10,000 బెడ్స్ కు చేరువలో అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తోంది. విజయవాడ, చిత్తూరులో అత్యాధునిక ఆస్పత్రులను అందుబాటులోకి తేనుంది. నెల్లూరులో నెలకొల్పుతున్న 200 పడకల ఆస్పత్రిలో కొద్ది రోజుల్లో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, కాకినాడల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ సంస్థ 2014-15లో 800 పడకలను జోడిస్తోంది. దీంతో మొత్తం పడకల సామర్థ్యం 10,000 మార్కును దాటుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఆపరేషన్స్) సంగీతా రెడ్డి తెలిపారు.
అత్యాధునిక వైద్య సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలన్నదే తమ లక్ష్యమని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. విస్తరణ కార్యకలాపాల కోసం ఈ ఏడాది రూ. 800 కోట్లవరకూ వ్యయపరుస్తామని అన్నారు, అంత క్రితంతో పోలిస్తే డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైస్ కన్సాలిడేటెడ్ ఆదాయంలో 16 శాతం వృద్ధి నమోదు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో వృద్ధి ఆశిస్తున్నట్టు వెల్లడించారు.
ఆమె ఇంకా ఏమన్నారంటే..
ఒక్కో పడకకు రూ.1 కోటి..
మహారాష్ట్రలోని నాసిక్‌లో 125, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 120 పడకలతో కూడి న ఆసుపత్రులు త్వరలో ప్రారంభం అవుతున్నాయి. బెంగళూరులో 200 పడకలు, దక్షిణ చెన్నైలో 170 పడకలతో కొత్తగా ఆసుపత్రులు రానున్నాయి. అన్ని ఆసుపత్రులను నూతన టెక్నాలజీతో తీసుకొస్తున్నాం. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని భారత్‌లోనూ పరిచయం చేయడంలో ముందుంటున్నాం.
ఆసుపత్రి ఏర్పాటులో ఒక్కో పడకకు ఎంత కాదన్నా రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి దాకా వ్యయం చేస్తున్నాం. ఇక చిత్తూరులో వైద్య కళాశాల రానుంది. తమిళనాడులోనూ కళాశాల ఏర్పాటు చేస్తాం. ఆ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ నెలకొల్పేది నిర్ణయించలేదు. రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తేవాలన్న ప్రణాళిక ఉంది. కొత్త ప్రభుత్వం ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐలపై తీసుకునే చొరవ ఆధారంగా అపోలో ఫార్మా విభాగంలో వాటా విక్రయం ఉంటుంది. రూపాయి బలపడ్డంత మాత్రాన హెల్త్ టూరిజంపై తిరోగమన ప్రభావం ఉండదు. దీనికి కారణం థాయిలాండ్ వంటి దేశాలతో పోలిస్తే తక్కువ వ్యయానికే వైద్య సేవలు అందిస్తున్నాం కాబట్టి.
భారత్‌లో తొలిసారిగా..: కేన్సర్ చికిత్సలో భారత్‌లో తొలిసారిగా ప్రోటాన్ థెరపీని పరిచయం చేయబోతున్నాం. అపోలో చెన్నై ఆసుపత్రిలో వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తోంది. ఇందుకోసం రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సతో పోలిస్తే ప్రోటాన్ థెరపీ 10 రెట్లు మేలు. అమెరికాలో 27, చైనాలో 10 ప్రోటాన్ థెరపీ కేంద్రాలున్నాయి. ఇక టెలిమెడిసిన్ కేంద్రాలను భారీగా విస్తరిస్తున్నాం. ఇప్పటికే 135 కేంద్రాలున్నాయి. రెసిడెన్షియల్ భవనాల్లోనూ ఏర్పాటవుతున్నాయి.
టాటా హౌసింగ్‌కు చెందిన 35 ప్రాజెక్టుల్లో టెలిమెడిసిన్ కేంద్రాలు రానున్నాయి. రోగులు ఆసుపత్రికి రాకుండానే ఈ కేంద్రాల నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపోలో కేంద్ర కార్యాలయంలోని వైద్యులను సంప్రదించవచ్చు. బీపీ, ఈసీజీతోపాటు రోగి గుండె వేగాన్ని తెలుసుకోవచ్చు.ఇందుకు ప్రత్యేక పరికరాలు టెలి మెడిసిన్ కేంద్రాల్లో ఉంటాయి. సాధారణ సమస్య అయితే వైద్యులు మందులను సిఫార్సు చేస్తారు. అత్యవసర చికిత్స అవసరమైతే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు ఉంటాయి. టెలి మెడిసిన్‌లో సమయం ఆదా అవుతుంది. ఖర్చు తక్కువ. ప్రపంచంలో ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేయొచ్చు.