Lung problem
-
ఊపిరితిత్తులు సాగే గుణం కోల్పోతే? పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.. అయితే..
పీల్చేటప్పుడు గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వెళ్లాక ఊపిరితిత్తులు సాగుతాయి. ఊపిరితిత్తులకు ఇలా సాగే గుణం ఉంటుంది. అంతేకాదు... ఈ గుణంతో పాటు అనేకానేక గాలి గదులు ఉండటం వల్ల దేహంలోని అన్ని అవయవాల్లోకెల్లా నీళ్లలో తేలేవి ఊపిరితిత్తులే. కానీ ఒకవేళ ఊపిరితిత్తులు తమకున్న ఈ సాగే గుణాన్ని కోల్పోతే? గాలి లోపలికి ప్రవేశించలేదు. దాంతో మెదడులాంటి కీలక అవయవాలకు ఆక్సిజన్ అందదు. ఊపిరితిత్తులు తమకు ఉన్న సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయేలా చేసే జబ్బే ‘ఇంటస్టిషియల్ లంగ్ డిసీజ్’ (ఐఎల్‌డీ). దీన్నే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ అని కూడా అంటారు. ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఎక్కువ. ఐఎల్‌డీ లేదా లంగ్ ఫైబ్రోసిస్‌పై అవగాహన అవగాహన కల్పించే కథనమిది. ఐఎల్‌డీ / లంగ్ ఫైబ్రోసిస్‌లో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 1. పుట్టుకతోనే ఐఎల్‌డి ఉండటం: దీన్ని ఇడియోపథిక్ ఫైబ్రోసిస్ అంటారు. దీనికి నిర్దిష్టమైన కారణం ఉండదు. వంశపారంపర్యంగా వస్తుంది. తీవ్రమైన ఆయాసం, దగ్గుతో ఇది బయటపడుతుంది. మంచి వయసులో ఉన్నప్పుడూ ఆయాసం వస్తుంటుంది. ప్రతి ఒక్కరిలోనూ జీవితంలోని ఏదో ఓ దశలో దగ్గు, ఆయాసం రావడం సహజమే కావడంతో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా జబ్బు ముదిరి గుండె మీద దుష్ప్రభావాలు కలిగాక... బయటపడుతుంది. 2. సెకండరీ ఐఎల్‌డీ : ఇదో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే... సొంత రోగనిరోధక శక్తి తమపైనే దుష్ప్రభావాలు చూపడం వల్ల వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్లీ్కరోడెర్మా, లూపస్, సోరియాసిస్ వంటì చర్మ, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారిలో చివరిదశలో... లంగ్స్‌కు ఉండే సహజమైన సాగే గుణం తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు సెకండరీ ఐఎల్‌డీ అభివృద్ధి చెందిందా అని పరీక్షించుకోవడం అవసరం. ఇడియోపథిక్ ఐఎల్‌డీని నివారించడం సాధ్యం కాదు. కానీ... సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగి, తగిన చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చు. ఇక సెకండరీ ఐఎల్‌డీ విషయానికి వస్తే... సమస్యకు కారణాన్ని గుర్తించడం, లంగ్స్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించడం, త్వరితంగా వ్యాధి నిర్ధారణతో మంచి ఫలితాలు పొందవచ్చు. చికిత్స : ఐఎల్‌డీని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అయితే మంచి చికిత్సతో జీవితకాలాన్ని పొడిగించడంతో పాటు, దీని వల్ల కలిగే సమస్యల్ని చాలావరకు తగ్గించవచ్చు. చికిత్సలో ప్రధానంగా స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుంది. స్టెరాయిడ్స్ అనగానే అనేక అపోహలతో బాధితుల్లో చాలామంది చికిత్సను నిరాకరిస్తుంటారు. ఫలితంగా జబ్బు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. స్టెరాయిడ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించేందుకు క్యాల్షియమ్ ట్యాబ్లెట్స్, యాంటాసిడ్స్ కూడా ఇస్తారు. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారాన్ని సూచిస్తారు. ఆక్సిజన్ థెరపీ : ఐఎల్‌డీ చికిత్సలో ఆక్సిజన్ థెరపీనీ ఉపయోగిస్తారు. రక్తంలో ఆక్సిజన్ పాళ్లు పెంచడం ఈ థెరపీ ప్రధాన ఉద్దేశం. ఆక్సిజన్ ఇవ్వడం వల్ల లంగ్స్ మీద శ్రమ తగ్గుతుంది. ఊపిరితిత్తులు మందులకు సక్రమంగా రెస్పాండ్ అవుతాయి. దీనితో మంచి ఫలితాలూ వస్తాయి. ఆక్సిజెన్ థెరపీని రెండు రకాలుగా ఇవ్వవచ్చు. 1. సిలెండర్స్ ద్వారా : సంప్రదాయ ఆక్సిజన్ సిలెండర్స్తో ఇవ్వడం ఒక ప్రక్రియ. ఇందులో ఒకసారి ఆక్సిజన్ ఇవ్వడం మొదలయ్యాక తిరిగి నింపడానికి వ్యవధి అవసరం. దాంతో ప్రస్తుతం దీనికి అంత ఆదరణ లేదు. 2. కాన్సంట్రేషన్ మెషిన్ ద్వారా : మన వాతావరణంలోని ఆక్సిజన్‌నే అందిస్తూ, అవసరమైతే పెంచుకుంటూ, వీలైతే తగ్గించుకుంటూ... ఇలా అవసరమైన మోతాదును ఇవి సరఫరా చేస్తాయి. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కరోనా / కోవిడ్ తర్వాత ఆక్సిజన్ కాన్సంట్రేషన్ మెషిన్లపై అవగాహన పెరిగిన విషయం తెలిసిందే. ఈ థెరపీని ఆస్తమా రోగుల్లో, సిగరెట్ తాగడం వల్ల వచ్చే సీఓపీడీ రోగుల్లో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తమా/స్మోకింగ్ అలవాటు ఉండి, ఆక్సీజన్ థెరపీ తీసుకునే బాధితులు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆక్సిజన్ థెరపీని తీసుకోవాలి. లక్షణాలు : మొదట దగ్గు అందునా ప్రధానంగా పొడి దగ్గు వస్తుంటుంది. శరీరం ఏమాత్రం కష్టపడ్డా దగ్గు, ఆయాసం రావడం, అవి తీవ్రం కావడం జరుగుతుంది. ఆయాసం రాత్రి వేళల్లో కంటే పగలే ఎక్కువ. మామూలుగా అలర్జీ లేదా ఆస్తమా వంటి కేసుల్లో ఆయాసం రావడం పగటి కంటే రాత్రుళ్లు ఎక్కువ. కానీ ఇలా రివర్స్‌లో ఉండటమే ఐఎల్‌డీ కేసుల్లో ప్రత్యేకత. కాళ్లలో వాపు, నిద్రలేమి, నీరసం, కడుపులో నొప్పి వస్తాయి. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడంతో పాటు కార్బన్‌డైయాక్సైడ్ మోతాదులు ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతాయి. దాంతో మెదడుపై దుష్ప్రభావాలు పడి, సంబంధిత లక్షణాలు వ్యక్తమవుతాయి. అంటే... బాగా మత్తుగా అనిపించడం, గురక రావడం, బీపీలో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఫిట్స్ రావడమూ జరగవచ్చు. పై లక్షణాలు కనిపించిన తర్వాత కూడా చికిత్స తీసుకోకపోతే నాలుగైదేళ్లలో ఊపిరితిత్తుల ఫెయిల్యూర్‌తో రోగి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు. నిర్ధారణ పరీక్షలు : ఎక్స్–రే పరీక్షతో ఐఎల్‌డీని గుర్తించవచ్చు. ఇందులో రెటిక్యులార్ నాడ్యుల్స్ అంటే... చిన్న చిన్న కణుతులు కనిపించినప్పుడు ‘హై రెజల్యూషన్ సీటీ – చెస్ట్’ పరీక్ష ద్వారా జబ్బును నిర్ధారణ చేస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ డిసీజ్, సొరియాసిస్ లాంటి చర్మం, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారికి ప్రతి ఆర్నెల్లకోసారి ఎక్స్–రే పరీక్ష నిర్వహించి, అనుమానం ఉన్నప్పుడు ‘హై–రెజల్యూషన్ సీటీ’తో ఈ జబ్బును కనుగొంటారు. నిర్ధారణ తర్వాత జబ్బు తీవ్రత, దాని దుష్పరిమాణాలను తెలుసుకోవడం కోసం టూ–డీ ఎకో, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) వంటి పరీక్షలు చేస్తారు. ఏబీజీ పరీక్షతో ధమనుల్లో మంచి రక్తంలో ఆక్సిజన్, కార్బన్‌డైయాక్సైడ్ మోతాదులు ఎలా ఉన్నాయో డాక్టర్లు తెలుసుకుంటారు పై పరీక్షలతో పాటు ఆటో ఇమ్యూన్ జబ్బులు తెలుసుకోడానికి చేయించాల్సిన పరీక్షలు అంటే... ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఈ సెల్స్, యాంటీ డీఎస్ డీఎన్ఏ, సీఆర్పీ వంటి పరీక్షలు తప్పనిసరి. ప్రైమరీ ఐఎల్‌డీ ఉన్నవారి కంటే... ఆటో ఇమ్యూన్ జబ్బుల వల్ల ఐఎల్‌డీ వచ్చిన వారిలో చికిత్స వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. -డాక్టర్ రమణ ప్రసాద్, సీనియర్ పల్మనాలజిస్ట్ -
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
ఊపిరితిత్తుల కౌన్సెలింగ్
నడిస్తే ఆయాసం... ఛాతీనొప్పి..? నా వయసు 33. పదేళ్ల నుంచి ఒక ఆస్బెస్టాస్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మూడేళ్ల నుంచి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాను. మొదట్లో నా సమస్యను టీబీగా అనుమానించి చికిత్స తీసుకున్నాను. ఫలితం లేదు. వడివడిగా నడవలేకపోతున్నాను. పరుగెడితే పట్టలేనంత ఆయాసం, రొప్పుతో పాటు ఛాతీలో భరించలేనంత నొప్పి. మిత్రులు హైదరాబాద్‌కు వెళ్లి స్పెషలిస్టుకు చూపించమంటున్నారు. మీ సలహా ఏమిటి? - బి. నరసింహారావు, వీరులపహాడ్ ఊపిరితిత్తుల వ్యాధులకూ, క్యాన్సర్‌కు దారితీసే కొన్ని ప్రధాన కారణాలలో ఆస్బెస్టాస్ ఒకటి. దీన్నే రాతినార అంటారు. ఆస్బెస్టాస్ గనులు లేదా పరిశ్రమల్లో పనిచేసేవారి ఆరోగ్యంపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆస్బెస్టాస్ రాళ్లను పిండి చేస్తున్న సమయంలో కంటికి కనిపించనంతటి పరిణామంలో వాటినుంచి వెలువడే ఖనిజ ధాతువులు గాలిలో కలుస్తాయి. ఆ గాలిని పీల్చినప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, అక్కడి కణజాలాన్ని రోగగ్రస్తం చేస్తాయి. ఊపిరితిత్తుల చుట్టూ దానికి రక్షణ కవచంలా ఉండే ఒక పలచటి పొర ఉంటుంది. దీన్నే మీసోథీలియోమా అంటారు. ఆస్బెస్టాస్ ఖనిజ ధాతువులు గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన తర్వాత దానికి రక్షణగా ఉండే ఈ పొరను తీవ్రంగా ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. అది క్రమంగా మీసోథీలియోమా క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. దీన్ని మొదట్లోనే గుర్తిస్తే చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పటికే మీరు చాలా కాలయాపన చేశారు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేసినా మీ సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ సమస్యకు కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఊపిరితిత్తుల నిపుణులను కలవండి. సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. అయితే మీరు ఉన్న వృత్తిరీత్యా (ప్రొఫెషనల్ హజార్డ్గా) మీకు మీసోథీలియోమా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పురోగతి కారణంగా అది మీసోథీలియోమా క్యాన్సరే అని నిర్దారణ జరిగినా... దీనికి వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ (వ్యాట్స్) ద్వారా చికిత్స చేయవచ్చు. ఇక అవసరాన్ని బట్టి కీమో, రేడియేషన్ చికిత్సలనూ వినియోగించుకోవచ్చు. ఆస్బెస్టాస్తో వచ్చే ఎంతటి జటిలమైన సమస్యకైనా ఇప్పుడు పెద్దనగరాల్లో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా మీకు దగ్గరలోని పెద్ద సెంటర్లకు వెళ్లండి. -
హృద్రోగంతో బాధపడుతున్న అసాంజే!
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే హృదయ సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారంటూ సోమవారం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు తక్షణం వైద్య సహాయం అవసరమని పేర్కొన్నాయి. అయితే ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని వీడితే అరెస్టు చేస్తారనే భయంతో అసాంజేకు సరైన వైద్యం అందడం లేదని ఆయన మద్దతుదారులను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. వివిధ దేశాల రహస్య పత్రాలను బట్టబయలు చేసి ప్రకంపనలు సృష్టించిన అసాంజే రెండేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఎంబసీలోని ఏసీ రూమ్‌లో ఉండటం.. సూర్య రశ్మికి దూరంగా ఉడటం.. తదితర కారణాలతో అసాంజే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆస్తమా, డయాబెటిస్ మొదలైన సమస్యలను కూడా ఆయన ఎదుర్కొవలసి రావచ్చని వెల్లడించింది. ఈక్వెడార్ దౌత్య కార్యాలయం అసాంజేను ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని బ్రిటన్ విదేశాంగ శాఖను కోరినా స్పందన రాలేదని పేర్కొంది.