వ్యాయామంతో అనేక క్యాన్సర్లు దూరం!
పరిపరి శోధన
వ్యాయామంతో మంచి ఆరోగ్యం సమకూరుతుందన్న అంశం తెలిసిందే. అయితే క్రమం తప్పని వ్యాయామంతో చాలా రకాల క్యాన్సర్లు దూరమవుతాయంటున్నారు పరిశోధకులు. క్యాన్సర్లలో ఒకటీ రెండు కాదు... ఏకంగా పదమూడు రకాలకు పైగానే దూరమవుతాయన్నది వారి మాట. అమెరికా, యూరప్‌లలో నిర్వహించిన 12 అధ్యయనాలలో తేలిన వాస్తవమిది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే నిత్యం వ్యాయామం చేసేవారికి ఈసోఫేజియల్ ఎడినోకార్సినోమా అనే ఒక తరహా క్యాన్సర్‌తో పాటు కాలేయ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల క్యాన్సర్, కడుపునకు సంబంధించిన క్యాన్సర్లు, రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు, పెద్దపేగుల క్యాన్సర్, తల, మెడకు సంబంధించిన క్యాన్సర్లు, మలద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్... ఇలా అనేక రకాల క్యాన్సర్లు దూరమవుతాయని ఆ అధ్యనాలలో తేలింది.
వ్యాయామం వల్ల శరీరాన్ని ఉత్తేజపరిచే ఎండోక్రైన్ స్రావాలు తగినంత మోతాదులోనే అవుతుంటాయనీ, దాంతో అన్ని వ్యవస్థలూ అదుపులో ఉంటూ, అన్ని వ్యవస్థల మధ్య మంచి సమతౌల్యత సాధ్యమవుతుందన్నది అధ్యయనవేత్తల మాట. క్యాన్సర్‌లను నివారించడం అంటే ఎన్నో అకాల మరణాలనూ నివారించినట్లే అంటున్నారు వారు. ఈ వివరాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.