పుష్కరాలకు 2,270 బస్సులు
హైదరాబాద్ నుంచి 530
25 లక్షల మందిని చేరవేయడమే లక్ష్యం
టీఎస్ఆర్టీసీ జేఎండీ రమణరావు వెల్లడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం 2,270 బస్సులు నడుపుతున్నట్టు టీఎస్ ఆర్టీసీ జాయింట్ ఎండీ రమణరావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టంలోని వివిధ పుష్కర ఘాట్లకు 25 లక్షల మంది భక్తులను చేరవేయడమే లక్ష్యంగా బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలి పారు. హైదరాబాద్ నుంచి 530, ఆదిలాబాద్- 310, నిజామాబాద్- 300, కరీంనగర్ -415, వరంగల్- 355, ఖమ్మం నుంచి 360 బస్సులు పుష్కర ఘాట్లకు భక్తులను చేరవేస్తాయని వివరించారు.
హైదరాబాద్ నుంచి అన్ని పుష్కరఘాట్లకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రధాన ఘాట్లు అయిన బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంలకు అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పుష్కరఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రమణరావు వివరించారు. తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు, సమాచార కేంద్రాలు, విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యం, క్లాక్ రూం సౌకర్యంతో పాటు బస్స్టేషన్ల వద్ద 150 మంది అంతర్గత సిబ్బందిని కూడా నియమిస్తున్నట్టు తెలిపారు. భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు.