
‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’లో పాల్గొన్న కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
దేశవ్యాప్తంగా 4,200 ప్రాంతాల్లో సైకిల్ ర్యాలీలు
న్యూఢిల్లీ: దేశం నుంచి ఊబకాయాన్ని పారద్రోలాలంటే ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ... ‘ఊబకాయంపై అవగాహన అత్యవసరం.
ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు రోజువారీ జీవితంలో వ్యాయామం ఎంతో ముఖ్యం. సైక్లింగ్ అతి సులువైన ఎక్స్‌ర్‌సైజ్. దీని వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు... పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజూ సైక్లింగ్ చేసే వాళ్లు కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు’ అని అన్నారు. ఈ సందర్భంగా మాండవీయ సైకిల్ తొక్కి ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఐసీసీఐ, సీఐఐ ప్రతినిదులు పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కో రంగానికి చెందిన ఔత్సాహికులు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. గతంలో ఆర్మీ అధికారులు, పోస్ట్‌మెన్‌లు, వెల్‌నెస్ నిపుణులు ఇలా పలు రంగాలకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న ఒలింపియన్ అర్జున్‌లాల్ జాట్ మాట్లాడుతూ... ‘ఒక అథ్లెట్‌గా ప్రజల్లో ఆరోగ్యంపై వస్తున్న అవగాహన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం ఆహ్వానించదగ్గ విషయం. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ దిశగా ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది’ అని అన్నారు.
మరోవైపు గువాహటిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో భారత మెడికల్ అసోసియేషన్‌కు చెందిన వందలాది మంది వైద్యులు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఓవరాల్‌గా దేశంలోని 4,200 కేంద్రాల్లో ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజే దేశంలో 1200 ప్రాంతాల్లో ఈ ర్యాలీలు జరిగినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి దేశ ప్రజలతో తన మనసులోని మాటలు పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగాగా ఆదివారం నరేంద్ర మోదీ ఒబేసిటీ గురించి ప్రస్తావించారు. ఊబకాయాన్ని పారదోలేందుకు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని దేశ ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment