heart treatment
-
మీ గుండె పదిలంగా.. హార్ట్ సర్జరీలపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే STEMI ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవన ప్రమాణాలు చిన్న వయసులోనే గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అయితే గుండెపోటు సంభవించిన తొలి గంటలోపే (దీన్నే గోల్డెన్ అవర్ అంటారు) సరైన అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు అత్యధిక అవకాశాలున్నాయి. అనారోగ్యానికి గురైన వెంటనే గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే దాన్ని గుర్తించడం, సమీపంలో ఉన్న ఆసుపత్రికి సకాలంలో చేర్చడం, ఇంజక్షన్ ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం, తదుపరి చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రోగిని తరలించి, ECG వంటి పరీక్షల ద్వారా రోగి పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన శస్త్ర చికిత్సను చేయడం అనేవి చాలా ముఖ్యం. ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే గుండెపోటు కారణంగా జరిగే మరణాలను కట్టడి చేయగలం. ఇందుకోసమే ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం STEMI కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది గుండె వ్యాధులకు చెక్ పెడుతూ.. అసంక్రమిక వ్యాధుల్లో NCD (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) గుండె సంబంధిత సమస్యల వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.సీ.డీల్‌లో గుండెపోటు వల్ల జరుగుతున్న మరణాలు 32 శాతం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుకు గురై మరణించేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో హృద్రోగ చికిత్సలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. STEMI ద్వారా గుండె పదిలం: గుండెపోటు సంభవించిన తొలి 40 నిమిషాల సమయం ఎంతో కీలకమైనది. ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే STEMI ముఖ్యోద్దేశ్యం. ముందుగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలో ఉన్న PHCలలో ఇనీషియల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్ లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్‌ను ఉచితంగా రోగికి అందించడం, తదనంతరం 100కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పటల్‌కు రోగిని తరలించి అవసరమైన టెస్టులు, శస్త్ర చికిత్స నిర్వహించడం ఈ కార్యక్రమంలో భాగం. ఇప్పటికే గ్రామ స్థాయిలో సిబ్బంది, వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ నిర్మాణం చేసింది. SVRR GGH గుంటూరు, GGH కర్నూలు, KGH విశాఖపట్నం నాలుగు హబ్స్ గా ఏర్పాటు చేసి ఈ జిల్లాల పరిధిలో 61 స్పోక్స్ ను ఏర్పాటు చేసి హార్ట్ కేర్ సర్వీసులను సామాన్యులకు, గ్రామీణులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఏం చేస్తారంటే..: గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థను వినియోగించి గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్‌కు తరలిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేసారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు. మెడికల్ కాలేజ్ హాస్పటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పటల్స్ లో సిబ్బంది నియామకం: గుండె వ్యాధులను తగ్గించేందుకు అత్యుత్తమమైన, నాణ్యమైన హార్ట్ కేర్ సర్వీసులను రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కార్డియాలజీ విభాగంలో అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాల కోసం వేగంగా అవసరమైన పోస్టులను మంజూరు చేసారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్ ల్యాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు, టెక్నికల్ అసిస్టెంట్స్, ల్యాబ్ మరియు ఓటీ విభాగాల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిలో 94 పోస్టులను సాంక్షన్ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. దీంతో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి. చదవండి: CM Jagan: గౌరవం చేతల్లోనూ.. STEMI పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 29, 2023న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 2024 నుండి STEMI ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని టీచింగ్ హాస్పటల్స్‌లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్ విభాగాలను బలోపేతం చేసి, కార్డియాక్ సేవలను పెంపొందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. -
సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు టీటీడీ ఆహ్వానం
తిరుమల: టీటీడీ నిర్వహించనున్న శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ఆస్పత్రిలో స్వచ్ఛంద సేవలు అందించడానికి దేశంలోని గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పీడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు, వైద్యులను ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ ప్రాణదాన పథకం కింద నిర్వహించనున్న ఈ ఆస్పత్రిలో నవజాత శిశువులు, పిల్లలకు గుండె చికిత్స, వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 ఏళ్ల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన వైద్యులు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది. ఆసక్తి గల వైద్యనిపుణులు cmo. adldirector@gmail. com మెయిల్ ఐడీకి తమ వివరాలతో పాటు ఏయే కేటగిరీ కింద ఆసక్తి ఉందో తెలియజేస్తూ, వారి అర్హత పత్రాలను జత చేయాలని టీటీడీ కోరింది. ఆప్షన్ అ: ఈ విధానంలో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, ప్రోటోకాల్ దర్శనం, తిరుమల–తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు. ఆప్షన్ ఆ: ఈ విధానంలో స్వచ్ఛంద సేవకు ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ నియమ నిబంధనల మేరకు పరస్పర ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లిస్తారు. వీరికి శ్రీవారి దర్శనం, రవాణా సదుపాయాలు ఉండవు. -
గాటు లేకుండానే.. గుండెకు చికిత్స
సాక్షి, హైదరాబాద్: శరీరంపై కత్తిగాట్లు, కుట్లే కాదు.. కనీసం నొప్పి కూడా తెలియకుండా పూర్తిగా దెబ్బతిన్న గుండె రక్తనాళాలకు అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. సాధారణంగా ఈ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఛాతీని ఓపెన్ చేసి దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో దాతల రక్తనాళాలను అమరుస్తారు. ఈ తరహా చికిత్సను వైద్య పరిభాషలో ‘ట్రాన్స్ కేథటర్ అరోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్’టెక్నిక్ అంటారు. అయితే ఈ చికిత్స ద్వారా ఒకేరోజు ఐదుగురు బాధితులకు 5 రక్తనాళాల మార్పిడి చేయడం దేశ వైద్య చరిత్రలోనే తొలిసారని అపోలో వైద్యులు తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసకుమార్, ఆస్పత్రి డివిజన్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్ చికిత్స వివరాలను మీడియాకు వెల్లడించారు. బాధితులంతా 70 ఏళ్ల పైవారే సిద్దిపేటకు చెందిన రాజేశం(73), హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్(70), ప్రసాదరావు(73), దామోదరం రాఠీ (70)లతో పాటు మరో వ్యక్తి ఎడమ జఠరిక వైఫల్యం (అరోటిక్ వాల్వ్‌స్టెనోసిస్)తో బాధపడుతున్నారు. అరోటిక్ వాల్వ్ అనేది గుండె కింది భాగంలో రక్తాన్ని పంపింగ్ చేసే ఎడమ జఠరికతోపాటు ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేసే బృహద్ధమనిని కలుపుతుంది. పెరుగుతున్న వయసు కారణంగా రక్తనాళాలు బలహీనపడి కుచించుకుపోయి రక్తం సరఫరా వ్యతిరేక దిశలో ప్రయాణించడంతో గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో అరోటిక్ వాల్వ్ స్టెనోసిస్‌గా పిలుస్తారు. ఈ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఛాతీపై కోతపెట్టి దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో బ్రెయిన్‌డెడ్ దాతల నాళాలను అమర్చుతుంటారు. బాధితులంతా 70 ఏళ్లు నిండినవారు కావడం.. ఈ వయసులో వారికి ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయడం రిస్క్‌తో కూడిన పనేకాకుండా చికిత్స తర్వాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కోసారి ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తుంది. రెండోరోజే డిశ్చార్జ్.. వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ‘హార్ట్‌వాల్వ్ థెరపీ’ ప్రోగ్రామ్‌లో డాక్టర్ శ్రీనివాస్‌కుమార్ ఇటీవల శిక్షణ పొందారు. వృద్ధాప్యంతోపాటు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఈ ఐదుగురు బాధితులకు కత్తిగాటుతో పనిలేకుండా కనీసం రక్తం చుక్క కూడా కారకుండా తొడభాగంలోని రక్తనాళం ద్వారా దెబ్బతిన్న గుండె రక్తనాళాలను పునరుద్ధరించినట్లు శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. చికిత్స చేసిన రెండో రోజే బాధితులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. వృద్ధాప్యంతోపాటు ఊపిరితిత్తులు, మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్న రోగులకు ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకేరోజు ఐదుగురు బాధితులకు చికిత్స చేయడం దేశవైద్య చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. -
'మోదీజీ.. నన్ను బతికించండి ప్లీజ్'
ఆగ్రా: తయ్యాబా అనే ఆ పాపకు ఎనిమిదేళ్లు. చక్కగా స్కూల్ కు వెళ్లి చదువుకుంటోంది. ఈ మధ్య తనకు గుండెకు రంద్రం ఉందని తెలిసింది. ఇంట్లో పూటగడవని పరిస్థితి. మంచి బట్టలు ఇచ్చి, పుస్తకాలు కొనిచ్చి పంపే స్తోమత కూడా ఆమె తల్లదండ్రులకు అంతంతమాత్రం. ఆ చిట్టి తల్లికి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు. వెంటనే తాను ఒక లేఖ రాయాలనుకుంది. అది కూడా భారత ప్రధాని నరేంద్రమోదీకి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుండెజబ్బుతో బాధపడుతున్న తనను కాపాడాలని, చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా సహాయం చేయాలని వేడుకుంటూ తయ్యాబా ప్రధానికి లేఖ రాసింది. తయ్యాబా తండ్రి చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె రాసిన లేఖకు వెంటనే స్పందించిన ప్రధాని కార్యాలయం వెంటనే స్పందించింది. ఆపరేషన్‌కోసం ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తి ఖర్చులు భరిస్తానని స్పష్టం చేసింది. ఆ లేఖలో పాప ఇలా రాసింది. 'నా హృదయానికి రంద్రం ఉంది. నా ఆపరేషన్ కోసం మా నాన్న దగ్గర డబ్బు లేదు. ప్రధాని అందరికోసం పనిచేస్తారని చెప్పడం టీవీ ద్వారా తెలుసుకున్నాను. నేను బతికేందుకు అర్హురాలిని' అని పేర్కొంది. ఈ లెటర్ పంపించిన కొద్ది రోజులకే ప్రధాని నుంచి బదులు వచ్చిందని, తన ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ప్రధానిగారిని తన కృతజ్ఞతలు అని తయ్యాబా చెప్పింది.