What Is Lung Fibrosis - Causes, Symptoms, Diagnosis and Treatment - Sakshi
Sakshi News home page

Lung Fibrosis: ఊపిరితిత్తులు సాగే గుణం కోల్పోతే? పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.. అయితే..

Published Mon, May 29 2023 5:46 PM | Last Updated on Thu, Jul 27 2023 7:16 PM

What Is Lung Fibrosis Causes Symptoms Diagnosis Treatment - Sakshi

పీల్చేటప్పుడు గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. వెళ్లాక  ఊపిరితిత్తులు సాగుతాయి. ఊపిరితిత్తులకు ఇలా సాగే గుణం ఉంటుంది. అంతేకాదు... ఈ గుణంతో పాటు అనేకానేక గాలి గదులు ఉండటం వల్ల దేహంలోని అన్ని అవయవాల్లోకెల్లా నీళ్లలో తేలేవి ఊపిరితిత్తులే. కానీ ఒకవేళ ఊపిరితిత్తులు తమకున్న ఈ సాగే గుణాన్ని కోల్పోతే?

గాలి లోపలికి ప్రవేశించలేదు. దాంతో మెదడులాంటి కీలక అవయవాలకు ఆక్సిజన్‌ అందదు. ఊపిరితిత్తులు తమకు ఉన్న సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయేలా చేసే జబ్బే ‘ఇంటస్టిషియల్‌ లంగ్‌ డిసీజ్‌’ (ఐఎల్‌డీ).  దీన్నే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌ అని కూడా అంటారు. ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే మధ్య వయస్కులు, వృద్ధుల్లో ఎక్కువ. ఐఎల్‌డీ లేదా లంగ్‌ ఫైబ్రోసిస్‌పై అవగాహన అవగాహన కల్పించే కథనమిది. 

ఐఎల్‌డీ / లంగ్‌ ఫైబ్రోసిస్‌లో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 
1. పుట్టుకతోనే ఐఎల్‌డి ఉండటం: దీన్ని ఇడియోపథిక్‌ ఫైబ్రోసిస్‌ అంటారు. దీనికి నిర్దిష్టమైన కారణం ఉండదు. వంశపారంపర్యంగా వస్తుంది. తీవ్రమైన ఆయాసం, దగ్గుతో ఇది బయటపడుతుంది. మంచి వయసులో ఉన్నప్పుడూ ఆయాసం వస్తుంటుంది. ప్రతి ఒక్కరిలోనూ జీవితంలోని ఏదో ఓ దశలో దగ్గు, ఆయాసం రావడం సహజమే కావడంతో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా జబ్బు ముదిరి  గుండె మీద దుష్ప్రభావాలు కలిగాక... బయటపడుతుంది.  

2. సెకండరీ ఐఎల్‌డీ : ఇదో ఆటో 
ఇమ్యూన్‌ డిసీజెస్‌ అంటే... సొంత రోగనిరోధక శక్తి తమపైనే దుష్ప్రభావాలు చూపడం వల్ల వచ్చే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, స్లీ్కరోడెర్మా, లూపస్, సోరియాసిస్‌ వంటì  చర్మ, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారిలో చివరిదశలో... లంగ్స్‌కు ఉండే సహజమైన సాగే గుణం తగ్గడం వల్ల ఈ సమస్య  వస్తుంది. అందుకే ఆటో ఇమ్యూన్‌ డిసీజెస్‌ ఉన్నప్పుడు సెకండరీ ఐఎల్‌డీ అభివృద్ధి చెందిందా అని పరీక్షించుకోవడం అవసరం.  

ఇడియోపథిక్‌ ఐఎల్‌డీని నివారించడం సాధ్యం కాదు. కానీ... సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరిగి, తగిన చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా  నియంత్రణలో ఉంచవచ్చు. ఇక సెకండరీ ఐఎల్‌డీ విషయానికి వస్తే... సమస్యకు  కారణాన్ని గుర్తించడం, లంగ్స్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించడం,  త్వరితంగా వ్యాధి నిర్ధారణతో  మంచి ఫలితాలు పొందవచ్చు. 

చికిత్స :
ఐఎల్‌డీని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. అయితే మంచి చికిత్సతో జీవితకాలాన్ని పొడిగించడంతో పాటు, దీని వల్ల కలిగే సమస్యల్ని చాలావరకు తగ్గించవచ్చు. చికిత్సలో ప్రధానంగా స్టెరాయిడ్స్‌ వాడాల్సి ఉంటుంది.

స్టెరాయిడ్స్‌ అనగానే అనేక అపోహలతో బాధితుల్లో చాలామంది చికిత్సను నిరాకరిస్తుంటారు. ఫలితంగా జబ్బు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. స్టెరాయిడ్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించేందుకు క్యాల్షియమ్‌ ట్యాబ్లెట్స్, యాంటాసిడ్స్‌ కూడా ఇస్తారు. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారాన్ని సూచిస్తారు. 

ఆక్సిజన్‌ థెరపీ :  ఐఎల్‌డీ చికిత్సలో ఆక్సిజన్‌ థెరపీనీ ఉపయోగిస్తారు. రక్తంలో ఆక్సిజన్‌ పాళ్లు పెంచడం ఈ థెరపీ ప్రధాన ఉద్దేశం. ఆక్సిజన్‌ ఇవ్వడం వల్ల లంగ్స్‌ మీద శ్రమ తగ్గుతుంది. ఊపిరితిత్తులు మందులకు సక్రమంగా రెస్పాండ్‌ అవుతాయి.  దీనితో మంచి ఫలితాలూ వస్తాయి. 

ఆక్సిజెన్‌ థెరపీని రెండు రకాలుగా ఇవ్వవచ్చు. 
1. సిలెండర్స్‌ ద్వారా : సంప్రదాయ ఆక్సిజన్‌ సిలెండర్స్‌తో ఇవ్వడం ఒక ప్రక్రియ. ఇందులో ఒకసారి ఆక్సిజన్‌ ఇవ్వడం మొదలయ్యాక తిరిగి నింపడానికి వ్యవధి అవసరం. దాంతో  ప్రస్తుతం దీనికి అంత ఆదరణ లేదు. 

2. కాన్సంట్రేషన్‌ మెషిన్‌ ద్వారా : మన వాతావరణంలోని ఆక్సిజన్‌నే అందిస్తూ, అవసరమైతే పెంచుకుంటూ, వీలైతే తగ్గించుకుంటూ... ఇలా అవసరమైన మోతాదును ఇవి సరఫరా చేస్తాయి. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. కరోనా / కోవిడ్‌ తర్వాత ఆక్సిజన్‌ కాన్సంట్రేషన్‌ మెషిన్లపై అవగాహన పెరిగిన విషయం తెలిసిందే. 

ఈ థెరపీని ఆస్తమా రోగుల్లో, సిగరెట్‌ తాగడం వల్ల వచ్చే సీఓపీడీ రోగుల్లో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తమా/స్మోకింగ్‌ అలవాటు ఉండి, ఆక్సీజన్‌ థెరపీ తీసుకునే బాధితులు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆక్సిజన్‌ థెరపీని తీసుకోవాలి.

లక్షణాలు :
మొదట దగ్గు అందునా ప్రధానంగా పొడి దగ్గు వస్తుంటుంది. శరీరం ఏమాత్రం కష్టపడ్డా దగ్గు, ఆయాసం రావడం, అవి తీవ్రం కావడం జరుగుతుంది. ఆయాసం రాత్రి వేళల్లో  కంటే పగలే ఎక్కువ. మామూలుగా అలర్జీ లేదా ఆస్తమా వంటి కేసుల్లో ఆయాసం రావడం పగటి కంటే రాత్రుళ్లు ఎక్కువ. కానీ ఇలా రివర్స్‌లో ఉండటమే  ఐఎల్‌డీ కేసుల్లో ప్రత్యేకత.

కాళ్లలో వాపు, నిద్రలేమి, నీరసం, కడుపులో నొప్పి వస్తాయి. అప్పటికీ నిర్లక్ష్యం చేస్తే రక్తంలో ఆక్సిజన్‌ తగ్గిపోవడంతో పాటు కార్బన్‌డైయాక్సైడ్‌  మోతాదులు ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతాయి. దాంతో మెదడుపై దుష్ప్రభావాలు పడి, సంబంధిత లక్షణాలు వ్యక్తమవుతాయి. అంటే... బాగా మత్తుగా అనిపించడం, గురక రావడం, బీపీలో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కొన్నిసార్లు ఫిట్స్‌ రావడమూ జరగవచ్చు. పై లక్షణాలు కనిపించిన తర్వాత కూడా చికిత్స తీసుకోకపోతే నాలుగైదేళ్లలో ఊపిరితిత్తుల ఫెయిల్యూర్‌తో రోగి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తాడు. 

నిర్ధారణ పరీక్షలు :
ఎక్స్‌–రే పరీక్షతో ఐఎల్‌డీని గుర్తించవచ్చు. ఇందులో రెటిక్యులార్‌ నాడ్యుల్స్‌ అంటే... చిన్న చిన్న కణుతులు కనిపించినప్పుడు ‘హై రెజల్యూషన్‌ సీటీ – చెస్ట్‌’ పరీక్ష ద్వారా జబ్బును నిర్ధారణ చేస్తారు.

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, లూపస్‌ డిసీజ్, సొరియాసిస్‌ లాంటి చర్మం, కీళ్ల సంబంధమైన జబ్బులు ఉన్నవారికి ప్రతి ఆర్నెల్లకోసారి ఎక్స్‌–రే పరీక్ష నిర్వహించి, అనుమానం ఉన్నప్పుడు ‘హై–రెజల్యూషన్‌ సీటీ’తో ఈ జబ్బును కనుగొంటారు.

నిర్ధారణ తర్వాత జబ్బు తీవ్రత, దాని దుష్పరిమాణాలను తెలుసుకోవడం కోసం  టూ–డీ ఎకో, ఆర్టీరియల్‌ బ్లడ్‌ గ్యాస్‌ (ఏబీజీ) వంటి పరీక్షలు చేస్తారు. ఏబీజీ పరీక్షతో ధమనుల్లో మంచి రక్తంలో ఆక్సిజన్, కార్బన్‌డైయాక్సైడ్‌ మోతాదులు ఎలా ఉన్నాయో డాక్టర్లు తెలుసుకుంటారు 

పై పరీక్షలతో పాటు ఆటో ఇమ్యూన్‌ జబ్బులు తెలుసుకోడానికి చేయించాల్సిన పరీక్షలు అంటే... ఆర్‌ఏ ఫ్యాక్టర్, ఏఎన్‌ఏ, ఎల్‌ఈ సెల్స్, యాంటీ డీఎస్‌ డీఎన్‌ఏ, సీఆర్‌పీ వంటి పరీక్షలు తప్పనిసరి. ప్రైమరీ ఐఎల్‌డీ ఉన్నవారి కంటే... ఆటో ఇమ్యూన్‌ జబ్బుల వల్ల ఐఎల్‌డీ వచ్చిన వారిలో చికిత్స  వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
-డాక్టర్‌ రమణ ప్రసాద్‌, సీనియర్‌ పల్మనాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement