Proton therapy
-
రెండేళ్లలో రూ. 1,400 కోట్లు పెట్టుబడులు
• విస్తరణలో అపోలో హాస్పిటల్స్ • క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏడాదిన్నరలో ప్రోటాన్ థెరపీ • వైజాగ్‌లో క్యాన్సర్ చికిత్స విభాగం న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ సంస్థ విస్తరణ నిమిత్తం రెండేళ్లలో రూ.1,400 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. క్యాన్సర్ పేషెంట్ల కోసం చెన్నై హాస్పిటల్లో త్వరలో అధునికమైన ప్రోటాన్ థెరపీని అందుబాటులోకి తేనున్నామని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన పని ఇప్పటికే మొదలైందని, ఈ థెరపీ ఏడాదిన్నర కాలంలో అందుబాటులోకి రానున్నదని వివరించారు. నవీ ముంబైలో అపోలో గ్రూప్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గౌహతిలో ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, జైపూర్‌లో హాస్పిటల్ నిర్మాణం కోసం భూమిని కొనుగోలు చేశామని వివరించారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ప్రోటాన్ థెరపీ ప్రస్తుతం చైనా, జపాన్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉందని అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీతా రెడ్డి పేర్కొన్నారు. వైజాగ్, భువనేశ్వర్ హాస్పిటల్స్‌లో క్యాన్సర్ చికిత్సా విభాగాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వివరించారు. -
2018 నాటికి అపోలో ప్రోటాన్ థెరపీ
♦ అంకాలజీ విభాగంలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు ♦ దీన్లో రూ.650 కోట్లతో చెన్నైలో ప్రోటాన్ థెరపీ కేంద్రం ♦ 15 నెలల్లో మరో 9 నగరాల్లో అపోలో కొత్త ఆసుపత్రులు ♦ అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్, ప్రెసిషన్ అంకాలజీ ప్రారంభం ♦ అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్... కేన్సర్, అంకాలజీ విభాగంలోకి అడుగుపెట్టింది. అపోలో గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి బుధవారమిక్కడ అపోలో కేన్సర్ ఇనిస్టిట్యూట్, ప్రెసిషన్ అంకాలజీ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడారు. వారింకా ఏమన్నారంటే.. ⇒ దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏటా 10 లక్షల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. ఇందుకు కారణం వ్యాధిని ముందుగా గుర్తించకపోవటం... లేదా పూర్తి స్థాయిలో చికిత్స అందించలేకపోవటమే. ఇకపై దేశంలో కేన్సర్ మరణాలు లేకుండా ప్రోటాన్ థెరపీపై పరిశోధనలు చేస్తున్నాం. 2017 చివరికి లేదా 2018 ప్రారంభంలో ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ⇒ ఆగ్నేయాసియాలో తొలిసారిగా ప్రొటాన్ థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది అపోలోనే. వచ్చే 15-18 నెలల్లో అంకాలజీలో రూ.1,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. తొలి దశలో రూ.650 కోట్లు ప్రోటాన్ థెరపీపై ఖర్చు చేస్తాం. బెల్జియంకు చెందిన ఇయాన్ బీమ్ అప్లికేషన్స్ (ఐబీఏ) నుంచి ప్రోటాన్ థెరపీ మిషనరీని కొనుగోలు చేశాం. ఇప్పటికే ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్బీ) అనుమతి కూడా పొందాం. ఈ కేంద్రంలో 650-700 వైద్యులు, 150-200 పడకలు అందుబాటులో ఉంటాయి. ⇒ ప్రోటాన్ థెరపీ ప్రధానంగా కాలేయం, ఊపిరితిత్తులు, కళ్లు, మెదడు, వెన్నుపాము కేన్సర్ చికిత్సలకు సరైంది. చిన్నారులు, వృద్ధుల్లో కేన్సర్ నిర్ధారణ ముందుగానే చేయొచ్చు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, బిలాస్పూర్, బెంగళూరు, మధురై నగరాల్లోని 9 ఆసుపత్రులను కేన్సర్ ఇనిస్టిట్యూట్ కింద పనిచేస్తాయి. దీంతో అపోలోకి వచ్చే ప్రతి రోగికి కేన్సర్ చికిత్స, సంరక్షణ సమాన స్థాయిలో అందించే వీలు కలుగుతుంది. ⇒ ప్రోటాన్ థెరపీకి రూ.10-15 లక్షల చార్జీ అవుతుంది. అపోలో మొత్తం పేషెంట్లలో 30% మంది విదే శాల నుంచి వచ్చేవారే. ఏటా ఆసుపత్రి ఆదాయలలో 20-22% ఆదాయం కేన్సర్ కేర్ నుంచే వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో కేన్సర్ ఇన్స్టిట్యూట్ ఫలితాల్ని అపోలో గ్రూప్‌లో కలిపే చూపిస్తాం. వచ్చే ఏడాది నుంచి విడిగా చూపిస్తాం. 15 నెలల్లో మరో 9 ఆసుపత్రులను ప్రారంభించాలనేది మా లక్ష్యం. త్వరలోనే ముంబైలో ఆసుపత్రిని ప్రారంభిస్తాం. -
10,000 బెడ్స్ కు చేరువలో అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తోంది. విజయవాడ, చిత్తూరులో అత్యాధునిక ఆస్పత్రులను అందుబాటులోకి తేనుంది. నెల్లూరులో నెలకొల్పుతున్న 200 పడకల ఆస్పత్రిలో కొద్ది రోజుల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, కాకినాడల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ సంస్థ 2014-15లో 800 పడకలను జోడిస్తోంది. దీంతో మొత్తం పడకల సామర్థ్యం 10,000 మార్కును దాటుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఆపరేషన్స్) సంగీతా రెడ్డి తెలిపారు. అత్యాధునిక వైద్య సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యమని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విస్తరణ కార్యకలాపాల కోసం ఈ ఏడాది రూ. 800 కోట్లవరకూ వ్యయపరుస్తామని అన్నారు, అంత క్రితంతో పోలిస్తే డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైస్ కన్సాలిడేటెడ్ ఆదాయంలో 16 శాతం వృద్ధి నమోదు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఆశిస్తున్నట్టు వెల్లడించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ఒక్కో పడకకు రూ.1 కోటి.. మహారాష్ట్రలోని నాసిక్‌లో 125, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 120 పడకలతో కూడి న ఆసుపత్రులు త్వరలో ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరులో 200 పడకలు, దక్షిణ చెన్నైలో 170 పడకలతో కొత్తగా ఆసుపత్రులు రానున్నాయి. అన్ని ఆసుపత్రులను నూతన టెక్నాలజీతో తీసుకొస్తున్నాం. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని భారత్‌లోనూ పరిచయం చేయడంలో ముందుంటున్నాం. ఆసుపత్రి ఏర్పాటులో ఒక్కో పడకకు ఎంత కాదన్నా రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి దాకా వ్యయం చేస్తున్నాం. ఇక చిత్తూరులో వైద్య కళాశాల రానుంది. తమిళనాడులోనూ కళాశాల ఏర్పాటు చేస్తాం. ఆ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ నెలకొల్పేది నిర్ణయించలేదు. రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తేవాలన్న ప్రణాళిక ఉంది. కొత్త ప్రభుత్వం ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐలపై తీసుకునే చొరవ ఆధారంగా అపోలో ఫార్మా విభాగంలో వాటా విక్రయం ఉంటుంది. రూపాయి బలపడ్డంత మాత్రాన హెల్త్ టూరిజంపై తిరోగమన ప్రభావం ఉండదు. దీనికి కారణం థాయిలాండ్ వంటి దేశాలతో పోలిస్తే తక్కువ వ్యయానికే వైద్య సేవలు అందిస్తున్నాం కాబట్టి. భారత్‌లో తొలిసారిగా..: కేన్సర్ చికిత్సలో భారత్‌లో తొలిసారిగా ప్రోటాన్ థెరపీని పరిచయం చేయబోతున్నాం. అపోలో చెన్నై ఆసుపత్రిలో వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సతో పోలిస్తే ప్రోటాన్ థెరపీ 10 రెట్లు మేలు. అమెరికాలో 27, చైనాలో 10 ప్రోటాన్ థెరపీ కేంద్రాలున్నాయి. ఇక టెలిమెడిసిన్ కేంద్రాలను భారీగా విస్తరిస్తున్నాం. ఇప్పటికే 135 కేంద్రాలున్నాయి. రెసిడెన్షియల్ భవనాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. టాటా హౌసింగ్‌కు చెందిన 35 ప్రాజెక్టుల్లో టెలిమెడిసిన్ కేంద్రాలు రానున్నాయి. రోగులు ఆసుపత్రికి రాకుండానే ఈ కేంద్రాల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపోలో కేంద్ర కార్యాలయంలోని వైద్యులను సంప్రదించవచ్చు. బీపీ, ఈసీజీతోపాటు రోగి గుండె వేగాన్ని తెలుసుకోవచ్చు.ఇందుకు ప్రత్యేక పరికరాలు టెలి మెడిసిన్ కేంద్రాల్లో ఉంటాయి. సాధారణ సమస్య అయితే వైద్యులు మందులను సిఫార్సు చేస్తారు. అత్యవసర చికిత్స అవసరమైతే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ఉంటాయి. టెలి మెడిసిన్‌లో సమయం ఆదా అవుతుంది. ఖర్చు తక్కువ. ప్రపంచంలో ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేయొచ్చు.