జూలియన్ అసాంజ్ ‘వికీలీక్స్’ హీరో. స్మార్ట్‌గా ఉంటాడు. సాఫ్ట్‌గా ఉంటాడు. షార్ప్‌గా ఉంటాడు. ఇప్పుడు లండన్‌లో ఉన్నాడు. ‘ఆడు నాక్కావాలి’ అంటున్నాడు జో బైడెన్! ‘వస్తే తీసుకెళ్లు’ అంటోంది బ్రిటన్. పదేళ్ల క్రితం అమెరికాను పెద్ద దెబ్బ కొట్టాడు అసాంజ్. అదీ కోపం ఒబామాకు.. ట్రంప్‌కి.. బైడెన్‌కి. ఇప్పుడు అతడి కోసం వేట మొదలైంది. వేట కోసం ఒక యువతి పెదవులకు లిప్‌స్టిక్ అద్దుకుని, చేత్తో గన్ పట్టుకుని లండన్ బయల్దేరిందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్! అసాంజ్ అంటే అమ్మాయిల్లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను అసాంజ్‌పై ఒక వలగా అమెరికా విసరబోతోందా?! జైల్లో ఉన్నాడిప్పుడు జూలియన్ అసాంజ్.
లండన్‌లోని ‘హర్ మెజెస్టీస్ ప్రిజన్’లో అసాంజ్!
హర్ మెజెస్టీనా!! అసాంజ్ లైఫ్ అంతా అమ్మాయిలేనా?! అరెస్ట్ అవడానికి ముందు అమ్మాయిలు.. అరెస్ట్ అయ్యాక అమ్మాయిలు.. జైలు పేరు కూడా హర్ మెజెస్టీ! అప్పుడే ఏమైందీ! అతడిని హతమార్చేందుకు తయారవుతున్నది కూడా ఒక అమ్మాయే! ఇంటెలిజెన్స్ అంచనా. పదేళ్లుగా లండన్‌లోని జైళ్లలో ఉన్నాడు అసాంజ్. ఆ మాట కరెక్టు కాదు. పదేళ్లుగా అమెరికా అతడి కోసం వేటాడుతోంది. అతడొక సద్దాం హుస్సేన్ ఆ దేశానికి. ఒక ఒసామా బిన్ లాడెన్ కూడా. వాళ్లిద్దరినీ పట్టుకోగలిగింది. అసాంజ్‌ని మాత్రం పట్టుకోలేక పోయింది. అంతే తేడా.
అమ్మాయిలకే అతడంటే ఇష్టం
పదేళ్ల క్రితం.. అమెరికా విదేశాంగ కార్యాలయం. హిల్లరీ క్లింటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి. అసాంజ్ ఇష్యూని తేల్చేయమని చెప్పేశారు ప్రెసిడెంట్ ఒబామా.
‘అతడికి ఇష్టమైనవి ఏమిటి?’
‘రహస్యాలు’
‘అమ్మాయిలు కారా?’
‘కారు. అమ్మాయిలకే అతడంటే ఇష్టం’
‘అది చాలు’
అసాంజ్‌ను పట్టుకునేందుకు ప్లాన్ మొదలైంది. స్వీడన్‌లో ఇద్దరు మహిళలు అసాంజ్ తమపై అత్యాచారం చేశాడని కేసు పెట్టారు. అది నిలవలేదు! స్వీడన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తే నేరస్థులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం కింద అతడిని తమ దేశం రప్పించాలని అమెరికా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఒబామా పట్టుకోలేకపోయాడు. ట్రంప్ పట్టుకోవాలన్నంత కసి చూపించలేదు. జో బైడెన్ మరీ పట్టనట్లయితే లేరు. ఇక బ్రిటన్ తన పట్టు విడవడానికి సిద్ధంగా లేదు. ఆస్ట్రేలియాకు కూడా క్వీన్ ఎలిజబెత్తే రాణిగారు. అసాంజ్ ఆస్ట్రేలియా పౌరుడు. ఎంత లేదన్నా అదొకటి పనిచేస్తుంటుంది.
అసాంజ్ మరెంత కాలం సురక్షితంగా ఉంటారు?
అయితే ఎంతకాలమని ‘హర్ మెజెస్టీ ప్రిజన్’లో అసాంజ్ సురక్షితంగా ఉంటారు? అతడిని ప్రాణాలతో పట్టుకోవడం లేదంటే హతమార్చడం అనే లక్ష్యంతో ఒక అమెరికన్ టీమ్ బ్రిటన్‌లో పనిచేస్తోందని వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. బ్రిటన్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘సీక్రెట్ ఇంటిలిజెన్స్ సర్వీస్’ దగ్గర కొంత సమాచారం ఉందనైతే అంటున్నారు. కానీ అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘సి.ఐ.ఎ.’ దగ్గర ఉన్న సమాచారం అయితే కరెక్టే. అసాంజ్ జూలియన్‌కు స్త్రీ బలహీనత లేదు. స్త్రీలకు అతడి బలహీనత ఉందన్నది అతడిపై జోక్ కావచ్చు. అందంగా ఉంటాడు అతడు. నలభై తొమ్మిదేళ్లు ఇప్పుడు. పదేళ్ల క్రితం అతడి ముఖంపై చిరునవ్వు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది.
అసాంజ్‌కు ప్రేమను పంచినవారంతా స్త్రీలే. ఆ శక్తి అతడిలో పని చేస్తోందా? ఇప్పుడు జైల్లో ఉండటానికి ముందు.. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అండగా ఉన్నది, అతడికి తినడానికింత తెచ్చిపెట్టిందీ ఒక స్త్రీ మూర్తే. పమేలా ఆండర్సన్. కెనడియన్–అమెరికన్ నటి, మోడల్. టెలివిజన్ పర్సనాలిటీ. అతడి కంటే వయసులో నాలుగేళ్లు పెద్ద. అసాంజ్‌ని ఆమె ప్రేమిస్తున్నారని మూడేళ్ల క్రితం బ్రిటిష్ టాబ్లాయిడ్స్ అదే పనిగా కొన్నాళ్లు రాసి, అలసి ఊరుకున్నాయి. పమేలా మాత్రం ఇప్పటికే అసాంజ్‌ని కలుస్తూనే ఉన్నారు. ఆయన కోసం పిజ్జాలు, బర్గర్‌లు ప్యాక్ చేయించి తెస్తూనే ఉన్నారు.
అతడిని ప్రపంచ ప్రసిద్ధుడిని చేసిన స్త్రీ మాత్రం చెల్సీ ఎలిజబెత్ మ్యానింగ్. అసాంజ్ కంటే పదిహేడేళ్లు చిన్న. యూఎస్ ఆర్మీలో సోల్జర్. చెల్సీ అబ్బాయిగా పుట్టి అమ్మాయి అయింది. ఆమె ద్వారా అమెరికన్ మిలటరీ రహస్యాలను సంపాదించాడు అసాంజ్. మొత్తం 7 లక్షల, 50 వేల ఫైల్స్. అంత పెద్ద మొత్తంలో సీక్రెట్‌లను చెల్సీ అతడికి ఎందుకు ఇచ్చిందనే దానికి కారణం లేదు. ఇచ్చింది. తెలిసో, తెలియకో ఇచ్చింది. పర్యవసానంగా ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించింది. అసాంజ్ ఎవరికైనా రుణపడి ఉన్నాడా అంటే ఆమెకే కావచ్చు. అతడు రుణపడి ఉండవలసిన వ్యక్తులు మరికొందరు కూడా ఉంటారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఈక్వెడార్ దేశాలలో తన నలుగురు సంతానాన్ని పెంచుతున్న అజ్ఞాత తల్లులు. అతడు బయటపెట్టే నిజాలు తప్ప, అతడి గురించిన నిజాలు బయటికి ప్రపంచానికి దాదాపుగా తెలియవు. అతడి జీవిత భాగస్వామి ఎవరో కూడా తెలియదు.
అసాంజ్ జీవితంపై తల్లి ప్రభావం ఎక్కువ?
అందరి కన్నా కూడా అసాంజ్ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిన స్త్రీ అతడి తల్లి.. క్రిస్టయిన్. కొడుకు జీవితానికి, తల్లి జీవితానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. తల్లికి వచ్చిన సమస్యే కొడుక్కీ వచ్చింది. క్రిస్టయిన్ తన రెండో భర్త బిడ్డ కోసం కోర్టుల చుట్టూ తిరిగారు. చివరికి అతడి నుంచి పిల్లల్ని దాచేశారు. అసాంజ్ కూడా తన ప్రియురాలి వల్ల తనకు కలిగిన కొడుకును దక్కించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగాడు. అసాంజ్ నుంచి విడిపోతూ ఆ అమ్మాయి తన బిడ్డను తనకు ఇప్పించమని కోర్టును ఆశ్రయించింది. ఈ రెండు అనుభవాల అనంతరం అసాంజ్ తన తల్లితో కలిసి... ఆస్ట్రేలియాలో బిడ్డల సంరక్షణ చట్టాలకు సంబంధించిన డేటాబ్యాంక్ (సమాచార నిధి) ఏర్పరిచారు. సమాచారం అందుబాటులో లేని సమాజం చీకట్లో ఉన్నట్లేని బలంగా నమ్మిన అసాంజ్.. దేశాల రహస్యాలను లీక్ చేయడాన్ని వృత్తిగా పెట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?!
ఇంటర్ నెట్ నిపుణుడు
జూలియన్ అసాంజ్ జర్నలిస్టు. పబ్లిషర్. ఇంటర్‌నెట్ వ్యవహారాలలో నిపుణుడు. ‘వికీలిక్స్’ సంస్థకు ఎడిటర్ కమ్ ఛైర్మన్. దేశాలు తిరిగి రహస్యాలు సేకరించేవాడు. బయటపెట్టేవాడు. 2010 నవంబర్‌లో అమెరికా దౌత్య వ్యూహాల అధికార పత్రాలు తొలివిడతగా లీక్ కాగానే అసాంజ్ కోసం వేట మొదలైంది! అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ ‘రెడ్ కార్నర్’ నోటీసు జారీ చేసింది. దాంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత బ్రిటన్ పోలీసులకు లొంగిపోయాడు.
వికీలీక్స్ ఒక వెబ్‌సైట్. 2006లో ప్రారంభం అయింది. అంతకు ముందు అసాంజ్ కంప్యూటర్ ప్రోగ్రామర్. హ్యాకర్ కూడా. ఫిజిక్స్, మేథ్స్ అతడి సబ్జెక్టులు. పత్రికా స్వాతంత్య్రం, సమాచార హక్కు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్... అతడి అభిమాన అంశాలు. కెన్యాలో అమాయక పౌరుల ఊచకోత, ఆఫ్రికా తీరం వెంబడి పేరుకుపోతున్న వ్యర్థ రసాయనాలు, గ్వాంటనామో జైలు దుర్భర పరిస్థితి వెనుక అమెరికా అమానుష విధానాలు, మల్టీనేషనల్ బ్యాంకుల అవకతవకల్ని రూఢీ పరిచే పత్రాలను సంపాదించి తన సైట్‌లో పెట్టేవాడు. ఆ క్రమంలోనే ఆఫ్ఘాన్, ఇరాక్ యుద్ధాలలో అమెరికా కుతంత్రాలను వెల్లడించే సమాచారాన్ని లీక్ చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అమెరికా నిశ్చేష్టురాలైంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment