Colon Cancer
-
పైల్స్‌కు, క్యాన్సర్‌కు ఒకేలాంటి లక్షణాలు..!
మన జీర్ణ వ్యవస్థలో చివరన ఉండే భాగాన్ని కోలన్ అని, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్ ను కోలన్ క్యాన్సర్ అని అంటారు. పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్ (కణుతులు) ఏర్పడి వాటిలో కణాలు అపరిమితంగా పెరగడమే ఈ క్యాన్సర్‌కు కారణం. తొలుత ఈ కణుతులు హాని ఏమీ చేయకపోయినా... కొంతకాలం తర్వాత క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. మిగతా క్యాన్సర్లలాగే ఈ క్యాన్సర్‌కు కూడా ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా జీన్ మ్యూటేషన్స్, లావుగా ఉన్నవారిలో, ఫైబర్ చాలా తక్కువగా తీసుకునేవారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, ఇతర క్యాన్సర్‌కు తీసుకునే రేడియేషన్ వంటివి కొంతవరకు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు కావచ్చు. కోలన్ చివరి భాగం, మలద్వారం కొంచెం పైన ఉండే రెక్టమ్‌కు సంబంధించిన కోలోరెక్టల్ క్యాన్సర్ మన దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ క్యాన్సర్ 60 ఏళ్లు, ఆ పైబడిన వారిలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. కోలన్, కోలోరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు ఈ లక్షణాలు... కణితి ఎక్కడ వచ్చింది, పరిమాణం ఎంత, ఏయే భాగాలకు వ్యాపించింది అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా కనిపించే లక్షణాలు... 1. అజీర్తి లేక విరేచనాలు అవ్వడం 2. మలం, మలవిసర్జనలో మార్పులు 3. మలంలో రక్తం, రక్తపు చారికలు 4. పొట్ట కిందభాగంలో నొప్పి, పట్టేసినట్లు ఉండటం, గ్యాస్ పోతుండటం 5. మలవిసర్జనకు వెళ్లినప్పుడు నొప్పి 6. అకారణంగా నీరసం, బరువు తగ్గడం 7. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) ఈ క్యాన్సర్ లక్షణాలను అశ్రద్ధ చేస్తే లివర్‌కు పాకే (మెటాస్టాసిస్) ప్రమాదం ఎక్కువ. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అజీర్తి, విరేచనాలు అవుతుండటం అప్పుడప్పుడూ జరిగేదే. కానీ, అకస్మాత్తుగా జీర్ణవ్యవస్థలో మార్పులు కనిపించి, ఏమి చేసినా తగ్గకపోగా, ఇంకా ఎక్కువవుతున్నట్లు గమనిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయడానికి ముందుగా డాక్టర్లు... ఫ్యామిలీ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ వంటివి చేశాక కొలనోస్కోపీ, బేరియమ్ ఎనీమా ఎక్స్–రే చేస్తారు. కొలనోస్కోపీ అంటే ఒక సన్నటి గొట్టాన్ని మలద్వారంలో పెట్టి కెమెరా సహాయంతో పాలిప్స్ ఉన్నాయా అని చూస్తారు. కణుతులు ఏమైనా కనబడితే తొలగించి బయాప్సీకి పంపుతారు. మైక్రోస్కోపు సహాయంతో ఆ కణాలు క్యాన్సర్ కణాలా అని తేల్చుకుంటారు. బేరియమ్ ఎనీమా పరీక్షలో బాధితుల చేత బేరియమ్ తాగించి, పెద్దపేగుకు చేరుకున్నాక ఎక్స్‌రే తీసి చూస్తారు. కణుతులు ఉంటే ఈ ఎక్స్‌రేలో ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. బయాప్సీలో క్యాన్సర్ కణాలు అని తేలితే, క్యాన్సర్ దశ తెలుసుకోడానికి మిగతా పరీక్షలు చేస్తారు. చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, సీరమ్ సీఈఏ పరీక్షలతో అవసరమైతే పెట్ సీటీ స్కాన్ పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉన్నదనే అంశాన్ని నిర్ధారణ చేస్తారు. నివారణ : యాభై ఏళ్లు పైబడినవారు ఒకసారి మలపరీక్ష, డాక్టర్ సలహా మేరకు సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవరచుకుంటే కొంతవరకు ఈ క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. మలంలో రక్తం పడటం పైల్స్ వంటి సమస్యలల్లోనూ సాధారణంగా జరిగేదే. ఇలా జరిగినప్పుడు అది కేవలం పైల్స్ సమస్య అనే భావించకుండా... మలద్వారం, రెక్టమ్‌ను పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ లేదా వీటితో పాటు పెద్దపేగును మొత్తంగా చూసే కొలనోస్కోపీ, ఇంకా డాక్టర్ సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకుంటే మంచిది. అంతేగానీ వేడి చేసిందనీ లేదా పైల్స్ సమస్య కావొచ్చేమోలే అని సొంతవైద్యం చేసుకుంటూ ఉంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలలో లేదా అజీర్తి, బ్యాక్టీరియా, వైరస్‌లతో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్లో కనిపించే లక్షణాలూ... కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ తొలిదశలో కనిపించే లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉండవచ్చు. అందువల్ల పై లక్షణాలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కోలన్ క్యాన్సర్‌కు చికిత్స అన్నది వ్యాధి దశను బట్టి ఉంటుంది. ప్రారంభదశలోనే గుర్తిస్తే రాడికల్ సర్జరీ ఉత్తమమైనది. ఈ రోజుల్లో ఈ సర్జరీలను లాపరోస్కోపిక్ (కీహోల్) పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతిలో... వ్యాధి సోకిన భాగాన్ని హై– డెఫినిషన్ కెమెరాలు పెద్దదిగా, స్పష్టంగా కనిపించేట్లు చేస్తాయి. ఫలితంగా సర్జరీని మరింత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చు. ఓపెన్ సర్జరీతో పోలిస్తే, లాపరోస్కోపిక్ సర్జరీలో రోగి త్వరగా కోలుకుంటాడు. రోగి ఆరోగ్యం, క్యాన్సర్ దశ, క్యాన్సర్ రకాన్ని బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా రెండింటినీ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించినట్లయితే, ముఖ్యంగా కోలన్ క్యాన్సర్‌లో కీమోథెరపీ, రేడియేషన్ ముందుగా ఇచ్చి, తర్వాత సర్జరీ చేస్తారు. ఒకవేళ చివరిదశలో గుర్తించినా, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి మందుల సహాయంతో రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. -డా. సీహెచ్. మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు 9849022121 -
మరోసారి ఆసుపత్రిలో చేరిన బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే మరోసారి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా పీలే పెద్దప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిదే. గతేడాది సెప్టెంబర్ 2021లో పెద్దప్రేగుకు ఏర్పడిని కణితిని వైద్యులు తొలగించారు. అప్పటినుంచి పీలే..సావోపోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రికి తరచు చికిత్స కోసం వెళ్లి వస్తున్నాడు. తాజాగా సోమవారం నొప్పి మరోసారి ఎక్కువవడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు హాస్పిటల్ మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీలే పరిస్థితి బాగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో ఆయన అబ్జర్వేషన్లో కొనసాగుతున్నాడు. కాగా గత ఫిబ్రవరిలో యూరిన్ ఇన్ఫెక్షన్ సోకడంతో ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కీమోథెరపీ కూడా చేయించుకున్నాడు. కాగా ఫుట్‌బాల్‌లో పీలేది చెరగని ముద్ర. మూడు ప్రపంచ కప్‌లు సాధించిన ఏకైక ఫుట్‌బాలర్‌గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదయింది. 1958, 1962, 1970 ప్రపంచకప్‌ల్లో పీలే బ్రెజిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. చదవండి: Wimbledon 2022: రష్యన్ టెన్నిస్ ప్లేయర్లకు షాక్.. వింబుల్డన్‌కు దూరమయ్యే అవకాశం! -
హాలీవుడ్ హీరో చద్విక్ బోస్‌మ్యాన్ మృతి
మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథర్‌గా పాపులారిటీ సంపాదించిన చద్విక్ బోస్‌మ్యాన్ శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన పేగు సంబంధిత క్యాన్సర్‌తో బా«దపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. చద్విక్ వయసు కేవలం 43 సంవత్సరాలే. 2016లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. క్యాన్సర్ చికిత్స, కీమోథెరపీలను తీసుకుంటూనే ‘బ్లాక్ పాంథర్, మార్షల్, దా 5 బ్లడ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించారాయన. 2003లో నటుడిగా చద్విక్ తన కెరీర్‌ను ప్రారంభించారు. 2013లో వచ్చిన ‘42’లో ఆయన చేసిన జాకీ రాబిన్సన్ పాత్ర పెద్ద బ్రేక్. ఆ తర్వాత ‘ది కిల్ హోల్, డ్రాఫ్ట్ డే, గెట్ ఆన్ అప్, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్’ వంటి సినిమాలు చేశారు. చద్విక్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. -
క్యాన్సర్ కొరుకుతానంటోంది!
వేటమాంసం, ప్రాసెస్డ్ మాంసాలు అతిగా తినడం వల్ల గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయనీ, స్థూలకాయం వస్తుందనీ చాలాకాలంగా వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వాటివల్ల రకరకాల క్యాన్సర్లు కూడా వస్తాయని ఇటీవల తేలింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్నదేమిటంటే, పాశ్చాత్య దేశాల్లో 30 శాతం క్యాన్సర్లు రావడానికీ, అక్కడి ఆహారపుటలవాట్లకూ సంబంధం ఉందట! ఇక, మన భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో కూడా 20 శాతం క్యాన్సర్లకూ, మనం తినే ఆహారానికీ లింకు ఉందని తేల్చారు. మాంసం తినడం మానేసినవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గినట్లు కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరు నెలల క్రితమే డబ్ల్యూహెచ్ఓ ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. అందులో ఒక జాబితాను సిద్ధం చేశారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాల పేర్లతో కూడిన ‘గ్రూప్1’లో ప్రాసెస్డ్ మాంసాన్ని చేర్చారు. ఇక, క్యాన్సర్ తెచ్చే అవకాశమున్న ఆహారపదార్థాల పేర్లతో కూడిన ‘గ్రూప్ 2ఏ’లో రెడ్ మీట్ (వేట మాంసం)ను పేర్కొన్నారు. గొడ్డు మాంసం, పెయ్యదూడ మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివన్నీ ‘రెడ్ మీట్’ కిందకు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 34 వేల మంది ప్రాసెస్డ్ మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణిస్తున్నారని తాజా అంచనా. అలాగే, దాదాపు 50 వేల మంది రెడ్ మీట్ అతిగా తినడం వల్ల ఏటా క్యాన్సర్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతిరోజూ తింటే... పెద్ద పేగు క్యాన్సర్ ‘అతి సర్వత్ర వర్జయేత్’ - దేనిలోనైనా అతి పనికి రాదు అని పెద్దల మాట. మాంసం తినే విషయంలోనూ ఇది పాటించాల్సిన సూత్రమే. ఎందుకంటే, అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తేల్చాయి. దీనికి కారణాలు అన్వేషిస్తే - మాంసంలో పీచు పదార్థం కానీ, సంరక్షించే ఇతర పోషకాలు కానీ ఉండవు. పెపైచ్చు, మాంసంలో యానిమల్ ప్రోటీన్, శ్యాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. మాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, హెచ్చు ఉష్ణోగ్రతల్లో వండుతున్నప్పుడు క్యాన్సర్ కారకాలైన హెటెరో సైక్లిక్ ఎమైన్స్ (హెచ్‌సీఏ), పాలీ సైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్) ఏర్పడతాయి. అవి క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. ప్రాసెస్డ్ మాంసంలోని అతి కొవ్వు, ఇతర జంతు ఉత్పత్తుల వల్ల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దాని వల్ల వక్షోజ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి క్యాన్సర్లు కూడా ... గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివి అతిగా తిన్నా, ప్రాసె్స్డ్ మాంసాన్ని అతిగా తిన్నా అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమం (ప్యాంక్రియాస్), పొట్ట, గర్భాశయం లోపలి పొర, ప్రొస్టేట్ గ్రంథులకు క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుందని ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్’ వెల్లడించింది. ప్రాసెస్డ్ మాంసంతో పురీషనాళ క్యాన్సర్ ఇటీవలి కాలంలో పురీషనాళ క్యాన్సర్ (కోలో రెక్టల్ క్యాన్సర్) ఎక్కువవుతోంది. ప్రాసెస్డ్ మాంసం అతిగా తీసుకొన్నా, అతిగా ఉడికించిన మాంసాన్ని భుజించినా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ప్రాసెస్డ్ మాంసంతో ఎందుకు ముప్పంటే, మాంసం పాడవకుండా ఉండడానికి సహజంగా కానీ, కృత్రిమంగా కానీ నైట్రైట్లు, నైట్రేట్ల లాంటి లవణాలను చేరుస్తారు. అవి మాంసంలోని పదార్థాలతో రియాక్ట్ అయి క్యాన్సర్ కారక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మన డీఎన్ఏను దెబ్బ తీస్తాయి. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్డ్ మాంసం తినడం వల్ల పురీష నాళ క్యాన్సర్ వచ్చే రిస్క్ 18 శాతం పెరుగుతుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. గ్రిల్డ్ మాంసంతోనూ చిక్కే! నేరుగా నిప్పుల మీద మాంసాన్ని వేయించడం (గ్రిల్డ్ మాంసం), కాల్చడం వల్ల కొవ్వు ఆ వేడి నిప్పుల మీదకు చేరుతుంది. దాంతో, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్)తో నిండిన మంటలు వస్తాయి. సదరు పీఏహెచ్‌లు ఆహారం తాలూకు ఉపరితలానికి అంటుకుంటాయి. వేడి పెరిగిన కొద్దీ మరిన్ని పీఏహెచ్‌లు వస్తాయి. దాంతో, ఉదర సంబంధమైన క్యాన్సర్లు వచ్చే రిస్కు పెరుగుతుంది. అతి కొవ్వుతో రొమ్ము క్యాన్సర్ కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు, వేపుడు ఆహారపదార్థాలు తినడం వల్ల స్త్రీలలో మరింతగా ఈస్ట్రోజెన్స్ ఉత్పత్తి అవుతాయి. వక్షోజాలలో, స్త్రీల సెక్స్ హార్మోన్లకు స్పందించే ఇతర అవయవాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించాలంటే- మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా అధిక కొవ్వు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. అయితే మాంసాహారం తక్కువ కావడం వల్ల విటమిన్ బి-12, విటమిన్-డి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించి మితం హితం అన్న జాగ్రత్త తీసుకోవాలి. అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువ - హార్వర్డ్ వర్శిటీ -
నాలుగు కప్పుల కాఫీతో పేగు క్యాన్సర్ దూరం
న్యూయార్క్: రోజుకు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే పెద్దపేగు క్యాన్సర్‌ను తగ్గించడంలో సాయపడుతుందట. ఈ క్యాన్సర్ సోకకుండా కూడా కాఫీ నిరోధిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. పెద్దపేగు క్యాన్సర్ సోకిన రోగులకు వ్యాధి మూడో దశలోనూ ఈ వ్యాధిని తగ్గించేందుకు కాఫీ ఉపయోగపడుతుందని బోస్టన్‌కు చెందిన డానా ఫార్బర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. రోజూ రెండు, మూడు కప్పుల కాఫీ తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని వారు అన్నారు. 'వ్యాధి సంక్రమించి మూడో దశలో ఉండి శస్త్రచికిత్స లేదా కీమోథెరపీ చేయించుకుంటున్న రోగులు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ (దాదాపు 460 మిల్లీ గ్రాముల కెఫైన్) తాగడం వల్ల మేలు కలుగుతుంది. ఇలా కాఫీ తాగే వారు తాగనివారితో పోలిస్తే 42 శాతం ఎక్కువగా వ్యాధి నుంచి బయటపడ్డారు. 33 శాతం తక్కువగా రోగులు మరణించారు.' అని చార్లెస్ అనే పరిశోధకుడు చెప్పాడు. దాదాపు వెయ్యి మందికి పైగా రోగులను అధ్యయనం చేసి వారు ఈ ఫలితాలు వెల్లడించారు. కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం లేదని, త్వరగా కోలుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. యాస్పిరిన్తోనూ... లండన్: వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న స్థూలకాయులు యాస్పిరిన్ వాడడం వల్ల ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని తాజా అధ్యయనం తెలిపింది. దీర్ఘకాలికంగా యాస్పిరిన్ వాడితే ప్రయోజనం ఉంటుందని ఇంగ్లండ్‌లోని పరిశోధకులు తెలిపారు. -
నేడో రేపో ఆస్పత్రి నుంచి అక్కినేని డిశ్చార్జ్!
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ నేపథ్యంలో కిమ్స్‌లో చేరిన సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కోలుకుంటున్నారు. దీంతో ఆయనను ఒకటి రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. మలవిసర్జన సంబంధిత పేగుకు కేన్సర్ సోకడంతో అక్కినేనికి శనివారం శస్త్ర చికిత్స జరిగింది. దీంతో 4 రోజుల పాటు ఆయనను ఐసీయూలోనే ఉంచిన వైద్యులు బుధవారం జనరల్ వార్డుకు తరలించారు.