క్యాన్సర్ కొరుకుతానంటోంది! | Cancer diseases attack eating more meats | Sakshi
Sakshi News home page

క్యాన్సర్ కొరుకుతానంటోంది!

Published Sat, Apr 30 2016 2:47 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

క్యాన్సర్ కొరుకుతానంటోంది!

క్యాన్సర్ కొరుకుతానంటోంది!

వేటమాంసం, ప్రాసెస్డ్ మాంసాలు అతిగా తినడం వల్ల గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయనీ, స్థూలకాయం వస్తుందనీ చాలాకాలంగా వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వాటివల్ల రకరకాల క్యాన్సర్లు కూడా వస్తాయని ఇటీవల తేలింది.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతున్నదేమిటంటే, పాశ్చాత్య దేశాల్లో 30 శాతం క్యాన్సర్లు రావడానికీ, అక్కడి ఆహారపుటలవాట్లకూ సంబంధం ఉందట! ఇక, మన భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో కూడా  20 శాతం క్యాన్సర్లకూ, మనం తినే ఆహారానికీ లింకు ఉందని తేల్చారు. మాంసం తినడం మానేసినవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గినట్లు కూడా పరిశోధనలు చెబుతున్నాయి.
 
ఆరు నెలల క్రితమే డబ్ల్యూహెచ్‌ఓ ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. అందులో ఒక జాబితాను సిద్ధం చేశారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాల పేర్లతో కూడిన ‘గ్రూప్1’లో ప్రాసెస్డ్ మాంసాన్ని చేర్చారు. ఇక, క్యాన్సర్ తెచ్చే అవకాశమున్న ఆహారపదార్థాల పేర్లతో కూడిన ‘గ్రూప్ 2ఏ’లో రెడ్ మీట్ (వేట మాంసం)ను పేర్కొన్నారు.  గొడ్డు మాంసం, పెయ్యదూడ మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివన్నీ ‘రెడ్ మీట్’ కిందకు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 34 వేల మంది ప్రాసెస్డ్ మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణిస్తున్నారని తాజా అంచనా. అలాగే, దాదాపు 50 వేల మంది రెడ్ మీట్ అతిగా తినడం వల్ల ఏటా క్యాన్సర్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.  
 
ప్రతిరోజూ తింటే... పెద్ద పేగు క్యాన్సర్
‘అతి సర్వత్ర వర్జయేత్’ - దేనిలోనైనా అతి పనికి రాదు అని పెద్దల మాట. మాంసం తినే విషయంలోనూ ఇది పాటించాల్సిన సూత్రమే. ఎందుకంటే, అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తేల్చాయి. దీనికి కారణాలు అన్వేషిస్తే - మాంసంలో పీచు పదార్థం కానీ, సంరక్షించే ఇతర పోషకాలు కానీ ఉండవు.

పెపైచ్చు, మాంసంలో యానిమల్ ప్రోటీన్, శ్యాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. మాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, హెచ్చు ఉష్ణోగ్రతల్లో వండుతున్నప్పుడు క్యాన్సర్ కారకాలైన హెటెరో సైక్లిక్ ఎమైన్స్ (హెచ్‌సీఏ), పాలీ సైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్) ఏర్పడతాయి. అవి క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. ప్రాసెస్డ్ మాంసంలోని అతి కొవ్వు, ఇతర జంతు ఉత్పత్తుల వల్ల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దాని వల్ల వక్షోజ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.
 
ఇలాంటి క్యాన్సర్లు కూడా ...
గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివి అతిగా తిన్నా, ప్రాసె్‌స్డ్ మాంసాన్ని అతిగా తిన్నా అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమం (ప్యాంక్రియాస్), పొట్ట, గర్భాశయం లోపలి పొర, ప్రొస్టేట్ గ్రంథులకు క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుందని ‘అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్’ వెల్లడించింది.
 
ప్రాసెస్డ్ మాంసంతో పురీషనాళ క్యాన్సర్
ఇటీవలి కాలంలో పురీషనాళ క్యాన్సర్ (కోలో రెక్టల్ క్యాన్సర్) ఎక్కువవుతోంది. ప్రాసెస్డ్ మాంసం అతిగా తీసుకొన్నా, అతిగా ఉడికించిన మాంసాన్ని భుజించినా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ప్రాసెస్డ్ మాంసంతో ఎందుకు ముప్పంటే, మాంసం పాడవకుండా ఉండడానికి సహజంగా కానీ, కృత్రిమంగా కానీ నైట్రైట్లు, నైట్రేట్ల లాంటి లవణాలను చేరుస్తారు. అవి మాంసంలోని పదార్థాలతో రియాక్ట్ అయి క్యాన్సర్ కారక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మన డీఎన్‌ఏను దెబ్బ తీస్తాయి. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్డ్ మాంసం తినడం వల్ల పురీష నాళ క్యాన్సర్ వచ్చే రిస్క్ 18 శాతం పెరుగుతుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది.
 
గ్రిల్డ్ మాంసంతోనూ చిక్కే!
నేరుగా నిప్పుల మీద మాంసాన్ని వేయించడం (గ్రిల్డ్ మాంసం), కాల్చడం వల్ల కొవ్వు ఆ వేడి నిప్పుల మీదకు చేరుతుంది. దాంతో, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్)తో నిండిన మంటలు వస్తాయి. సదరు పీఏహెచ్‌లు ఆహారం తాలూకు ఉపరితలానికి అంటుకుంటాయి. వేడి పెరిగిన కొద్దీ మరిన్ని పీఏహెచ్‌లు వస్తాయి. దాంతో, ఉదర సంబంధమైన క్యాన్సర్లు వచ్చే రిస్కు పెరుగుతుంది.
 
అతి కొవ్వుతో రొమ్ము క్యాన్సర్
కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు, వేపుడు ఆహారపదార్థాలు తినడం వల్ల స్త్రీలలో మరింతగా ఈస్ట్రోజెన్స్ ఉత్పత్తి అవుతాయి. వక్షోజాలలో, స్త్రీల సెక్స్ హార్మోన్లకు స్పందించే ఇతర అవయవాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించాలంటే- మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా అధిక కొవ్వు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. అయితే మాంసాహారం తక్కువ కావడం వల్ల విటమిన్ బి-12, విటమిన్-డి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించి మితం హితం అన్న జాగ్రత్త తీసుకోవాలి.

అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువ
- హార్వర్డ్ వర్శిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement