సమతుల్యత సాధించాలి | Teamwork can lead to the success | Sakshi
Sakshi News home page

సమతుల్యత సాధించాలి

Published Sat, Mar 8 2025 4:18 AM | Last Updated on Sat, Mar 8 2025 4:18 AM

Teamwork can lead to the success

– డాక్టర్‌ సంగీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్‌ వర్క్‌ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్‌ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.

సమతుల్యం చేయడంలోనే సవాళ్లు
వైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్‌ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్‌– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్‌ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.

నాయకత్వం జెండర్‌తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్‌ మేకర్స్‌ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్‌ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.

నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలి
సాధారణంగా మహిళలు రిస్క్‌ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్‌దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్‌వర్క్‌ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్‌తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్‌ సంగీతారెడ్డి. 

మార్పులు తప్పనిసరి
రోల్‌ మోడల్స్‌ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్‌ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement