అగ్రరాజ్యంపై యుద్ధం చేయాలంటే మారణాయుధాలు అవసరం లేదని, ఒక ల్యాప్‌టాప్‌తో దాన్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చని గుక్కతిప్పుకోనీయకుండా చేయొచ్చని నిరూపించిన వికీలీక్స్ అధిపతి జూలియన్ అసాంజ్‌కు పద్నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. తన సాహసవంతమైన కార్యకలాపాల కారణంగా అయినవాళ్లకు దూరమై కొన్నాళ్లు లండన్‌లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో తలదాచుకుని, ఆ తర్వాత బ్రిటన్ చెరలో మగ్గిన అసాంజ్ నేరాంగీకార ప్రకటనకు సిద్ధపడి అమెరికా ఇవ్వజూపిన వెసులుబాటుకు తలొగ్గక తప్పని స్థితి ఏర్పడటం స్వేచ్ఛాప్రియులకూ, పాత్రికేయలోకానికీ చివుక్కుమనిపిస్తుంది.
ఒప్పందం ప్రకారం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని 14 దీవుల సముదాయమైన ఉత్తర మెరీనా ఐలాండ్స్ (ఎన్‌ఎంఐ)లో ఒకటైన సైపాన్ దీవిలోని న్యాయస్థానం ఎదుట అసాంజ్ హాజరై తన తప్పు ఒప్పుకున్నాడు. అమెరికాలో అడుగుపెట్టడానికి అసాంజ్ విముఖత చూపిన కారణంగా, సాంకేతికంగా దానిలోనే భాగమైన సైపాన్‌లో ఈ తతంగం పూర్తిచేయటానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు.
అమెరికా ఆయనపై గూఢచర్యానికి సంబంధించి 18 ఆరోపణలు చేసింది. వాటి ఆధారంగా విచారణ జరిగితే అసాంజ్‌కు 175 ఏళ్ల శిక్షపడేది. కానీ ఒప్పందం ప్రకారం అందులో ఒకే ఒక నేరారోపణ మోపి, దానికింద అయిదేళ్ల శిక్షవిధించి బ్రిటన్ జైల్లో అనుభవించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే విడుదల చేయటానికి ఒప్పందం కుదిరింది. వికీలీక్స్ ఎప్పటిలా పనిచేస్తుందా లేదా అన్నది తేలాల్సి వుంది.
ఏం నేరం చేశాడు అసాంజ్? యుద్ధాలనూ, దురాక్రమణలనూ సమర్థించుకునేందుకు అగ్రరాజ్యాలు ప్రచారంలో పెట్టే అబద్ధాలను తుత్తినియలు చేశాడు. అమెరికా దురాక్రమణలో ఉన్న ఇరాక్‌లో ఒక మారుమూల పల్లెలో వీధిలో నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరు సాధారణ పౌరులనూ, రాయిటర్ జర్నలిస్టులు ఇద్దరినీ కేవలం సరదా కోసం బాంబులతో హతమార్చిన అమెరికా సైనికుల దురంతాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు.
ఉగ్రవాదాన్ని అంతంచేసే పేరిట ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా కూటమి దేశాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాయో, ఎలా నరమేధాన్ని సాగించాయో తెలిపే లక్ష పత్రాలను బట్టబయలు చేశాడు. వర్ధమాన దేశాలే కాదు... సాటికి సరైన సంపన్న దేశాల విషయంలోనూ అమెరికాకు ఎంత చిన్న చూపున్నదో ఏకరువు పెట్టే కోట్లాది సందేశాలను బజారున పడేశాడు. అవన్నీ వేర్వేరు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన సందేశాలు. ఎక్కడి ప్రభుత్వం ఎటువంటిదో, సైనిక వ్యవస్థల తీరుతెన్నులేమిటో తెలిపే అంచనాలు వాటిల్లో ఉన్నాయి.
ఆఖరికి దేశదేశాల పాలకులు తమ అక్రమార్జనను వేరే దేశాల బ్యాంకులకు తరలిస్తున్న వైనాన్ని ఆధారాలతో వెల్లడించాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2006లో జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ‘మన అనుకూలుర’ వివరాలు పంపిన సందేశం కూడా అసాంజ్ లీక్స్‌లో ఉంది. ఇవన్నీ గూఢచర్యం కిందికొస్తాయని ఇన్నేళ్లుగా అమెరికా చేసిన వాదనలో పసలేదు. ఆ దేశమైనా, పాశ్చాత్య దేశాలైనా సందర్భం ఉన్నా లేకపోయినా ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెబుతుంటాయి. తెరవెనక మాత్రం అందుకు విరుద్ధమైన పోకడలకు పోతుంటాయి. దీన్నే సాక్ష్యాధారాలతో అసాంజ్ వెల్లడించాడు.
అప్రజాస్వామికమైన ఆ కార్యకలాపాలు తాము నమ్మే విలువలకూ, విధానాలకూ పూర్తి విరుద్ధమని ఆ దేశాల పౌరులు గ్రహించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చివుంటే అంతిమంగా అక్కడి సమాజాలకూ, ప్రపంచానికీ మేలు జరిగేది. కానీ వంచకులను విశ్వసించటం, అబద్ధాలకు పట్టంగట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి. అసాంజ్ విలువను ఇలాంటి సమాజాలు ఏం గుర్తించగలవు? ఆయన ఇరాక్, అఫ్గాన్‌లలో అమెరికా దురంతాలను వెల్లడించినప్పుడు అమెరికా పౌరులు వెల్లువలా కదిలివుంటే ఇవాళ ఇజ్రాయెల్ గాజాను వల్లకాడు చేయసాహసించేది కాదు.
మారణాయుధాలూ, మందుగుండు సరఫరా చేస్తూ ఆ నెత్తుటి క్రీడకు అమెరికా దోహదపడేది కాదు. అమెరికా ఆరోపిస్తున్నట్టు అసాంజ్ గూఢచారి కాదు. నికార్సయిన పాత్రికేయుడు. తన చర్యల ద్వారా మెరుగైన స్వేచ్ఛాయుత సమాజాన్ని ఆశించాడు తప్ప అందులో దురుద్దేశాలు లేవు. చేయని నేరానికి ఇలా గత అయిదేళ్లుగా అసాంజ్ దాదాపు 19 చదరపు అడుగుల సెల్‌లో రోజుకు 23 గంటలు ఏకాంతవాస ఖైదు అనుభవిస్తున్నాడు. బయటి ప్రపంచంతోగానీ, సహ ఖైదీలతోగానీ ఆయనకు సంబంధాల్లేవు. ఈ శిక్ష కారణంగా ఆరోగ్యం బాగా దెబ్బతింది. గుండెజబ్బు సోకింది. బహుశా అందుకే కావొచ్చు... ఆయన ఈ ఒప్పందానికి అంగీకరించి వుండొచ్చు.
అసాంజ్ విడులను స్వాగతిస్తూనే పాత్రికేయ ప్రపంచం వ్యక్తం చేస్తున్న భయాందోళనలు సహేతుకమైనవి. తమ దేశ పౌరుడు కాకపోయినా తమ గుట్టుమట్లు వెల్లడించినందుకు అమెరికా ఆగ్రహించటం, ఇన్నేళ్లుగా ఆయన్ను వెంటాడటం... ప్రజాస్వామ్య దేశాలుగా డప్పు కొట్టుకునే స్వీడన్, బ్రిటన్‌లు అందుకు సహకరించటం ఏరకంగా చూసినా సిగ్గుచేటైన విషయం. అసాంజ్ కేసు చూపి భవిష్యత్తులో తమ చీకటి చర్యలను బట్టబయలు చేసే ఏ దేశ పాత్రికేయులనైనా అమెరికా తమ దేశానికి పట్టి అప్పగించమని కోరవచ్చు.
ఇప్పుడు ఆస్ట్రేలియా అసాంజ్ వెనక దృఢంగా నిలబడి అటు అమెరికాపైనా, ఇటు బ్రిటన్‌పైనా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చింది. ఎన్ని దేశాలు ఆ పని చేయగలుగుతాయి? అసాంజ్ విడుదల ఆయన కుటుంబానికీ, మద్దతుదార్లకూ ఊరటనిస్తుందనటంలో సందేహం లేదు. కానీ ఇందులో అంతర్లీనంగా కనిపిస్తున్న పోకడలు ప్రమాదకరమైనవి.
చెరవీడిన అసాంజ్ !
Published Wed, Jun 26 2024 4:30 AM | Last Updated on Wed, Jun 26 2024 4:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment