వైదేహి ఆస్పత్రిలో చికిత్సానంతరం కృప
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): గ్రహణంమొర్రి, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ జీవించే అవకాశం ప్రమాదంలో పడ్డ 13 ఏళ్ల బాలికకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో పునర్జన్మ లభించింది. వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పరిధి కొత్తపాలెం నివాసితులు సిద్దాబత్తుల పురుషోత్తం, కుమారి నిరుపేదలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో చివరి సంతానం.. కృప. 2008లో జన్మించిన కృప గ్రహణంమొర్రి, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ విశాఖ వస్తున్నారని తెలుసుకుని పాప తల్లిదండ్రులు ఆయనను కలిశారు.
వైఎస్సార్ పాపకు వెంటనే ఆపరేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు గ్రహణంమొర్రికి ఆపరేషన్ చేయించారు. గుండెకు మాత్రం పాప ఎదిగిన తర్వాతే ఆపరేషన్ చేయడం వీలవుతుందని వైద్యులు తెలిపారు. 2009లో వైఎస్సార్ కన్నుమూయడంతో తర్వాత వచ్చిన పాలకులు చిన్నారిని పట్టించుకోలేదు. కృప ఎదిగే కొద్దీ గుండె సమస్యతోపాటు కిడ్నీ సమస్య కూడా వెంటాడింది. దీంతో తరచూ తీవ్ర అనారోగ్యానికి గురవుతుండేది.
వైఎస్సార్, జగన్‌లకు రుణపడి ఉంటాం..
నాడు పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి మమ్మల్ని ఆదుకోకపోతే మా పాప జీవించి ఉండేది కాదు. ఎక్కడున్నా ఆ మహానుభావుడికి వేల వేల కృతజ్ఞతలు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఆరోగ్యశ్రీని వర్తింపజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం.
–పురుషోత్తం సిద్దాబత్తుల (చిన్నారి కృప తండ్రి)
‘సాక్షి’ చొరవతో..
ఈ ఏడాది జూన్ 23న కృప తీవ్ర అనారోగ్యానికి గురవడంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పాపకు గుండె, కిడ్నీ సమస్యలు తీవ్రమైనట్టు తెలిపారు. వీటికి హైదరాబాద్ లేదా చెన్నైలో మాత్రమే చికిత్స ఉందని, చాలా ఖర్చుతో కూడుకుందని చెప్పారు. బతికే అవకాశాలు కూడా తక్కువేనని చెప్పడంతో తల్లిదండ్రులు బావురుమన్నారు. ఇక చేసేది లేక కృప తండ్రి పురుషోత్తం తనకు తెలిసిన వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సహాయాన్ని అర్థించడం ప్రారంభించారు. అదే సమయంలో ఆయన మెసేజ్‌ను చూసిన సాక్షి విలేకరి విజయ్‌కుమార్ వెంటనే పాప అనారోగ్య విషయాన్ని ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్‌కు తెలియజేశారు.
బెంగళూరు నుంచి తల్లిదండ్రులతో కలిసి ఇటీవల నగరానికి చేరుకున్న కృప
ఆయన కృపకు బెంగళూరులో ఆపరేషన్ చేసే వీలుందని తెలుసుకుని.. అక్కడి ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ ఉషతో మాట్లాడారు. ఆమె సూచన మేరకు కృపను బెంగళూరు వైదేహి ఆస్పత్రిలో చేర్చారు. సెప్టెంబర్ 8న కార్డియాలజిస్ట్ డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం పాపకు గుండె ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. పాపకు ఆరోగ్యం కుదుటపడటంతో సెప్టెంబర్ 24న డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడే గుండె ఆపరేషన్ చేయడంతో కొంతకాలం ఆగాక కిడ్నీ సమస్యకు కూడా ఉచితంగా ఆపరేషన్ చేస్తానన్నారని కృప తల్లిదండ్రులు చెప్పారు. ఆపరేషన్ మొత్తం ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేయడంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లోనూ వర్తింపచేయడం గ్రేట్
ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స. ఇలాంటి ఆపరేషన్‌ల్లో సగం మాత్రమే విజయావకాశాలు ఉంటాయి. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకున్నవారికి కూడా వర్తింపజేయడం గ్రేట్. గతేడాది మా ఆస్పత్రిలో చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఆనంద్‌కు ఆరోగ్యశ్రీ పథకం కింద గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాం. దీనికి ఏపీ ప్రభుత్వం రూ.11 లక్షలు విడుదల చేసింది.
– డాక్టర్ దుర్గాప్రసాద్, కార్డియాలజిస్ట్, వైదేహి ఆస్పత్రి, బెంగళూరు
Comments
Please login to add a commentAdd a comment