బీడీ, సిగరెట్‌ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి! | World No Tobacco Day 2023: Health Risks of Smoking Tobacco | Sakshi
Sakshi News home page

పొగ తాగడం మానేసిన 20 నిమిషాల్లోనే ఎన్నెన్నో లాభాలు.. ఒక్కసారి ట్రై చేయండి

Published Sun, May 28 2023 1:36 AM | Last Updated on Thu, Jul 27 2023 7:17 PM

World No Tobacco Day 2023: Health Risks of Smoking Tobacco - Sakshi

మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172  కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు.

వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న  వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.

పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్‌ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు.

అణువణువునా విషం...
అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి  సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్‌లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

ప్రతి అవయవానికీ క్యాన్సర్‌ ముప్పు...
వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి.

నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్‌), మలద్వార (కోలోరెక్టల్‌) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్‌ క్యాన్సర్లు, బ్లాడర్‌ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం.

ఇక ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది.  పొగాకులోని బెంజీన్‌ రసాయనం ‘అక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్‌)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది.

పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు...
పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్‌ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్‌కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్‌ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్‌ మూడు నెలల్లో నార్మల్‌కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్‌ఎటాక్‌ వచ్చే ముప్పు (రిస్క్‌) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్‌ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది.       

ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్‌ వ్యర్థాలతో భూమిని సైతం...
సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్‌ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్‌) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్‌ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి.

పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు
పాంటోన్‌ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్‌ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు.

బానిసగా చేసుకునేది నికోటిన్‌...
పొగాకులోని నికోటిన్‌... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్‌ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్‌ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్‌ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్‌ కారణంగానే హాయిగా, రిలాక్స్‌డ్‌గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు.

నికోటిన్‌ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా ఆఫ్‌ పాలెట్‌’ అనే రకం క్యాన్సర్‌ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్‌ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్‌నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్‌ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్‌ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్‌ మానలేదు. ఇదీ నికోటిన్‌ పవర్‌.
-డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement