మన జీర్ణ వ్యవస్థలో చివరన ఉండే భాగాన్ని కోలన్ అని, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్ ను కోలన్ క్యాన్సర్ అని అంటారు. పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్ (కణుతులు) ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరగడమే ఈ క్యాన్సర్‌కు కారణం. తొలుత ఈ కణుతులు హాని ఏమీ చేయకపోయినా... కొంతకాలం తర్వాత క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.
మిగతా క్యాన్సర్‌లలాగే ఈ క్యాన్సర్‌కు కూడా ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా జీన్ మ్యూటేషన్స్, లావుగా ఉన్నవారిలో, ఫైబర్ చాలా తక్కువగా తీసుకునేవారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, ఇతర క్యాన్సర్‌కు తీసుకునే రేడియేషన్ వంటివి కొంతవరకు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు కావచ్చు.
కోలన్ చివరి భాగం, మలద్వారం కొంచెం పైన ఉండే రెక్టమ్‌కు సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ క్యాన్సర్ 60 ఏళ్లు, ఆ పైబడిన వారిలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
కోలన్, కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు
ఈ లక్షణాలు... కణితి ఎక్కడ వచ్చింది, పరిమాణం ఎంత, ఏయే భాగాలకు వ్యాపించింది అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి.
ఎక్కువగా కనిపించే లక్షణాలు...
1. అజీర్తి లేక విరేచనాలు అవ్వడం
2. మలం, మలవిసర్జనలో మార్పులు
3. మలంలో రక్తం, రక్తపు చారికలు
4. పొట్ట కిందభాగంలో నొప్పి, పట్టేసినట్లు ఉండటం, గ్యాస్ పోతుండటం
5. మలవిసర్జనకు వెళ్లినప్పుడు నొప్పి
6. అకారణంగా నీరసం, బరువు తగ్గడం
7. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)
ఈ క్యాన్సర్ లక్షణాలను అశ్రద్ధ చేస్తే లివర్‌కు పాకే (మెటాస్టాసిస్) ప్రమాదం ఎక్కువ.
మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అజీర్తి, విరేచనాలు అవుతుండటం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ, అకస్మాత్తుగా జీర్ణవ్యవస్థలో మార్పులు కనిపించి, ఏమి చేసినా తగ్గకపోగా, ఇంకా ఎక్కువవుతున్నట్లు గమనిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయడానికి ముందుగా డాక్టర్లు... ఫ్యామిలీ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ వంటివి చేశాక కొలనోస్కోపీ, బేరియమ్ ఎనీమా ఎక్స్–రే చేస్తారు. కొలనోస్కోపీ అంటే ఒక సన్నటి గొట్టాన్ని మలద్వారంలో పెట్టి కెమెరా సహాయంతో పాలిప్స్ ఉన్నాయా అని చూస్తారు. కణుతులు ఏమైనా కనబడితే తొలగించి బయాప్సీకి పంపుతారు. మైక్రోస్కోపు సహాయంతో ఆ కణాలు క్యాన్సర్ కణాలా అని తేల్చుకుంటారు.
బేరియమ్ ఎనీమా పరీక్షలో బాధితుల చేత బేరియమ్ తాగించి, పెద్దపేగుకు చేరుకున్నాక ఎక్స్‌రే తీసి చూస్తారు. కణుతులు ఉంటే ఈ ఎక్స్‌రేలో ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. బయాప్సీలో క్యాన్సర్ కణాలు అని తేలితే, క్యాన్సర్ దశ తెలుసుకోడానికి మిగతా పరీక్షలు చేస్తారు. చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, సీరమ్ సీఈఏ పరీక్షలతో అవసరమైతే పెట్ సీటీ స్కాన్ పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉన్నదనే అంశాన్ని నిర్ధారణ చేస్తారు.
నివారణ : యాభై ఏళ్లు పైబడినవారు ఒకసారి మలపరీక్ష, డాక్టర్ సలహా మేరకు సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవరచుకుంటే కొంతవరకు ఈ క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు.
మలంలో రక్తం పడటం పైల్స్ వంటి సమస్యలల్లోనూ సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు అది కేవలం పైల్స్ సమస్య అనే భావించకుండా... మలద్వారం, రెక్టమ్‌ను పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ లేదా వీటితో పాటు పెద్దపేగును మొత్తంగా చూసే కొలనోస్కోపీ, ఇంకా డాక్టర్ సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకుంటే మంచిది. అంతేగానీ వేడి చేసిందనీ లేదా పైల్స్ సమస్య కావొచ్చేమోలే అని సొంతవైద్యం చేసుకుంటూ ఉంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
పైల్స్ సమస్యలలో లేదా అజీర్తి, బ్యాక్టీరియా, వైరస్‌లతో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్‌లో కనిపించే లక్షణాలూ... కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ తొలిదశలో కనిపించే లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండవచ్చు. అందువల్ల పై లక్షణాలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.
కోలన్ క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. ప్రారంభదశలోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ ఉత్తమమైనది. ఈ రోజుల్లో ఈ సర్జరీలను లాపరోస్కోపిక్ (కీహోల్) పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతిలో... వ్యాధి సోకిన భాగాన్ని హై– డెఫినిషన్ కెమెరాలు పెద్దదిగా, స్పష్టంగా కనిపించేట్లు చేస్తాయి.
ఫలితంగా సర్జరీని మరింత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చు. ఓపెన్ సర్జరీతో పోలిస్తే, లాపరోస్కోపిక్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటాడు. రోగి ఆరోగ్యం, క్యాన్సర్ దశ, క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా రెండింటినీ ఇవ్వాల్సి ఉంటుంది.
క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించినట్లయితే, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌లో కీమోథెరపీ, రేడియేషన్ ముందుగా ఇచ్చి, తర్వాత సర్జరీ చేస్తారు. ఒకవేళ చివరిదశలో గుర్తించినా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి మందుల సహాయంతో రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు.
-డా. సీహెచ్. మోహన వంశీ,
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్
ఫోన్ నంబరు 9849022121
Comments
Please login to add a commentAdd a comment