
పిల్లాడు అన్నం తినడం లేదు.. వెంటనే ఓ చిప్స్ ప్యాకెట్ తాయిలమైపోతుంది. పాప మారాం చేస్తోంది.. మరో ఎరుపురంగు ప్యాకెట్ తారకమంత్రంగా పనిచేస్తుంది. బుజ్జాయి స్కూలుకు వెళ్తోంది.. ఆ బ్యాగ్‌లో పుస్తకాలు ఉన్నా లేకున్నా చిరుతిళ్ల ప్యాకెట్టు మాత్రం ఉండి తీరుతుంది. చిన్నారి బడి నుంచి వచ్చాడు. ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వీధి చివరి దుకాణంలో ఊరూపేరూ తెలియని రంగురంగుల ప్యాకెట్ వాడి నోరు మూయిస్తుంది. ఏ పదార్థంతో తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారో తెలీని ‘ప్యాకెట్లు’ చిన్నారుల పాలిట విషంగా మారుతున్నాయి. ఈ తిను ‘బండారం’ తెలుసుకోకుండా తల్లిదండ్రులు చేతులారా పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు.
ఏ షాపు చూసినా చిరుతిళ్ల ప్యాకెట్ల తోరణాలు కనిపిస్తుంటాయి. ఏ మాత్రం వాటి ఆకర్షణలో పడినా పిల్లలను ఆస్పత్రుల చుట్టూ తిప్పాల్సిందే. జంక్ ఫుడ్ పేరిట నానా రకా ల పదార్థాలు పాన్‌షాపుల్లో దర్శనమిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగుల్లో ఆకట్టుకునే బొమ్మలతో పిల్లల నోరూరిస్తున్నాయి. కానీ ఇటువంటి చిరుతిళ్లు చిన్నారుల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం తప్పదని చెబుతున్నారు.
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన రింగ్స్ చిప్స్ ప్యాకెట్లు ఎక్కువగా జిల్లాలోని దుకాణాల్లో కనిపిస్తున్నాయి. రింగ్స్, ట్రాప్స్ అనే రకాలకు చెందిన రింగ్స్ చిప్స్ ఒడిశా నుంచి వస్తున్నాయని, ట్రాయ్ రింగ్స్ అనే రకం పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా వస్తున్నాయని దుకాణదారులు చెబుతున్నారు.
ఎక్కువగా పాఠశాలలు ఉండే ప్రాంతాల్లో పాన్ షాపుల్లో రెండు, ఐదు రూపాయలకే ఈ చిరుతిళ్లు దొరుకుతుండడంతో.. అవి తినడం బాలలకు వ్యసనంగా మారిపోతోంది. ముప్పొద్దులా వీటినే తింటుండడంతో చాలా మంది ఉదర సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రంగు రంగు ప్యాకెట్‌లు, నకిలీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి
పిల్లలను జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. జింక్ ఫుడ్స్‌లో కెమికల్స్ ఉంటాయి. ఇవి తిన డం వల్ల చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్యలు, కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి మందగించడం వంటి సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తుంటాయి. పాణిపూరి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్‌లకు పిల్లలను దూరంగా ఉంచాలి.
– జి.వేణుగోపాల్, చిన్నపిల్లల వైద్యుడు, సీహెచ్‌సీ, పాతపట్నం
విద్యార్థులు చదువుకు దూరం
విద్యార్థులు పాఠశాలకు వచ్చేముందు చిప్స్, రింగ్స్ ప్యాకెట్‌లు తినుకుంటూ వస్తుంటా రు. పాఠశాలకు వచ్చి కడుపు నొప్పి, విరేచనాలు అంటూ మా కు చెబుతుంటారు. ఇంటికి విద్యారి్థని పంపిస్తుంటాము. మధ్యాహ్నం భోజనం కూడా పాఠశాలలో సరిగా తినడం లేదు. చిరుతిళ్లకు పిల్లలను దూరంగా ఉంచాలి.
– పొడ్డిడి కృష్ణారావు,హెచ్‌ఎం, ఎంపీపీ మెయిన్ పాఠశాల, పాతపట్నం
(చదవండి: 10th Class Exams: ఈ పంచ సూత్రాలతో ఒత్తిడిని అధిగమిద్దాం..గెలుపును అందుకుందాం!)
Comments
Please login to add a commentAdd a comment