WikiLeaks founder Julian asanje
-
WikiLeaks: అసాంజ్‌కు విముక్తి
సైపన్/కాన్బెర్రా: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైపన్లోని ఫెడరల్ కోర్టు అసాంజ్‌ను బుధవారం విడుదల చేసింది. అంతకుముందు మూడు గంటలపాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందడం, వాటిని బయట పెట్టడం వంటి నేరాలను అసాంజ్ అంగీకరించారు. అయితే, ‘‘రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకముంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలను సేకరించి బయట పెట్టా. అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఆయన నేరాంగీకార వాంగ్మూలాన్ని అనుమతిస్తున్నట్టు చీఫ్ యూఎస్ డి్రస్టిక్ట్ జడ్జి రమొనా వి.మంగ్లోనా ప్రకటించారు. అసాంజ్‌కు ఐదేళ్ల రెండు నెలల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఇప్పటికే బ్రిటిష్ జైల్లో ఐదేళ్లు శిక్ష అనుభవించిన కారణంగా ఆయన్ను విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. ‘‘మీరు ఈ న్యాయస్థానం నుంచి స్వేచ్ఛా వ్యక్తిగా బయటకు వెళ్లవచ్చు’’ అని ప్రకటించారు. అనంతరం అసాంజ్ కోర్టు నుంచి బయటికొచ్చారు. ఈ పరిణామం పట్ల ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మీడియా ఎదురుచూపులువిచారణను కవర్ చేయడానికి ప్రపంచవ్యాప్త మీడియా సైపన్లోని కోర్టు దగ్గరికి చేరుకుంది. గంటలపాటు బయట వేచి చూసినా విచారణను చిత్రీకరించేందుకు మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించలేదు. అసాంజ్ కోర్టు హాలు నుంచి బయటకు వస్తున్న ఫొటోను ఆయన భార్య స్టెల్లా ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భావోద్వేగంతో కంటతడి పెట్టకుండా ఉండలేకపోతున్నా’ అన్నారు. అసాంజ్ విడుదల స్వాగతించదగ్గ పరిణామమని ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు. అసాంజ్ విడుదలకు ఆ్రస్టేలియా సకల ప్రయత్నాలు చేసిందన్నారు. ఇది చరిత్రాత్మకమైన రోజని అసాంజ్ న్యాయవాది జెన్నిఫర్ రాబిన్సన్ అన్నారు. ఆయన విడుదలకు సాయం చేసినందుకు అల్బనీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వందేళ్లలో అమెరికా ఎవరిపైనా గూఢచర్య చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్టు అయిన అసాంజ్పైనే మోపిందని ఆయన తరఫున వాదించిన మరో న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురయ్యారన్నారు. శుభాకాంక్షలు చెప్పిన న్యాయమూర్తి విచారణ సందర్భంగా అసాంజ్‌కు న్యాయమూర్తి రమోనా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ‘‘వచ్చే వారం మీ పుట్టిన రోజని తెలిసింది. మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. జూలై 3న అసాంజ్ 54వ ఏట అడుగుపెట్టనున్నారు. భార్యను, తండ్రిని హత్తుకుని..ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేట్ విమానంలో సైపన్ దీవుల నుంచి బయల్దేరి బుధవారం రాత్రి ఆ్రస్టేలియా రాజధాని కాన్బెర్రా చేరుకున్నారు. కుడిచేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటికొస్తున్న ఆయన్ను చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తనకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. వారు అసాంజ్‌ను హత్తుకుని కన్నీటిపర్యంతమయ్యారు. -
ఎట్టకేలకు స్వేచ్ఛ.. లండన్ జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ అసాంజే విడుదల
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. లండన్ బెల్మార్ష్ జైలు నుంచి సోమవారం ఆయన విడుదల అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆయన నేరం ఒప్పుకున్నారని, ఈ మేరకు అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చిన ఆయనకు.. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి సైతం లభించినట్లు తెలుస్తోంది. జులియన్ అసాంజే(52) విడుదలను వికీలీక్స్ సంస్థ ఎక్స్ ద్వారా ధృవీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి. బెల్మార్ష్ జైలులో 1901 రోజులు ఆయన గడిపారు. జూన్ 24 ఉదయం ఆయన విడుదలయ్యారు. లండన్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్కడి నుంచి ఆయన స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అని వికీలీక్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. JULIAN ASSANGE IS FREEJulian Assange is free. He left Belmarsh maximum security prison on the morning of 24 June, after having spent 1901 days there. He was granted bail by the High Court in London and was released at Stansted airport during the afternoon, where he boarded a…— WikiLeaks (@wikileaks) June 24, 2024అంతేకాదు.. అసాంజే విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వాళ్లకు వికీలీక్స్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందులో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల కృషి కూడా ఉందని తెలిపింది. అయితే అమెరికా న్యాయవిభాగంతో ఒప్పందం జరిగిందని ధృవీకరించిన వికీలీక్స్.. ఆ ఒప్పందం తాలుకా వివరాలు అధికారికంగా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఈలోపు.. ఉత్తర మరియానా దీవులలోని(US) కోర్టులో దాఖలైన పత్రాల సారాంశం సోమవారం రాత్రి బయటకు వచ్చింది. అందులో.. బ్రిటన్‌లో కస్టడీలో ఉన్న అసాంజే.. అమెరికా గూఢచర్య చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు అని ఉంది. అంతేకాదు ఆయనపై మోపబడ్డ 18 అభియోగాలన్నింటిని(17 అభియోగాలు+వికీలీక్స్‌పై కంప్యూటర్ దుర్వినియోగం కేసు).. ఒక్క కేసుగానే కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సైపన్ కోర్టు ఎదుట అసాంజే విచారణకు హాజరవుతారని, కోర్టు ఆయనకు 62 నెలల శిక్ష విధించనుందని, అయితే బ్రిటన్‌లో ఆయన అనుభవించిన శిక్షా కాలాన్ని ఇందులో నుంచి మినహాయిస్తారని, ఆపై ఆయన్ను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతిస్తారన్నది ఆ పత్రాల సారాంశం. అసాంజేను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల్లో ఈ అభ్యర్థనపై విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. #JulianAssange is free!!! After 14 years of being detained, today he left the UK. I can’t wait to give him a hug and go on a walk with him. pic.twitter.com/sPwVrt1U9y— Juan Passarelli (@JuanAndOnlyDude) June 25, 2024భావ స్వేచ్చప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా హీరోగా జేజేలు అందుకున్న అసాంజే.. అమెరికా పాలిట మాత్రం విలన్‌గా తయారయ్యాడు. ఇరాక్, అఫ్గనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలను 2010లో ఆయన స్థాపించిన విజిల్ బ్లోయర్ వెబ్సైట్ వికీలీక్స్ విడుదల చేసింది. ఏప్రిల్ 2010లో.. హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన బాగ్దాద్ వైమానిక దాడికి సంబంధించిన వీడియో విడుదల చేసింది. అమెరికా చేసిన ఈ దాడిలో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. జులై 2010 - వికీలీక్స్ 91,000కు పైగా పత్రాలను విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా అఫ్గానిస్థాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి. అక్టోబర్ 2010లో ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ విడుదల చేసింది.ఈ లీక్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అమెరికా ఆయనపై అబియోగాలు మోపి.. విచారించేందుకు సిద్ధపడింది. అయితే ఈ అభియోగాలే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్ధతుదారుల్ని తెచ్చిపెట్టింది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించాడంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అభిమానులు పెరిగిపోయారు. మరోవైపు అసాంజేపై అమెరికా మోపిన నేరాభియోగాల్ని వాక్ స్వేచ్చకు తీవ్ర ముప్పుగా మేధోవర్గం అభివర్ణించింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. అమెరికా వాదనకు సైతం ఓ వర్గం నుంచి మద్ధతు లభించింది. చివరకు.. 14 ఏళ్ల తర్వాత.. ఒక డీల్ ప్రకారమే ఆయన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.అసాంజే మీద కేసు ఏంటంటే..2010-11 మధ్య అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయాల్ని వికీలీక్స్ బయటపెట్టింది. అందులో బాగ్దాద్‌పై జరిపిన వైమానిక దాడుల ఫుటేజీ కూడా ఉంది. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్(మాజీ) చెల్సీ మేనింగ్ సహకారంతోనే అసాంజే ఈ లీకులకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆమెకు 2013లో 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 2017లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమె శిక్షను తగ్గించారు. 2023లో ఓ ఇంటర్వ్యూలో చెల్సీ మేనింగ్ఇక.. 2019లో డొనాల్డ్ ట్రంప్ పాలనలో అసాంజేపై 18 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికా గూఢాచర్య చట్టం ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం. ఐదేళ్లుగా జైల్లో.. ఈ వ్యవహారంతో.. అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. అదే సమయంలో స్వీడన్ నుంచి ఆయనపై లైంగిక దాడి విచారణ జరిగింది. ఇక ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేసిన మోరిస్‌తో అసాంజేకు చనువు పెరిగింది. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడే.. ఆమెతో డేటింగ్ చేసి ఇద్దరుపిల్లల్ని కన్నారాయన. అసాంజే 2019 ఏప్రిల్ నుంచి లండన్‌లోని బెల్మార్ష్ జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయన స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోవడం గమనార్హం. 14 ఏళ్లుగా నాటకీయ పరిణామాలుపదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించాయి. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని.. వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదించింది. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది కూడా. ఈ క్రమంలో ఆయనపై అభియోగాలు నిజమని తేలితే.. ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడేది. అయితే అటు ఆస్ట్రేలియా విజ్ఞప్తులు, ఇటు పాత్రికేయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గి బైడెన్ ప్రభుత్వం చివరకు ఆయన విడుదలకు సిద్ధమయ్యింది. -
జైలులోనే వికీలీక్స్ ఫౌండర్ అసాంజే పెళ్లి
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే తన ప్రేయసి స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోబోతున్నారు. బుధవారం లండన్‌లోని హై-సెక్యూరిటీ జైలులో వీరు వివాహం చేసుకోబోతున్నారని వికీలీక్స్ మీడియా బృందం తెలిపింది. టాప్ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ వివియెన్ వెస్ట్‌వుడ్ మోరిస్ వివాహ దుస్తులను, అసాంజే కోసం కిల్ట్ను డిజైన్ చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట వివాహం అసాంజే జైల్లో ఉన్న కారణంగా వాయిదా పడింది. చివరికి గవర్నర్, జైలు అధికారుల ప్రత్యేక అనుమతితో జైలులోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జైలులో నలుగురు అతిథులు, ఇద్దరు అధికారిక సాక్షులతోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డుల మధ్య విజిటింగ్ హవర్స్ సమయంలో ఈ వేడుక జరగనుంది. వికీలీక్స్ ప్రకారం, వందలాది మంది అసాంజే మద్దతుదారులు ఈ కార్యక్రమానికి జైలు వెలుపల చేరుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా అసాంజే వికీలీక్స్ యూఎస్ మిలిటరీ రికార్డులు, దౌత్య అంశాల విడుదలకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. అసాంజే 2019 నుంచి బెల్మార్ష్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దీనికి ముందు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో 7 సంవత్సరాలు ఉన్నారు. రాయబార కార్యాలయంలో నివసిస్తున్న సమయంలోనే అసాంజే తన న్యాయవాది మోరిస్‌తో కలసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేస్తున్నప్పుడు మోరిస్‌ను కలిశారు. 2015 నుంచి వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారు. -
"వికీలీక్స్" వీరుడి కోసం వేట మొదలైంది!
జూలియన్ అసాంజ్ ‘వికీలీక్స్’ హీరో. స్మార్ట్‌గా ఉంటాడు. సాఫ్ట్‌గా ఉంటాడు. షార్ప్‌గా ఉంటాడు. ఇప్పుడు లండన్‌లో ఉన్నాడు. ‘ఆడు నాక్కావాలి’ అంటున్నాడు జో బైడెన్! ‘వస్తే తీసుకెళ్లు’ అంటోంది బ్రిటన్. పదేళ్ల క్రితం అమెరికాను పెద్ద దెబ్బ కొట్టాడు అసాంజ్. అదీ కోపం ఒబామాకు.. ట్రంప్‌కి.. బైడెన్‌కి. ఇప్పుడు అతడి కోసం వేట మొదలైంది. వేట కోసం ఒక యువతి పెదవులకు లిప్‌స్టిక్ అద్దుకుని, చేత్తో గన్ పట్టుకుని లండన్ బయల్దేరిందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్! అసాంజ్ అంటే అమ్మాయిల్లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను అసాంజ్‌పై ఒక వలగా అమెరికా విసరబోతోందా?! జైల్లో ఉన్నాడిప్పుడు జూలియన్ అసాంజ్. లండన్‌లోని ‘హర్ మెజెస్టీస్ ప్రిజన్’లో అసాంజ్! హర్ మెజెస్టీనా!! అసాంజ్ లైఫ్ అంతా అమ్మాయిలేనా?! అరెస్ట్ అవడానికి ముందు అమ్మాయిలు.. అరెస్ట్ అయ్యాక అమ్మాయిలు.. జైలు పేరు కూడా హర్ మెజెస్టీ! అప్పుడే ఏమైందీ! అతడిని హతమార్చేందుకు తయారవుతున్నది కూడా ఒక అమ్మాయే! ఇంటెలిజెన్స్ అంచనా. పదేళ్లుగా లండన్‌లోని జైళ్లలో ఉన్నాడు అసాంజ్. ఆ మాట కరెక్టు కాదు. పదేళ్లుగా అమెరికా అతడి కోసం వేటాడుతోంది. అతడొక సద్దాం హుస్సేన్ ఆ దేశానికి. ఒక ఒసామా బిన్ లాడెన్ కూడా. వాళ్లిద్దరినీ పట్టుకోగలిగింది. అసాంజ్ని మాత్రం పట్టుకోలేక పోయింది. అంతే తేడా. అమ్మాయిలకే అతడంటే ఇష్టం పదేళ్ల క్రితం.. అమెరికా విదేశాంగ కార్యాలయం. హిల్లరీ క్లింటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి. అసాంజ్ ఇష్యూని తేల్చేయమని చెప్పేశారు ప్రెసిడెంట్ ఒబామా. ‘అతడికి ఇష్టమైనవి ఏమిటి?’ ‘రహస్యాలు’ ‘అమ్మాయిలు కారా?’ ‘కారు. అమ్మాయిలకే అతడంటే ఇష్టం’ ‘అది చాలు’ అసాంజ్‌ను పట్టుకునేందుకు ప్లాన్ మొదలైంది. స్వీడన్లో ఇద్దరు మహిళలు అసాంజ్ తమపై అత్యాచారం చేశాడని కేసు పెట్టారు. అది నిలవలేదు! స్వీడన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తే నేరస్థులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం కింద అతడిని తమ దేశం రప్పించాలని అమెరికా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఒబామా పట్టుకోలేకపోయాడు. ట్రంప్ పట్టుకోవాలన్నంత కసి చూపించలేదు. జో బైడెన్ మరీ పట్టనట్లయితే లేరు. ఇక బ్రిటన్ తన పట్టు విడవడానికి సిద్ధంగా లేదు. ఆస్ట్రేలియాకు కూడా క్వీన్ ఎలిజబెత్తే రాణిగారు. అసాంజ్ ఆస్ట్రేలియా పౌరుడు. ఎంత లేదన్నా అదొకటి పనిచేస్తుంటుంది. అసాంజ్ మరెంత కాలం సురక్షితంగా ఉంటారు? అయితే ఎంతకాలమని ‘హర్ మెజెస్టీ ప్రిజన్’లో అసాంజ్ సురక్షితంగా ఉంటారు? అతడిని ప్రాణాలతో పట్టుకోవడం లేదంటే హతమార్చడం అనే లక్ష్యంతో ఒక అమెరికన్ టీమ్ బ్రిటన్‌లో పనిచేస్తోందని వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. బ్రిటన్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘సీక్రెట్ ఇంటిలిజెన్స్ సర్వీస్’ దగ్గర కొంత సమాచారం ఉందనైతే అంటున్నారు. కానీ అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘సి.ఐ.ఎ.’ దగ్గర ఉన్న సమాచారం అయితే కరెక్టే. అసాంజ్ జూలియన్‌కు స్త్రీ బలహీనత లేదు. స్త్రీలకు అతడి బలహీనత ఉందన్నది అతడిపై జోక్ కావచ్చు. అందంగా ఉంటాడు అతడు. నలభై తొమ్మిదేళ్లు ఇప్పుడు. పదేళ్ల క్రితం అతడి ముఖంపై చిరునవ్వు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. అసాంజ్‌కు ప్రేమను పంచినవారంతా స్త్రీలే. ఆ శక్తి అతడిలో పని చేస్తోందా? ఇప్పుడు జైల్లో ఉండటానికి ముందు.. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అండగా ఉన్నది, అతడికి తినడానికింత తెచ్చిపెట్టిందీ ఒక స్త్రీ మూర్తే. పమేలా ఆండర్సన్. కెనడియన్–అమెరికన్ నటి, మోడల్. టెలివిజన్ పర్సనాలిటీ. అతడి కంటే వయసులో నాలుగేళ్లు పెద్ద. అసాంజ్ని ఆమె ప్రేమిస్తున్నారని మూడేళ్ల క్రితం బ్రిటిష్ టాబ్లాయిడ్స్ అదే పనిగా కొన్నాళ్లు రాసి, అలసి ఊరుకున్నాయి. పమేలా మాత్రం ఇప్పటికే అసాంజ్ని కలుస్తూనే ఉన్నారు. ఆయన కోసం పిజ్జాలు, బర్గర్లు ప్యాక్ చేయించి తెస్తూనే ఉన్నారు. అతడిని ప్రపంచ ప్రసిద్ధుడిని చేసిన స్త్రీ మాత్రం చెల్సీ ఎలిజబెత్ మ్యానింగ్. అసాంజ్ కంటే పదిహేడేళ్లు చిన్న. యూఎస్ ఆర్మీలో సోల్జర్. చెల్సీ అబ్బాయిగా పుట్టి అమ్మాయి అయింది. ఆమె ద్వారా అమెరికన్ మిలటరీ రహస్యాలను సంపాదించాడు అసాంజ్. మొత్తం 7 లక్షల, 50 వేల ఫైల్స్. అంత పెద్ద మొత్తంలో సీక్రెట్లను చెల్సీ అతడికి ఎందుకు ఇచ్చిందనే దానికి కారణం లేదు. ఇచ్చింది. తెలిసో, తెలియకో ఇచ్చింది. పర్యవసానంగా ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించింది. అసాంజ్ ఎవరికైనా రుణపడి ఉన్నాడా అంటే ఆమెకే కావచ్చు. అతడు రుణపడి ఉండవలసిన వ్యక్తులు మరికొందరు కూడా ఉంటారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఈక్వెడార్ దేశాలలో తన నలుగురు సంతానాన్ని పెంచుతున్న అజ్ఞాత తల్లులు. అతడు బయటపెట్టే నిజాలు తప్ప, అతడి గురించిన నిజాలు బయటికి ప్రపంచానికి దాదాపుగా తెలియవు. అతడి జీవిత భాగస్వామి ఎవరో కూడా తెలియదు. అసాంజ్ జీవితంపై తల్లి ప్రభావం ఎక్కువ? అందరి కన్నా కూడా అసాంజ్ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిన స్త్రీ అతడి తల్లి.. క్రిస్టయిన్. కొడుకు జీవితానికి, తల్లి జీవితానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. తల్లికి వచ్చిన సమస్యే కొడుక్కీ వచ్చింది. క్రిస్టయిన్ తన రెండో భర్త బిడ్డ కోసం కోర్టుల చుట్టూ తిరిగారు. చివరికి అతడి నుంచి పిల్లల్ని దాచేశారు. అసాంజ్ కూడా తన ప్రియురాలి వల్ల తనకు కలిగిన కొడుకును దక్కించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగాడు. అసాంజ్ నుంచి విడిపోతూ ఆ అమ్మాయి తన బిడ్డను తనకు ఇప్పించమని కోర్టును ఆశ్రయించింది. ఈ రెండు అనుభవాల అనంతరం అసాంజ్ తన తల్లితో కలిసి... ఆస్ట్రేలియాలో బిడ్డల సంరక్షణ చట్టాలకు సంబంధించిన డేటాబ్యాంక్ (సమాచార నిధి) ఏర్పరిచారు. సమాచారం అందుబాటులో లేని సమాజం చీకట్లో ఉన్నట్లేని బలంగా నమ్మిన అసాంజ్.. దేశాల రహస్యాలను లీక్ చేయడాన్ని వృత్తిగా పెట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?! ఇంటర్ నెట్ నిపుణుడు జూలియన్ అసాంజ్ జర్నలిస్టు. పబ్లిషర్. ఇంటర్నెట్ వ్యవహారాలలో నిపుణుడు. ‘వికీలిక్స్’ సంస్థకు ఎడిటర్ కమ్ ఛైర్మన్. దేశాలు తిరిగి రహస్యాలు సేకరించేవాడు. బయటపెట్టేవాడు. 2010 నవంబర్‌లో అమెరికా దౌత్య వ్యూహాల అధికార పత్రాలు తొలివిడతగా లీక్ కాగానే అసాంజ్ కోసం వేట మొదలైంది! అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ ‘రెడ్ కార్నర్’ నోటీసు జారీ చేసింది. దాంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత బ్రిటన్ పోలీసులకు లొంగిపోయాడు. వికీలీక్స్ ఒక వెబ్సైట్. 2006లో ప్రారంభం అయింది. అంతకు ముందు అసాంజ్ కంప్యూటర్ ప్రోగ్రామర్. హ్యాకర్ కూడా. ఫిజిక్స్, మేథ్స్ అతడి సబ్జెక్టులు. పత్రికా స్వాతంత్య్రం, సమాచార హక్కు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్... అతడి అభిమాన అంశాలు. కెన్యాలో అమాయక పౌరుల ఊచకోత, ఆఫ్రికా తీరం వెంబడి పేరుకుపోతున్న వ్యర్థ రసాయనాలు, గ్వాంటనామో జైలు దుర్భర పరిస్థితి వెనుక అమెరికా అమానుష విధానాలు, మల్టీనేషనల్ బ్యాంకుల అవకతవకల్ని రూఢీ పరిచే పత్రాలను సంపాదించి తన సైట్లో పెట్టేవాడు. ఆ క్రమంలోనే ఆఫ్ఘాన్, ఇరాక్ యుద్ధాలలో అమెరికా కుతంత్రాలను వెల్లడించే సమాచారాన్ని లీక్ చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అమెరికా నిశ్చేష్టురాలైంది. చదవండి: ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి -
అసాంజేకు 50 వారాల జైలు
లండన్: వికీలీక్స్ సహవ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే(47)కు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించిన నేరానికిగాను ఆయనకు 50 వారాల జైలు శిక్ష పడింది. స్వీడన్ మహిళ లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కోర్టు నుంచి బెయిల్ పొందిన అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. అసాంజేకు ఇచ్చిన దౌత్యపరమైన వెసులుబాటును ఈక్వెడార్ ప్రభుత్వం ఉపసంహరించుకోడంతో గత నెలలో బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై బుధవారం సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న జడ్జి డెబొరా టేలర్ అసాంజేకు 50 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
ఓడి గెలిచిన అసాంజే
చరిత్ర పొడవునా, ప్రతీఘాతుక శక్తులు ప్రపంచంపై అజమాయిషీ చేయాలని ఎల్లçప్పుడూ ప్రయత్నిస్తూ వచ్చాయి. హింస ద్వారా, అపహరణ ద్వారా, ప్రధాన స్రవంతి వార్తా కథనాలను వక్రీకరించడం ద్వారా లేక ప్రజారాశుల్లో భయాందోళనలను రేకెత్తించడం ద్వారా వారు ప్రపంచాన్ని నియంత్రించాలని ప్రయత్నిస్తుంటారు. మరోవైపున సాహస ప్రవృత్తి, నిజాయితీ కలిగిన వ్యక్తులు ఇలాంటి చీకటి శక్తులపై తిరగబడుతూ వచ్చారు. అబద్ధాలను ఎండగట్టుతూ, పాశవికత్వం, దుర్మార్గంపై గర్జిస్తూ్త వీరు పోరాడుతున్నారు. పాలకులకు వ్యతిరేకంగా కొందరు కత్తులు, తుపాకులు ఉపయోగించి పోరాడారు. కొంతమంది మాటల్నే ఆయుధాలుగా చేసుకున్నారు. చాలామంది ఈ పోరాటాలను విస్తరించారు. అంధకార శక్తులపై పోరాటానికి నూతన యోధులు పుట్టుకొస్తున్నారు. ప్రతిఘటించ డం అంటే ఉత్తమమైన ప్రపంచం కోసం స్వప్నించడమే. జీవించడానికి కలగనడం అన్నమాట. చరిత్రలో అత్యంత సాహసవంతులు తమ దేశాలు, సంస్కృతుల కోసం మాత్రమే ఎన్నడూ పోరాడలేదు. సమస్త మానవజాతికోసం పోరాడారు. వీరినే ‘సహజ మేధావులు’గా నిర్వచించవచ్చు. ఆస్ట్రేలియా కంప్యూటర్ నిపుణుడు, చింతనాపరుడు, మానవతావాది జులియన్ అసాంజే ఒక కొత్తదైన పోరాట రూపాన్ని ఎంచుకున్నారు. అక్షరాలు, పదాలతో కూడిన ఒక మొత్తం బెటాలియన్ని ఆయన ప్రారంభించారు. అంకితభావం కలిగిన కొద్దిమంది నిపుణులు, కార్యకర్తలతో కూడిన చిన్న బృందానికి జులియన్ అసాంజే ‘కమాండర్’. పాశ్చాత్య సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వేలాది డాక్యుమెంట్లను బహిర్గతం చేసిన యుద్ధం అది. దశాబ్దాలుగా పాశ్చాత్య ప్రపంచం సాగిస్తూ వచ్చిన అత్యంత ఘోరమైన నేరాలకు గట్టి సాక్ష్యాధారంగా ఉంటున్న అపారమైన డేటాబేస్‌లోకి ఆయన చొచ్చుకెళ్లారు. అత్యంత విషపూరితమైన రహస్యాలను బహిర్గతం చేశారు. వికీలీక్స్ తర్వాత, న్యూయార్క్, బెర్లిన్, లండన్ లేక పారిస్ నగరాల్లో నివసిస్తున్న ఏ ఒక్కరికీ ‘మాకు ఏమీ తెలియదు’ అని చెప్పే హక్కు లేకుండా పోయింది. ఇప్పటికీ వారికి జరిగిందేమీ తెలియదు అనుకుంటే, తెలుసుకోకూడదని వారు నిర్ణయించుకున్నారన్నమాటే. దీనికి మించిన అవకాశవాదం ఉండదు. ఆఫ్గాన్ ప్రజలకు పాశ్చాత్య ప్రపంచం ఏం ఒరగబెట్టిందో అసాంజే, అతడి సహచరులు బట్టబయలు చేశారు. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలను నయా వలసవాదం, సామ్రాజ్యవాదం ఎన్ని బాధలకు గురి చేశాయో కూడా వీరు తేల్చి చెప్పారు. అమెరికా, పాశ్చాత్య ప్రపంచం సాగించిన ఘాతుకాలకు చెందిన రహస్య ఫైళ్లను లక్షలాదిగా విడుదల చేసి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పర్చిన అసాంజేకు కొన్ని రోజుల క్రితం ఒక దేశం (ఈక్వెడార్) ద్రోహం చేసింది. అసాంజేకు ఇన్నేళ్లుగా రాజ కీయ ఆశ్రయమిచ్చి, పౌరసత్వం కల్పించిన ఆ దేశ పాలకుడు లెనిన్ మోరినోను చరిత్ర చాలా చెడుగా అంచనా వేయవచ్చు. మెట్రోపాలిటన్ పోలీసులు జులియన్ అసాంజేని లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయం నుంచి లాగి వ్యాన్ ఎక్కిస్తున్నప్పుడు పాశ్చాత్య పాలన అసలు రూపాన్ని యావత్ ప్రపంచం చూడగలిగింది. పాశ్చాత్య బీభత్సాన్ని ఎదుర్కోవడానికి దేశదేశాల్లో లక్షలాదిమంది ప్రజలు ఇప్పుడు లేచి నిలబడుతున్నారు. వీరిని పాశ్చాత్య ప్రభావం నుంచి విముక్తి చేస్తున్న కొత్త మీడియాకు, అసాంజే, ఆయన సహోద్యోగులు వంటి ధీరోదాత్తులకు అభివందనలు. అసాంజే ఓడిపోలేదు. వెన్నుపోటుకు, విద్రోహానికి గురయ్యాడు. కానీ అతడు తనకు మద్దతిస్తున్న లక్షలాదిమంది ప్రజల ఆలోచనల్లో నిలిచి ఉన్నారు. అతని నిజాయితీకి, ధైర్యసాహసాలకు, సత్యనిష్ఠకు ప్రపంచ ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతోంది. భూమ్మీద అత్యంత శక్తిమంతమైన, దుష్ట, విధ్వంసక, పాశవిక స్వభావం కలిగిన మొత్తం పాశ్చాత్య సామ్రాజ్యంతో అసాంజే ఘర్షిస్తున్నారు. దాని రహస్య సంస్థలను దెబ్బతీయడంలో, వాటి కుట్రలను అడ్డుకోవడంలో ఆయన విజయం సాధిం చారు. అలా ఎంతోమంది జీవితాలను కాపాడారు. ఇదంతా జులియన్ అసాంజే సాధించిన విజయంగానే చెప్పవచ్చు. అంతిమ విజయం కాదు కానీ ఇది విజయం కంటే తక్కువేమీ కాదు. అసాంజేని అరెస్టు చేయడం ద్వారా పాశ్చాత్య సామ్రాజ్యం తన బలహీనతను చాటుకుంది. రాయబార కార్యాలయం నుంచి పోలీసు వ్యాన్ లోకి అసాంజేని లాగడం ద్వారా పాశ్చాత్య సామ్రాజ్యం తన అంత్యక్రియలను తానే సిద్ధం చేసుకుంటోంది. (’న్యూ ఈస్టర్న్ అవుట్‌లుక్’ సౌజన్యంతో) వ్యాసకర్త : ఆంద్రె విచెక్ , ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జర్నలిస్టు, చిత్ర నిర్మాత -
హృద్రోగంతో బాధపడుతున్న అసాంజే!
లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే హృదయ సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారంటూ సోమవారం మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనకు తక్షణం వైద్య సహాయం అవసరమని పేర్కొన్నాయి. అయితే ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని వీడితే అరెస్టు చేస్తారనే భయంతో అసాంజేకు సరైన వైద్యం అందడం లేదని ఆయన మద్దతుదారులను ఉటంకిస్తూ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. వివిధ దేశాల రహస్య పత్రాలను బట్టబయలు చేసి ప్రకంపనలు సృష్టించిన అసాంజే రెండేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఎంబసీలోని ఏసీ రూమ్‌లో ఉండటం.. సూర్య రశ్మికి దూరంగా ఉడటం.. తదితర కారణాలతో అసాంజే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టెలిగ్రాఫ్ పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆస్తమా, డయాబెటిస్ మొదలైన సమస్యలను కూడా ఆయన ఎదుర్కొవలసి రావచ్చని వెల్లడించింది. ఈక్వెడార్ దౌత్య కార్యాలయం అసాంజేను ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని బ్రిటన్ విదేశాంగ శాఖను కోరినా స్పందన రాలేదని పేర్కొంది.