సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న అపోలో వైద్యులు
సాక్షి, హైదరాబాద్: శరీరంపై కత్తిగాట్లు, కుట్లే కాదు.. కనీసం నొప్పి కూడా తెలియకుండా పూర్తిగా దెబ్బతిన్న గుండె రక్తనాళాలకు అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. సాధారణంగా ఈ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఛాతీని ఓపెన్ చేసి దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో దాతల రక్తనాళాలను అమరుస్తారు. ఈ తరహా చికిత్సను వైద్య పరిభాషలో ‘ట్రాన్స్ కేథటర్ అరోటిక్ వాల్వ్ రీప్లేస్‌మెంట్’టెక్నిక్ అంటారు. అయితే ఈ చికిత్స ద్వారా ఒకేరోజు ఐదుగురు బాధితులకు 5 రక్తనాళాల మార్పిడి చేయడం దేశ వైద్య చరిత్రలోనే తొలిసారని అపోలో వైద్యులు తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసకుమార్, ఆస్పత్రి డివిజన్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్ చికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు.
బాధితులంతా 70 ఏళ్ల పైవారే
సిద్దిపేటకు చెందిన రాజేశం(73), హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్(70), ప్రసాదరావు(73), దామోదరం రాఠీ (70)లతో పాటు మరో వ్యక్తి ఎడమ జఠరిక వైఫల్యం (అరోటిక్ వాల్వ్‌స్టెనోసిస్)తో బాధపడుతున్నారు. అరోటిక్ వాల్వ్ అనేది గుండె కింది భాగంలో రక్తాన్ని పంపింగ్ చేసే ఎడమ జఠరికతోపాటు ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే బృహద్ధమనిని కలుపుతుంది. పెరుగుతున్న వయసు కారణంగా రక్తనాళాలు బలహీనపడి కుచించుకుపోయి రక్తం సరఫరా వ్యతిరేక దిశలో ప్రయాణించడంతో గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో అరోటిక్ వాల్వ్ స్టెనోసిస్‌గా పిలుస్తారు. ఈ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఛాతీపై కోతపెట్టి దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో బ్రెయిన్‌డెడ్ దాతల నాళాలను అమర్చుతుంటారు. బాధితులంతా 70 ఏళ్లు నిండినవారు కావడం.. ఈ వయసులో వారికి ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయడం రిస్క్‌తో కూడిన పనేకాకుండా చికిత్స తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది.
రెండోరోజే డిశ్చార్జ్..
వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ‘హార్ట్‌వాల్వ్ థెరపీ’ ప్రోగ్రామ్‌లో డాక్టర్ శ్రీనివాస్‌కుమార్ ఇటీవల శిక్షణ పొందారు. వృద్ధాప్యంతోపాటు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఈ ఐదుగురు బాధితులకు కత్తిగాటుతో పనిలేకుండా కనీసం రక్తం చుక్క కూడా కారకుండా తొడభాగంలోని రక్తనాళం ద్వారా దెబ్బతిన్న గుండె రక్తనాళాలను పునరుద్ధరించినట్లు శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. చికిత్స చేసిన రెండో రోజే బాధితులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. వృద్ధాప్యంతోపాటు ఊపిరితిత్తులు, మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకేరోజు ఐదుగురు బాధితులకు చికిత్స చేయడం దేశవైద్య చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment