మీ గుండె పదిలంగా.. హార్ట్‌ సర్జరీలపై ఏపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టి | Ap Government Special Focus On Heart Treatment | Sakshi
Sakshi News home page

మీ గుండె పదిలంగా.. హార్ట్‌ సర్జరీలపై ఏపీ సర్కార్‌ ప్రత్యేక దృష్టి

Published Tue, Aug 15 2023 6:20 PM | Last Updated on Tue, Aug 15 2023 7:26 PM

Ap Government Special Focus On Heart Treatment - Sakshi

సాక్షి, అమరావతి: గుండె సంబంధిత వ్యాధుల కారణంగా పెరుగుతున్న మరణాల రేటును తగ్గించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు నిలబెట్టే STEMI ప్రాజెక్టుకు వైద్య ఆరోగ్యశాఖ శ్రీకారం చుట్టింది.

మారుతున్న జీవన ప్రమాణాలు చిన్న వయసులోనే గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అయితే గుండెపోటు సంభవించిన తొలి గంటలోపే (దీన్నే గోల్డెన్ అవర్ అంటారు) సరైన అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టేందుకు అత్యధిక అవకాశాలున్నాయి. అనారోగ్యానికి గురైన వెంటనే గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే దాన్ని గుర్తించడం, సమీపంలో ఉన్న ఆసుపత్రికి సకాలంలో చేర్చడం, ఇంజక్షన్ ద్వారా ప్రాణాపాయాన్ని తప్పించడం, తదుపరి చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రోగిని తరలించి, ECG వంటి పరీక్షల ద్వారా రోగి పరిస్థితిని అంచనా వేసి, అవసరమైన శస్త్ర చికిత్సను చేయడం అనేవి చాలా ముఖ్యం. ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే గుండెపోటు కారణంగా జరిగే మరణాలను కట్టడి చేయగలం. ఇందుకోసమే ICMR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం STEMI కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది 

గుండె వ్యాధులకు చెక్ పెడుతూ..
అసంక్రమిక వ్యాధుల్లో NCD (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) గుండె సంబంధిత సమస్యల వల్లే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.సీ.డీల్లో గుండెపోటు వల్ల జరుగుతున్న మరణాలు 32 శాతం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 38 లక్షల మంది ప్రజలు గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుకు గురై మరణించేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ముఖ్యమంత్రి ఇదివరకే ఆదేశాలు జారీచేశారు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, పీహెచ్‌సీలు, జిల్లా ఆసుపత్రుల్లో హృద్రోగ చికిత్సలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. 

STEMI ద్వారా గుండె పదిలం:
గుండెపోటు సంభవించిన తొలి 40 నిమిషాల సమయం ఎంతో కీలకమైనది. ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ రోగికి అవసరమైన చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడటమే STEMI ముఖ్యోద్దేశ్యం. ముందుగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ అందించడం, సమీపంలో ఉన్న PHCలలో ఇనీషియల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడం, గోల్డెన్ అవర్ లో ఇవ్వాల్సిన ఇంజెక్షన్‌ను ఉచితంగా రోగికి అందించడం, తదనంతరం 100కి.మీల పరిధిలో క్యాథ్ లాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పటల్‌కు రోగిని తరలించి అవసరమైన టెస్టులు, శస్త్ర చికిత్స నిర్వహించడం ఈ కార్యక్రమంలో భాగం.

ఇప్పటికే గ్రామ స్థాయిలో సిబ్బంది, వైద్యులకు శిక్షణా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలను కూడా చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రూ.120 కోట్లు వెచ్చించి క్యాథ్ లాబ్స్ నిర్మాణం చేసింది. SVRR GGH గుంటూరు, GGH కర్నూలు, KGH విశాఖపట్నం నాలుగు హబ్స్ గా ఏర్పాటు చేసి ఈ జిల్లాల పరిధిలో 61 స్పోక్స్ ను ఏర్పాటు చేసి హార్ట్ కేర్ సర్వీసులను సామాన్యులకు, గ్రామీణులకు కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఏం చేస్తారంటే..:
గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్‌ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థను వినియోగించి గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్‌కు తరలిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేసారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు. 

మెడికల్ కాలేజ్ హాస్పటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పటల్స్ లో సిబ్బంది నియామకం:
గుండె వ్యాధులను తగ్గించేందుకు అత్యుత్తమమైన, నాణ్యమైన హార్ట్ కేర్ సర్వీసులను రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు. కార్డియాలజీ విభాగంలో అవసరమైన వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాల కోసం వేగంగా అవసరమైన పోస్టులను మంజూరు చేసారు. 

రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్డియాలజీ, క్యాథ్ ల్యాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు, టెక్నికల్ అసిస్టెంట్స్, ల్యాబ్ మరియు ఓటీ విభాగాల్లో రెగ్యులర్, కాంట్రాక్టు పద్ధతిలో 94 పోస్టులను సాంక్షన్ చేస్తూ జీవో రిలీజ్ చేసింది. దీంతో కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి.
చదవండి: CM Jagan: గౌరవం చేతల్లోనూ..

STEMI పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేసేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 29, 2023న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 2024 నుండి STEMI ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని టీచింగ్ హాస్పటల్స్‌లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్ విభాగాలను బలోపేతం చేసి, కార్డియాక్ సేవలను పెంపొందించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement