బైడెన్‌ తప్పుడు నిర్ణయం | Sakshi Editorial On Joe Biden Wrong decision | Sakshi
Sakshi News home page

బైడెన్‌ తప్పుడు నిర్ణయం

Published Fri, Nov 22 2024 4:28 AM | Last Updated on Fri, Nov 22 2024 4:28 AM

Sakshi Editorial On Joe Biden Wrong decision

అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్‌ డక్‌ ప్రెసిడెంట్‌’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్‌ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్‌ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. 

ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్‌ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్‌కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్‌కు తెలిపారు. 

యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్‌ ప్రాంతంలోని కరచెవ్‌ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్‌ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. 

యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్‌ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్‌ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్‌లే రూపొందించాయి. 

చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. 

అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్‌ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్‌ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్‌ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌ బైడెన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. 

దాంతో బైడెన్‌కు తత్వం బోధపడి బ్రిటన్‌ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్‌’ విధించటానికి తమ మిగ్‌–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్‌ పోలెండ్‌ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్‌ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్‌ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. 

‘నో ఫ్లైజోన్‌’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జార్జి బుష్‌ 1992లో చేశారు. 

ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్‌ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్‌కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్‌ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్‌ సీనియర్‌ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.

నిజానికి  క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్‌కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్‌పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. 

మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్‌కూ 1997లో నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్‌ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్‌ అపరాధిగా మారినట్టయింది. 

మందుపాతరల వల్ల కీయూవ్‌లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్‌ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement