'మోదీజీ.. నన్ను బతికించండి ప్లీజ్'
ఆగ్రా: తయ్యాబా అనే ఆ పాపకు ఎనిమిదేళ్లు. చక్కగా స్కూల్ కు వెళ్లి చదువుకుంటోంది. ఈ మధ్య తనకు గుండెకు రంద్రం ఉందని తెలిసింది. ఇంట్లో పూటగడవని పరిస్థితి. మంచి బట్టలు ఇచ్చి, పుస్తకాలు కొనిచ్చి పంపే స్తోమత కూడా ఆమె తల్లదండ్రులకు అంతంతమాత్రం. ఆ చిట్టి తల్లికి ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో తెలియదు. వెంటనే తాను ఒక లేఖ రాయాలనుకుంది. అది కూడా భారత ప్రధాని నరేంద్రమోదీకి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గుండెజబ్బుతో బాధపడుతున్న తనను కాపాడాలని, చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా సహాయం చేయాలని వేడుకుంటూ తయ్యాబా ప్రధానికి లేఖ రాసింది. తయ్యాబా తండ్రి చెప్పులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఆమె రాసిన లేఖకు వెంటనే స్పందించిన ప్రధాని కార్యాలయం వెంటనే స్పందించింది. ఆపరేషన్కోసం ఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తి ఖర్చులు భరిస్తానని స్పష్టం చేసింది. ఆ లేఖలో పాప ఇలా రాసింది. 'నా హృదయానికి రంద్రం ఉంది. నా ఆపరేషన్ కోసం మా నాన్న దగ్గర డబ్బు లేదు. ప్రధాని అందరికోసం పనిచేస్తారని చెప్పడం టీవీ ద్వారా తెలుసుకున్నాను. నేను బతికేందుకు అర్హురాలిని' అని పేర్కొంది. ఈ లెటర్ పంపించిన కొద్ది రోజులకే ప్రధాని నుంచి బదులు వచ్చిందని, తన ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ప్రధానిగారిని తన కృతజ్ఞతలు అని తయ్యాబా చెప్పింది.