మందులు ఎగురుకుంటూ వస్తాయ్‌!  | Telangana Is The First State To Provide Medical Services Through Drones | Sakshi
Sakshi News home page

మందులు ఎగురుకుంటూ వస్తాయ్‌! 

Published Sun, Mar 15 2020 5:25 AM | Last Updated on Sun, Mar 15 2020 9:14 AM

Telangana Is The First State To Provide Medical Services Through Drones - Sakshi

మన దేశంలో డ్రోన్ల ద్వారా వైద్య సేవలను అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవనుంది. డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మందులు, డయాగ్నస్టిక్‌ శాంపిల్స్‌ సేవలను అందించేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ మారుట్‌ డ్రోన్స్, అపోలో ఆస్పత్రుల మధ్య ఒప్పందం కుదిరింది. బేగంపేటలో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా–2020 కార్యక్రమంలో మెడికల్‌ డ్రోన్‌ ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా మారుట్‌ డ్రోన్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ వీ ప్రేమ్‌ కుమార్‌ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మెడికల్‌ డ్రోన్‌ ఎలా పని చేస్తుందో ఆయన మాటల్లోనే.. – హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో 

డ్రోన్లు ఎక్కడ ఉంటాయంటే? 
ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు, బ్లడ్‌ బ్యాంకుల్లో మారుట్‌ డ్రోన్స్‌ ఉంటాయి. ఆర్డర్‌ రాగానే ఇక్కడి డ్రోన్స్‌లో సంబంధిత సిబ్బంది మందులను అమర్చితే డ్రోన్లు టేకాఫ్‌ అవుతాయి. 8 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరం డ్రోన్లు ప్రయాణిస్తాయి.

ఎవరికి సేవలందిస్తారంటే?
గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు, రోడ్లు, రవాణా సౌకర్యం సరిగా లేని మారుమూల ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తారు. వర్షా కాలంలో, రాత్రి సమయాల్లో ఆయా మారుమూల ప్రాంతాలకు వెళ్లటం కష్టం కాబట్టి ఇక్కడి ప్రజలకు డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణిలు, పాము కాటు, గుండెపోటు వంటి అత్యవసర రోగులకు మందులను సరఫరా చేస్తారు. ఈ డ్రోన్ల ద్వారా రక్తం, వ్యాక్సిన్స్, డయాగ్నస్టిక్‌ శాంపిల్స్, దీర్ఘకాలిక ఔషధాలను సరఫరా చేస్తారు. మెడికల్‌ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అపోలో ఆస్పత్రితో ఒప్పందం చేసుకుంది.

డ్రోన్‌ ఎలా పని చేస్తుందంటే? 
ఇవి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అనుసంధానిత డ్రోన్స్‌. దీన్ని మొబైల్‌ యాప్‌ ద్వారా నియంత్రణ చేస్తారు. ఓలా, ఉబర్‌లు ఎలాగైతే గమ్య స్థానాన్ని మ్యాప్‌లో చూపిస్తాయో అలాగే ఈ డ్రోన్స్‌ మ్యాప్స్‌ ఆధారంగా గమ్య స్థానానికి చేరుకుంటుంది. అంతేకాదు మందులను బుక్‌ చేయగానే వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తేనే మందు లు డెలివరీ అవుతాయి. దీంతో సరైన మనిషికే మందులు అందుతాయన్న మాట. డ్రోన్‌ ఎంత దూరంలో ఉంది? ఎంత సమయం పడుతుంది? వంటి సమాచారం లైవ్‌లో కనిపిస్తుంటుంది. దీంతో రోగికి ఒత్తిడి తగ్గుతుంది. ‘మెడికల్‌ డ్రోన్స్‌ సాంకేతికత మీద ఏడాది కాలంగా పని చేస్తున్నాం. సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు’ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు.

డ్రోన్‌కు అమర్చేందుకు మెడికల్‌ కిట్‌ సిద్ధం చేస్తున్న దృశ్యం

డ్రోన్లతో దోమల నిర్మూలన! 
గతంలో మారుట్‌ డ్రోన్స్‌ జీహెచ్‌ఎంసీ భాగస్వామ్యంతో మియాపూర్, రాయదుర్గంలోని చెరువుల్లో దోమ మందులను పిచికారి చేసింది. సిరిసిల్ల జిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా డ్రోన్ల సహాయంతో సీడ్‌ బాల్స్‌లను నాటింది. మస్కిటో డ్రోన్స్‌లోని ఏఐ సాంకేతికత పిచికారితో పాటు దోమల సంఖ్య, లార్వా లెక్కింపు, దోమల జాతి, లింగ బేధాలు వంటి రియల్‌ టైం నివేదికలను కూడా అందిస్తుంది. గంటకు 6 ఎకరాలకు పిచికారి చేస్తుంది. ప్రస్తుతం మూసీ పరీవాహక ప్రాంతంలో 52 కిలోమీటర్లు, తెలంగాణలోని 70 చెరువుల్లో యాంటి లార్వా అరాడికేషన్‌ను ప్రాజెక్టులను చేపట్టామని ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

డ్రోన్‌ ద్వారా వచ్చిన మెడికల్‌ కిట్‌ తీసుకుంటున్న దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement