Cancers
-
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.. పరాకు వద్దు
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్‌లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్‌ను క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌కు లాగానే ఈ క్యాన్సర్స్కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్‌కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ. నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్నూ, గ్రేడింగ్‌లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది. లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్. పారానేసల్ సైనసెస్తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్‌లు. లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు. మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్‌కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్‌కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్‌కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్‌ఏటీ, ఐఎమ్ఆర్టీ, ఐజీఆర్టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్‌కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్డ్ ట్రీట్మెంట్గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్‌లో ఉండాలి. మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం. - డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు: 9849022121 -
సెనోలిటిక్స్.. వయసుపై యుద్ధం!
జాతస్య హి ధ్రువో మృత్యు... పుట్టిన వాడు గిట్టక తప్పదు! అందరికీ తెలిసిన సత్యం ఇది.కానీ బతికినన్ని రోజులూరోగాలు దరిచేరకుండా ఉంటే?కనీసం వాటితో వచ్చే నొప్పి, సమస్యలు తక్కువగా ఉంటే? ఎంతో బాగుంటుంది కదూ! అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ఈ అద్భుతం సాకారం కానుంది. సెనోలిటిక్స్... ఈ పదం ఎప్పుడైనా విన్నారా? వయసు మీదపడ్డాక వచ్చే సమస్యలను తగ్గించే మందులను సెనోలిటిక్స్ అని పిలుస్తున్నారు. వయసును జయించేందుకు.. చిరాయువుగా ఉండేందుకు శతాబ్దాలుగా మనిషి ప్రయత్ని స్తున్నప్పటికీ ఈ విషయంలో సాధించింది కొంతే. కానీ 1961లో సెనెసెంట్ కణాలను గుర్తించాక ఈ పరిస్థితిలో మార్పొచ్చింది. ఏమిటీ సెనెసెంట్ కణాలు? సాధారణ పరిభాషలో చెప్పాలంటే సెనెసెంట్ కణాలను వయసైపోయిన కణాలు అనొచ్చు. ఏర్పడ్డ క్షణం నుంచి గిట్టేంత వరకూ శరీర కణాలు నిత్యం విభజితమవుతుంటాయి. అయితే ఒక దశ దాటాక కణాల శక్తి నశించి విడిపోకుండా ఉండిపోతాయి. కాలక్రమంలో ఈ కణాలు శరీరంలో ఎక్కువ అవుతుంటాయి. ప్రతి అవయవం, వ్యవస్థకు చెందిన సెనెసెంట్ కణాలు పోగుబడటం వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు.. సెనెసెన్స్ దశకు చేరుకున్న కణం తనంతట తాను నశించిపోయే ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. అప్టోసిస్ అని పిలిచే ఈ ప్రక్రియ సక్రమంగా పనిచేయకపోతే సమస్యలు వస్తాయి. ఈ రెండు సమస్యలను పరిష్కరించ గలిగితే.. అంటే సెనెసెంట్ కణాలు బయటకు వెళ్లిపోయేలా చేసినా.. అప్టోసిస్ సక్రమంగా పనిచేసేలా చేసినా.. వృద్ధాప్య సమస్యలను అధిగమించినట్లే! కేన్సర్‌ను అడ్డుకునేందుకూ... ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సెనొలిటిక్ మందులు శరీరంలోని సెనెసెంట్ కణాలను సులువుగా తొలగిస్తాయి. అయితే వాటిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నందున వాటి విస్తృత వాడకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిజానికి సెనెసెంట్ కణాలతో ఎప్పుడూ నష్టమే జరగదు. విభజన చేతకానంత దెబ్బతిని ఉంటే కణం పెరగడం ఆగిపోతుంది. కొన్నిసార్లు కేన్సర్ కారక జన్యుమార్పులను కట్టడి చేసేందుకూ కణాలు సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అడ్డూఅదుపు లేకుండా కణాలు విభజితం కావడమే కేన్సర్ అన్నది తెలిసిందే. గాయాల వల్ల దెబ్బతిన్న కణాలు కూడా సెనెసెంట్ దశకు చేరుకుంటాయి. అయితే ఈ క్రమంలో కణాలు తమ చుట్టూ ఉన్న ఇతర కణాలకు నష్టం కలిగించే ప్రొటీన్లు, పదార్థాలను విడుదల చేస్తుంటాయి. ఫలితంగా మంట/వాపు వంటివి ఏర్పడి చివరకు చుట్టూ ఉన్న కణాలు మరణిస్తాయి. కణాలు అప్టోసిస్ను నిరోధించినా, నష్టం కొనసాగినా ఆర్థరైటిస్, మధుమేహం, గుండె జబ్బుల్లాంటివి వస్తాయని అంచనా. తొలగిస్తే ప్రయోజనాలు... 2004లో మేయో క్లినిక్‌కు చెందిన జేమ్స్ కిర్క్ల్యాండ్ సెనెసెంట్ కణాలపై కొన్ని పరిశోధనలు చేపట్టారు. ఆయుష్షును పెంచేందుకు జరిగిన ప్రయోగాల్లో ఎలుకల్లోని సెనెసెంట్ కణాలు మాయమవడాన్ని గుర్తించారు. ఇదే పనిని మందుల సాయంతో ఎలా చేయాలో తెలుసుకునేందుకు జరిపిన ప్రయోగాల కారణంగా డసాటినిబ్, క్యుర్సెటిన్ అనే రెండు మందుల గురించి తెలిసింది. డసాటనిబ్ కేన్సర్ మందు. క్యుర్సెటిన్ అనేది కొన్ని పండ్లు, కాయగూరల్లో సహజసిద్ధంగా లభిస్తుంది. ఈ రెండూ తొలి సెనోలిటిక్ మందులయ్యాయి! ఇవి సెనెసెంట్ కణాలు జీవించి ఉండేందుకు కారణమైన వాటిని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయని, ఫలితంగా ఈ కణాలు నశించిపోతాయని తెలిసింది. అయితే కొన్ని కణాలు ఈ రెండింటికీ లొంగని నేపథ్యంలో మరిన్ని సెనోలిటిక్ మందుల కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. 2015లో నావిటోక్లాక్స్ అనే మందు రేడియోధార్మికత బారినపడ్డ ఎలుకల్లోనూ సెనెసెంట్ కణాలను నశింపజేస్తున్నట్లు స్పష్టమైంది. దాంతోపాటు సెనెసెంట్ దశకు చేరుకున్న మూలకణాలు మళ్లీ చైతన్యవంతమైనట్లు ఈ ప్రయోగాల తరువాత తెలిసింది. ప్రస్తుతం అల్జీమర్స్, కీళ్లనొప్పులు, మాస్కులర్ డీజనరేషన్, చిన్నతనంలోనే కేన్సర్‌ను ఎదుర్కొని శరీరంలో భారీ మొత్తంలో సెనెసెంట్ కణాలు కలిగి ఉన్న వారిపైనా నావిటోక్లాక్స్ను ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు అంధత్వ నివారణతోపాటు వెన్నెముక గాయాలకు చికిత్సగా ఉపయోగపడే సెనోలిటిక్ మందులపైనా ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ లీచెస్టర్ నేతృత్వంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సెనెసెంట్ కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేసే యాంటీబాడీలను తయారు చేసేందుకు ఈ నెలలోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఆడుతూ పాడుతూ వయసును దాటేయవచ్చు. ఆ తరువాత ఏమిటన్నది మాత్రం తెలియకపోవడం కొసమెరుపు! -
ఆరోగ్యశ్రీ చరిత్రలో కొత్త అధ్యాయం
-
ఇక రాష్ట్రంలో ఆరోగ్య విప్లవం
అందరూ బాగుండాలి. అన్ని ప్రాంతాలూ బాగుండాలి. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్ముతున్నా. ఆ దిశలోనే రాష్ట్రంలో పాలన పరంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఉండేలా, ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా అందరి అభివృద్ధికి ఉపయోగిస్తాం. ప్రతి నిర్ణయం ఇదే ప్రాతిపదికన జరుగుతోంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం అని, ఈ దిశగా దేశంలోని 28 రాష్ట్రాలకన్నా మిన్నగా మరో అడుగు ముందుకు వేస్తూ.. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఆయన ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య రంగానికి సంబంధించి పలు వరాలు ప్రకటించారు. ఏలూరు ఆశ్రం, శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారికి భరోసా అందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికామని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏం మాట్లాడారంటే.. విప్లవాత్మక మార్పులు కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం ప్రారంభించిన రెండో కార్యక్రమం ఇది. జనవరి 1వ తేదీన సుమారు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాం. రెండవ కార్యక్రమంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు 2,059కి పెంచుతూ పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఇది అన్నింటికన్నా సంతృప్తిని ఇచ్చే కార్యక్రమం. ఇంతకు ముందు నాన్నగారు, దివంగత మహానేత రాజశేఖరరెడ్డి.. దేశ ఆరోగ్య చర్రితలోనే ఒక విప్లవాత్మకక పథకంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ పథకాన్ని దేశంలోని 28 రాష్ట్రాల కంటే మిన్నగా మరో అడుగు ముందుకు వేసి అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నా. పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నా. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ 1,059 రోగాలకు మాత్రమే పరిమితమైంది. గత ప్రభుత్వంలో వీటిని కూడా పట్టించుకోని పరిస్థితులను మనమంతా చూశాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందుకే ఏడు నెలలుగా ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తూ అడుగులు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ రోజు (శుక్రవారం) ఇక్కడ పైలెట్ ప్రాజెక్టుగా 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నెలలపాటు ఈ పైలట్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అదనంగా 200 రోగాలకు చికిత్సను విస్తరిస్తూ 1,259 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స అందిస్తాం. రోగులకు మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే మూడు నెలల్లో వాటిని అధిగమించి ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాకు విస్తరిస్తూ వెళతాం. సచివాలయాల పరిధిలోకి ఆశా వర్కర్లు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అడుగు ముందుకు వేసి 1,259 రోగాలకే కాకుండా ఏకంగా 2,059 రోగాలకు వైద్యం అందించేలా పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా ఏటా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నాం. ఈ మేరకు కోటి 42 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మెడికల్ అసిస్టెంట్, పీహెచ్సీలో ఉన్న ఆరోగ్యమిత్రలు ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ఎక్కడికి వెళ్లాలి, ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలి అనే గైడెన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 వేల నుండి 50 వేల మంది ఆశావర్కర్లను గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకువచ్చి వారికి 300 – 350 ఇళ్లను కేటాయిస్తాం. ఈ ఇళ్లకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలు వారి చేతిలో పెడతాం. ఆశా అక్క, చెల్లెమ్మ తోడుగా, జగనన్న అండగా ఉన్నాడు అనే మాట వినిపించేలా చేస్తాం. మహిళకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డును అందిస్తున్న వైఎస్ జగన్, చిత్రంలో మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత ఆరోగ్యశ్రీ చరిత్రలో కొత్త అధ్యాయం – నవంబర్ 1న చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా రాష్ట్రం వెలుపల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను వర్తింప చేశాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 150 ఆసుపత్రుల్లో సేవలు అందేలా చర్యలు తీసుకున్నాం. – ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రోగులు విశ్రాంతి తీసుకునే సమయంలో తోడుగా ఉండాలనే తపన, తాపత్రయంతో రోజుకు రూ.225, నెలకు రూ.5000 చొప్పున డాక్టర్లు ఎన్ని నెలలు విశ్రాంతి తీసుకోమంటే అన్ని నెలలు సాయం అందించే కార్యక్రమానికి డిసెంబర్ నుంచి శ్రీకారం చుట్టాం. – పుట్టుకతోనే వినికిడి లోపం, మూగ, చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్ చేయాలంటే ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దీన్ని ఎలా కత్తిరించాలని చూసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కేవలం ఒక చెవికి మాత్రమే ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని మారుస్తూ రెండు చెవులకు ఆపరేషన్ చేసే విధంగా డిసెంబర్ 1న ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాగైతే ఒక్కొక్కరికి రూ.10 లక్షల నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినా పర్వాలేదని చిన్నారులకు తోడుగా ప్రభుత్వం ఉంటుందని గట్టిగా భరోసా ఇచ్చాం. – జనవరి 1వ తేదీ నుంచి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో తీసుకువచ్చాం. ఇందుకు హెల్త్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏప్రిల్ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీపీఎం స్థాయిలో మందుల నాణ్యత ఉండేలా చూస్తాం. – డయాలసిస్ పెషేంట్లందరికీ నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇస్తున్నాం. ఇదే విధంగా తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫిలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికి రూ.10 వేల పెన్షన్ వచ్చే నెల మొదటి తేదీ వారి చేతుల్లో పెడతాం. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికో, కుర్చీకో పరిమితమైన వారు ప్రతి ఊళ్లో కనిపిస్తున్నారు. ఇలాంటి వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ఫిబ్రవరి 1 నుంచి శ్రీకారం చుడుతున్నాం. కుష్టు వ్యాధిగ్రస్తులకు కూడా ఫిబ్రవరి1 నుంచి రూ.3 వేలు పెన్షన్ ఇస్తాం. – రెండు నెలల కిందట ఏలూరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది వచ్చి కలిశారు. అన్నా.. చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మేం చేసే పనులు ఎవరు చేయలేరన్నా, అయినా మా జీతాలు ఇంతేనన్నా అని చెప్పి బాధపడ్డారు. అందుకే జనవరి ఒకటి నుంచి వారి వేతనాలు రూ.16 వేలకు పెంచుతున్నాం. – నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా మూడేళ్లలో దశల వారీగా అన్ని ఆసుపత్రులను మార్చబోతున్నాం. ఫిబ్రవరి 1వ తేదీన 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాల రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తాం. జాతీయ స్థాయి ప్రమాణాలకు సమానంగా అభివృద్ధి చేస్తూ నాడు– నేడు కార్యక్రమం నిర్వహిస్తాం. – ఇప్పుడు 108, 104 వాహనాలకు ఫోన్ కొడితే వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని నెలాఖరుకల్లా మార్చబోతున్నాం. అక్షరాల 1061 కొత్త అంబులెన్స్ వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. మీరు ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోపే కొత్త అంబులెన్స్‌లు మీ దగ్గరకు వచ్చి ఎక్కించుకుని ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించి తిరిగి చిరునవ్వుతో మళ్లీ మిమ్మల్ని ఇంటి దగ్గర దింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. – నెట్వర్క్ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడేలా గ్రేడింగ్ విధానం ప్రవేశపెడతాం. మే నెలాఖరుకు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు, నర్సుల పోస్టులు, మిగిలిన అన్ని రకాలు పోస్టులను పూర్తిగా భర్తీ చేస్తాం. ప్రభుత్వాసుపత్రులలో వైద్యులు, నర్సులు లేరనే మాట వినిపించకుండా చేస్తాం. – పలాస, మార్కాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పరిశోధనా కేంద్రాలు (ఆసుపత్రులు) తీసుకొస్తాం. పలాసలో ఇప్పటికే టెండర్లు పిలిచాం. మరో నెల రోజుల్లోపే పనులు మొదలవుతాయి. మర్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు, ఏలూరు, విజయనగరం, పులివెందులల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. వీటికి సంబంధించి కూడా డ్రాయింగ్స్ తయారవుతున్నాయి. మరో ఆరు వారాల్లో ఇవన్నీ పూర్తి చేసుకుని.. ఆ తర్వాత ఒక నెలలో టెండర్లు పిలుస్తాం. అనంతరం రెండున్నర నెలల్లోనే పనులు ప్రారంభిస్తాం. అవ్వాతాతలకు కంటి వెలుగు గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాం. దాదాపు 66 లక్షల మంది బడి పిల్లలకు కంటి వెలుగు ద్వారా పూర్తిగా స్క్రీనింగ్ చేశాం. లక్షా 47 వేల మంది పిల్లలకు కళ్ల జోళ్లు ఇచ్చాం. 45 వేల మందికి ఆపరేషన్ చేయిస్తున్నామని సగర్వంగా చెబుతున్నా. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అవ్వాతాతలను కంటి వెలుగు కార్యక్రమానికి తీసుకువెళ్తాం. ఆరు నెలల పాటు వారికి కేటాయించి, స్క్రీనింగ్ చేసి, ఉచితంగా ఆపరేషన్లు చేయించి, కళ్లజోళ్లు పంపిణీ చేస్తాం. కంటివెలుగు స్టాల్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇకపై పిల్లలకు జగన్ మామ అండ మన పిల్లలు బాగా చదవాలి. భావితరాలతో పోటీ పడాలని, వారి జీవితాలు మార్చాలని ఈ నెల 9వ తేదీన అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ పిల్లలను చదివించడం కోసం తల్లులు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి తల్లికి జగనన్న తోడుగా ఉంటూ ఆ ప్రతి చిన్న పిల్లాడికి, చిన్న పాపకు జగన్ మామ తోడుగా ఉన్నాడని ఈ వేదిక మీద నుండి తెలియచేస్తున్నా. ప్రతి గవర్నమెంట్ స్కూల్‌ను ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా మారుస్తాం. అమ్మఒడి కార్యక్రమం, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ల రూపు రేఖలు పూర్తిగా మార్చబోతున్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లలకు మధ్యాహ్నం పెట్టే భోజనం మెనూ కూడా మారుస్తున్నాం. నవరత్నాలతో సహా అన్ని పథకాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు.. పేదరికంలో ఉన్న ఇతర వర్గాల వారందరికీ అందాలి. ఆ దిశగానే పాలన సాగిస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అనంతరం నలుగురికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు, ప్రత్యేక పింఛన్లు మంజూరు చేస్తూ ఇద్దరికి లేఖలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్ల సంఘం తరఫున మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి కోటి రూపాయల విరాళం అందించారు. ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకష్ణ శ్రీనివాస్, నారాయణస్వామి, తానేటి వనిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంచి వైద్యం అందుతోంది.. వైద్యులకు కృతజ్ఞతలు ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇద్దరు రోగులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రి నుంచి అనంతలకిŠష్ అనే రోగి మాట్లాడుతూ.. అనారోగ్యం పాలై వైద్యం కోసం చాలా ఇబ్బంది పడ్డామని, అప్పుల పాలయ్యామని చెప్పారు. అలాంటి తమకు ఇప్పుడు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతోందన్నారు. సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించామని, ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు 1059 వ్యాధులకు చికిత్స చేస్తుండగా, ఇప్పుడు మరో 1,000 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తద్వారా రోగులకు మరింత వైద్య సహాయం అందుతుందన్నారు. అనంతరం శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రి నుంచి పొన్నాడ సింహాచలం అనే రోగి మాట్లాడగా.. ఆయన ఆరోగ్యం, చికిత్స అందుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. ‘ఇప్పుడు మీరు పొందుతున్న ప్రొసీజర్, మోకాలి చిప్పకు సంబంధించినది. గతంలో ఇది ఆరోగ్యశ్రీలో లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చాం. ఆపరేషన్‌తో పాటు, మీరు ఇంటికి వెళ్లిన తర్వాత వైద్యులు సూచించినంత కాలం మీకు ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున సహాయం చేస్తుంది. వైద్యులు కూడా మంచి సేవలందిస్తున్నందుకు అభినందనలు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇకపై ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్ చికిత్సను కూడా చేరుస్తున్నాం. ఇవాళ క్యాన్సర్ చికిత్స పరిస్థితి ఎలా ఉందంటే ముష్టి వేసినట్లు కాస్తో కూస్తో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్లుగా ఉంది. అన్ని రకాల క్యాన్సర్లకు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అడుగులు వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని రకాల క్యాన్సర్ పేషెంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వమే భరిస్తుంది. చికెన్‌గున్యా, వడదెబ్బ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వాటికి ఇంతకు ముందు వేలకు వేలు డాక్టర్లు పిండి వసూలు చేసే పరిస్థితి ఉండేది. ఇక మీదట ఆ పరిస్థితి ఉండదు. 1,259 రోగాల్లో భాగంగా వీటన్నింటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ కార్డులపై క్యూ ఆర్ బార్ కోడ్ ఇస్తున్నాం. బ్లడ్ టెస్టో, ఎక్స్రేనో, లేదా సిటీ స్కానో తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారి ఆ రిపోర్ట్‌ల కోసం వెతుక్కునే పని లేకుండా మొత్తం మెడికల్ రిపోర్టులన్నీ ఆ కార్డులో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు నేటి నుంచే కార్డులు పంపిణీ చేస్తున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా అర్హత ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ కార్డులను అందజేస్తాం. -
చిన్నపిల్లల్లో వచ్చే లుకేమియాను నివారించే తల్లి పాలు
చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో తేలింది. చిన్నపిల్లలో వచ్చే క్యాన్సర్లలో రక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతం ఉంటాయి. దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే కనీసం ఆర్నెల్ల పాటైనా తల్లిపాలు తాగిన వారిలో బ్రెస్ట్ మిల్క్ ఈ బ్లడ్‌క్యాన్సర్లు వచ్చే అవకాశాలను 14 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గిస్తుందని తేలింది. కేవలం క్యాన్సర్ల నివారణ మాత్రమేగాక... తల్లిపాలు అకస్మాత్తుగా కారణం తెలియకుండా పిల్లలు మృతిచెందే కండిషన్ అయిన సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్), చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని తేలింది. అంతేకాదు... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువని తేలింది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జామా పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే క్యాన్సర్లు
నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అమాయకత్వం ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయడానికి ఒక కారణమైతే... బిజీలైఫ్, అందుబాటులో ఉండే మెడికల్ షాప్‌లు, ఫోన్లలోనే డాక్టర్ సలహాలు, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, పెయిన్‌కిల్లర్స్, ఇంటర్నెట్ సమాచారం అనారోగ్య లక్షణాలకు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చి సమస్యను తీవ్రం చేసే మరొక అంశమని చెప్పవచ్చు. వేడి చేసిందనీ, పడని ఆహారం తీసుకున్నామనీ, ప్రయాణాల వల్ల అని, అలసట అని, ఎప్పుడో తగిలిన దెబ్బల చిహ్నాలంటూ భ్రమపడట వల్ల అనీ, వయస్సు పైబడే కొద్దీ కనిపించే లక్షణాలే అంటూ సర్దుకుపోవడం... ఇలా కారణాలేమైనప్పటికీ అవి క్యాన్సర్‌కు ప్రమోషన్ ఇచ్చి లేటు దశలో గుర్తించే పరిస్థితులే చాలా సందర్భాల్లో ఏర్పడుతుంటాయి. అవగాహన పెంపొందించుకుని తొలిదశలోనే కనుగొంటే ఆధునిక వైద్యంలో ఏ సవాలుకైనా సమాధానం లభిస్తుంది. రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్సావిధానాలు రెండూ వైద్యరంగానికి కొత్తదనాన్ని సంతరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాయి. క్యాన్సర్ చికిత్స విధానాలన్నీ ఏ దశలో వ్యాధి కనుగొన్నామనే అంశం మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందుకే సాధారణ లక్షణాలూ కొంత ఎక్కువ కాలం కొనసాగినప్పుడు రోగి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి. అందుకే సాధారణ లక్షణాలే ఒక్కోసారి క్యాన్సర్లను ఎలా పట్టిస్తాయో తెలుసుకోవడం మంచిది. తలనొప్పి: చికాకు, పనుల ఒత్తిడి, ఎండ, కొన్ని వాసనలు, ఆకలి వంటి కారణాలతో మైగ్రేన్ లేదా తలనొప్పి అప్పుడప్పుడు రావడం చాలా సహజమే. తలనొప్పికి కారణం తెలుసుకోవడం, మైగ్రేన్ అయితే నిర్దిష్టకాలం పాటు సరైన మందులు వాడితే సమస్య తగ్గుతుంది. ఉదయం లేవగానే తలభారం, తీవ్రమైన నొప్పి, వాంతులు కావడం, వికారం లాంటి లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతం కావచ్చు. గొంతునొప్పి: చల్లటి పదార్థాలు, వాతావరణం, కొత్తప్రదేశం, తాగేనీరు మారాయి అందుకే గొంతు బొంగురు, నొప్పి అని బాధపడే వారిని చాలామందినే చూస్తుంటాం. రెండుమూడు రోజుల్లో తగ్గకపోతే మందులు కోర్సుగా వాడటం లాంటి ప్రయత్నాలు చేశాక కూడా ఆ సమస్య బాధిస్తుంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. థైరాయిడ్ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ లక్షణాలు తొలిదశలో ఇలాగే ఉంటాయి. దగ్గు, ఆయాసం: ముఖ్యంగా సిగరెట్టు తాగేవారు మాకు ఇలాంటి లక్షణాలు అలవాటే అనుకుంటారు. కానీ వీరికి లంగ్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల ఇతర క్యాన్సర్లు వచ్చే ముప్పు ఎక్కువ అని గ్రహిస్తే మంచిది. గొంతులో నస, ఆగని దగ్గు, కళ్లె/తెమడలో రక్తం, ఆయాసం వంటివి టీబీ లేదా లంగ్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. కడుపు ఉబ్బరం, మంట: వేళకు ఆహారం తీసుకోకపోవడం, కంటికి ఇంపుగా నోరూరించే అనారోగ్య పదార్థాలు, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో మనలో చాలా మంది కడుపులో మంట, తేన్పులు, ఉబ్బరం, ఆకలి తగ్గడం, వికారం వంటి లక్షణాలను తరచూ చూస్తున్నారు. ముందు సరైన జీవనశైలి అలవరచుకుని నీరు, పీచు ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నప్పటికీ, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటే ఎండోస్కోపీ, స్కానింగ్ లాంటి పరీక్షలతో జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, కాలేయం, పాంక్రియాస్, గాల్‌బ్లాడర్ క్యాన్సర్లను తొలిదశలోనే కనుగొనే అవకాశం ఉంది. మూత్రవ్యవస్థలో తేడాలు: మూత్రంలో రక్తం పడటం, ఆగిఆగిరావడం, మంటగా ఉండటం మొదలైన లక్షణాలు కనిపించినప్పుడు తమకు వేడిచేసిందని కొందరు భ్రమిస్తూ ఉంటారు. సాధారణంగా నీళ్లు తక్కువ తాగడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటి కారణాలవల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మరీ తీవ్రంగా ఉండి చికిత్సలకు లొంగకపోతే యూరినరీ బ్లాడర్‌కు సంబంధించిన క్యాన్సర్ కావచ్చని అనుమానించాలి. 50 ఏళ్లపైబడిన పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్ లక్షణాలు ఈ విధంగానే ఉండవచ్చు. నెలసరిమధ్య రక్తస్రావం, పొట్టభారంగా ఉండటం, ఆకలి మందగించడం, స్త్రీల నెలసరి ముందు ఉండే సమస్యలుగా పొరబడవచ్చుగానీ కొన్ని సందర్భాల్లో ఒవేరియన్, యుటిరైన్ క్యాన్సర్లు కూడా అయ్యే అవకాశాలుంటాయి. మలవిసర్జనలో తేడాలు: అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు ఆహారపు అలవాట్లు మారినప్పుడు పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి సమస్యలున్నప్పుడు కనిపించవచ్చు. కానీ మలవిసర్జన సమయంలో ఎప్పుడూ రక్తం పడుతుంటే మాత్రం దాన్ని పైల్స్ అనుకుంటే పొరబాటు పడుతున్నట్లే. దక్షిణభారతదేశంలో పురుషుల్లో ఎక్కువగా కనిపించే కోలన్ క్యాన్సర్ లక్షణాలు కూడా కావచ్చు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలతో సమస్య ఏమిటో తెలిసిపోతుంది. అసలు విషయాన్ని గమనించక రకరకాల ఆహార పదార్థాల వల్ల ఈ సమస్య తలెత్తోందంని ఇతర అంశాలకు దీన్ని ఆపాదించుకుంటాం. ఆహార పదార్థాలు మార్చి మార్చి తీసుకుంటూ ఇబ్బందిపడే కంటే సరైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. తీవ్రమైన అలసట, ఆకలి, బరువు తగ్గడం, వీడని జ్వరం ఇంకా ఆయా అవయవాలకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే పూజలు, మంత్రాలు, విభూది, తాయెత్తులు, దిష్టితీయడాలు వంటి అనేక మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి. ఇలాంటివి చేస్తూ ఉండే ఫలితం కనిపించకపోగా అసలు సమస్య బయటపడే సమయానికి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ అసలు భాగం నుంచి ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు లొంగకుండా తయారుకావచ్చు. ప్రతినెలా కనిపించే గడ్డలే అనీ, పాలగడ్డలనీ రొమ్ములో దీర్ఘకాలం పాటు కనిపించే కణుతులను అశ్రద్ధ చేస్తే కణితి ఇతర భాగాలకు పాకే ప్రమాదం పొంచిఉంటుంది. అలసట, చర్మం మీద ఊదారంగు మచ్చలు, తేలికగా కమిలిపోవడం వంటివి బ్లడ్‌క్యాన్సర్‌ను హెచ్చరించవచ్చు. గోళ్లలో మార్పులు, ముందుకు వంగి ఉండటం లివర్ / లంగ్ క్యాన్సర్లకు సూచన కావచ్చు. శరీరం మీద మచ్చలు, వాటిలో మార్పుల మీద కూడా ఒక కన్నేసి ఉంచితే మంచిది. ఒత్తిడికి గురైనప్పుడు, వాతావరణం, ఆహారం మారినప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు దాదాపుగా అందరూ ఎదుర్కొనేవే. అయితే తీవ్రంగా ఉన్నప్పుడు కూడా అవే కారణాలని భ్రమపడి ముందు వాడిన మందులనే మళ్లీ వాడుకుంటూ కాలయాపన చేస్తే సమస్యలను మనమే తీవ్ర చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే చాలావరకు క్యాన్సర్ ముదిరాకే చికిత్సకు వస్తూ ఉంటారు. అదృష్టవశాత్తూ గత కొంతకాలంగా హెల్త్‌చెకప్స్ చేయించుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం ఒక శుభపరిణామం అని చెప్పవచ్చు. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
మహిళల పునరుత్పత్తి వ్యవస్థ క్యాన్సర్లు
గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపై అమ్మాయిలకు అవగాహన లేక వేయించుకోక పోవడం ఒక కారణమైతే, పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హెచ్.పి.వి. వైరస్ ఎక్కువగా ఉండటం వంటివి మరిన్ని ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే పెళ్లి కాని అమ్మాయిలూ లేదా పెళ్లి అయినా ఈ క్యాన్సర్ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత మూడు డోసులు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే సెర్విక్స్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలగుతాము. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్ స్త్రీలలో ప్రధానంగా ఉన్నా వ్యాక్సిన్స్ వేయించుకోవటం వల్ల, పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకుని ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి చికిత్స తీసుకోవటం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడకుండా, ఒకవేళ గురయినా చికిత్సతో బయటపడే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం కొంతవరకు మంచిపరిణామం అని చెప్పుకోవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హెచ్.పి.వి. వైరస్‌లో 16, 18 రకాలు, అవి సోకకుండా వ్యాక్సిన్స్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అరుదుగా ఇతర కారణాలవల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకనే డాక్టర్ సలహా మేరకు అప్పుడప్పుడు పాప్స్మియర్స్ చేయించుకుంటూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలం. ఇంకా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏయే క్యాన్సర్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి? ఒకసారి తెలుసుకుందాం. అండాశయాల (ఒవేరియన్) క్యాన్సర్ స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్ తర్వాత ఈ క్యాన్సరే ఎక్కువ. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా లేటుగా గుర్తించగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్‌గా పేర్కొంటారు. పిల్లలు కలగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. మొదట్లో లక్షణాలు అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని పొరబడటం వల్ల తొలిదశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తించలేకపోవచ్చు. లక్షణాలు: ∙పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు యోని స్రావాలు అసాధారణంగా, మూత్రం ఎక్కువగా రావటం అలసట, జ్వరం, సీఏ 125 రక్త పరీక్ష, అల్టాస్రౌండ్ స్కానింగ్లతో ఈ క్యాన్సర్ ను నిర్ధారణ చేయవచ్చు. యుటెరైన్ లేదా ఎండోమెట్రియల్ లేదా గర్భాశయ క్యాన్సర్ గర్భసంచిలో ఉండే లైనింగ్ ఎండోమెట్రియవ్ు, ఈ పొర మరీ పలుచగానూ లేదా 14 మి.మీ. కంటే ఎక్కువగా మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉండటం, రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండటం, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభం కావడం, మెనోపాజ్‌కు చేరుకున్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ కు గురయ్యే ముప్పు ఎక్కువ. 50 నుండి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది. అందుకనే మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కన్పించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘‘ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి, ఎవ్వరితో చెప్పుకోను’’ అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ అది మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌కు టొమాక్సిఫెన్ మందు వాడిన స్త్రీలు, పెల్విస్‌కు రేడియేషన్ తీసుకున్నవారు, హార్మోన్ థెరపీ దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. నెలసరి మధ్యలో, మెనోపాజ్ దశ దాటాక రక్తస్రావం కన్పిస్తే అల్టాస్రౌండ్, హిస్టిరోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి. వెజైనల్ అండ్ వల్వా క్యాన్సర్ ఇది స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి బయటకు కన్పించే అవయవం, యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్ అరుదుగా కన్పించేవే కాని ఈ అవయవాలు క్యాన్సర్‌కు గురయితే ట్రీట్మెంట్ ఇవ్వటం మరింత కష్టతరం, క్యాన్సర్‌ను అదుపులో పెట్టి జీవితకాలం పెంపొందించటమూ అంత సులువేమి కాదు. మెనోపాజ్ వయస్సులో థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో, హెచ్.పి.వి. వైరల్, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘‘లైకస్ స్లీ్కరోసిస్’’ అనే చర్మవ్యాధి వల్ల స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలతో కూడిన మచ్చలు పడతాయి. ఆ మచ్చలు ‘వల్వార్ కార్సినోమా’ అనే చర్మ సంబంధ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ‘లైకస్ స్లీ్కరోసిస్’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా క్యాన్సర్ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే స్త్రీలు పాప్‌స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ∙పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం అసాధారణమైన యోనిస్రావాలు, రక్తస్రావం ∙కలయిక సమయంలో రక్తం కన్పించడం ∙నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం ∙అలసట, జ్వరం, బరువు తగ్గటం. గైనకాలజికల్ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియోథెరపీలను తీసుకోవటంతో ఈ క్యాన్సర్లను అదుపులో ఉంచటం సాధ్యమే. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
అబ్బే.. వాటితో కేన్సర్ రాదు!
మొబైల్‌ఫోన్ ఎక్కువగా వాడితే కేన్సర్ వస్తుందట! ఇంటిపైకప్పులపై ఉండే టవర్లతో తలనొప్పులు.. కేన్సర్లు! ఇలాంటి వార్తలు చూసి బెంబేలెత్తిపోయారా? ఇకపై అలా భయపడాల్సిన అవసరం లేదంటోంది అమెరికా ప్రభుత్వపు నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రామ్! మగ ఎలుకల్లో కొన్ని రకాల కేన్సర్లకు మొబైల్ రేడియోధార్మికత కారణమవుతున్నా.. మనుషుల దగ్గరికొచ్చేసరికి ఇది అసాధ్యమని ఈ సంస్థ శాస్త్రవేత్తలు తేల్చేశారు. సుమారు పదేళ్ల పాటు అధ్యయనం జరిపి మరీ తాము ఈ నిర్ధారణకు వచ్చామని చెబుతున్నారు. మొబైల్ఫోన్లకు కేన్సర్‌కు ఉన్న లింకుపై నిగ్గు తేల్చేందుకు అమెరికన్ నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రామ్ పదేళ్ల కింద ఒక పరిశోధన చేపట్టింది. కొన్ని మగ ఎలుకలను రేడియోధార్మికతకు గురిచేసి పరిశీలనలు జరిపారు. 2జీ, త్రీజీ ఫోన్ల నుంచి వెలువడే 900 మెగాహెర్ట్జ్ కంటే 4 రెట్లు ఎక్కువ తీవ్రతతో కూడిన రేడియో తరంగాలను ఎలుకలపై ప్రయోగించినప్పుడు గుండె, మెదడుతో పాటు కొన్ని ఇతర గ్రంథుల్లో కేన్సర్ కణితులు ఏర్పడ్డాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెక్కాన్వే అంటున్నారు. అయితే అన్ని రకాల ఎలుకల్లోనూ ఇదే రకమైన ఫలితాలు కనిపించకపోవడం.. ఆడ ఎలుకల్లోనూ వేరుగా ఉండటం గమనార్హం. 4జీతో తక్కువ అవకాశం.. స్మార్ట్ఫోన్లలో అధిక పౌనఃపున్యమున్న రేడియో తరంగాలను వాడుతుంటారు. 2జీ, 3జీలలో ఇది 900 మెగాహెర్ట్జ్గా ఉంటే.. 4జీలో ఈ పౌనఃపున్యం మరింత ఎక్కువగా ఉంటుంది. అధిక పౌనఃపున్యమున్న రేడియో తరంగాలు శరీరం లోపలికి చొచ్చుకుపోయే అవకాశాలు తక్కు వని శాస్త్రవేత్తలు అంటున్నారు. మొబైల్ఫోన్ల కంటే చాలా ఎక్కువ రెట్లు తీవ్రతతో కూడిన రేడియో తరంగాలు కొన్ని రకాల ఎలుకల్లో.. ముఖ్యంగా మగ ఎలుకల్లో కేన్సర్ కణితులు ఏర్పడేందుకు కారణం కావచ్చు. -
ప్రాణాలకు ‘పొగ’!
తెలుగు రాష్ట్రాల్లో పొగాకు పలువురి ప్రాణాలు తీస్తోంది. పొగాకు ఉత్పత్తులతో ఏటా లక్షలాది మంది కేన్సర్ బారిన పడుతున్నారు. పలు రాష్ట్రాలతో పోలిస్తే పొగతాగే వారు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉండటం ఆందోళన కలిగించే విషయం సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొగరాయుళ్లు ఏటా పెరిగిపోతున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య కోటీ ఎనభై లక్షలు. పొగ తాగే వారిలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా (14.2 శాతం), గుట్కా, కిళ్లీ, పాన్‌మసాలాలు వంటివి వాడేవారు తెలంగాణలో ఎక్కువ (10.1) శాతం ఉన్నారు. పొగతాగే వారి కనిష్ట వయసు 17 ఏళ్లు కాగా.. గుట్కా, పాన్‌మసాలాలు పదిహేనేళ్ల వయసు నుంచే మొదలెడుతున్నట్టు వెల్లడైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొగతాగే వారు, గుట్కాలు వాడే వారు ఎంత ఎక్కువగా పెరుగుతున్నారో.. అంత తీవ్ర స్థాయిలో క్యాన్సర్ బాధితులూ పెరిగిపోతున్నారు. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలున్నా నామమాత్రంగా కూడా లెక్కచేయడం లేదని తేటతెల్లమైంది. భారీగా పెరుగుతున్న పొగాకు కారక క్యాన్సర్లు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పొగాకు, గుట్కా కారక క్యాన్సర్లు తీవ్రమైనట్టు గాట్స్ (గ్లోబల్ అడల్ట్స్ టుబాకో సర్వే) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పొగాకు, గుట్కా కారక క్యాన్సర్లు 35 వేలకు పైనే నమోదవుతున్నట్టు తేలింది. నోరు, నాలుక, మెడ భాగాలకు ఈ క్యాన్సర్ వస్తోంది. ప్రతి పది క్యాన్సర్లలో 3 పొగాకు కారక క్యాన్సర్లే. ఇవిగాకుండా ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్లు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్లు ఎక్కువగా మూడు, లేదా నాలుగో స్టేజ్‌లోనే తెలుస్తుండటంతో 80% మంది మృత్యువాత పడుతున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 150 నుంచి 200 మందికి ఏటా కొత్తగా క్యాన్సర్లు వస్తుంటే.. అందులో 30 శాతం పొగాకు కారక క్యాన్సర్లే ఉన్నాయి. మెడ, తల భాగంలోనే అధికం పొగాకు వాడే వారికి ఎక్కువగా మెడ, తల భాగంలో క్యాన్సర్లు సోకుతున్నాయి. నా దగ్గరకు వచ్చే కేసుల్లో ప్రతి పదింటిలో మూడు లేదా నాలుగు ఇలాంటి క్యాన్సర్లే. వీరి వయసు కూడా 30 నుంచి 40 ఏళ్లలోపే. బాధితుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. –డా.రమేష్ మాటూరి, క్యాన్సర్ శస్త్రచికిత్సా నిపుణులు,ఎంఎన్‌జే ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్ చిన్న వయసు వారిలోనూ వస్తోంది పొగతాగడం, గుట్కాలు తీసుకోవడం వంటి వాటి వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్లు వస్తున్నాయి. దీన్నిబట్టి పొగాకు తీవ్రత ఎలా ఉందో అంచనా వేయొచ్చు. అయితే చివరి దశలో గుర్తించడం వల్ల చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. – డా.రవికిరణ్ బొబ్బా, మెడికల్ ఆంకాలజిస్ట్ రవి అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, విజయవాడ -
మంచి జీవనశైలితో చాలా క్యాన్సర్లు దూరం...
క్రమబద్ధమైన జీవనశైలి ఆరోగ్యాన్ని ఇస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యకరమైన ఆ జీవనశైలితో క్యాన్సర్లను సమర్థంగా నివారించవచ్చునని మరోమారు తాజాగా నిరూపితమైంది. దాదాపు లక్షా నలభై వేల మందికి పైగా వ్యక్తులను చాలా నిశితంగా పరిశీలించాక ఈ విషయం మరింతగా స్పష్టమైంది. రోజూ మంచి సమతుల ఆహారంతో తీసుకోవడం, పొగతాగే అలవాటును పూర్తిగా మానేయడంతో పాటు వారానికి కనీసం ఐదు రోజులైనా రోజూ అరగంట సేపు వ్యాయామం చేసే వారిలో ఊపిరితిత్తులు, పెద్దపేగులు, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు, గొంతు, కాలేయం, రొమ్ము, ప్రోస్టేట్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేటతెల్లమైంది. హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు జామా ఆంకాలజీ అనే హెల్త్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
ఆల్కహాల్... పరిమితంగానూ ప్రమాదమే!
పరిపరి శోధన చాలా పరిమితంగా తీసుకుంటే ఆల్కహాల్ ఆరోగ్యానికి మేలు చేస్తుందనీ, మోతాదుకు మించకుండా రెడ్ వైన్ లాంటివి తీసుకుంటే కొంతవరకు గుండెజబ్బుల నివారణకు తోడ్పడుతుందనే అపోహ ఉంది. కానీ ఎంత తక్కువ మోతాదులో తీసుకున్నా ఆల్కహాల్ ప్రమాదకరమే అంటున్నారు పరిశోధకులు. కనీసం ఏడు రకాల క్యాన్సర్లకు ఆల్కహాల్ దోహదపడుతుందన్నది తాజా పరిశోధనలు చెబుతున్న మాట. ఎంత పరిమితంగా తాగినా అది గొంతు, ల్యారింగ్స్, ఈసోఫేగస్, కాలేయం, పెద్దపేగులు, జీర్ణవ్యవస్థ, రొమ్ము క్యాన్సర్లకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు అధ్యయనవేత్తలు. న్యూజిల్యాండ్‌లోని ఒటాగో మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగానికి చెందిన పరిశోధకులు చెబుతున్న మాట ఇది. అక్కడి ప్రొఫెసర్ జీనీ కానర్ నేతృత్వంలో జరిగిన పరిశోధనల్లో స్పష్టంగా వెల్లడైన మాట ఇది.‘‘ఇంకా మరెన్నో క్యాన్సర్లకు కూడా మద్యం కారణం కావచ్చు. కానీ ఆ ఏడు రకాల క్యాన్సర్లను మద్యం ప్రేరేపిస్తుందని మా అధ్యయనాల్లో వెల్లడైంది’’ అన్నారు జీనీ కానర్. ‘‘మా అధ్యయనాల ప్రకారం... ఫలానా పరిమితి వరకు మద్యం సురక్షితమైనది అని చెప్పడానికి కూడా వీల్లేదు’’ అమె చెబుతున్నారు. ‘‘క్యాన్సర్ వచ్చే అవకాశాలు డోస్ డిపెండెంట్ అని కూడా చెప్పవచ్చు. అంటే మీరు తాగే మోతాదు పెరుగే కొద్దీ... క్యాన్సర్ వచ్చే అవకాశాలూ అంతే పెరుగుతుంటాయి’’ అని హెచ్చరిస్తున్నారామె. పైగా ఎనర్జీ డ్రింక్‌లతో తక్షణం ఉత్తేజం కలుగుతుందనే భావన కలిగించడం కలిగించడం కోసం వాటిల్లో ఆల్కహాల్ కలుపుతుంటారని తేలింది. కొన్ని శీతల పానీయాల్లో అమెరికాకు చెందిన నార్దరన్ కెంటకీ యూనివర్సిటీ అధ్యయనాల్లోనూ వెల్లడైంది. దీని వల్ల యువత క్రమంగా మద్యానికి అలవాటు పడటం, తర్వాత అదేపనిగా తాగడం (బింజ్ డ్రింకింగ్) జరుగుతోందని ఆ యూనివర్సిటీ చెందిన అధ్యయనవేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. ఇక వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ (డబ్ల్యూసీఆర్ఎఫ్)కు చెందిన ప్రోగ్రామ్ మేనేజర్ సుసానా బ్రౌన్ మాట్లాడుతూ ‘‘మద్యం ఎంత తక్కువ మోతాదుల్లో తీసుకున్నా అది కాలేయ క్యాన్సర్‌కు దోహదం చేస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘‘అందుకే మా అధ్యయన ఫలితాల ఆధారంగా ఎంత తక్కువ మోతాదుల్లో అయినా అసలు మద్యమే తాగకూడదని మేం సూచిస్తుంటాం’’ అంటున్నారు సుసానా బ్రౌన్. -
వ్యాయామంతో అనేక క్యాన్సర్లు దూరం!
పరిపరి శోధన వ్యాయామంతో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్న అంశం తెలిసిందే. అయితే క్రమం తప్పని వ్యాయామంతో చాలా రకాల క్యాన్సర్లు దూరమవుతాయంటున్నారు పరిశోధకులు. క్యాన్సర్లలో ఒకటీ రెండు కాదు... ఏకంగా పదమూడు రకాలకు పైగానే దూరమవుతాయన్నది వారి మాట. అమెరికా, యూరప్‌లలో నిర్వహించిన 12 అధ్యయనాలలో తేలిన వాస్తవమిది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే నిత్యం వ్యాయామం చేసేవారికి ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే ఒక తరహా క్యాన్సర్‌తో పాటు కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, కడుపునకు సంబంధించిన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగుల క్యాన్సర్, తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లు, మలద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్... ఇలా అనేక రకాల క్యాన్సర్లు దూరమవుతాయని ఆ అధ్యనాలలో తేలింది. వ్యాయామం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిచే ఎండోక్రైన్ స్రావాలు తగినంత మోతాదులోనే అవుతుంటాయనీ, దాంతో అన్ని వ్యవస్థలూ అదుపులో ఉంటూ, అన్ని వ్యవస్థల మధ్య మంచి సమతౌల్యత సాధ్యమవుతుందన్నది అధ్యయనవేత్తల మాట. క్యాన్సర్లను నివారించడం అంటే ఎన్నో అకాల మరణాలనూ నివారించినట్లే అంటున్నారు వారు. ఈ వివరాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
క్యాన్సర్ కొరుకుతానంటోంది!
వేటమాంసం, ప్రాసెస్డ్ మాంసాలు అతిగా తినడం వల్ల గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయనీ, స్థూలకాయం వస్తుందనీ చాలాకాలంగా వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, వాటివల్ల రకరకాల క్యాన్సర్లు కూడా వస్తాయని ఇటీవల తేలింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్నదేమిటంటే, పాశ్చాత్య దేశాల్లో 30 శాతం క్యాన్సర్లు రావడానికీ, అక్కడి ఆహారపుటలవాట్లకూ సంబంధం ఉందట! ఇక, మన భారతదేశం లాంటి వర్ధమాన దేశాల్లో కూడా 20 శాతం క్యాన్సర్లకూ, మనం తినే ఆహారానికీ లింకు ఉందని తేల్చారు. మాంసం తినడం మానేసినవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గినట్లు కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరు నెలల క్రితమే డబ్ల్యూహెచ్ఓ ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. అందులో ఒక జాబితాను సిద్ధం చేశారు. ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాల పేర్లతో కూడిన ‘గ్రూప్1’లో ప్రాసెస్డ్ మాంసాన్ని చేర్చారు. ఇక, క్యాన్సర్ తెచ్చే అవకాశమున్న ఆహారపదార్థాల పేర్లతో కూడిన ‘గ్రూప్ 2ఏ’లో రెడ్ మీట్ (వేట మాంసం)ను పేర్కొన్నారు. గొడ్డు మాంసం, పెయ్యదూడ మాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివన్నీ ‘రెడ్ మీట్’ కిందకు వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా దాదాపు 34 వేల మంది ప్రాసెస్డ్ మాంసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మరణిస్తున్నారని తాజా అంచనా. అలాగే, దాదాపు 50 వేల మంది రెడ్ మీట్ అతిగా తినడం వల్ల ఏటా క్యాన్సర్‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతిరోజూ తింటే... పెద్ద పేగు క్యాన్సర్ ‘అతి సర్వత్ర వర్జయేత్’ - దేనిలోనైనా అతి పనికి రాదు అని పెద్దల మాట. మాంసం తినే విషయంలోనూ ఇది పాటించాల్సిన సూత్రమే. ఎందుకంటే, అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువని హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తేల్చాయి. దీనికి కారణాలు అన్వేషిస్తే - మాంసంలో పీచు పదార్థం కానీ, సంరక్షించే ఇతర పోషకాలు కానీ ఉండవు. పెపైచ్చు, మాంసంలో యానిమల్ ప్రోటీన్, శ్యాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. మాంసాన్ని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, హెచ్చు ఉష్ణోగ్రతల్లో వండుతున్నప్పుడు క్యాన్సర్ కారకాలైన హెటెరో సైక్లిక్ ఎమైన్స్ (హెచ్‌సీఏ), పాలీ సైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్స్ (పీఏహెచ్) ఏర్పడతాయి. అవి క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతాయి. ప్రాసెస్డ్ మాంసంలోని అతి కొవ్వు, ఇతర జంతు ఉత్పత్తుల వల్ల హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. దాని వల్ల వక్షోజ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి క్యాన్సర్లు కూడా ... గొడ్డుమాంసం, పంది మాంసం, గొర్రె మాంసం లాంటివి అతిగా తిన్నా, ప్రాసె్స్డ్ మాంసాన్ని అతిగా తిన్నా అన్నవాహిక, ఊపిరితిత్తులు, క్లోమం (ప్యాంక్రియాస్), పొట్ట, గర్భాశయం లోపలి పొర, ప్రొస్టేట్ గ్రంథులకు క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుందని ‘అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్’ వెల్లడించింది. ప్రాసెస్డ్ మాంసంతో పురీషనాళ క్యాన్సర్ ఇటీవలి కాలంలో పురీషనాళ క్యాన్సర్ (కోలో రెక్టల్ క్యాన్సర్) ఎక్కువవుతోంది. ప్రాసెస్డ్ మాంసం అతిగా తీసుకొన్నా, అతిగా ఉడికించిన మాంసాన్ని భుజించినా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ప్రాసెస్డ్ మాంసంతో ఎందుకు ముప్పంటే, మాంసం పాడవకుండా ఉండడానికి సహజంగా కానీ, కృత్రిమంగా కానీ నైట్రైట్లు, నైట్రేట్ల లాంటి లవణాలను చేరుస్తారు. అవి మాంసంలోని పదార్థాలతో రియాక్ట్ అయి క్యాన్సర్ కారక పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మన డీఎన్ఏను దెబ్బ తీస్తాయి. రోజుకు 50 గ్రాముల ప్రాసెస్డ్ మాంసం తినడం వల్ల పురీష నాళ క్యాన్సర్ వచ్చే రిస్క్ 18 శాతం పెరుగుతుందని తాజా అమెరికన్ అధ్యయనం వెల్లడించింది. గ్రిల్డ్ మాంసంతోనూ చిక్కే! నేరుగా నిప్పుల మీద మాంసాన్ని వేయించడం (గ్రిల్డ్ మాంసం), కాల్చడం వల్ల కొవ్వు ఆ వేడి నిప్పుల మీదకు చేరుతుంది. దాంతో, పాలీసైక్లిక్ ఆరోమేటిక్ హైడ్రోకార్బన్ (పీఏహెచ్)తో నిండిన మంటలు వస్తాయి. సదరు పీఏహెచ్‌లు ఆహారం తాలూకు ఉపరితలానికి అంటుకుంటాయి. వేడి పెరిగిన కొద్దీ మరిన్ని పీఏహెచ్‌లు వస్తాయి. దాంతో, ఉదర సంబంధమైన క్యాన్సర్లు వచ్చే రిస్కు పెరుగుతుంది. అతి కొవ్వుతో రొమ్ము క్యాన్సర్ కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు, వేపుడు ఆహారపదార్థాలు తినడం వల్ల స్త్రీలలో మరింతగా ఈస్ట్రోజెన్స్ ఉత్పత్తి అవుతాయి. వక్షోజాలలో, స్త్రీల సెక్స్ హార్మోన్లకు స్పందించే ఇతర అవయవాల్లో క్యాన్సర్ కణాల పెరుగుదలను అది ప్రోత్సహిస్తుంది. కాబట్టి, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని నివారించాలంటే- మాంసం, పాల ఉత్పత్తుల ద్వారా అధిక కొవ్వు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. అయితే మాంసాహారం తక్కువ కావడం వల్ల విటమిన్ బి-12, విటమిన్-డి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించి మితం హితం అన్న జాగ్రత్త తీసుకోవాలి. అరుదుగా మాంసం తినేవాళ్ళతో పోలిస్తే ప్రతి రోజూ మాంసం తినేవారికి ‘పెద్ద పేగు క్యాన్సర్’ వచ్చే రిస్కు మూడు రెట్లు ఎక్కువ - హార్వర్డ్ వర్శిటీ -
కొత్త పరిశోధన
చిన్నపిల్లల్లో వచ్చే లుకేమియాను నివారించే తల్లి పాలు చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో తేలింది. చిన్నపిల్లలో వచ్చే క్యాన్సర్లలో రక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతం ఉంటాయి. దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే కనీసం ఆర్నెల్ల పాటైనా తల్లిపాలు తాగిన వారిలో ఈ బ్లడ్‌క్యాన్సర్లు వచ్చే అవకాశాలను 14 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గినట్లు తేలింది. కేవలం క్యాన్సర్ల నివారణ మాత్రమేగాక... తల్లిపాలు అకస్మాత్తుగా కారణం తెలియకుండా పిల్లలు మృతిచెందే కండిషన్ అయిన సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్), చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని తేలింది. అంతేకాదు... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువని తేలింది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జామా పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.