ఐదేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన జులియన్ అసాంజే
అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘన నేరాన్ని అంగీకరించిన అసాంజే?
లండన్ జైలులో కుదిరిన ఒప్పందం!!
18 అభియోగాలకుగానూ ఒక్కదానిపైనే విచారణ?
అమెరికా కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు అసాంజే అంగీకారం
బుధవారం సైపన్ కోర్టు ఎదుట అసాంజే హాజరు
ఆ ఒక్క కేసులో 62 నెలల శిక్ష విధించే అవకాశం
బ్రిటన్ కారాగార శిక్షను పరిగణనలోకి తీసుకోనున్న అమెరికా కోర్టు
ఆ వెంటనే సొంత దేశం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు అనుమతి
అసాంజే విడుదలను ధృవీకరించిన వికీలీక్స్
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. లండన్ బెల్‌మార్ష్ జైలు నుంచి సోమవారం ఆయన విడుదల అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆయన నేరం ఒప్పుకున్నారని, ఈ మేరకు అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చిన ఆయనకు.. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి సైతం లభించినట్లు తెలుస్తోంది.
జులియన్ అసాంజే(52) విడుదలను వికీలీక్స్ సంస్థ ఎక్స్ ద్వారా ధృవీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి. బెల్‌మార్ష్ జైలులో 1901 రోజులు ఆయన గడిపారు. జూన్ 24 ఉదయం ఆయన విడుదలయ్యారు. లండన్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్కడి నుంచి ఆయన స్టాన్‌స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అని వికీలీక్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది.
JULIAN ASSANGE IS FREE
Julian Assange is free. He left Belmarsh maximum security prison on the morning of 24 June, after having spent 1901 days there. He was granted bail by the High Court in London and was released at Stansted airport during the afternoon, where he boarded a…— WikiLeaks (@wikileaks) June 24, 2024
అంతేకాదు.. అసాంజే విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వాళ్లకు వికీలీక్స్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందులో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల కృషి కూడా ఉందని తెలిపింది. అయితే అమెరికా న్యాయవిభాగంతో ఒప్పందం జరిగిందని ధృవీకరించిన వికీలీక్స్.. ఆ ఒప్పందం తాలుకా వివరాలు అధికారికంగా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఈలోపు..
ఉత్తర మరియానా దీవులలోని(US) కోర్టులో దాఖలైన పత్రాల సారాంశం సోమవారం రాత్రి బయటకు వచ్చింది. అందులో.. బ్రిటన్‌లో కస్టడీలో ఉన్న అసాంజే.. అమెరికా గూఢచర్య చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు అని ఉంది. అంతేకాదు ఆయనపై మోపబడ్డ 18 అభియోగాలన్నింటిని(17 అభియోగాలు+వికీలీక్స్‌పై కంప్యూటర్ దుర్వినియోగం కేసు).. ఒక్క కేసుగానే కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సైపన్ కోర్టు ఎదుట అసాంజే విచారణకు హాజరవుతారని, కోర్టు ఆయనకు 62 నెలల శిక్ష విధించనుందని, అయితే బ్రిటన్‌లో ఆయన అనుభవించిన శిక్షా కాలాన్ని ఇందులో నుంచి మినహాయిస్తారని, ఆపై ఆయన్ను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతిస్తారన్నది ఆ పత్రాల సారాంశం.
అసాంజేను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల్లో ఈ అభ్యర్థనపై విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
#JulianAssange is free!!! After 14 years of being detained, today he left the UK. I can’t wait to give him a hug and go on a walk with him. pic.twitter.com/sPwVrt1U9y
— Juan Passarelli (@JuanAndOnlyDude) June 25, 2024
భావ స్వేచ్చప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా హీరోగా జేజేలు అందుకున్న అసాంజే.. అమెరికా పాలిట మాత్రం విలన్‌గా తయారయ్యాడు. ఇరాక్, అఫ్గనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలను 2010లో ఆయన స్థాపించిన విజిల్ బ్లోయర్ వెబ్‌సైట్ వికీలీక్స్ విడుదల చేసింది.
ఏప్రిల్ 2010లో.. హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన బాగ్దాద్ వైమానిక దాడికి సంబంధించిన వీడియో విడుదల చేసింది. అమెరికా చేసిన ఈ దాడిలో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. జులై 2010 - వికీలీక్స్ 91,000కు పైగా పత్రాలను విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా అఫ్గానిస్థాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి. అక్టోబర్ 2010లో ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ విడుదల చేసింది.
ఈ లీక్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అమెరికా ఆయనపై అబియోగాలు మోపి.. విచారించేందుకు సిద్ధపడింది. అయితే ఈ అభియోగాలే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్ధతుదారుల్ని తెచ్చిపెట్టింది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించాడంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అభిమానులు పెరిగిపోయారు. మరోవైపు అసాంజేపై అమెరికా మోపిన నేరాభియోగాల్ని వాక్ స్వేచ్చకు తీవ్ర ముప్పుగా మేధోవర్గం అభివర్ణించింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. అమెరికా వాదనకు సైతం ఓ వర్గం నుంచి మద్ధతు లభించింది. చివరకు.. 14 ఏళ్ల తర్వాత.. ఒక డీల్ ప్రకారమే ఆయన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అసాంజే మీద కేసు ఏంటంటే..
2010-11 మధ్య అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయాల్ని వికీలీక్స్ బయటపెట్టింది. అందులో బాగ్దాద్‌పై జరిపిన వైమానిక దాడుల ఫుటేజీ కూడా ఉంది. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్(మాజీ) చెల్సీ మేనింగ్ సహకారంతోనే అసాంజే ఈ లీకులకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆమెకు 2013లో 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 2017లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమె శిక్షను తగ్గించారు.
2023లో ఓ ఇంటర్వ్యూలో చెల్సీ మేనింగ్
ఇక.. 2019లో డొనాల్డ్ ట్రంప్ పాలనలో అసాంజేపై 18 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికా గూఢాచర్య చట్టం ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం.
ఐదేళ్లుగా జైల్లో..
ఈ వ్యవహారంతో.. అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. అదే సమయంలో స్వీడన్ నుంచి ఆయనపై లైంగిక దాడి విచారణ జరిగింది. ఇక ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేసిన మోరిస్‌తో అసాంజేకు చనువు పెరిగింది. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడే.. ఆమెతో డేటింగ్ చేసి ఇద్దరుపిల్లల్ని కన్నారాయన. అసాంజే 2019 ఏప్రిల్ నుంచి లండన్‌లోని బెల్‌మార్ష్ జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయన స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోవడం గమనార్హం.
14 ఏళ్లుగా నాటకీయ పరిణామాలు
పదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించాయి. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని.. వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదించింది. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది కూడా. ఈ క్రమంలో ఆయనపై అభియోగాలు నిజమని తేలితే.. ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడేది. అయితే అటు ఆస్ట్రేలియా విజ్ఞప్తులు, ఇటు పాత్రికేయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గి బైడెన్ ప్రభుత్వం చివరకు ఆయన విడుదలకు సిద్ధమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment