2018 నాటికి అపోలో ప్రోటాన్ థెరపీ
♦ అంకాలజీ విభాగంలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు
♦ దీన్లో రూ.650 కోట్లతో చెన్నైలో ప్రోటాన్ థెరపీ కేంద్రం
♦ 15 నెలల్లో మరో 9 నగరాల్లో అపోలో కొత్త ఆసుపత్రులు
♦ అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్, ప్రెసిషన్ అంకాలజీ ప్రారంభం
♦ అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్... కేన్సర్, అంకాలజీ విభాగంలోకి అడుగుపెట్టింది. అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ ప్రీతా రెడ్డి బుధవారమిక్కడ అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్, ప్రెసిషన్ అంకాలజీ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడారు. వారింకా ఏమన్నారంటే..
⇒ దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏటా 10 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఇందుకు కారణం వ్యాధిని ముందుగా గుర్తించకపోవటం... లేదా పూర్తి స్థాయిలో చికిత్స అందించలేకపోవటమే. ఇకపై దేశంలో కేన్సర్ మరణాలు లేకుండా ప్రోటాన్ థెరపీపై పరిశోధనలు చేస్తున్నాం. 2017 చివరికి లేదా 2018 ప్రారంభంలో ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తాం.
⇒ ఆగ్నేయాసియాలో తొలిసారిగా ప్రొటాన్ థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది అపోలోనే. వచ్చే 15-18 నెలల్లో అంకాలజీలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. తొలి దశలో రూ.650 కోట్లు ప్రోటాన్ థెరపీపై ఖర్చు చేస్తాం. బెల్జియంకు చెందిన ఇయాన్ బీమ్ అప్లికేషన్స్ (ఐబీఏ) నుంచి ప్రోటాన్ థెరపీ మిషనరీని కొనుగోలు చేశాం. ఇప్పటికే ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్‌బీ) అనుమతి కూడా పొందాం. ఈ కేంద్రంలో 650-700 వైద్యులు, 150-200 పడకలు అందుబాటులో ఉంటాయి.
⇒ ప్రోటాన్ థెరపీ ప్రధానంగా కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లు, మెదడు, వెన్నుపాము కేన్సర్ చికిత్సలకు సరైంది. చిన్నారులు, వృద్ధుల్లో కేన్సర్ నిర్ధారణ ముందుగానే చేయొచ్చు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, బిలాస్‌పూర్, బెంగళూరు, మధురై నగరాల్లోని 9 ఆసుపత్రులను కేన్సర్ ఇనిస్టిట్యూట్ కింద పనిచేస్తాయి. దీంతో అపోలోకి వచ్చే ప్రతి రోగికి కేన్సర్ చికిత్స, సంరక్షణ సమాన స్థాయిలో అందించే వీలు కలుగుతుంది.
⇒ ప్రోటాన్ థెరపీకి రూ.10-15 లక్షల చార్జీ అవుతుంది. అపోలో మొత్తం పేషెంట్లలో 30% మంది విదే శాల నుంచి వచ్చేవారే. ఏటా ఆసుపత్రి ఆదాయలలో 20-22% ఆదాయం కేన్సర్ కేర్ నుంచే వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఫలితాల్ని అపోలో గ్రూప్‌లో కలిపే చూపిస్తాం. వచ్చే ఏడాది నుంచి విడిగా చూపిస్తాం. 15 నెలల్లో మరో 9 ఆసుపత్రులను ప్రారంభించాలనేది మా లక్ష్యం. త్వరలోనే ముంబైలో ఆసుపత్రిని ప్రారంభిస్తాం.