ఇక రాష్ట్రంలో ఆరోగ్య విప్లవం | CM YS Jagan Comments at the inauguration of YSR ArogyaSri Pilot Project | Sakshi
Sakshi News home page

ఇక రాష్ట్రంలో ఆరోగ్య విప్లవం

Published Sat, Jan 4 2020 3:34 AM | Last Updated on Sat, Jan 4 2020 10:34 AM

CM YS Jagan Comments at the inauguration of YSR ArogyaSri Pilot Project - Sakshi

శుక్రవారం ఏలూరులో జరిగిన వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభ కార్యక్రమంలో లబ్ధిదారుడికి ఆరోగ్యశ్రీ కార్డును అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అందరూ బాగుండాలి. అన్ని ప్రాంతాలూ బాగుండాలి. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్ముతున్నా. ఆ దిశలోనే రాష్ట్రంలో పాలన పరంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గతంలో అన్యాయంగా తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఉండేలా, ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా అందరి అభివృద్ధికి ఉపయోగిస్తాం. ప్రతి నిర్ణయం ఇదే ప్రాతిపదికన జరుగుతోంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం అని, ఈ దిశగా దేశంలోని 28 రాష్ట్రాలకన్నా మిన్నగా మరో అడుగు ముందుకు వేస్తూ.. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఈ పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఆయన ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య రంగానికి సంబంధించి పలు వరాలు ప్రకటించారు. ఏలూరు ఆశ్రం, శ్రీకాకుళం కిమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి వారికి భరోసా అందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికామని చెప్పారు. ఈ సభలో సీఎం ఇంకా ఏం మాట్లాడారంటే.. 

విప్లవాత్మక మార్పులు
కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం ప్రారంభించిన రెండో కార్యక్రమం ఇది. జనవరి 1వ తేదీన సుమారు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశాం. రెండవ కార్యక్రమంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు 2,059కి పెంచుతూ పైలట్‌ ప్రాజెక్టుగా చేపడుతున్నాం. ఇది అన్నింటికన్నా సంతృప్తిని ఇచ్చే కార్యక్రమం. ఇంతకు ముందు నాన్నగారు, దివంగత మహానేత రాజశేఖరరెడ్డి.. దేశ ఆరోగ్య చర్రితలోనే ఒక విప్లవాత్మకక పథకంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఈ పథకాన్ని దేశంలోని 28 రాష్ట్రాల కంటే మిన్నగా మరో అడుగు ముందుకు వేసి అమలు చేసేందుకు ఇక్కడికి వచ్చినందుకు గర్వపడుతున్నా. పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నా. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ 1,059 రోగాలకు మాత్రమే పరిమితమైంది. గత ప్రభుత్వంలో వీటిని కూడా  పట్టించుకోని పరిస్థితులను మనమంతా చూశాం.
 వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

అందుకే ఏడు నెలలుగా ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తూ అడుగులు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ రోజు (శుక్రవారం) ఇక్కడ పైలెట్‌ ప్రాజెక్టుగా 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడు నెలలపాటు ఈ పైలట్‌ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో అదనంగా 200 రోగాలకు చికిత్సను విస్తరిస్తూ 1,259 వ్యాధులకు ఈ పథకం కింద చికిత్స అందిస్తాం. రోగులకు మంచి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఎక్కడైనా సమస్యలు ఉంటే మూడు నెలల్లో వాటిని అధిగమించి ఏప్రిల్‌ నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా ఒక్కో జిల్లాకు విస్తరిస్తూ వెళతాం. 
 
సచివాలయాల పరిధిలోకి ఆశా వర్కర్లు
పశ్చిమగోదావరి జిల్లాలో ఒక అడుగు ముందుకు వేసి 1,259 రోగాలకే కాకుండా ఏకంగా 2,059 రోగాలకు వైద్యం అందించేలా పైలట్‌ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా ఏటా రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరినీ  ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నాం. ఈ మేరకు కోటి 42 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. గ్రామ సెక్రటేరియట్‌లో ఉన్న మెడికల్‌ అసిస్టెంట్, పీహెచ్‌సీలో ఉన్న ఆరోగ్యమిత్రలు ఎవరికైనా ఏదైనా రోగం వస్తే ఎక్కడికి వెళ్లాలి, ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలి అనే గైడెన్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 వేల నుండి 50 వేల మంది ఆశావర్కర్లను గ్రామ సెక్రటేరియట్‌ పరిధిలోకి తీసుకువచ్చి వారికి 300 – 350 ఇళ్లను కేటాయిస్తాం. ఈ ఇళ్లకు సంబంధించిన ఆరోగ్య బాధ్యతలు వారి చేతిలో పెడతాం. ఆశా అక్క, చెల్లెమ్మ తోడుగా, జగనన్న అండగా ఉన్నాడు అనే మాట వినిపించేలా చేస్తాం.  
మహిళకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డును అందిస్తున్న వైఎస్‌ జగన్, చిత్రంలో మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనిత 

ఆరోగ్యశ్రీ చరిత్రలో కొత్త అధ్యాయం 
– నవంబర్‌ 1న చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా రాష్ట్రం వెలుపల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను వర్తింప చేశాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని 150 ఆసుపత్రుల్లో సేవలు అందేలా చర్యలు తీసుకున్నాం. 
– ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత రోగులు విశ్రాంతి తీసుకునే సమయంలో తోడుగా ఉండాలనే తపన, తాపత్రయంతో రోజుకు రూ.225, నెలకు రూ.5000 చొప్పున డాక్టర్లు ఎన్ని నెలలు విశ్రాంతి తీసుకోమంటే అన్ని నెలలు సాయం అందించే కార్యక్రమానికి డిసెంబర్‌ నుంచి శ్రీకారం చుట్టాం. 
– పుట్టుకతోనే వినికిడి లోపం, మూగ, చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్‌ చేయాలంటే ఆరేడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దీన్ని ఎలా కత్తిరించాలని చూసే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కేవలం ఒక చెవికి మాత్రమే ఆపరేషన్‌ చేసే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిని మారుస్తూ రెండు చెవులకు ఆపరేషన్‌ చేసే విధంగా డిసెంబర్‌ 1న ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాగైతే ఒక్కొక్కరికి రూ.10 లక్షల నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినా పర్వాలేదని చిన్నారులకు తోడుగా ప్రభుత్వం ఉంటుందని గట్టిగా భరోసా ఇచ్చాం.
– జనవరి 1వ తేదీ నుంచి గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో తీసుకువచ్చాం. ఇందుకు హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఏప్రిల్‌ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ, జీపీఎం స్థాయిలో మందుల నాణ్యత ఉండేలా చూస్తాం.
– డయాలసిస్‌ పెషేంట్లందరికీ నెలకు రూ.10 వేలు పెన్షన్‌ ఇస్తున్నాం. ఇదే విధంగా తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారందరికి రూ.10 వేల పెన్షన్‌ వచ్చే నెల మొదటి తేదీ వారి చేతుల్లో పెడతాం. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికో, కుర్చీకో పరిమితమైన వారు ప్రతి ఊళ్లో కనిపిస్తున్నారు. ఇలాంటి వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్‌ ఇచ్చే కార్యక్రమానికి ఫిబ్రవరి 1 నుంచి శ్రీకారం చుడుతున్నాం. కుష్టు వ్యాధిగ్రస్తులకు కూడా ఫిబ్రవరి1 నుంచి రూ.3 వేలు పెన్షన్‌ ఇస్తాం. 
– రెండు నెలల కిందట ఏలూరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది వచ్చి కలిశారు. అన్నా.. చాలీచాలని జీతంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మేం చేసే పనులు ఎవరు చేయలేరన్నా, అయినా మా జీతాలు ఇంతేనన్నా అని చెప్పి బాధపడ్డారు. అందుకే జనవరి ఒకటి నుంచి వారి వేతనాలు రూ.16 వేలకు పెంచుతున్నాం. 
– నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా మూడేళ్లలో దశల వారీగా అన్ని ఆసుపత్రులను మార్చబోతున్నాం. ఫిబ్రవరి 1వ తేదీన 5 వేల ఆరోగ్య ఉప కేంద్రాల రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, సబ్‌ సెంటర్లు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్‌ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తాం. జాతీయ స్థాయి ప్రమాణాలకు సమానంగా అభివృద్ధి చేస్తూ నాడు– నేడు కార్యక్రమం నిర్వహిస్తాం.  
– ఇప్పుడు 108, 104 వాహనాలకు ఫోన్‌ కొడితే వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని నెలాఖరుకల్లా మార్చబోతున్నాం. అక్షరాల 1061 కొత్త అంబులెన్స్‌ వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. మీరు ఫోన్‌ కొట్టిన 20 నిమిషాల్లోపే కొత్త అంబులెన్స్‌లు మీ దగ్గరకు వచ్చి  ఎక్కించుకుని ఆరోగ్యశ్రీ ద్వారా సేవలందించి తిరిగి చిరునవ్వుతో మళ్లీ మిమ్మల్ని ఇంటి దగ్గర దింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
– నెట్‌వర్క్‌ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడేలా గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెడతాం. మే నెలాఖరుకు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులు, నర్సుల పోస్టులు, మిగిలిన అన్ని రకాలు పోస్టులను పూర్తిగా భర్తీ చేస్తాం. ప్రభుత్వాసుపత్రులలో వైద్యులు, నర్సులు లేరనే మాట వినిపించకుండా చేస్తాం.
– పలాస, మార్కాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పరిశోధనా కేంద్రాలు (ఆసుపత్రులు) తీసుకొస్తాం. పలాసలో ఇప్పటికే టెండర్లు పిలిచాం. మరో నెల రోజుల్లోపే పనులు మొదలవుతాయి. మర్కాపురం, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరు, ఏలూరు, విజయనగరం, పులివెందులల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. వీటికి సంబంధించి కూడా  డ్రాయింగ్స్‌ తయారవుతున్నాయి. మరో ఆరు వారాల్లో ఇవన్నీ పూర్తి చేసుకుని.. ఆ తర్వాత ఒక నెలలో టెండర్లు పిలుస్తాం. అనంతరం రెండున్నర నెలల్లోనే పనులు ప్రారంభిస్తాం.

అవ్వాతాతలకు కంటి వెలుగు
గత ఏడాది అక్టోబర్‌ 10వ తేదీన వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాం. దాదాపు 66 లక్షల మంది బడి పిల్లలకు కంటి వెలుగు ద్వారా పూర్తిగా స్క్రీనింగ్‌ చేశాం. లక్షా 47 వేల మంది పిల్లలకు కళ్ల జోళ్లు ఇచ్చాం. 45 వేల మందికి ఆపరేషన్‌ చేయిస్తున్నామని సగర్వంగా చెబుతున్నా. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అవ్వాతాతలను కంటి వెలుగు కార్యక్రమానికి తీసుకువెళ్తాం. ఆరు నెలల పాటు వారికి కేటాయించి, స్క్రీనింగ్‌ చేసి, ఉచితంగా ఆపరేషన్లు చేయించి, కళ్లజోళ్లు పంపిణీ చేస్తాం. 
కంటివెలుగు స్టాల్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌  

ఇకపై పిల్లలకు జగన్‌ మామ అండ
మన పిల్లలు బాగా చదవాలి. భావితరాలతో పోటీ పడాలని, వారి జీవితాలు మార్చాలని ఈ నెల 9వ తేదీన అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ పిల్లలను చదివించడం కోసం తల్లులు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి తల్లికి జగనన్న తోడుగా ఉంటూ ఆ ప్రతి చిన్న పిల్లాడికి, చిన్న పాపకు జగన్‌ మామ తోడుగా ఉన్నాడని ఈ వేదిక మీద నుండి తెలియచేస్తున్నా. ప్రతి గవర్నమెంట్‌ స్కూల్‌ను ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌గా మారుస్తాం. అమ్మఒడి కార్యక్రమం, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు, నాడు– నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ల రూపు రేఖలు పూర్తిగా మార్చబోతున్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లలకు మధ్యాహ్నం పెట్టే భోజనం మెనూ కూడా మారుస్తున్నాం.

నవరత్నాలతో సహా అన్ని పథకాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు.. పేదరికంలో ఉన్న ఇతర వర్గాల వారందరికీ అందాలి. ఆ దిశగానే పాలన సాగిస్తున్నాం’ అని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. అనంతరం నలుగురికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు, ప్రత్యేక పింఛన్లు మంజూరు చేస్తూ ఇద్దరికి లేఖలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్‌ మిల్లర్ల సంఘం తరఫున మంత్రి చెరుకువాడ రంగనాథరాజు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి కోటి రూపాయల విరాళం అందించారు. ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకష్ణ శ్రీనివాస్, నారాయణస్వామి,  తానేటి వనిత, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, నేతలు, పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

మంచి వైద్యం అందుతోంది.. వైద్యులకు కృతజ్ఞతలు
ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇద్దరు రోగులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రి నుంచి అనంతలకిŠష్‌ అనే రోగి మాట్లాడుతూ.. అనారోగ్యం పాలై వైద్యం కోసం చాలా ఇబ్బంది పడ్డామని, అప్పుల పాలయ్యామని చెప్పారు. అలాంటి తమకు ఇప్పుడు ఈ పథకం ద్వారా ఎంతో మేలు జరుగుతోందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించామని, ఆరోగ్యశ్రీలో ఇప్పటి వరకు 1059 వ్యాధులకు చికిత్స చేస్తుండగా, ఇప్పుడు మరో 1,000 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తద్వారా రోగులకు మరింత వైద్య సహాయం అందుతుందన్నారు. అనంతరం శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రి నుంచి పొన్నాడ సింహాచలం అనే రోగి మాట్లాడగా.. ఆయన ఆరోగ్యం, చికిత్స అందుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. ‘ఇప్పుడు మీరు పొందుతున్న ప్రొసీజర్, మోకాలి చిప్పకు సంబంధించినది. గతంలో ఇది ఆరోగ్యశ్రీలో లేదు. ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చాం. ఆపరేషన్‌తో పాటు, మీరు ఇంటికి వెళ్లిన తర్వాత వైద్యులు సూచించినంత కాలం మీకు ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున సహాయం చేస్తుంది. వైద్యులు కూడా మంచి సేవలందిస్తున్నందుకు అభినందనలు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇకపై ఆరోగ్యశ్రీలోకి క్యాన్సర్‌ చికిత్సను కూడా చేరుస్తున్నాం. ఇవాళ క్యాన్సర్‌ చికిత్స పరిస్థితి ఎలా ఉందంటే ముష్టి వేసినట్లు కాస్తో కూస్తో ఇచ్చామంటే ఇచ్చాం అన్నట్లుగా ఉంది. అన్ని రకాల క్యాన్సర్లకు ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అడుగులు వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని రకాల క్యాన్సర్‌ పేషెంట్లకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వమే భరిస్తుంది. 

చికెన్‌గున్యా, వడదెబ్బ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ లాంటి వాటికి ఇంతకు ముందు వేలకు వేలు డాక్టర్లు పిండి వసూలు చేసే పరిస్థితి ఉండేది. ఇక మీదట ఆ పరిస్థితి ఉండదు. 1,259 రోగాల్లో భాగంగా వీటన్నింటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.

ఆరోగ్యశ్రీ కార్డులపై క్యూ ఆర్‌ బార్‌ కోడ్‌ ఇస్తున్నాం. బ్లడ్‌ టెస్టో, ఎక్స్‌రేనో, లేదా సిటీ స్కానో తీసుకుంటే ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారి ఆ రిపోర్ట్‌ల కోసం వెతుక్కునే పని లేకుండా మొత్తం మెడికల్‌ రిపోర్టులన్నీ ఆ కార్డులో నమోదయ్యేలా చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు నేటి నుంచే కార్డులు పంపిణీ చేస్తున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా అర్హత ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ కార్డులను అందజేస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement