శుభమస్తు.. ఆరోగ్య‘మస్త్‌’ | Precautions to be taken for health protection | Sakshi
Sakshi News home page

శుభమస్తు.. ఆరోగ్య‘మస్త్‌’

Published Sat, Dec 28 2024 5:27 AM | Last Updated on Sat, Dec 28 2024 1:59 PM

Precautions to be taken for health protection

కొత్త ఏడాది నాడు.. పెద్దలు దీవెనలిస్తారు.. ఫ్రెండ్స్‌ విషెస్‌ చెబుతారు .. పిల్లలకు కానుకలిస్తారు మరి పెద్ద పెద్ద డాక్టర్లో..?  కొత్త సంవత్సరంలో ‘అందరికీ ఆరోగ్యమస్తు’ అని దీవిస్తూనే.. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహా–సూచనలను ‘కన్సల్టేషన్‌’గా అందిస్తున్నారు. దాన్నే సమగ్రంగా, సంక్షిప్తంగా, చిరు కానుకగా ప్రత్యేక పేజీ రూపంలో ‘సాక్షి’ అందిస్తోంది.  

‘ఓమ్‌’ ప్రథమం గట్‌ బయోమ్‌
జీర్ణ వ్యవస్థ చాలా సంక్లిష్టమైన వ్యవస్థ. గతంలో జీర్ణవ్యవస్థ అనేది కేవలం జీర్ణం చేయడానికి ఉపయోగడపతుందని అనుకున్నారు. ఇటీవలి పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే జీర్ణవ్యవస్థలో కోటాను కోట్ల బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయనీ, ‘గట్‌ బయోమ్‌’గా పేర్కొనే వీటి సమతౌల్యత వల్లనే మానసిక ఆరోగ్యం, వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేయడం వంటివన్నీ ఆధారపడి ఉంటాయని తెలిసింది.

అంటే ఓ వ్యక్తి ఆహారం అరిగించడంలోనే కాకుండా, అతడు తినే పదార్థాల తీరు తెన్నులు అతడి మానసిక ఆరోగ్యాన్నీ, రోగనిరోధక వ్యవస్థ పనితీరును నిర్దేశిస్తుంటాయన్నమాట. ఈ బయోమ్‌ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్‌), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి. మంచి జీవనశైలిని అనుసరిస్తూ, పూర్తిగా సమతులాహారం తీసుకుంటూ ఉంటే గట్‌ బయోమ్‌ సమతౌల్యత బాగుంటుంది. మన భారతీయ సంప్రదాయ ఆహారంలో మొక్కలూ, వృక్షాల నుంచి లభ్యమయ్యే ఆహారం తీసుకుంటుంటాం. అంటే... మనం తినే అన్నంలోనే కాయధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కాయగూరలతో పాటు పులవడానికి సిద్ధంగా ఉండే ఇడ్లీ, దోశలు, భోజనం చివర్లో పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయాటిక్‌ ఆహారాలను తీసుకుంటాం. 

ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్‌ బయోమ్‌ను ఆరోగ్యకరంగా, సమతౌల్యంగా ఉండేలా చూస్తాయి. ఇటీవల మనం తీసుకుంటున్నప్రాసెస్‌డ్‌ ఫుడ్, చక్కెరతో చేసే తీపిపదార్థాల్లో ఇవి అంతగా ఉండవు. అందుకే మంచి సమతులాహారం తీసుకోవడంతో పాటు మంచి జీవనశైలిలో భాగంగా ఒంటికి తగినంత శ్రమ కలిగేలా తేలికపాటి వ్యాయామాలు, వేళకు కంటి నిండా నిద్రపోవడం వంటి చర్యలతో గట్‌ బయోమ్‌ సమతౌల్యత సమర్థంగా నిర్వహితమవుతూ ఉంటుంది. 

దీనివల్ల మంచి జీర్ణక్రియ, తిన్నది ఒంటికి పట్టడమే కాకుండా మంచి మూడ్‌ (భావోద్వేగాల) నిర్వహితమవుతుండటం, వ్యాధి నిరోధక వ్యవస్థ చురుగ్గా, క్రియాశీలకంగా మారడం, పూర్తిస్థాయి భౌతిక, మానసిక ఆరోగ్యాల నిర్వహణ జరుగుతాయి. అందుకే స్వాభావికమైన, పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు, పులవడానికి సంసిద్ధంగా ఉండే పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్, తేలికపాటి వ్యాయామాలతో గట్‌ బయోమ్‌ సమతౌల్యతతో నిర్వ‘హిత’మయ్యేలా చూసుకోవాలని ఆకాంక్షిస్తున్నా.  
- డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ,సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ అండ్‌ చైర్‌పర్సన్‌ ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ

కదలికే ‘కీళ్ల’కం
పోషకాలు తీసుకోవడానికి జాయింట్స్‌కు నోరు లేదు. అదెలాగంటారా? మన దేహంలోని ప్రతి కణానికీ రక్తం ద్వారా పోషకాలూ, ఆక్సిజన్‌ అందుతాయి. రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండటం వల్ల వాటికి నేరుగా న్యూట్రియెంట్స్‌ (పోషకాలు) అందుతాయి. కానీ, కీళ్ల విషయం వేరు. అవి రక్తప్రసరణ వ్యవస్థతో నేరుగా అనుసంధానమై ఉండవు. మరి వాటికి పోషకాలు అందడమెలా? కీళ్లు ఎంతగా కదులుతుంటే అంతగా వాటికి పోషకాలు అందుతాయి. ఒకవేళ శరీరం కదలికలు మందగించి, కీళ్లలో కదలిక లేకపోతేనో?... అప్పుడు వాటికి పోషకాలు అందవు. నేరుగా రక్తప్రసరణ వ్యవస్థతో అనుసంధానమై ఉన్న కణాలకు ఉన్నట్లు వాటికి సప్లై ఉండదు కాబట్టే... వాటికి నోరు లేదు అన్నది. 

నోరున్న వాడు నోరు చేసుకు బతుకుతాడు. మరప్పుడు నోరు లేని కీళ్లు కష్టం చేసుకుని బతకాల్సిందే కదా. అందుకే కీలాడితే గానీ వాటికి బతుకాడదు. అందుకే కీళ్ల ఆరోగ్యం బాగుండాలంటే, వాటికీ పోషకాలు అందాలంటే వ్యాయామం తప్పనిసరి అన్నమాట. ఇక మరోమాట... ఎవరిలోనైనా కీళ్లు బాగా అరిగిపోతే (అంటే కీళ్లపై ఉండే కార్టిలేజ్‌ అనే ΄పోర అరిగితే) అప్పుడు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం.  ఇలాంటి సందర్భాల్లో కొంతమంది కీళ్లలోకి ఇంజెక్షన్‌ ఇస్తామంటూ పీఆర్‌పీలు, స్టెరాయిడ్స్‌ ఎక్కిస్తారు. అవి అందగానే నొప్పులన్నీ తగ్గుతాయి. దాంతో ఇంజెక్షన్‌తోనే నొప్పి అంతా తగ్గిపోయిందంటూ చాలామంది ఆనందపడతారు. అలాంటి ఇంజక్షన్స్‌ చేయమంటూ ఆర్థోపెడిక్‌ సర్జన్ల దగ్గరికి రోజూ పదుల సంఖ్యలో వస్తుంటారు. నాలుగో స్టేజీలో ఉన్న మోకాళ్ల ఆర్థరైటిస్‌కి ఏ డాక్టర్‌ అయినా పీఆర్‌పీ ఇంజెక్షన్‌ ఇస్తే అతడు డాక్టర్‌ కాదు... ఆపరేషన్‌ అంటే భయపడే అమాయకులైన పేషెంట్లను మోసం చేస్తున్నాడని గ్రహించాలి. 

ఇంజెక్షన్‌ చేయడమనేది ఎంబీబీఎస్‌ చదువుతున్న వైద్య విద్యార్థులు మొదలు కాం΄ûండర్లూ చేయగలిగేదే. స్టెరాయిడ్స్‌ ఇవ్వడంతో తొలుత నొప్పులు ఉపశమించినట్లు కనిపించినా... ఆ తర్వాత అవి బోలుగా మారడం, తేలిగ్గా విరగడం జరుగుతుంది. మహామహా కీళ్లమార్పిడి నిపుణులు చిన్నపాటి ఇంజెక్షన్‌ చేయలేరా? ఎందుకు చేయరంటే బాధితుల పాలిట అదో ద్రోహం. వాళ్ల ఎముకల్ని గుల్ల చేసేసే ఓ అనైతిక (అన్‌ ఎథికల్‌) పద్ధతి. అందుకే కీళ్లు పూర్తిగా అరిగాక ఎవరైనా ఇంజెక్షన్స్‌తో మాన్పిస్తామంటే... వాళ్లు నొప్పి నివారణ మందులూ, స్టెరాయిడ్స్‌ కలిపి ఇంజెక్షన్‌ చేస్తూ, దీర్ఘకాలికంగా ఎముకల్ని గుల్ల గుల్ల చేస్తున్నారని అర్థం చేసుకోవాలి.  
-డాక్టర్‌ గురవారెడ్డి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల నిపుణులు

మూత్ర పిండం బ్రహ్మాండంగా ఉండాలంటే..
గతంలో పెద్దవయసు వారిలోనే కనిపించే చాలా ఆరోగ్య సమస్యలు ఇప్పుడు చిన్నవయసు వారిలోనూ ఎక్కువగానే  కనిపిస్తున్నాయి. ఇటీవల పెరిగిన ఆరోగ్య స్పృహ కారణంగా ముందుగానే చేయిస్తున్న  వైద్య పరీక్షల వల్ల  అనేక జబ్బులు బయటపడటమూ జరుగుతోంది. దీనివల్ల రెండు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటిది... జబ్బులు బయటపడటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా పెరిగిందనేది ఆందోళన కాగా... ఇక రెండో అంశం... ఆరోగ్యస్పృహ ఇంతగా పెరగకపోయి ఉంటే, అవి మరింత ముదిరాక బయటపడి ఇంకా సమస్యాత్మకంగా మారేవనే పాజిటివ్‌ అంశం.

ఉదాహరణకు గతంలో మూత్రవ్యవస్థకు సంబంధించిన జబ్బుల్లోనూ కిడ్నీల్లో రాళ్లు, పెద్దవయసువారిలో మూత్ర విసర్జన కష్టం కావడం ఇక డయాబటిస్, హైపర్‌టెన్షన్‌ బాధితుల్లో కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. కానీ ఇటీవల యుక్తవయసువారిలోనూ, ఆమాటకొస్తే చాలా చిన్నపిల్లల్లోనూ కిడ్నీలో రాళ్ల సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణం కావచ్చు. మన ఆహారపు అలవాట్లు, కలుషిత వాతావరణం, జీవనశైలి మార్పులు వంటివి కారణాలు కావచ్చు. 

అయితే ఇప్పుడు ఓ ఆరోగ్య సమస్య వచ్చిందంటే... ఉదాహరణకు ‘కిడ్నీలో రాళ్లు’ సమస్యను తీసుకుంటే... ఇటీవల అత్యాధునికమైన వైద్య ప్రక్రియలూ, లేజర్లు, రొబోటిక్‌ సర్జరీలూ అందుబాటులోకి రావడంతో కోత, గాటూ లేకుండా, రక్తం చిందకుండా సర్జరీ చేస్తున్నామని అనుకోవడం తప్ప అసలివి రాకుండా చేసుకోవడానికి నివారణలేమిటి అనే ఆలోచనకు తావులేకుండా పోయింది. నిజానికి మనం ఆలోచించాల్సింది వ్యాధుల నివారణ గురించే. 

ఉదా:  కిడ్నీలు, మూత్ర వ్యవస్థ విషయానికి వస్తే... రాళ్లు ఏర్పడటానికి ఆస్కారమిచ్చే ఆహారానికి దూరంగా ఉండటం, నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వంటి నివారణ చర్యల గురించి గురించి ఆలోచించాలి. సమాజంలో  ఇప్పుడు ఇన్‌ఫెర్టిలిటీ సమస్య కూడా పెరిగింది. వీటన్నింటికీ కారణం మన జీవనశైలిలోని  మార్పులే. దీనికి తోడు మన జీవితాల్లో పెరుగుతున్న తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్‌) కూడా మరో ప్రధాన కారణం. దీనివల్లనే హైబీపీ, డయాబెటిస్‌... మళ్లీ వీటివల్లనే  కిడ్నీ జబ్బులు... ఇలా ఓ చైన్‌ రియాక్షన్‌లా కొనసాగుతున్నాయి. ఇవన్నీ జీవనశైలిలో మార్పుల వల్ల జరుగుతున్నాయని గ్రహించి మన లైఫ్‌స్టైల్‌ను పునర్నిర్వచించుకొని హెల్దీ జీవనశైలిని అనుసరించాలి. 
-డాక్టర్‌ మల్లికార్జున ఎండీ అండ్‌ చీఫ్‌ కన్సల్టెంట్‌ యూరాలజిస్ట్, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ

మీరు  బరువైతే గుండె  చెరువే
గుండెను అందరూ పదిలంగా చూసుకోవాల్సిన అవసరముంది. అందుకు కొన్ని సూచనలు... 
మనం మన ఒత్తిడి (స్ట్రెస్‌)కి కారణమైన అంశాలని చెబుతున్న వాటిల్లో 90 శాతం అంశాలు అంతగా ఒత్తిడికి గురిచేసేవే కాదు. అసలు స్ట్రెస్‌ కంటే... మనం దానికి భయపడుతున్న తీరే ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలనే పరిష్కార మార్గాలు ఆలోచిస్తే స్ట్రెస్‌ దానంతట అదే తగ్గిపోతుంది. 

⇒ మహిళలకు ప్రత్యేకంగా చెబుతున్న విషయమేమిటంటే... నిత్యజీవితంలోని ఒత్తిడి (స్ట్రెస్‌) పురుషులకంటే మహిళలకే ఎక్కువగా హాని చేస్తుందని అధ్యయనాల్లో తేలింది. మహిళలు ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం గుండెకు మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజెన్‌ వల్ల గుండెకు కలిగే రక్షణ తొలగిపోతుంది కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ మానసిక స్థైర్యాన్ని మరింతగా పెంచుకుంటూ, సమస్యలను తేలిగ్గా పరిష్కరించుకుంటూ మానసికంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరముంది.

ఇందుకోసం చేయాల్సిన పనులూ సులువు కూడా. మొబైల్‌ ఫోన్‌ను పరిమితంగా వాడితే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే టెలివిజన్‌కే అంటిపెట్టుకొని ఉండటం. ఒకేచోట కూర్చుని అదేపనిగా వీటిని వాడుతుంటే స్థూలకాయం వస్తుంది. ఇది కేవలం గుండెకే కాదు... అనేక ఆరోగ్య అనర్థాలకు కారణం. ఆరోగ్యకరమైనవి తింటూ, తగినంత వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా ఉంటే కేవలం గుండెజబ్బులే కాదు... ఇతర వ్యాధులూ తగ్గుతాయి. 
-డాక్టర్‌ బొల్లినేని భాస్కర్‌రావు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిమ్స్‌ హాస్పిటల్స్‌

ఈ ఎన్‌ టీ ‘తల’మానికం
మన ముక్కు చెవులనూ, అలాగే మన తలను మిగతా దేహంతో అనుసంధానం చేసే మెడ... వీటన్నింటి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ చెవుల సంరక్షణ కోసం... ∙అతి భారీ శబ్దాలు వినికిడి సమస్యను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోట్లలో / పనిప్రదేశాలలో ఇయర్‌ ప్లగ్స్‌ వాడుకోవాలి.  ∙చెవులు వినబడుతుంటేనే చిన్నారులు మాటలు నేర్చుకునేది. అందుకే చిన్నారి పుట్టగానే ఆ పిల్లలకు వెంటనే వినికిడి పరీక్షలు చేయించాలి. ఇలాచేయడం వల్ల  అటు వినికిడి సమస్యనూ, ఇటు మాటలు రాకపోవడాన్నీ ఏకకాలంలో అరికట్టవచ్చు. 

ఇక ముక్కు ఆరోగ్యం కోసం... 
⇒ అన్ని అవయవాలనుంచి తేమను లాగేసినట్టే... ముక్కు నుంచి కూడా తేమను లాగేస్తుంది ఈ సీజన్‌. అందుకే ముక్కు తాలూకు తేమ బాగానే నిర్వహితమయ్యేలా చూసుకునేందుకు నీళ్లు తాగుతూ హైడ్రేటిడ్‌గా ఉండాలి. 

⇒ ముక్కులు బిగదీసుకుపోయే తత్త్వం ఉన్నవారు (ఇది ఈ సీజన్‌లో మరీ ఎక్కువ) సెలైన్‌ నేసల్‌ స్ప్రేలు వాడటం వల్ల ముక్కు ఆరోగ్యం బాగుంటుంది. గొంతు ఆరోగ్యం (థ్రోట్‌ హైజీన్‌) కోసం... 

⇒ స్మోకింగ్, మద్యం అలవాటు మానుకుంటే కేవలం గొంతు ఆరోగ్య మాత్రమే కాదు... మొత్తం దేహం ఆరోగ్యమంతా బాగుంటుంది. 
⇒గొంతు ఆరోగ్యం కోసం గొంతును శుభ్రంగా ఉంచుకోవడం మేలు చేస్తుంది. ఇందుకు గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసుకుని పుక్కిలించడం ఓ మంచి చిట్కా. మసాలాలు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల గొంతులో ఇరిటేషన్లు, యాసిడ్‌ గొంతులోకి వచ్చి గొంతు మండటం అనే సమస్యలు నివారితమవుతాయి. ఇక వీటితో పాటు ఈ చలి సీజన్‌లో మరింత చల్లటి గాలికీ, నీటికి దూరంగా ఉండటం, కాలుష్యానికి ఎక్స్‌పోజ్‌ కాకుండా జాగ్రత్తవహించడం వంటి జాగ్రత్తలు మేలు చేస్తాయని గ్రహించాలి.  -డాక్టర్‌ ఈసీ వినయ కుమార్‌ హెచ్‌ఓడీ అండ్‌ సీనియర్‌ ఈఎన్‌టీ సర్జన్, అపోలో హాస్పిటల్స్‌

ఇంటి పని ఒంటికి మంచిది
మంచి వ్యాయామంతో ఇటు కీళ్లూ, అటు గుండె రెండూ ఒకేసారి ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ వ్యాయామాలు చేయడానికి తమకు సమయం లేదంటూ చాలామంది చెబుతుంటారు. ఈరోజుల్లో కొన్ని ఇంటి పనులు అందరూ చేయాలి. ముఖ్యంగా ఇంట్లోని ఇల్లాళ్లతో పాటు ఇంటి  మగవాళ్లు కూడా. ఉదాహరణకు... తోటపనీ, వస్తువులు తేవడం, లేవగానే బెడ్‌షీట్స్‌ మడతపెట్టడం, ఇల్లు ఊడ్చటం, తుడవడం ఇవన్నీ ఇంట్లోని మహిళలు చేయాల్సిన పనులుగా చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ ఇవన్నీ చేస్తే కీళ్లకు కదలికలు సమకూరి వాటి ఆరోగ్యం మెరుగుపడటం, పోషకాలు అందడం జరుగుతాయి. ఇవే పనులు గుండెజబ్బుల ముప్పునూ తప్పిస్తాయి. అంటే ఒకే పనితో ఎన్నో ప్రమోజనాలుంటాయి.

ఉదా: క్రమం తప్పని వ్యాయామం వల్ల గుండె బలంగా అవుతుంది. (కీళ్లు కూడా) అంతేకాదు... పది లక్షల సార్లు గుండె కొట్టుకుంటే కలిగే శ్రమను ఒక్కసారి చేసే వ్యాయామం దూరం చేస్తుంది. వ్యాయామం వల్ల రక్త ప్రసరణ ప్రక్రియ మెరుగవుతుంది. శరీరంలో కొవ్వు తగ్గుతుంది. ఎముకలు బలంగా మారతాయి. ఒత్తిడీ, నిద్రలేమి వంటివీ తగ్గుతాయి. చాలామంది పురుషులు ΄పోగతాగడం, మద్యంతాగడం తమ జన్మహక్కుగా భావిస్తారు. పైగా కొద్దిపాటి మద్యం గుండెకు మేలు చేస్తుందని సమర్థించుకుంటారు. కానీ... ΄పోగ, మద్యం ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. 

చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు పరచడానికి కొత్త సంవత్సరాన్ని ఒక సందర్భంగా తీసుకుంటారు. మీ నిర్ణయం ఏదైనా... అంటే వ్యాయామం చేయడం, బరువు తగ్గడం, ΄పోగ, మద్యం వంటి అలవాట్లు మానేయడం... ఇవన్నీ వాయిదా వేయకండి.  ఇప్పుడే ఈ కొత్త సంవత్సరంలో మొదలుపెట్టండి. 
-డాక్టర్‌ గాయత్రి కామినేని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ అండ్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్,  కామినేని హాస్పిటల్స్‌

డబ్బు జబ్బుకు ‘బీమా’త్రలు
గత కొన్నేళ్లుగా పర్యావరణంలో వస్తున్న మార్పుల కారణంగా క్యాన్సర్లు అలాగే లైఫ్‌స్టెల్‌ డిసీజెస్‌ అని పిలిచే హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌ వంటివి విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. జబ్బు వచ్చాక చికిత్స ఎలాగూ తప్పదు. ఇప్పుడు వీటి చికిత్సల గురించి ఆలోచించడం కంటే అసలివి రాకుండా ఉండేలా నివారణ చర్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇదో మంచి సమయం. ప్రస్తుత కాలం చాలా అనిశ్చితంగా ఉంది. మన ఆర్థిక పరిస్థితుల్లోగానీ రోజువారీ కార్యక్రమాల్లోగానీ ఎలాంటి మార్పులు వస్తాయో తెలియని అనిశ్చితి. అందుకే మున్ముందు మనందరి ఆరోగ్యాల రక్షణ కోసం, చికిత్సల కోసం మెడికల్‌ ఇన్సూ్యరెన్స్‌ను సిఫార్సు చేస్తున్నాను. మీతో పాటు మీ కుటుంబమంతటికీ ఇన్సూ్యరెన్స్‌ వచ్చేలా పాలసీ తీసుకోండి. 

క్యాన్సర్లు వస్తే అయ్యే ఖర్చులకు బెంబేలెత్తడం కంటే అవి రాకుండా నివారించడానికి అనుసరించాల్సిన మార్గాలు చాలా సులువైనవి. సమాజంలోని అందరూ... ముఖ్యంగా నలభై దాటిన ప్రతివారూ తరచూ ముందస్తు స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.  
అయితే ప్రస్తుతం సాంకేతిక మార్పులతో అందుబాటులోకి వచ్చిన చికిత్సలకు అయ్యే ఖర్చు తడిసిమోపెడు కానుంది. ఆ ఖర్చులు తట్టుకోవాలంటే ఇన్సూ్యరెన్స్‌ ఒక మార్గం. వాటితో పాటు మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తూ నివారించుకోవడం మరో మార్గం. ఈ రెండు మార్గాలను ఎంచుకుని మనల్ని మనం అటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థికంగా కాపాడుకోవడం మన చేతుల్లో ఉన్న పని.  
- డాక్టర్‌ బి. కిశోర్‌రెడ్డి ఎండీ అమోర్‌ హాస్పిటల్స్, అండ్‌ చీఫ్‌ ఆర్థో ఆంకాలజిస్ట్‌ అమోర్‌ హాస్పిటల్‌

ఆరోగ్యానికి బోన్‌.. మెయిన్‌
ఒక భవనం పడిపోకుండా స్థిరంగా ఉండాలన్నా, ఈ దేహం ఒంగిపోకుండా నిటారుగా నిలబడాలన్నా... చిత్రంగా ఈ రెంటికీ అవసరమైనది క్యాల్షియమ్‌. దాదాపు 30 ఏళ్ల వయసులో ఇది గరిష్టంగా ఉండి, ఆ తర్వాత అనేక అంశాల కారణంగా ఇది కొద్దికొద్దిగా తగ్గుతూ పోతుంటుంది. అయితే దాన్ని మరింత కాలం నిలుపుకుంటూ దేహపు ఫ్రేమ్‌ వర్క్‌ అయిన ఎముకల సాంద్రతను (బోన్‌ డెన్సిటీని) గరిష్టకాలం పాటు నిలుపుకోవాలంటే చేయాల్సింది చాలా సులువైన పనులే. మంచి సమతులాహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడం. ఎముకల ఆరోగ్యాన్నీ, సాంద్రతనూ నిలుపుకోవడానికి తీసుకునే ఆహారంలోనూ రుచికరమైనవే ఎక్కువ. 

ఉదాహరణకు పాలు, వెన్న లాంటి డెయిరీ ఫుడ్స్‌; చిక్కుళ్లు, బెండకాయ, క్యాబేజీ, బ్రాకలీ లాంటి రుచికరమైన కూరగాయలు; టేస్టీగా ఉండే అంజీర్‌ లాంటి ఎండుఫలాలు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్‌తో పాటు చాలామంది టేస్టీగా ఫీలై తినే చేపలు. ఇవి ఎముకలతో పాటు మొత్తం దేహ సంపూర్ణ ఆరోగ్యాన్నీ కాపాడతాయి. అయితే వ్యాయామాలు లేకుండా కేవలం ఆహారాలు మాత్రమే ఎముకల సాంద్రత పెంచలేవు. అందుకే... నడక వంటి తమకు అనువైన వ్యాయామాలతో పాటు శ్రమ ఎక్కువగా చేయలేనివారు నడకతో పాటు ఇతరులు సైక్లింగ్, జాగింగ్, ఈత, తమకు ఇష్టమైన స్పోర్ట్స్‌ ఆడటం వంటి స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు చేస్తుంటే  ఎముకలలోని క్యాల్షియమ్‌ చాలాకాలం పదిలంగా ఉంటుంది. 
-డాక్టర్‌ సుధీర్‌రెడ్డి సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ ల్యాండ్‌మార్క్‌ హాస్పిటల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement