Oncology Department
-
తిరుపతి: పింక్ బస్సులు తిప్పుతాం
సాక్షి, తిరుపతి: వెంకన్న సన్నిధిలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి అడుగు పడింది. శ్రీ బాలాజీ అంకాలజీ ఆస్పత్రికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ. 124 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ జిల్లాకు పింక్ బస్సులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు, టెస్టుల కోసమే ఈ బస్సులు. చిత్తూరు, తిరుపతిలో పింక్ బస్సుల ద్వారా స్క్రీనింగ్ నిర్వహిస్తామని వెల్లడించారాయన. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది తిరుమల ఘాట్ రోడ్లో ఎలక్ట్రికల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘాట్ రోడ్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారాయన. ఒలెక్ట్ర బస్సు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాం. బస్సు కండిషన్ బాగానే ఉందని తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు భావిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్ లో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఐరన్ క్రాస్ బార్స్ ఎత్తు పెంచుతాము, ఘాట్ రోడ్ పిట్ట గోడలు మరింత పటిష్టం చేస్తాం. భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తాం అని తెలిపారాయన. -
పైల్స్‌కు, క్యాన్సర్‌కు ఒకేలాంటి లక్షణాలు..!
మన జీర్ణ వ్యవస్థలో చివరన ఉండే భాగాన్ని కోలన్ అని, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్ ను కోలన్ క్యాన్సర్ అని అంటారు. పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్ (కణుతులు) ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరగడమే ఈ క్యాన్సర్‌కు కారణం. తొలుత ఈ కణుతులు హాని ఏమీ చేయకపోయినా... కొంతకాలం తర్వాత క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. మిగతా క్యాన్సర్లలాగే ఈ క్యాన్సర్‌కు కూడా ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా జీన్ మ్యూటేషన్స్, లావుగా ఉన్నవారిలో, ఫైబర్ చాలా తక్కువగా తీసుకునేవారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, ఇతర క్యాన్సర్‌కు తీసుకునే రేడియేషన్ వంటివి కొంతవరకు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు కావచ్చు. కోలన్ చివరి భాగం, మలద్వారం కొంచెం పైన ఉండే రెక్టమ్‌కు సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ క్యాన్సర్ 60 ఏళ్లు, ఆ పైబడిన వారిలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కోలన్, కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు ఈ లక్షణాలు... కణితి ఎక్కడ వచ్చింది, పరిమాణం ఎంత, ఏయే భాగాలకు వ్యాపించింది అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా కనిపించే లక్షణాలు... 1. అజీర్తి లేక విరేచనాలు అవ్వడం 2. మలం, మలవిసర్జనలో మార్పులు 3. మలంలో రక్తం, రక్తపు చారికలు 4. పొట్ట కిందభాగంలో నొప్పి, పట్టేసినట్లు ఉండటం, గ్యాస్ పోతుండటం 5. మలవిసర్జనకు వెళ్లినప్పుడు నొప్పి 6. అకారణంగా నీరసం, బరువు తగ్గడం 7. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఈ క్యాన్సర్ లక్షణాలను అశ్రద్ధ చేస్తే లివర్‌కు పాకే (మెటాస్టాసిస్) ప్రమాదం ఎక్కువ. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అజీర్తి, విరేచనాలు అవుతుండటం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ, అకస్మాత్తుగా జీర్ణవ్యవస్థలో మార్పులు కనిపించి, ఏమి చేసినా తగ్గకపోగా, ఇంకా ఎక్కువవుతున్నట్లు గమనిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయడానికి ముందుగా డాక్టర్లు... ఫ్యామిలీ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ వంటివి చేశాక కొలనోస్కోపీ, బేరియమ్ ఎనీమా ఎక్స్–రే చేస్తారు. కొలనోస్కోపీ అంటే ఒక సన్నటి గొట్టాన్ని మలద్వారంలో పెట్టి కెమెరా సహాయంతో పాలిప్స్ ఉన్నాయా అని చూస్తారు. కణుతులు ఏమైనా కనబడితే తొలగించి బయాప్సీకి పంపుతారు. మైక్రోస్కోపు సహాయంతో ఆ కణాలు క్యాన్సర్ కణాలా అని తేల్చుకుంటారు. బేరియమ్ ఎనీమా పరీక్షలో బాధితుల చేత బేరియమ్ తాగించి, పెద్దపేగుకు చేరుకున్నాక ఎక్స్‌రే తీసి చూస్తారు. కణుతులు ఉంటే ఈ ఎక్స్‌రేలో ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. బయాప్సీలో క్యాన్సర్ కణాలు అని తేలితే, క్యాన్సర్ దశ తెలుసుకోడానికి మిగతా పరీక్షలు చేస్తారు. చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, సీరమ్ సీఈఏ పరీక్షలతో అవసరమైతే పెట్ సీటీ స్కాన్ పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉన్నదనే అంశాన్ని నిర్ధారణ చేస్తారు. నివారణ : యాభై ఏళ్లు పైబడినవారు ఒకసారి మలపరీక్ష, డాక్టర్ సలహా మేరకు సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవరచుకుంటే కొంతవరకు ఈ క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. మలంలో రక్తం పడటం పైల్స్ వంటి సమస్యలల్లోనూ సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు అది కేవలం పైల్స్ సమస్య అనే భావించకుండా... మలద్వారం, రెక్టమ్‌ను పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ లేదా వీటితో పాటు పెద్దపేగును మొత్తంగా చూసే కొలనోస్కోపీ, ఇంకా డాక్టర్ సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకుంటే మంచిది. అంతేగానీ వేడి చేసిందనీ లేదా పైల్స్ సమస్య కావొచ్చేమోలే అని సొంతవైద్యం చేసుకుంటూ ఉంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలలో లేదా అజీర్తి, బ్యాక్టీరియా, వైరస్‌లతో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్లో కనిపించే లక్షణాలూ... కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ తొలిదశలో కనిపించే లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండవచ్చు. అందువల్ల పై లక్షణాలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కోలన్ క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. ప్రారంభదశలోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ ఉత్తమమైనది. ఈ రోజుల్లో ఈ సర్జరీలను లాపరోస్కోపిక్ (కీహోల్) పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతిలో... వ్యాధి సోకిన భాగాన్ని హై– డెఫినిషన్ కెమెరాలు పెద్దదిగా, స్పష్టంగా కనిపించేట్లు చేస్తాయి. ఫలితంగా సర్జరీని మరింత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చు. ఓపెన్ సర్జరీతో పోలిస్తే, లాపరోస్కోపిక్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటాడు. రోగి ఆరోగ్యం, క్యాన్సర్ దశ, క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా రెండింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించినట్లయితే, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌లో కీమోథెరపీ, రేడియేషన్ ముందుగా ఇచ్చి, తర్వాత సర్జరీ చేస్తారు. ఒకవేళ చివరిదశలో గుర్తించినా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి మందుల సహాయంతో రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
కర్నూలు: మహిళ అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి
కర్నూలు(హాస్పిటల్): ఓ మహిళ అండాశయంలో ఏర్పడిన 10 కిలోల క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు విజయవంతంగా తొలగించారు. వివరాలను శుక్రవారం గైనకాలజి విభాగంలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సాయిప్రణీత్ తెలిపారు. ఎమ్మిగనూరుకు చెందిన మదనమ్మ(65) అనే మహిళ ఐదు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి తీవ్రం కావడంతో ఈ నెల 7వ తేదిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజి విభాగంలో చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఆమె అండాశయంలో 10 కిలోల క్యాన్సర్ కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 23వ తేదిన ఆమెకు వైద్యులు సర్జరీ చేసి కణితి తొలగించారు. శుక్రవారం ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జ్ చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వారిలో సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ సి. సాయిప్రణీత్, గైనకాలజి ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్యరావు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కుముద, పీజీ వైద్యురాలు డాక్టర్ సోనాలి, అనెస్తెటిస్ట్ డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ వి. శ్రీలత, డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్‌గౌడ్, డాక్టర్ ఎం. స్నేహవల్లి ఉన్నారు. -
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన అంకాలజీ భవనాన్ని అపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆంకాలజీ భవనాన్ని నిర్మించడమే కాకుండా మూడు సంవత్సరాలు మెయిన్‌టెన్ చేస్తామని చెప్పటం ఆనందంగా ఉందన్నారు. వైద్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. నిమ్స్‌లో అవయవ మార్పిడి చికిత్సలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. సామాన్యులకు అందని కార్పొరేట్ వైద్యం పేదలకు నిమ్స్‌లో అందుతుందన్నారు. కేసీఆర్ కిట్ వచ్చాక రాష్ట్రంలో నార్మల్ డెలివరీలు పెరిగాయని పేర్కొన్నారు. తెలంగాణలో మాత శిశు మరణాలు తగ్గిపోయాయన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. మిషన్ ఇంద్ర ధనస్సులో తెలంగాణ దేశంలో ముందుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 45 బస్తీ దవాఖానాలు ప్రాంభిచామని.. వచ్చే ఏడాది మే నాటికి 500 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వైద్య పరీక్షలు సైతం ప్రభుత్వమే ఉచితంగా చేస్తోందన్నారు. విజన్ ఫర్ ఆల్ నినాదంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ప్రభత్వ రంగంలోని వైద్యులు సిబ్బంది బాగా కష్టపడుతున్నారని కితాబిచ్చారు. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మొదలు పెట్టాలని సూచించారు. డీన్ నియామకాన్ని రద్దు చేయాలి నిమ్స్ డీన్‌గా ఆర్వీ కుమార్ నియామకాన్ని రద్దు చేయాలని ఆందోళన చేపట్టిన రెసిడెంట్ డాక్టర్లు కేటీఆర్, లక్ష్మారెడ్డిలను కలిశారు. కాగా రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. -
ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది
-
2018 నాటికి అపోలో ప్రోటాన్ థెరపీ
♦ అంకాలజీ విభాగంలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు ♦ దీన్లో రూ.650 కోట్లతో చెన్నైలో ప్రోటాన్ థెరపీ కేంద్రం ♦ 15 నెలల్లో మరో 9 నగరాల్లో అపోలో కొత్త ఆసుపత్రులు ♦ అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్, ప్రెసిషన్ అంకాలజీ ప్రారంభం ♦ అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్... కేన్సర్, అంకాలజీ విభాగంలోకి అడుగుపెట్టింది. అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి బుధవారమిక్కడ అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్, ప్రెసిషన్ అంకాలజీ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడారు. వారింకా ఏమన్నారంటే.. ⇒ దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏటా 10 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఇందుకు కారణం వ్యాధిని ముందుగా గుర్తించకపోవటం... లేదా పూర్తి స్థాయిలో చికిత్స అందించలేకపోవటమే. ఇకపై దేశంలో కేన్సర్ మరణాలు లేకుండా ప్రోటాన్ థెరపీపై పరిశోధనలు చేస్తున్నాం. 2017 చివరికి లేదా 2018 ప్రారంభంలో ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ⇒ ఆగ్నేయాసియాలో తొలిసారిగా ప్రొటాన్ థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది అపోలోనే. వచ్చే 15-18 నెలల్లో అంకాలజీలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. తొలి దశలో రూ.650 కోట్లు ప్రోటాన్ థెరపీపై ఖర్చు చేస్తాం. బెల్జియంకు చెందిన ఇయాన్ బీమ్ అప్లికేషన్స్ (ఐబీఏ) నుంచి ప్రోటాన్ థెరపీ మిషనరీని కొనుగోలు చేశాం. ఇప్పటికే ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్బీ) అనుమతి కూడా పొందాం. ఈ కేంద్రంలో 650-700 వైద్యులు, 150-200 పడకలు అందుబాటులో ఉంటాయి. ⇒ ప్రోటాన్ థెరపీ ప్రధానంగా కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లు, మెదడు, వెన్నుపాము కేన్సర్ చికిత్సలకు సరైంది. చిన్నారులు, వృద్ధుల్లో కేన్సర్ నిర్ధారణ ముందుగానే చేయొచ్చు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, బిలాస్పూర్, బెంగళూరు, మధురై నగరాల్లోని 9 ఆసుపత్రులను కేన్సర్ ఇనిస్టిట్యూట్ కింద పనిచేస్తాయి. దీంతో అపోలోకి వచ్చే ప్రతి రోగికి కేన్సర్ చికిత్స, సంరక్షణ సమాన స్థాయిలో అందించే వీలు కలుగుతుంది. ⇒ ప్రోటాన్ థెరపీకి రూ.10-15 లక్షల చార్జీ అవుతుంది. అపోలో మొత్తం పేషెంట్లలో 30% మంది విదే శాల నుంచి వచ్చేవారే. ఏటా ఆసుపత్రి ఆదాయలలో 20-22% ఆదాయం కేన్సర్ కేర్ నుంచే వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఫలితాల్ని అపోలో గ్రూప్‌లో కలిపే చూపిస్తాం. వచ్చే ఏడాది నుంచి విడిగా చూపిస్తాం. 15 నెలల్లో మరో 9 ఆసుపత్రులను ప్రారంభించాలనేది మా లక్ష్యం. త్వరలోనే ముంబైలో ఆసుపత్రిని ప్రారంభిస్తాం.