ్స్ (తమ్మెల)కు చేసే శస్త్రచికిత్స చాలా సులువవుతుంది.
ప్రయోజనాలు: ఎండోస్కోపీ లేదా కీహోల్ సర్జరీగా అభివర్ణించే ఈ తక్కువ గాటుతో చేసే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీతో అనేక ప్రయోజనాలున్నాయి. కేవలం మూడు, నాలుగు చిన్న గాట్లు పెట్టడం వల్ల అవి తేలిగ్గా తగ్గిపోతాయి. దాంతో సర్జరీ తర్వాత చేయాల్సిన కీమో, రేడియోథెరపీ లాంటి ఇతర ప్రక్రియలు త్వరగా మొదలుపెట్టవచ్చు. కొన్నిసార్లు కోత గాయం మానకుండా ఉన్నప్పుడు వచ్చే వూండ్ కాంప్లికేషన్స్, ఈ ప్రక్రియలో రావు. పైగా కోత ఉండదు కాబట్టి నొప్పీ తక్కువే. ఇక నిమోనియా, డీప్‌వీన్ థ్రాంబోసిస్ లాంటి కాంప్లికేషన్లూ తక్కువే. సాధారణ శస్త్రచికిత్స తర్వాత మెట్లు ఎక్కడం, బరువులు మోయడం, కిందకూర్చోవడం వంటి ప్రక్రియలకు మూడు నెలలు ఆగాలి. కానీ కీహోల్ ప్రక్రియతో శస్త్రచికిత్స పూర్తయ్యాక ఆ పనులన్నీ ఆ మర్నాడే చేసుకోవచ్చు.
డాక్టర్ సిహెచ్.మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
ఫోన్: 98480 11421
క్యాన్సర్ కణితి తొలగింపులో...గాటుతో పోయేదానికి కోత ఎందుకు?
Published Sun, Nov 17 2013 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement