హృద్రోగంతో బాధపడుతున్న అసాంజే!
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే హృదయ సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారంటూ సోమవారం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు తక్షణం వైద్య సహాయం అవసరమని పేర్కొన్నాయి. అయితే ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని వీడితే అరెస్టు చేస్తారనే భయంతో అసాంజేకు సరైన వైద్యం అందడం లేదని ఆయన మద్దతుదారులను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది.
వివిధ దేశాల రహస్య పత్రాలను బట్టబయలు చేసి ప్రకంపనలు సృష్టించిన అసాంజే రెండేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఎంబసీలోని ఏసీ రూమ్‌లో ఉండటం.. సూర్య రశ్మికి దూరంగా ఉడటం.. తదితర కారణాలతో అసాంజే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆస్తమా, డయాబెటిస్ మొదలైన సమస్యలను కూడా ఆయన ఎదుర్కొవలసి రావచ్చని వెల్లడించింది. ఈక్వెడార్ దౌత్య కార్యాలయం అసాంజేను ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని బ్రిటన్ విదేశాంగ శాఖను కోరినా స్పందన రాలేదని పేర్కొంది.